Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 42


    ఈ కేసు నిర్వహించిన డి.ఐ.జి. ప్రవల్లికకి చాలా దగ్గర సహచరుడని కొద్దిమందికే తెలుసు. విహారితోపాటు ఆమెకూడా తెరవెనుకే వుండి నిర్వహించింది. సూర్యారావు బెయిల్ మీద విడుదల అయ్యాక విహారిని కలుసుకుంది. "ఈ రాత్రి సూర్యారావు చేసే భోజనంలో ఈ మందు కలపాలి" అంటూ సీసా ఇచ్చాడు విహారి.

    "ఎందుకు?" అంది ఆశ్చర్యంగా. "అతడి కథ పూర్తయిందిగా?"

    "అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది."


                      *    *    *


    రాత్రి భోజనం పూర్తిచేసి సూర్యారావు బెడ్ రూమ్ లో కూర్చుని వున్నాడు.

    దాదాపు ఎనిమిది గంటలనుంచి అతడు ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వటంలేదు. పేపర్ లో పడిన ఒక్కొక్క వాక్యం అతడి గుండెని కోసేస్తూ వుంది. నిన్నటివరకూ నీరాజనం పట్టిన ప్రజలు- ఈ రోజు కనబడితే కొట్టేటట్టు వున్నారు. ఎవరిమీదో తెలియని కసి- ఆ విహారిని చంపి పాతెయ్యాలన్నంత ఆవేశం. స్వామి ఫోన్ చేద్దామంటే దొరకటంలేదు. అలాగే కూర్చుని ఉన్నాడు.

    కూతురు గదిలోకి వచ్చింది.

    ఆమె క్రితం రాత్రే ఇంటికొచ్చింది. తండ్రి అరెస్ట్ హడావుడిలో ఆమెని ఎవరూ పట్టించుకోలేదు.

    "క్షమించు నాన్నా! ఇదంతా నావల్లే జరిగింది" అంది.

    "నువ్వేం చేస్తావమ్మా! అంతా నా ప్రారబ్ధం. కానీ ఒట్టేసి చెపుతున్నాను. ఆ అమ్మాయిమీద నేను చెయ్యి వెయ్యలేదు. అది జాకెట్టు చింపుకుంది. ఆ విహారిగాడు ఆడిన నాటకం అది."

    ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ- "విహారా?" అంది.

    "అదే, నిన్ను కిడ్నాప్ చేసినవాడు."

    "కానీ అతడు నిన్నరాత్రే నన్ను వదిలేశాడే?"

    సూర్యారావు పిడుగుపడ్డట్టు చూశాడు. "నిన్న రాత్రే వదిలేశాడా?"

    "అవును నాన్నా! రాత్రే యింటికి వచ్చేశాను. నువ్వు గెస్ట్ హౌస్ లో వున్నావన్నారు. ఎలా చెప్పాలో తెలియలేదు."

    ఆమె చెప్పిన దానిలో అబద్ధం ఏమీలేదు. గెస్ట్ హౌస్ ఫోన్ విహారి కట్ చేశాడంతే.

    "అతను నిన్నరాత్రే ఎందుకు వదిలేశాడు?"

    "నాకు తెలీదు."

    సూర్యారావు విహారి నెంబర్ వెతికి ఫోన్ చేశాడు.

    "నా కూతుర్ని నిన్నే వదిలేశావా?"

    "అవును! నాకు కావలసిన అగ్రిమెంటు మీద సంతకం ఒకరోజు ఆలస్యమవటం, అది జరగగానే మీ కూతుర్ని వదిలేశాను."

    "అయిదువేలు అడగటం?"

    "ఐదువేలు అడగటం ఏమిటి?"

    "మీ మేనకోడల్ని పంపావు కదా-"

    "మేనకోడలు ఎవరు?"

    సూర్యారావుకి టెన్షన్ పెరిగిపోయింది.

    "ఓ ఐదువేలు ఇమ్మని నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేయలేదూ?" అనరిచాడు.

    "చూడు మిస్టర్ సూర్యారావు- నాకు నిజాయితీ వుంది. డబ్బు వుంది .అదీగాక నువ్వు అడిగేది నాకు లాజిక్ కి కూడా అందటం లేదు. కావలిస్తే రెండు పనులూ ఒకేసారి అడుగుతాను కాని- కొసరి కొసరి ఎందుకు అడుగుతాను? ఎవరో నాలా స్వరం మార్చి నీతో మాట్లాడి వుంటారు. నేనయితే వాగ్దానం చేసినట్లు నా పని అయిపోగానే నీ కూతుర్ని వదిలేశాను" అని ఫోన్ పెట్టేశాడు విహారి.

    సూర్యారావుకు మతిపోయింది.

