Previous Page
రక్షరేకు పేజి 40


    జైహింద్ బాబు అప్పటికీ తటపటాయిస్తు ఊరుకున్నాడు. చంద్రి తన చిట్టచివరి మహాస్త్రం ప్రయోగించింది.
    "నువ్విలా ఆలోచిస్తు కూచుంటే, మా అమ్మ నన్నెవరికో ఇచ్చి కట్టబెట్టేస్తుంది. అప్పుడు అత్తయ్యనెవరు చూసుకుంటారో, ఆలోచించుకో"
    ఈ అస్త్రం జైహింద్ బాబు మీద బాగా పనిచేసింది.
    "అలాగే చంద్రీ. తప్పు కట్టి నిన్ను పెళ్ళిచేసుకుంటాలే. కానీ, కొంచెం రోజులాగాలి. తప్పు కట్టడానికైనా నా దగ్గిర డబ్బులు లేవు - "
    "అలాగే బావా, అసలు నువ్వు కొంచెం రాజీకి వచ్చి తప్పుకట్టడానికి ఒప్పుకోవాలేగాని, డబ్బెంతలో సంపాదిస్తావు?"
    పరమానందంతో వెళ్ళిపోయింది చంద్రి!
    కానీ, డబ్బు సంపాదించటం చంద్రి అన్నంత తేలిగ్గా కనిపించలేదు, జైహింద్ బాబుకి ఉద్యోగం కోసం ఎంతగా ప్రయత్నించినా దొరకటం లేదు. కూలిపని ఒక్కొక్కరోజున దొరుకుతుంది. ఒక్కొక్క రోజున దొరకటంలేదు. దొరికిన రోజున ఆ రోజు కూలి ఆ రోజు ఖర్చులకే సరిపోతోంది.
    తను ఏదీ సాధించలేకపోతున్నాడు. అప్పులు చెయ్యటం ఎంత దారుణమైన శాపమో తెలిసినా వడ్డీలకి అప్పుచెయ్యటం మానలేకపోయాడు. తప్పు కట్టడం ఎంత మూర్ఖత్వమో తెలిసినా, తప్పు కట్టడానికి సిద్ధ పడుతున్నాడు.
     పనికోసం తెగ తిరుగుతుంటే, తెలిసినవాళ్ళు రైల్వే బ్రిడ్జికి రంగువేసే పని ఉందని చెప్పారు. పని కొంచెం ప్రమాదకరమయింది. కానీ, కూలి కూడా ఎక్కువే! రోజుకి పన్నెండు రూపాయలు....... వెంటనే ఆ పనిలోకి వెళ్లాడు జైహింద్ బాబు.
    రైల్వేబ్రిడ్జికి క్రింది భాగంలో రంగువేయాలి..... బ్రిడ్జి అడుగున సన్నని బల్ల చెక్కలు అమర్చి వాటిమీద నిలబడి రంగులు వేస్తున్నారు కూలీలు..... అది చాలా ప్రమాదకరం! ఆ బల్ల చెక్కలు స్థిరంగా లేవు! ఊగిసలాడుతున్నాయి.
    అడుగున మురికికాలువ నగరంలో మురికినంతా తనలో నింపుకుని నిండుగా ప్రవహిస్తోంది. పైన బ్రిడ్జిమీద నుంచి రైళ్ళు పరుగెడుతూనే ఉన్నాయి.
    ఒక్కొక్కసారి రైలు నడిచినప్పుడల్లా ఇంజన్ మరుగుతోన్న వేడినీళ్ళను నాలుగు పక్కలకూ చిమ్ముతోంది. ఆ వేడినీళ్ళ బారినుంచి తప్పుకుంటూ, క్రిందబల్ల చెక్కమీద నుంచి కాలు జారకుండా చూసుకుంటూ రంగువేయాలి.
