ఈ సంఘటన అనుకోకుండా జరిగిపోవడంతో వెంటనే ఏం జవాబు చెప్పాలో తేల్చుకోలేకపోయింది.
అతనప్పటికే బ్యాక్ డోర్ తెరచి "రండి " అంటున్నాడు.
బస్ స్టాప్ దగ్గర నిలబడివున్న జనం ఈ దృశ్యం ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఈ పరిస్థితినుండి తప్పుకోవడానికి కారులో ఎక్కటమే శరణ్యమని మాలతి గ్రహించి చప్పున కారులోకి వచ్చి కూర్చుని తలుపు వేసేసింది. కారు కదిలింది.
కారు నడిపేది డ్రైవరు కాకుండా ఓనరే అయినప్పుడు ప్రక్కన కూర్చోకుండా వెనక సీట్లో కూర్చోవటం ఎటికనీ కాదని మాలతికి తెలుసు. అయినా ఆమెకంత కన్నా ముందుకు వెళ్ళటం చేతకాదు.
కారులోకి ఎక్కమన్నాడే గానీ చంద్రశేఖరం మాటాపలుకు లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. విచిత్రమేమిటంటే అతను మాట్లాడటం లేదని గమనించే స్థితిలో మాలతికూడా లేదు. ఇద్దరూ పరధ్యాసగా నిశ్శబ్దంగా వుండిపోయారు.
చిన్న బ్రేకుతో కారాగటంతో మాలతి ఈ లోకంలోకి వచ్చింది.
కారు ఓ అందమైన చిన్న బంగళాముందు ఆగి వుంది.
"ఇదేమిటి?" అన్న ప్రశ్నార్ధకం ఇద్దరినుంచి ఒకేసారి వచ్చింది.
మరుక్షణం చంద్రశేఖరం తెప్పరిల్లి మనసారా నవ్వేశాడు. "చూడండి, మీ రెసిడెన్స్ ఎక్కడో నేనూ అడగలేదు. నేను పరాకున వుండి అలవాటు చొప్పున మా ఇంటికి తీసుకువచ్చేశాను
. ఇప్పుడు చెప్పండి మీ అడ్రసు, డ్రాప్ చేసి తిరిగి వస్తాను."
ఎందుకనిపించిందో, ఎలా అనగలిగిందోగానీ మాలతి చప్పున "అదేమిటి? ఇంతవరకూ తీసుకొచ్చి మీ ఇంట్లోకి రానివ్వకుండా చేస్తారా? పదండి లోపలకు వెడదాం"అనేసింది.
రోడ్డుమీద చీకటిగావున్నా స్ట్రీట్ లైట్ వెలుతురువల్ల కారులో మసకమసగ్గా కనిపిస్తుంది. ఆ మాటలు విన్నాక అతని ముఖంలో వచ్చిన మార్పు మాలతి సూక్ష్మదృష్టి పసికట్టకపోలేదు.
"ఎందుకులెండి మళ్ళీ ఆలస్యమైపోతుంది"
మాలతి సాధారణంగా అంత ధైర్యంచేయదు. ఇందాక విన్న అస్పష్టమైన ఫోన్ సంభాషణ ఆమె చెవుల్లో మ్రోగుతుంది. అమ్మగారు....!ఈ అమ్మగారెవరో తెలుసుకోవాలని ఆమెకు పట్టుదలగా వుంది.
"అయిన ఆలస్యమెలాగూ అయిందిలెండి, ఇప్పుడు మీ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోవడం తప్పు" అంటూ మాలతి అతని సమాధానంకోసం ఎదురు చూడకుండా తలుపు తెరుచుకుని క్రిందకు దిగిపోయింది.
ఆడవాళ్ళలో మెతకదనం, చురుకుదనం మనిషినిబట్టి కాకుండా ఎదుటి మనిషినిబట్టి, పరిస్థితిని బట్టి ఎక్కువగా వుంటూ వుంటుంది.
చేసేదిలేక చంద్రశేఖరం కూడా కారుదిగి "రండి" అని దారి తీశాడు. దగ్గరగా వేసున్న ఎరుపురంగు గేటు తెరుచుకుని ఇద్దరూ లోపలకు వెళ్ళారు. లోపల వరండాలో వెలుగుతున్న లైటు కాంతి వీధిగేటువరకూ పడి, ఆ వెలుగులో ఇరువైపులా వున్న రకరకాల పూలచెట్లు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తాలుకు ఎడమవైపుగా కారు గరాజ్ వుంది. లోపలకు ప్రవేశించగానే ఒక్కసారిగా చల్లగాలి. దానికి తోడు అన్నివైపులనుంచీ మృదుసుగంధం వీచినట్లుగా అయి ఆమె మనస్సు పులకితమైపోయింది.
చిన్నమెట్లు రెండు ఎక్కి కారిడార్ లోకి వెళ్ళాక చంద్రశేఖరం గోడకున్న బజర్ నొక్కాడు.
