Home » Yandamuri veerendranath » అగ్నిప్రవేశం

 

       "నిజమే అంకుల్! మీ చేత్తో ఏమిచ్చినా అది దైవప్రసాదం అవుతుందని రంగమ్మ కూడా అంది."
   
    "మరే- ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే నువ్వు మాత్రం కొన్నాళ్ళు చదువులోనే మునిగిపోవాలి. ఎందుకూ కొరగాని పెళ్ళికొడుకుల గురించి ఆలోచించకు. నీ మనసులో ఉన్నదేమిటో నాకు పూర్తిగా అర్ధమౌతుందనుకో."
   
    "ఏమిటో అంకుల్! మీకర్ధమయినట్లుగా నా మనసు నాకర్ధం కావటంలేదు. చాలా గజిబిజిగా వుంది" అంది నవ్వాపుకుంటూ. ఆమెకి రాత్రి వచ్చిన కల గుర్తొచ్చింది.
   
    "అది నేను చెప్పనా! నీకు కావలసినదాన్ని మరెవరో తీసేసుకుంటున్నట్టు బాధగా వుంటుంది. అప్పుడు ఒంటరిదాన్నయినట్లు ఫీలవుతావు. ఫ్రస్టేషన్ వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావో నీకే తెలీకుండా పోతుంది అవునా?"
   
    "అవునంకుల్! ఇదంతా మీకెలా తెలుసు...." ఆశ్చర్యంగా అడిగింది.
   
    పరమహంస లేచి ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె ముఖం తనవైపు తిప్పుకుని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. "నువ్వు నా కోసం పుట్టవు కాబట్టి..... నీ మనసులో నువ్వే విషయం అనుకున్నా నాకు తెలిసిపోతుంది కాబట్టి! ప్రేమ ఉన్నచోటే ఈర్ష్య కూడా వుంటుంది. నేను అందరిపైనా ప్రేమ చూపించడం నువ్వు భరించలేకపోతున్నావ్. నా పైనుంచి నీ మనసు మరో మగాడివైపు తిప్పడానికి ప్రయత్నించి విఫలమౌతున్నావు. దాంతో నీ మీద నీకే కోపం వచ్చేస్తోంది."
   
    "అవును కాబోలు నాకే తెలియడం లేదు."
   
    "ఇంకా చిన్నపిల్లవు.... అందుకే కొన్నాళ్ళు చుదువుమీద దృష్టి మళ్ళించమంటున్నా నీలో సంఘర్షణ పోవడానికి కొంత కాలం పడుతుంది. ప్రేమ అనేది మనం కావాలనుకుంటే కలిగేది కాదు, వద్దనుకుంటే పొయ్యేది కాదు. ఎవరిమీద ఎందుకు కలుగుతుందో తెలియదు. నువ్వీ విషయంలో అనవసరంగా బాధపడకు- నేను అప్పుడప్పుడూ నీకు ధైర్యం కలిగిస్తుంటాను.....అవకాశం రాగానే నా దాన్నిగా చేసుకుంటాను. అప్పుడిక ఏ చింతలు, వంకలు నిన్ను బాధించవు...." అతడు వంగి ఆమె రెండు బుగ్గలమీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పైన ఈసారి బుగ్గనుంచి పెదిమలవైపు జరగబోయిందా ముద్దు.
   
    సాహితికి కలవరం పుడుతోంది. "ఎవరో వస్తున్నారు" అంటూ దిగ్గున లేచి నిలబడింది. పరమహంస చప్పున బయటకు వెళ్ళిపోయాడు. ఆమె అలాగే ఉండిపోయింది.
   