    ఎవరో గొప్ప నాటకం ఆడి తన పదవి పోయేటట్లు చేశారు.

    ఎవరు?

    స్వామా?

    ఆ ఆలోచన రాగానే సూర్యారావు ఉలిక్కిపడ్డాడు.

    అనుచరులలో ఏ మాత్రం క్రమశిక్షణ తప్పినా స్వామి సహించలేడు. అందుకని ఈ విధంగా పాఠం చెప్పాడా? పరమేశ్వరంతో కఠినంగా మాట్లాడాడు. అది మనసులో వుంచుకుని ఇలా దెబ్బ తీశాడా? కోపంవల్లో, భయంవల్లో తెలీదు కానీ సూర్యారావు వణికిపోయాడు.

    తేల్చుకోవాలని స్వామికి ఫోన్ చేస్తూ వుండగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. క్షణాల్లో అతడికి స్పృహ తప్పింది.

    అతడు తిన్న ఆహారంలో మూడు రోజుల వరకూ స్పృహ రాకుండా చేసే మందు కలిపింది విహారే.

    రెండో అంకం పూర్తి కావటానికి ఆ మాత్రం టైం కావాలి.


                                                  *    *    *


    సూర్యారావు మంత్రి పదవి పోవటం అన్నది స్వామికి కూడా పిడుగుపాటులా తగిలింది.

    సునాదమాల విహారి మనిషే అని అతడికి తెలుసు.

    సూర్యారావు ఇంత సులభంగా బుట్టలో పడతాడని స్వామి అనుకోలేదు.

    పరమేశ్వరం ద్వారా సూర్యారావుకి ధైర్యం కోల్పోవద్దని ఫోన్ చేయించాడు.

    పరమేశ్వరం ఫోన్ పెట్టేస్తూ "సూర్యారావు లేడు" అన్నాడు.

    "ఏమయ్యాడు?"

    "ఉన్నట్లుండి స్పృహతప్పి పడిపోయాడట. గుండెపోటేమో అనుకుంటున్నారు. ఆస్పత్రిలో వున్నాడు."

    స్వామి కళ్ళు ఎర్రబడ్డాయి. "ఇంతకు ఇంత జవాబు చెబుతాను పరమేశ్వరం! ఆ విహారి- ప్రవల్లికలు మరి మాట్లాడకుండా దెబ్బకొట్టే ప్లాన్ వెయ్యాలి" అన్నాడు. అతడు అంత ఆవేశపడటం అక్కడెవరూ అంతకుముందు చూడలేదు.

    ఐదు నిమిషాల తర్వాత పరమేశ్వరం ప్లాన్ చెప్పాడు.

    దుర్భేద్యమైన ప్లాన్ అది.

    స్వామి సంతృప్తిగా నవ్వాడు. ఇక్కడ ఇది జరుగుతున్న సమయానికి అక్కడ విహారి, ప్రవల్లికని "నాకు రామ్ లాల్ జీవిత సంగ్రహం కావాలి" అని అడుగుతున్నాడు.

    "రామ్ లాల్ జీవిత సంగ్రహమా? ఎందుకు?"

    విహారి నవ్వి "చెప్తాను" అన్నాడు.

    "ఒక గంటలో ఇస్తాను" అంది ప్రవల్లిక. చాలన్నట్లు తలూపేడు. "బైదిబై కంగ్రాచ్యులేషన్స్... ఇంతకాలం మేమెవరమూ చేయలేని పని మీరు సాధించారు" అంది.

    "అప్పుడే ఏమైంది? ఇంకా చెయ్యవలసింది ముందుంది."

    డ్రైవ్-ఇన్-రెస్టారెంట్ లో కూర్చుని ఉన్నారిద్దరూ, కార్లు వరుసగా వున్నాయి.

    "నా కర్ధం కాని దొకటుంది. ఎందుకు సూర్యారావుని రోజుల తరబడి మత్తులో ఉంచటం జరుగుతోంది."

    విహారి నవ్వి "చెప్పను" అన్నాడు. "నీక్కూడా చెప్పటం లేదని ఏమీ అనుకోకు. మీ డిపార్ట్ మెంట్ తో ఇలా ఒకరి విషయం మరొకరు మాట్లాడుకోవటం వల్లనే అన్నీ బట్టబయలు అవుతున్నాయి. ఇక్కడ చెట్లకు మైకులున్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదు."

    ప్రవల్లిక అర్ధం చేసుకున్నట్లు తలూపింది.

    అంతలో మరో కారు వచ్చి పక్కన ఆగింది. అందులో ఒకప్పటి సి.బి.ఐ. చీఫ్ ఉన్నాడు. వీరిని చూసి విష్ చేశాడు.

    ఆయన ఆర్డర్ ఇవ్వటానికి అటు తిరగ్గానే "ఏమిటీయన పరిస్థితి?" అని అడిగాడు విహారి.

    "తిరిగి మా చీఫ్ గా రాబోతున్నారు."

    "అదేమిటి? అనుమానంతో ట్రాన్స్ ఫర్ చేశారుగా!"

    "తిరిగి ప్రయత్నం చేసినట్లున్నాడు. అదీగాక సూర్యారావు అరెస్టు విషయంలో ఈయనే స్వయంగా అన్ని ఏర్పాట్లూ చేశాడు. బహుశా మనం అనుకున్నట్టు ఈయనకి అనంతానంతస్వామితో సంబంధం లేదేమో?"

    "స్వామి అంటే గుర్తుకొచ్చింది. నిన్నొక పని చేశాను. స్వామికి ఒక బహుమతి పంపించాను చార్మినార్... పాలరాతితో చేసింది."

    "చార్మినార్ ఎందుకూ?" ఆశ్చర్యంతో అడిగింది.

    "ఒక స్తంభం విరిచేసి పంపాను-" సాధారణ విషయంగా అన్నాడు.

    ఆమెకు మొదట అర్ధంకాలేదు. అర్ధం కాగానే నవ్వుతో ఉక్కిరిబిక్కిరి అయింది. సరిగ్గా అదే సమయానికి సునాదమాల విష్ణుని తీసుకుని ఆ పార్లర్ కు వచ్చింది. విష్ణు ఐస్ క్రీం తింటున్నంతసేపూ ఆమె ఆ స్థంభం దగ్గర అలాగే నిలబడి కారువేపు చూస్తూ వుంది. తర్వాత వాడ్ని తీసుకుని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. ఆమె మొహం తెల్లగా పాలిపోయి వుంది.

    ప్రవల్లిక ఆ తర్వాత అక్కణ్ణుంచి వెళ్ళి గంట, గంటన్నర తర్వాత వచ్చి కారు అరలోంచి ఒక కవరు తీసి ఇస్తూ "రామ్ లాల్ గురించి చరిత్రంతా ఇందులో వుంది" అంది. దాదాపు పది పేజీల కవర్. రామ్ లాల్ పుట్టుక నించి, అతని పరిచయస్తులు, అలవాట్లు, బలహీనతలు అన్నీ అందులో వున్నాయి. అతడి మీద సి.బి.ఐ. రిపోర్ట్ అది.

    "గుడ్" అన్నాడు దాన్ని అందుకుంటూ.

    "నేను చెయ్యవలసినవి ఇంకేమైనా ఉన్నాయా?"

    "జపాన్ నుంచి వచ్చే షిప్ తాలూకు సంతకం పెట్టకముందే సూర్యారావు పదవి పోయింది కదా! ఆ ఓడ ఏమయిందో కనుక్కో. కొత్తగా వచ్చే మంత్రి సంతకం పెడతాడా లేదా అన్నది."

    "కనుక్కుంటాను."

    "మన రహస్యాలు, సి.బి.ఐ. ఆఫీసులో మాట్లాడుకున్న వాటితో సహా అన్నీ శత్రువులకు తెలిసిపోతున్నాయి. అదొక్కటే ఎలా జరుగుతూందో అర్ధం కావడం లేదు."

    ఆమె జవాబు చెప్పలేదు.

    "ప్రవల్లికా! నువ్వు జాగ్రత్తగా వుండాలి. ఇప్పుడు మనం స్వామిని కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. అతడు ప్రమాదకరమైన వ్యతి. మరికొన్ని రోజులపాటు అత్యంత జాగరూకతతో నీ చుట్టూ పరిసరాలు గమనిస్తూ వుండు. మనం చేసిన దానికి అతను పిచ్చివాడై ఏం చేసినా చెయ్యవచ్చు."

    ఆమె నవ్వి "ఇటువంటి వాటిని ఎదుర్కొనే విషయంలో మాకు సి.బి.ఐ.లో ట్రైనింగ్ వుంటుంది. కాబట్టి ప్రాణాలకి ప్రమాదం ఉండదులే" అంది.

    ఆ ప్రమాదం ప్రాణాలకు రాలేదు.

    మరోవైపు నుంచి వచ్చింది.


                                                      *    *    *


    "రామ్ లాల్! మన వ్యక్తి ఒకడు ఆస్పత్రి నుంచి మాయమయ్యాడు. అతనేమయ్యాడో తెలిసిందా?"

    రామ్ లాల్ లేదన్నట్టు తలూపాడు.

    "వాడికి మెలకువ వస్తే మాత్రం మన రహస్యాలు చెప్పేస్తాడు. డిపార్ట్ మెంటే వాడిని ఆస్పత్రినుంచి తప్పించి వుంటుందని నా ఉద్దేశ్యం."

 Previous Page Next Page