లోపల అలికిడి అయింది. ఒక్కక్షణంతర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
తలుపులు తెరిచింది ఆ ఇంటి నౌఖరు అయివుంటాడు. యాభై ఏళ్ళుంటాయి. తలవెంట్రుకలు నెరసిపోయాయి. మనిషి బక్కపలుచగా,షుమారైన ఎత్తులో వున్నాడు. చూసీ చూడగానే అతని ముఖంలో సౌజన్యం మూర్తీభవించినట్లు కనబడుతోంది.
"ఇంత ఆలస్యమయిందేం అయ్యగారు?" అంటూ వెనకనున్న అపరిచిత యువతిని చూసి మాట ఆపేసి ప్రక్కకి తిరిగి నిలబడ్డాడు.
"రండి" అని చంద్రశేఖరం లోపలకు దారితీశాడు.
విశాలమైన హాలు అది. మధ్యలో ఖరీదైన సోఫాసెట్టు అందంగా, అధునాతనంగా అమర్చివుంది. గది ద్వారాలకు, కిటికీలకు ఎరుపు, నీలం డిజైనులతో ఉన్న తెరలువేసి వున్నాయి. హాల్లో ఒకప్రక్క రేడియో, మరోప్రక్క టెలిఫోన్ అలంకరణలో ఓ భాగము అన్నట్లు నిండుతనం కలిగిస్తున్నాయి. గోడలమీద ప్రకృతి దృశ్యాలతో వున్న రెండు ఆయిల్ పెయింట్స్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బుద్ధుడి బొమ్మ,రమణీయమైన రెండు కాలెండర్లు తగిలించి వున్నాయి.
"కూర్చోండి" అన్నాడు చంద్రశేఖరం మర్యాదగా. గోడదగ్గరకు వెళ్ళి ఫ్యాన్ వేశాడు.
"ఇప్పుడే వస్తాను. గోపయ్యా ఇటురా!" అని తరువాత పసివాడ్ని తీసుకుని లోపలిగదిలోకి వెళ్ళిపోయాడు.
మాలతి ఆ హాల్లో ఒంటరిగా కూర్చుండిపోయింది. ఆరోజు తన ప్రవర్తన సంగతలావుంచి అతని నడవడిక చిత్రంగా, అనుమానాస్పదంగా వుంది. అతనికి తాను నిస్సందేహంగా ఇబ్బంది కలిగిస్తోంది. తననుంచి అతనేదో దాచాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమిటది?
ఉన్నట్లుంది ఆమె త్రుళ్ళిపడింది. భుజంమీద పులిపంజా పడినంత వాడిగా ఏదో దూసుకుపోయినట్లయి, వర్ణించలేనంత బాధ కలిగి తల త్రిప్పి చూసింది. మరు క్షణంలో ఆమె గుండెలవిసి పోయినట్లయాయి. ఓ ఏభై ఏళ్ళ స్త్రీ మూర్తి, బక్క పలచగా, విచిత్రంగా, భయంకరంగా వుంది. ఆమె జుట్టు చిందరవందరగా వుంది. ఆమెముఖం పీక్కుపోయి వుంది. కళ్ళు పెద్దగా ముఖంలోంచి బయటకు పొడుచుకు వచ్చినట్లు కసిగా, రౌద్రంగా వున్నాయి. చేతిగ్రోళ్ళు వాడిగా, అసహ్యంగా వున్నాయి.
రెండోచేతిని కూడా మాలతి రెండో భుజంమీద వేసి బలంగా ఊపుతూ "చెప్పు? ఎవరు నువ్వు? ఏమిటా దొంగ చూపులు? మాట్లాడవేం? హిహిహి" అంది."
మాలతి కళ్ళప్పగించి నిశ్చేష్టురాలై అలా చూస్తూ వుండిపోయింది. కుడి భుజం మండుతున్న విషయంకూడా ఆమెకు ధ్యాసలేదు.
"మావాడిని వల్లో వేసుకుందామని వచ్చావా? మావాడిని నానుంచి దూరం చేద్దామని వచ్చావా? మావాడిని కట్టేసుకుందామనుకుంటున్నావేమో? నీ పీక పిసికేస్తాను, నిన్ను చంపేస్తాను."
ఆ స్త్రీ రెండుచేతులూ భుజాలమీద నుంచి మాలతి మెడమీదకు జరిగాయి. పట్టుకోసం అన్నట్టు ముందుకు జరిగి "హీహీహీ" అంటూ ముఖంమీద ముఖం పెట్టింది.
అంతవరకూ నిశ్చలంగా వుండిపోయిన మాలతి ఒకే ఒక్క క్షణం తెలివిలోకి వచ్చినట్లుయి ఆ బంగళా అంతా మార్మోగేటట్లు కెవ్వున అరచి, స్మృతి విహీనురాలై ఆ సోఫాలోనే కుప్పకూలిపోయింది.