"డిపార్ట్ మెంట్ లో మన మనష్యులు దాన్ని ధృవీకరించటం లేదు. ఏదయినా జరిగివుంటే వాళ్ళకు తెలిసి వుండేది." అన్నాడు రామ్ లాల్.
"వాళ్ళకు తెలియకుండా ప్రవల్లికే స్వంత బాధ్యత మీద తప్పించిందేమో?" సాలోచనగా అన్నాడు స్వామి.
రామ్ లాల్ ఆశ్చర్యంతో నమ్మలేనట్టు "అది చాలా రిస్క్ కదా!" అన్నాడు.
"డిపార్ట్ మెంట్ ద్వారా ఏం చేసినా మనం దాన్ని ఎలాగో ఒకలా పట్టుకుంటామని వాళ్ళకి తెలుసు. అందుకే మూడో కంటికి తెలియకుండా ప్రవల్లిక, విహారి మాయంచేసి వుంటారు. రామ్ లాల్! ఎలాగయినా నువ్వు వాడి ఆచూకీ పట్టాలి. వీలయితే నోరు శాశ్వతంగా మూసేయి. వాడు వాళ్ళకి అప్రూవర్ గా మారకూడదు."
"డాక్టర్ దయానంద కృష్ణమూర్తిని నీడలా వెంటాడితే మన A-5 ఆచూకీ తెలుస్తుందనుకుంటాను."
"వాళ్ళు అంత అజాగ్రత్తగా వుంటారని నేననుకోను. A-5ని ప్రస్తుతం దయానంద కృష్ణమూర్తి ట్రీట్ చెయ్యడంలేదు" పరమేశ్వరం అన్నాడు.
"విహారికి కట్టిన మైక్రోఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే అది అతని దగ్గర లేదు.... ఏది ఏమైనా మన వాళ్ళందర్నీ అలర్ట్ చెయ్యి. అందరి వెనుక షాడోస్ ఏర్పాటు చెయ్యి. ఇద్దరు వ్యక్తుల్ని ఆ మైక్రోఫోన్ ల దగ్గర ఇరవై నాలుగ్గంటలపాటూ ఉంచు. సి.బి.ఐ. చీఫ్ దగ్గిరగానీ, విహారికి కట్టిన తాయెత్తు దగ్గిరగానీ A-5 గురించిన టాపిక్ రావొచ్చు. రేపు సాయంత్రం లోపులో A-5 విషయం మనకి తెలియాలి. ప్రవల్లిక, విహారి, చీఫ్ ఎవరో ఒకరి ద్వారా మనకి మన అనుచరుడు ఎక్కడ ఉంచబడ్డాడో తెలుస్తుంది. గో" అంటూ స్వామి ఆదేశించాడు. రామ్ లాల్ తలూపి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన అయిదు నిమిషాలకి వారికి తమ అనుచరుడు ఎక్కడ దాచి ఉంచబడ్డాడో తెలిసింది...
సునాదమాల ద్వారా ...
* * *
"నేను మీకు ముందే చెప్పాను. మా బామ్మతో మాట్లాడినా నాకు ఏడుపొస్తుంది. దాన్ని ఈర్ష్య అనరు, పొసెసివ్ నెస్ అంటారు. మొగాళ్ళు అంత గాఢంగా ప్రేమించలేరు కాబట్టే నాకీ ప్రేమలమీద నమ్మకం లేదన్నాను. నన్ను బలవంతంగా ప్రేమలోకి దింపి యిప్పుడు యింకో అమ్మాయితో హాయిగా కులుకుతున్నారు" కంటినిండా నీళ్ళతో అన్నది మాల.
"కులుకుతున్నావా! ఇంకో అమ్మాయితోనా? ఎవరా అమ్మాయి?" విహారి విస్తుబోయి అడిగాడు.
"ప్రహాళికో - ప్రహేళికో - కాళికో."
"ఓ .... ప్రవల్లికా..."
"ఆహా... ఆ పేరుని ఎంత తీయగా పలికాడమ్మా పురుషుడు."
"మాలా...." కోపంగా అరిచాడు విహారి.
"ఆడదీ, అసూయ ఒకే అక్షరంతో మొదలవుతాయని నిరూపిస్తున్నావు."
