"నా అదృష్టం." అంది చికాకు నణచుకుంటూ. ఆ స్వరంలో వెటకారం చలపతి హృదయానికి బాకులా తగిలింది.
"ఆ అదృష్టాన్ని మార్చుకోరాదూ?" అన్నాడు కసిగా.
అతని ధోరణిలో ప్రత్యేకతను గమనించని ఉమ "మన చేతుల్లో ఏముందీ?" అంది.
"ఉంటే మార్చుకునేదానివేనా?"
"మన చేతులలో ఏమీ లేదనీ, మారటం అసంభవమనీ నా తాత్పర్యం."
"నా చేతులలో ఉంది. నేను మార్చగలను."
అటు తిరిగి వంటచేస్తున్న ఉమ ఈ మాటతో నవ్వుతూ చలపతివంక తిరిగింది.
"సరే! మహారాజులా మార్చుకోండి. మీకు కావలసిన పిల్లను తెచ్చుకోండి. పెళ్ళి చేసుకోండి. నాకే అభ్యంతరం లేదు. నేను యోగినిలా గడుపుతాను."
"నీ కభ్యంతరం ఉండదు. నన్ను వదులుకోవటంలో బాధ ఉన్నప్పుడు కదా అభ్యంతరం? కాని నేనంటున్నది నా విషయం కాదు. నీ విషయం. నీ అదృష్టాన్నే మారుస్తానంటున్నాను. లోకం దృష్టిలో మనం భార్యభర్తలమయినా, ఇంతవరకూ మనం ఒక్కనాడు కూడా సంసారిక జీవితాన్ని గడపలేదు. నువ్వు కేశవరావుగారినెందుకు చేసుకోకూడదు?"
ఆరోజు మధ్యాహ్నం నుండీ విపరీతమైన సంఘర్షణతో నలిగిపోతున్న ఉమ ఈ మాట వినగానే నెత్తిన పిడుగుపడినట్లు నిల్చున్నచోటనే కూలిపోయింది.
30
సాయంత్రం సంధ్యకాంతులలో స్నానమాడుతున్న పబ్లిక్ గార్డెన్స్ చల్లగా ఊగిపోతూంది. ఆ చల్లని గాలుల నడుమనున్న కేశవ మెదడు మాత్రం ఆందోళనతో వేడెక్కి ఆవిరులను క్రక్కుతోంది.
ఉమ తన ఉత్తరం చూసుకుందా? చదువుకుని ఏమనుకుందో? వస్తుందా? తనకు తెలిసిన ఆమె స్వభావాన్ని బట్టి వస్తుందని ఆశ ఏమాత్రమూ లేదు. ఏదో తెగింపుతో అలా రాశాడు. తన అదృష్టాన్ని చివరిసారిగా పరీక్షించుకోవాలనిపించింది. కొంపదీసి ఆ ఉత్తరం మరొకరి చేతులలో పడలేదుగదా! అలా జరిగివుండదు. ఆ ఇంట్లో రఘువంశకావ్యం తెరిచేవాళ్ళెవరూ?
పూర్వం మునులు తపస్సుచేసి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందేవారుట! తనిపుడు ఉమ దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడు. తన భావన తీవ్రమైనదైతే, తన ప్రేమ సత్యమైనదైతే ఉమ వచ్చి తీరుతుంది. రావాలి!
"ఉమా! రా! రా! రా!" మనసారా ఉమను ధ్యానిస్తూ పెదవి కదల్పకుండా ఉమను ఎలుగెత్తి పిలిచాడు కేశవ. ఏదో నిస్పృహతో ఒకసారి కళ్ళుమూసి తెరిచాడు. దూరంగా ఎవరూ? ఉమే!! ఉమ వస్తూంది. తన తపస్సు ఫలించింది. ఉమ దగ్గిరగా వచ్చేసింది. కేశవను గమనించకుండానే ముందుకు సాగిపోతూంది.
"ఉమా!"
వణుకుతూన్న గొంతుకతో పిలిచాడు కేశవ. కలలో నడుస్తూన్న వ్యక్తికి ఎదురుదెబ్బ తగిలితే మెలకువ వచ్చి నడక ఆగిపోయినట్లు ఆగిపోయింది. కేశవను చూస్తూ వణికిపోయింది. అంతక్రితం వరకూ తనేదో కలగంటున్నట్లూ ఆ కలలో స్పష్టాస్పష్టంగా తనకే తెలియరాకుండా ఉన్న విషయమేదో ఆకృతి దాల్చినట్లు అనిపించింది.