    న్యాయానికి అంత ప్రమాదకరమయిన పరిస్థితుల్లో బ్రిడ్జి క్రింద బల్ల చెక్కలను స్థిరంగా బిగించవలసిన బాధ్యత కాంట్రాక్టరిది - కానీ, అందుకు చాలా డబ్బవుతుంది. అంతకంటే కూలి పెంచి ఎక్కువకూలికోసం ఆశపడివచ్చిన కూలివాళ్ళ చేతపని చేయించుకోవడం లాభదాయకం కూలీల ప్రాణంపోవచ్చు! అందువల్ల కాంట్రాక్టర్ కేంనష్టం? ఎక్కువ కూలికాశపడి కూలీలే ప్రాణాలకు తెగించి వస్తున్నప్పుడు కాంట్రాక్టర్ తప్పేముంది?
    ఎక్కువ కూలికి ఆశించి అలాటి ప్రమాదకరమయిన పనికి ఒప్పుకున్నంత మాత్రాన పాపం, కూలీలకు ప్రాణ భయం లేకపోలేదు.
    అందుకే వాళ్ళంతా అక్కడ వెలసిన కట్టమైసమ్మకి ఘనంగా పూజలుచేసి కొబ్బరికాయకొట్టి, ఆ కుంకం ముఖానికి పెట్టుకుని మరీ పనిలోకి దిగుతారు. అంతగా పూజలు చేసినా ఆ మురికి కాలువలో పడి చచ్చిపోయిన ఇద్దరు ముగ్గురు పనివాళ్ళని కట్టమైసమ్మ తన చేతులు జాపి కాపాడలేదు! వాళ్ళు చచ్చినా మిగిలినవాళ్ళు కూలికి రావటం మానలేదు. కట్టమైసమ్మకి పూజలూ మానలేదు.
    రోజుకి పన్నెండు రూపాయల కూలి అనగానే వెనుక ముందు ఆలోచించక పనిలో చేరిపోయాడు జైహింద్ బాబు. రెండు రోజుల్లో ఇరవై నాలుగు రూపాయలు సంపాదించగానే ఆనందంతో వళ్ళు తెలీలేదు జైహింద్ బాబుకు......
    "చంద్రీ! బాగా సంపాదిస్తున్నానే, ఇలా ఒక్కనెల పని చేశానంటే తప్పు కట్టేసి నిన్ను పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు చంద్రితో ఉత్సాహంగా. చంద్రి కూడా పొంగిపోయింది. పెళ్ళికి రెండు మూడు కొత్త చీరలు కూడా కొని దాచుకుంది.
    ఆరోజు జైహింద్ బాబు క్రిందనుండి రంగు వేస్తుండగా పైనుండి రైలు పోసాగింది.
    రంగు వేస్తున్న జైహింద్ బాబు భుజంమీదా, ముఖం మీదా మరుగుతోన్న నీళ్ళు పడ్డాయి. ఆ బాధకు తట్టుకోలేక పక్కకు తప్పుకోబోయాడు. స్థిరంగా లేని బల్ల చెక్క కదిలిపోయింది. పట్టుతప్పి క్రింద వున్న మురికినీళ్ళలో పడిపోయాడు.
    దురదృష్టవశాన ఆ మురికి నీళ్ళలో వున్న బండమీద పడ్డాడు జైహింద్ బాబు! అలా పడటంతోనే గుండెకు దెబ్బ తగిలింది...... వెంటనే తేరుకోలేకపోయాడు! ప్యాంటు చిరిగి కాళ్ళకు అడ్డుపడటం వలన ఈదలేకపోయాడు.....
    అన్ని విధాలుగా ప్రతిఘటించాలని ప్రయత్నించినా, ప్రతిఘటించగలిగే శక్తి సామర్ధ్యాలున్నా ఆ రకంగా ఆ యువకుడు తన నిండు జీవితాన్ని నగరంలోని 'మురికి' కి ఆహుతి చేసుకున్నాడు.
    చూసినవాళ్ళు కేకలు వేశారు. కంగారు పడ్డారు! ఒక రకంగా ఇంతటి దారుణమూ అక్కడి వాళ్ళకు సాధారణమయిపోయింది. ఆ మరునాటికి కాని జైహింద్ బాబు శవాన్ని బయటికి తియ్యలేకపోయారు..... అప్పటికి సంగతి తెలిసి అందరూ వచ్చారు.