"మొగాడు, మోసం కూడా ఒకే అక్షరంతో ప్రారంభమయ్యాయని మీరూ నిరూపించారు."
"నాకూ, ఆ అమ్మాయికీ మధ్య నువ్వనుకునే సంబంధం ఏదీ లేదు."
"ఉందని నేనూ అనుకోవడం లేదు. శారీరక సంబంధం ఉంటేనే ఈర్ష్య పడవలసిన అవసరం వుందని మీరనుకుంటే అది పొరపాటు. ఒక్క మీరేమిటి? చాలామంది అలానే అనుకుంటారు. కేవలం శారీరక సంబంధం వుంటేనే దగ్గరయినట్టు, దాని కొక్కదానికే మనం భయపడాల్సినట్టు వాదిస్తూ వుంటారు. నా వుద్దేశ్యంలో మానసికమైన దగ్గరితనం, శారీరకమైన దగ్గరితనం కంటే భయంకరమైనది."
"నీకు మతిపోయింది."
"కాదు- నా మనస్తత్వం అది. దాన్ని దాచే ప్రయత్నం కూడా నేనేమీ చేయలేదే. నాది చాలా చిన్న ప్రపంచం. అందులో ఒకే పురుషుడు. అది "మీరు..." అనుకున్నాను. అలాగే మీ ప్రపంచంలో కూడా నేనొక్కదాన్నే వుండాలనుకోవటంలో కూడా తప్పు లేదనుకుంటాను."
"అది మూర్ఖత్వం. ఒక మనిషికి మరో మనిషితో బోలెడు పనులుంటాయి. అవి చేయటానికి అవతలి వ్యక్తి స్త్రీయా, పురుషుడా? ఆవిడ నా ప్రపంచంలోకి వస్తుందా? దేశం ఎల్లల దగ్గర నిలబడి వుంటుందా? అని ఆలోచిస్తూ కూర్చుంటే లాభంలేదు, ఆ అమ్మాయి తెలివైంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమెనుంచే నేను స్ఫూర్తిని పొందాను. ఆమె వల్లే మారేను."
"నేనూ మీ వల్లే మారేను. ఒక మనిషి సాంగత్యంలో కొత్త ద్వారాలు తెరుచుకోవటం, కొత్తగా ఆలోచించటం నేర్చుకోవటం, ఇదేగా ప్రేమంటే... మీరగబట్టి అర్దరాత్రి ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాను. ఒక మొగాడు కన్నార్పకుండా చూస్తేనే వణికిపోయే నేను, కెమేరా ముందు నిలబడి జాకెట్ చింపుకున్నాను. మీరు దాచిన స్వామి తాలూకు అనుచరుడి దగ్గరికి ప్రతిరోజూ వంతులవారి చూసొస్తున్నాను. ఇదంతా ప్రేమవలనే వస్తుంది. కాదంటారా?"
"కాదనను. ప్రేమవల్లే అంధత్వం కూడా వస్తుందంటాను... ప్రస్తుతం దాన్ని పొగొట్టటం అన్నిటికన్నా ముఖ్యమైన పని అంటాను. పద" అని, ఆమె "ఎక్కడికి" అని వారిస్తున్నా వినకుండా రెక్కపట్టుకుని లాక్కెళ్ళి కార్లో కూలేశాడు.
సరిగ్గా అతడి మాటలు పూర్తయ్యే సమయానికి మైక్రోఫోన్ ముందు కూర్చున్న మనిషి లేచి స్వామి దగ్గరకు వెళ్ళాడు. క్షణాల్లో ఈ వార్త అక్కడ అందరికీ తెలిసిపోయింది.
"మన మనిషిని వంతులవారి కాపలా కాస్తూ చూస్తున్నది సునాదమాల అన్నమాట. అందుకే ఆ A-5 ఎక్కడున్నదీ తెలియటంలేదు. రామ్ లాల్ .... క్విక్" అన్నాడు స్వామి.
క్షణాల్లో సునాదమాల వెనుక నలుగురు మనుష్యులు నీడలా వెంటాడారు. ఆమెకు అనుమానం రాలేదు. సునాదమాల లాంటి అమ్మాయికి అసలా విషయం గుర్తించే అవకాశమే లేదు. అందులోనూ ఆమె చాలా ఆనందంగా వుంది ఆ రోజు.