    ఒక తల్లితో, ఆమె బిడ్డతో కూడా సంసారం సాగిస్తాననే ఈ దౌర్భాగ్యుడు సంఘంలో దైవస్వరూపుడు! యజమానురాలితో, దాసీదానితో సమంగా కులికేవాడు సంఘ సంస్కర్త! తల్లికి ఇతడంటే అపరిమితమైన నమ్మకం. ఈ రోజు తనతో అతడలా మాట్లాడాడని తెలిస్తే ఆవిడ గుండె బద్దలైపోదూ? కాని చెప్పక తప్పదు. ఆమెకు బాధ కలగలేదు. సంతోషం వేసింది..... గతరాత్రి కల మళ్ళీ గుర్తొచ్చింది. ఇక ఈ చిక్కుముడి విడిపోబోతూంది. బయట పరమహంస వెళ్ళిపోయాక కారు చప్పుడైంది.
   
    "ఏమిటమ్మా! కాలేజీకి వెళ్ళనన్నావుట. ఆరోగ్యం బావుండలేదా!" అంటూ నిర్మల వచ్చింది.
   
    "కాదు మమ్మీ! మరేమో....." ఆగింది.
   
    "ఏం జరిగిందమ్మా?"
   
    "జరక్కూడనిదే జరిగింది. తండ్రిస్థానం ఇచ్చిన వ్యక్తి వచ్చినన్ను ఉంచుకుంటానని ఓదార్చి వెళ్ళాడు. నీతోనూ, నాతోనూ సంసారం సాగించగల సరసుడట.....ఇదిగో నన్ను ముద్దుపెట్టుకుని మరీ ప్రామిస్ చేశాడు...." ఆమె మాటలు ఇంకా పూర్తికాలేదు. నిర్మల చివుక్కున లేచి, "సాహితీ ఏమిటా మాటలు?" అని కోపంగా అరిచింది.
   
    సాహితీ తాపీగా అంది- "నిజం మమ్మీ! పరమహంస అంకుల్, అంకుల్ ఏమిటి? మీ పెళ్ళి జరిగిననాడే నాకు తండ్రి అయ్యాడు. వాడికి నా పెళ్ళి చేయడం ఇష్టంలేదు. నా గుణం మంచిది కాదని ప్రచారాలు చేస్తాడు. మోసపోయాం మమ్మీ.....వాడు గుంటనక్క అని తెలియక ఆస్థి అంతా వాడిచేతుల్లో పెట్టాం."
   
    "షటప్! నీకేదో పిచ్చిపట్టింది. ఏం మాట్లాడుతున్నావో తెలియటంలేదు."
   
    "వాడూ ఇదే మాటన్నాడు. నాకు వాడి పిచ్చి పట్టిందట- అందుకే ఇలా అయిపోతున్నానట. మమ్మీ, నీకు తెలియదు..... రంగమ్మని పిలిచి అడుగు అర్ధరాత్రి పూట దానిపక్కలో పడుకుంటున్నాడని తెలుస్తుంది..... అలాంటివాడిని గౌరవించడం మన తప్పు! నా మాటల్లో నమ్మకం లేకపోతే సాయంత్రం వస్తాడుగా.....అతన్నే అడుగు అన్నీ బయటపడతాయి" అంది సాహితి ఆవేశంగా ఆమె మాటలు పూర్తి కాకుండానే నిర్మల ఏడుస్తూ గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది.
   
    "ఆవిడ బాధపడినా ఫర్వాలేదు. నిజం తెలుసుకుంది.... అంతేచాలు" అనుకుంది సాహితి. ఆ రోజంతా ఆ ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం తాండవించింది. సాహితి భయపడలేదు..... అతడు ఎప్పుడొస్తాడా అని చూస్తోంది. సాయంత్రం అతనొచ్చాడు..... వాళ్ళేదో చాలాసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు మాత్రం టెన్షన్ అనుభవించింది సాహితి..... ఆ తరువాత అతడు ఆమె గదిలోకి వచ్చాడు. అతడి మొహం ప్రశాంతంగా వుంది. "అమ్మా సాహితీ!" అన్నాడు. ఆ స్వరంలో కామ్ నెస్ ఆమెని భయపెట్టింది, తలెత్తి బేలగా చూసింది.
   