    అన్యాయమని తెలిసి తెలిసి అన్యాయాన్నే సమర్థించిన దయానంద్...
    అన్యాయాలను ఎదుర్కోవటానికి పూనుకొని, మిత్రుణ్ని ఎదిరించలేక పోయిన వ్యాసమూర్తి.....
    ఇద్దరూ కన్నీరు కార్చారు! ఆ ఇద్దరికీ జైహింద్ అంటే ప్రాణమే! కాని, అతడి మరణానికి తామే కారకులా?
    జైహింద్ బాబు మరణవార్త విని "వాడి అంతు తేలుస్తాను" అని రోషంతో వచ్చిన సుదీర్ బాబు ఆ ప్రదేశానికి రాగానే ఆ కాంట్రాక్టర్ ని చూడగానే నోట మాట రాక కొయ్యబారిపోయి నిలబడ్డాడు - ఆ కాంట్రాక్టర్ కి రైల్వేబ్రిడ్జి కాంట్రాక్టు రావటానికి కారణం తనే! మామూలుగా తన మామూలు తను తీసుకునే కాంట్రాక్టర్ కి ఆ కాంట్రాక్టు వచ్చేలా చేశాడు. ఇప్పుడా కాంట్రాక్టర్ ని తనేం చెయ్యలేడు. తీగ కదిలిస్తే డొంకంతా కదులుతుంది.....
    చచ్చిపోయిన జైహింద్ బాబు గుండెలను అంటిపెట్టుకుని వుంది చిన్ననాడు తను బహుమానంగా ఇచ్చిన ఆంజనేయస్వామి రక్షరేకు....
    ఆ ఆంజనేయస్వామి తనను చూసి విరగబడి నవ్వుతున్నాడు. "నాకు దేవుడిలో నమ్మకంలేదు! మనస్నేహంలో నమ్మకం వుంది....." అంటున్నాడు, ప్రాణం పోయినా రక్షరేకు వదలని జైహింద్ బాబు.
    "నేను గజ ఈతగాణ్ని. ఎంతటి మహా ప్రవాహంలోనయినా ఈదగలను! కానీ ఈ 'మురికి'లో ఈదలేకపోయాను" అంటున్నాడు, వంటినిండా మురికితో నిస్సహాయంగా ప్రాణాలు వదిలిన జైహింద్ బాబు.
    ఆనాడు తన బిడ్డను సాహసంతో రక్షించిన జైహింద్ బాబు ఈనాడు ఇలా 'మురికి'కి బలి కావటానికి తనే కారణమా?
    అన్నమ్మ కూడా వచ్చింది. "నా బిడ్డ సావలేదు - సావడు..... ఆడు దొర.... పెద్ద దొర...." అని ఏడుస్తూ నవ్వసాగింది!
    "ఇహీహీ.... చచ్చిపోతే చావలేదంటోంది వెర్రిబాగులది" అని నవ్వాడు నాదముని.
    దైవికంగా మనో వికాసానికి నోచుకోని నాదమునినీ. అమానుషాలకు తట్టుకోలేక మతిపోగొట్టుకున్నా అన్నమ్మనూ, మార్చి మార్చి చూసి తన కొడుకు కిరణ్ ని దగ్గిరగా లాక్కుంది సరళ, భయంతో, బాధతో!
    చంద్రి జైహింద్ బాబు తాలూకని తెలుసుకున్న కాంట్రాక్టర్ కొంత డబ్బు తీసి "ఇది ఖర్చులకుంచండి!" అని చంద్రికియ్యబోయాడు.
     "ఆ డబ్బు మా పెద్దకియ్యండి! తప్పు కట్టండి! నన్ను మా బావకిచ్చి పెళ్ళి చెయ్యండి!" అని జైహింద్ బాబు శవం మీద విరుచుకుపడిపోయింది చంద్రి.    
                                                     * సమాప్తం *

 Previous Page