ఆ ఆనందానికి కారణం ఆమె అనుమానాలు తొలగిపోవటం.
ఆమె "ఎక్కడికి?" అని వారిస్తున్నా వినకుండా విహారి రెక్క పట్టుకుని కార్లో తీసుకెళ్ళింది ప్రవల్లిక ఇంటికి!!
అంత అర్ధంతరంగా వచ్చిన ఆ ఇద్దరినీ చూసి ప్రవల్లిక ఆశ్చర్యపోయింది. ఆ సమయానికి నిజానికి తండ్రి ఆమెతో పెళ్ళి విషయమే మాట్లాడుతున్నాడు.
"ఏం లేదు. మా మాలకి ఉన్నట్టుండి ఓ అనుమానం వచ్చింది. దాన్ని మొగ్గలోనే తుంచెయ్యాలని ఇక్కడికి తీసుకొచ్చాను."
మాల మొహమాటపడి "ఏం లేదు" అంది కంగారుగా. ఆ అమ్మాయికి ఇంత ఇబ్బంది పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇంతలో విహారి అన్నాడు.
"చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకు? ఈ అమ్మాయీ నేనూ ప్రేమించుకున్నాం. ఎలా జరిగిందో ఏమో కానీ, ఇప్పటివరకూ మీ అమ్మాయీ నేనూ దాదాపు ప్రతి పనినీ కలిసే చేయవలసి వచ్చింది. దాంతో ఈవిడకి అనుమానం మొలకెత్తి ఇన్ని రోజుల్లో మహావృక్షమై- పెనుభూతంగా మారింది. దాన్ని ఇప్పుడు మీ కల్నల్ గారు గొడ్డలితో నరకాలి-"
"కల్నల్ ఎవరు?" అన్నాడు ప్రతాపరావు.
ప్రవల్లిక అయోమయంగా విహారివైపు చూసింది. రెండోవాక్యం దగ్గిరే ఆమె ఆలోచన ఆగిపోయింది. అది ఓ నిర్వికార అచేతనావస్థ. విషాదంకన్నా ఎక్కువయింది. వేదాంతంకన్నా తక్కువ మెట్టులో వుంది. విద్యుద్ఘాతంలా తగిలింది. ఆమె కళ్ళముందో దృశ్యం కదలాడింది. నాటకం స్టేజిమీద సునాదమాల ఇతడూ వెల్లకిలా పడుకున్న దృశ్యం అది. తను, అతని బరువు చెప్పగానే ఇతడు బహుశా ఫోన్ చేస్తున్నది ఈ అమ్మాయి అనుకొని వుంటాడు. అతడు ఆడ పోలీసాఫీసర్ల గొంతు గురించి తేలికగా మాట్లాడటంతో తను కల్నల్ వేషం వేసింది.
అంతవరకూ ఫర్వాలేదు.
తాడు తెగేవరకూ లాగింది.
ఆమెకు నవ్వొచ్చింది. దుఃఖంతో కూడిన నవ్వు అది. తనమీద తనకే తెలియని కసి.
క్షణాల్లో సర్దుకుని "ఏం లేదు నాన్నా! తర్వాత చెపుతాను. మీరు లోపలికి రండి. లోపల మాట్లాడుకుందాం" అని మాలని లోపలికి పిలిచింది. బ్రతుకు జీవుడా- అనుకుంటూ మాల ఆమెతో లోపలికి వెళ్లింది.
లోపలికెళ్ళాక కబుర్లలో డింపుతూ "మీ ఇద్దరికీ పరిచయం ఎలా జరిగింది?" అని అడిగింది. మాల జరిగింది మొత్తం మొదటినుంచి చెప్పేసింది. ప్రవల్లికకి జరిగిందంతా అర్ధమైంది. మెడికల్ షాప్ దగ్గిర తనకి బదులు ఈ అమ్మాయిని పట్టుకుని నిలదీయటం వగైరా ఇప్పుడు గుర్తొచ్చింది.
ఆమె మాలవైపు చూసింది.
స్వచ్చంగా, అమాయకంగా కనపడుతోంది.
ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది.
జీవితానికి కామాలే కానీ ఫుల్ స్టాపు లుండవు. మరణమే చివరిది. ఈ అధ్యాయం ఇక్కడితో ముగిసింది. మిగతాది ధ్యేయమే. తన ఆఫీసులో మరికొంత ఎక్కువసేపు సాయంత్రాలు.
కొంచెంసేపు మాట్లాడి విహారీ వాళ్ళూ వెళ్ళిపోయారు.
ఆమె ప్రతాపరావు దగ్గరకొచ్చి నిలబడింది. కంఠం మార్చటం, భావాల్ని మొహంలో ప్రతిబింబింప జెయ్యకుండా వుంచగలగడం సి.బి.ఐ.లో సాధ్యమేమో కానీ, నిజజీవితంలో కాదు. ఆమెని ప్రతాపరావు గమనించాడు. అయితే ప్రశ్నలేమీ అడగలేదు. విహారి మాటల్లోనే అతడికి జరిగిందంతా తెలిసింది. సానునయంగా భుజం తట్టాడు. 'బాధపడుతున్నావా అమ్మా?' అన్న ప్రశ్న స్పర్శలో వుంది. ఆమె లేదన్నట్టు తలూపింది. 'రాసి వుండాలి- నుదుట వ్రాసి వుండాలి' అన్న జవాబు అది.
* * *
సునాదమాలని ఫాలో అవుతున్న అనుచరులు ఆమె ఒక వీధిలోకి ప్రవేశించగానే ఆ విషయాన్ని రామ్ లాల్ కి వైర్ లెస్ లో తెలిపారు. క్షణాలలో అతడు అక్కడికి వచ్చాడు.
"అదిగో ఆ ఇంటిలోకి వెళ్ళింది" అన్నాడు చిన్న పెంకుటిల్లు చూపిస్తూ. రామ్ లాల్ ఆశ్చర్యపడ్డాడు. సరిగ్గా ప్రవల్లిక బంగ్లాకి వెనుక వేపున్న ఇల్లు అది. మూడోకంటికి తెలియకుండా ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి రావొచ్చు. ప్రవల్లిక ఈ విధమైన ఏర్పాటు చేసిందన్నమాట అనుకున్నాడు.
శబ్దం కాకుండా లోపలికి ప్రవేశించాడు.
అప్పుడే "నా డ్యూటీ అయిపోయిందమ్మా, ఇక నీది" అంటున్నాడు ప్రతాపరావు. A-5 ఇంకా స్పృహరాని స్థితిలోనే పడుకుని వున్నాడు. వంతులవారి కాపలా కాస్తున్నారు వాళ్ళిద్దరూ. అతను అక్కడ దాచబడిన సంగతి ఇప్పటివరకూ నలుగురికే తెలుసు. ఇప్పుడు శత్రువులకి కూడా తెలిసిపోయింది.
రామ్ లాల్ పాములా లోపలికి మరికాస్త జరిగాడు. అతడి చేతిలో కత్తి మెరుస్తూంది.
"ఇక మీరు వెళ్ళండి అంకుల్" అంటూంది మాల. ఆమెకి చాలాసేపు ఒంటరిగా కూర్చుని విహారి గురించి ఆలోచించుకోవాలని వుంది. ఆలోచించటానికేమీ వుండదు. ఆలోచన వుంటుంది. అదే ప్రేమంటే.
వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ ఆగి, జేబులోంచి ఒక మెడల్ తీస్తూ "నిన్న అడిగావు కదా పరమవీరచక్ర అంటే ఎలా వుంటుంది అని ఇదిగో" అంటూ చూపించాడు. ఆమె దాన్ని అందుకుని చదవటమూ వినటమేకానీ చూడలేదెప్పుడూ. ఆమె దాన్ని స్పృశించింది. మెడల్ గొప్పగా లేదు. ఖరీదైనది కూడా కాదు. కానీ కోట్లమంది ప్రజల ప్రతినిధిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యిచ్చింది అది. ఆమె చేతివేళ్ళు అప్రయత్నంగా వణికాయి.
ఈ లోపున రామ్ లాల్ మరో అడుగు ముందు కెళ్ళాడు. అతడి కాలిక్రింద కాగితం నలిగిన చప్పుడయింది. సైన్యంలో అనుభవం ప్రతాపరావుని హెచ్చరించింది. కానీ అప్పటికే ఆలస్యం అయింది.