    "పిచ్చితల్లీ! ఎలా అపార్ధం చేసుకున్నావమ్మా నన్ను. నీ ఆరోగ్యం బాగాలేదని అనుకున్నానే గాని అనారోగ్యం మరీ ఇంతగా నీ మనసుని కలచి వేస్తోందని నాకు తెలియదు. నాదే పొరపాటు. గ్రహబలం సరిగ్గా లేదని తెలిసి సరి చెయ్యకపోవడం నిన్ను ఉన్మాదస్థితిలోకి దింపుతోంది" అతడి ఒక్కొక్క మాట బాంబులా పేలింది. ఒక్కొక్క వాక్యం ఆమె స్థయిర్యాన్ని చిద్రం చేసింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. "నాకే రోగమూ లేదు. గ్రహాలన్నీ సరైన దారిలోనే నడుస్తున్నాయి. మీరేమీ దేవుడు కారు.... అంతా అమ్మకు చెప్పేశాను" అంది.
   
    "దీని వాలకం చూస్తుంటే నాకు భయంగా ఉందండీ. ఏమిటి చెయ్యడం?" అంటూ నిర్మల ఏడుస్తోంది.
   
    "మమ్మీ! నాకేమీ కాలేదు, ఈయన మాటలు నమ్మకు. నేను చెప్పినదంతా నిజమే".
   
    "సాహితీ! ఎందుకమ్మా పిచ్చిగా అభాండాలు వేస్తున్నావు? నీ మనసులో ఉన్నదేమిటో నాకు తెలియదనుకున్నావా?" అన్నాడు పరమహంస తాపీగా.
   
    "సాహితీ! ఆయన పాదాలమీద పడి క్షమాపణ చెప్పుకో. అలాంటి దేవుడిని అపార్ధం చేసుకున్నందుకు చాల పెద్ద శిక్షే పడుతుంది. నేనుకూడా ఎంత అవివేకిని....? నువ్వు చెప్పినదంతా విని ఆయన్ని నిలదీసి అడిగాను. నీ మనసు గురించి, నీ అనారోగ్యం గురించి అప్పటికప్పుడు దేవుడితో మాట్లాడి గ్రహించేశారు...." అంది నిర్మల సాహితి బిత్తరపోయింది.
   
    "నిర్మలా! బాధపడకు. అమ్మాయి తప్పేంలేదు. అంతా గ్రహాల బలం! బిడ్డ యింతగా బాధపడటం నేను చూడలేదు. వెంటనే నయం చేయించే ఏర్పాట్లు చేస్తాను" పరమహంస కంఠం రుద్దమయింది. కళ్ళనుంచి నీళ్ళు ధారలుగా కారుతున్నాయి. "మన సాహితి నన్ను అపార్ధం చేసుకుందంటే లోలోపల ఎంత మధనపడి వుండాలి?"
   
    "చూశావా! ఎంతటి విశాలహృదయమో ఆయనది. ఆయన దేవుడమ్మా కాళ్ళకి నమస్కరించి వేడుకో" నిర్మల కూడా ఏడుస్తోంది. సాహితికి తల బద్దలయిపోతున్నట్లుగా వుంది. జరిగిందేమిటి? వీళ్ళ ప్రవర్తన ఏమిటి? నిజంగానే తనకి పిచ్చి పడుతోందా? పరమహంస అంటున్నాడు- "నీ ఆస్థి నేనేదో కాజేసి తినేస్తున్నానన్న అనుమానం నీకున్నట్టుంది కదమ్మా! అందుకే ఈ అభాండాలు వేస్తున్నావు కదూ! వద్దమ్మా! మనసులోకి అలాంటి ఆలోచనలు రానివ్వకు- నా సాహితీ తల్లి అలా ఆలోచించటమే నేను భరించలేను..... ఈ క్షణమే దీన్నంతా వదిలేసి వెళ్ళిపోతాను.... నన్ను నా కూతురే అపార్ధం చేసుకోవటం నేను సహించలేనమ్మా."
   