బెదురుగా, భయంగా, ఆశ్చర్యంగా తనను చూస్తూ నిలుచున్న ఉమను చూసేసరికి కేశవకు సర్వాన్గాలు వణికాయి. ప్రకాశిస్తున్న అగ్నిహోత్రంలా ఉంది ఉమ. ఆమె కళ్ళలో వ్యక్తావ్యక్తంగా ఉన్న స్వల్పాతిస్వల్పమయిన సంతోషరేఖలు మాత్రమే కేశవకు మాట్లాడగలిగే శక్తినిచ్చాయి.
"కూర్చోండి ఉమా" అన్నాడు.
ఇంకా తన కలలోంచి తేరుకోనట్లే ఉంది ఉమకు. దూరంగా కూర్చుంది.
సంతోషంతో, సంభ్రమంతో ఉక్కిరిబిక్కిరయిపోతున్న కేశవకు వాక్యనిర్మాణ క్రమం కుదరటంలేదు. గంభీరంగా కూర్చున్న ఉమ నిశ్చలాకృతి అతని మెదడులోంచి పదజాలాన్ని తరుముతోంది.
"నేను మీకోసం - కాదు, మీరు నాకోసం...అదికాదు...మీరు ఇలా..అంటే నేను కోరినందుకు...నా ఉద్దేశం ఏవిఁటంటే..."
ఉమ పకపక నవ్వింది.
కేశవ పరిసరాలలో ఉన్న ప్రకృతంతా నవ్వింది. ఆ నవ్వు విన్న కేశవ కొత్త ఊపిరి పోసుకున్నాడు.
"నా సాహసానికి మన్నించండి ఉమాదేవీ! కాని, మీకోసం బ్రతుకంతా నాశనం చేసుకున్న నామీద దయతలిచి మీరు కనీసం..."
"ఆగండి" ఉమ గర్జించింది. కోపంతో ఉమ ముఖమంతా ఎర్రబడింది. ఆమె పెదవులు ఉద్రేకంతో వణుకుతున్నాయి.
"నామీద అనవసరంగా నేరారోపణ చేస్తున్నారు. నాకారణంగా మీ బ్రతుకు నాశనం చేసుకున్నారా? పచ్చి అబద్ధం. నేను మీ దానిని కాకపోవటంవలననే మీ బ్రతుకు నాశనమయిందని మీరనుకుంటూంటే అందుకు కారణం నేనుమాత్రం కాదు."
"అదేవిఁటీ ఉమాదేవీ! ఆనాడు మీరు నన్నంత నిర్దాక్షిణ్యంగా నెట్టేసి నా ప్రేమను తిరస్కరించారు. మరి నేను "ప్రేమ! తిరస్కారం!... మీరు నన్ను ప్రేమించిన మాట నిజమే అయితే మీ ప్రేమను వ్యక్తపరిచే మార్గం అదా? అబ్బాయి అమ్మాయి వెనక తిరిగి అల్లరిపెట్టి తరువాత పెళ్ళిచేసుకోవటానికి జీవితం హిందీ సినిమానా? ఏ తప్పూ చెయ్యకుండానే సాంఘిక నియమాలపట్ల కొంత నిర్లక్ష్యం వహించిన నేరానికి అక్కయ్య అనుభవించిన దారుణశిక్ష కళ్లారా చూస్తూ ఆ గోతిలో నేను పడగలనా? మీరు నన్ను ప్రేమించింది నిజమే అయితే మా ఇంటికొచ్చి మా అన్నయ్యనుగాని, మా అమ్మనుగాని అడిగి ఉండవలసింది. నడిరోడ్డు మీద వెంటపడటం, ప్రేమలేఖ లందించటం, ఇదంతా నిజమైన ప్రేమని అనుకోలేకపోయాను. బుద్ధున్నవాళ్ళెవరూ అనుకోరు."
"కొంతమంది రౌడీలుండవచ్చు. దాన్నిబట్టి అందరినీ అలానే అంచనా వెయ్యటం...."