    ఆమె నిరుత్తరురాలై అతనివైపు చూస్తూంది. ఎంత రసవత్తరమైన నాటకం! ఒక్క ఉదుటున వెళ్ళి అతడి మొహాన్ని గోళ్ళతో నిలువునా చీరెయ్యాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంది. ఆమెకు అతడిమీద కోపం రాలేదు. తల్లిని చూస్తే వస్తోంది. అది పూర్తిగా కోపం కాదు జాలి, నిస్సహాయత, కసి, అన్నీ కలగలిపిన భావం.
   
    "దీనికేదో దెయ్యం పట్టింది...." అంటూ నిర్మల ఏడుస్తూ అక్కన్నుంచి వెళ్ళిపోయింది. అతడు కూడా లేచాడు.....సన్నగా నవ్వాడు- ఆ నవ్వులో వెయ్యి అర్ధాలున్నాయి. అక్కన్నించి నిశ్శబ్దంగా అతడు వెళ్ళిపోయాడు.
   
    చాలాసేపు సాహితి అలాగే కూర్చుంది. శిలాప్రతిమకైనా చలనం వుంటుందేమో కానీ, ఆమెలో లేదు. ఆమె మనసులో సముద్రజలాలలోని సంకీర్ణ ధ్వనుల్లాంటి ఆలోచనలు.
   
    కొంతసేపటికి ఆమె తేరుకుని లేచింది. ఒక నిర్ణయానికి వచ్చినట్లు శబ్దం చేయకుండా ఆ గదిలోంచి బయటకు వచ్చింది.
   
    అందరూ నిద్ర పోతున్నారు.
   
    గేటు తీసుకుని బయటకు వచ్చింది.
   
    నిర్మానుష్యమైన వీధి, విశాలమయిన నగరం ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
   
    ఆమె అడుగు ముందుకేసింది.
   
    దూరంగా ఎక్కడో ఒక కుక్క అరుస్తోంది. ఆమె నడక సాగించింది.....అలా ఎంతదూరం సాగిందో తెలీదు. వయసులో వున్న అమ్మాయి అలా వంటరిగా అర్దరాత్రి వెళ్ళటం కుతూహలాన్ని రేపి-ఇద్దరు యువకులు ఆమె వెంట పడ్డారు. కాస్త సమయం గడిచాక మరింత చొరవ తీసుకుని వారిలో ఒకరు ఆమె దగ్గరకొచ్చి 'హల్లో' అన్నాడు. ఆమె బెదిరి నడక వేగం హెచ్చించింది. జనసంచారం లేదు. అటు భయం. వారిలో ఉత్సాహాన్ని పెంచింది. ఒకడామె నడుము మీద చెయ్యివేశాడు. ఆమెకు ఇలాంటి అనుభవం కొత్త ఎప్పుడూ కార్లలో తిరిగేది. వాళ్ళేమో రౌడీల్లా వున్నారు. ఏం చేయాలో అర్ధంకాలేదు. ఇంటినుంచి బయల్దేరుతున్నప్పుడు ఉన్నంత ఆవేశమిప్పుడు లేదు. భయంతో అరవబోయింది. అది గమనించి ఒకడామె నోటిమీద చెయ్యివేసి కేక బయటకు రాకుండా ఆపుచేసి, మరో చెయ్యి ఆమె మోకాళ్ళక్రింద వేయబోయాడు. దూరంగా చెట్లు, ప్లేగ్రౌండ్ కనపడుతున్నాయి. అక్కడంతా చీకటిగా వుంది. ఆమె గింజుకుంటూంది. రెండోవాడు మొదటివాడికి సాయం చేస్తున్నాడు.
   
    ఆకాశంలో ఒక ఒంటరి పక్షి జాలిగా అరుస్తూ వెళుతోంది.
   
                                  *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra