"ఏమే! సెక్స్ కోసం అంత పడి చచ్చిపోతున్నావని నాకు తెలీదు. అవునులే నీ రంగసాని వేషాలు మర్చిపోవడం నాదే తప్పు. పెళ్ళికి ముందునుంచి అలవాటు పడ్డదానివి. ఇప్పుడు లేకపోతే బాధగా వుండదూ" తిట్ల ప్రహసనం సాగిపోతోంది. పావని గతుక్కుమంది. కోపంలో అతని బలహీనతల్ని ఎత్తిచూపిందేగాని ఆమెకా వుద్దేశ్యం లేదు. అతడిలోని ఈ లోపం ఏమిటో అర్ధం కావడానికే ఆమెకు చాలారోజులు పట్టింది. అది తెలిశాక దాన్ని నయం చేసే డాక్టర్లున్నారేమో కనుక్కోవాలనుకుంది. అదీ రామ్మూర్తి కోసమే. ఆ బలహీనతే అతడిని ఇలా ప్రవర్తించేలా చేస్తోందని ఆమె ఉద్దేశ్యం.
అలసిపోయి రామ్మూర్తి పడుకోవడానికి లేచాడు. షర్టు విప్పుతుంటే జేబు దగ్గర ఎత్తుగా తగిలింది. పరమహంస ఫోటో గుర్తొచ్చింది. తీసి చూశాడు.
'విభూది బొట్టు పెట్టుకో, శుభం జరుగుతుంది' ఆయన మాటలు గుర్తుకొచ్చాయి. మొదటిసారిగా రామ్మూర్తికి పరమహంసపట్ల భయంతోపాటు భక్తి కూడా కలిగింది. విభూది కొద్దిగా తీసుకొని బొట్టు పెట్టుకున్నాడు. తర్వాత ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు.
* * *
"ఎక్కడికండీ ప్రయాణం?" పావని అడగకుండా వుండలేక పోయింది. వారం రోజులుగా భాస్కరరామ్మూర్తి ఆమెతో మాట్లాడటంలేదు.
"ఊరెళుతున్నారా?" మళ్ళీ అడిగింది పావని.
"కాదు ఏట్లోకి" అన్నాడు విసురుగా. ఆమె కాసేపు మాట్లాడలేదు.
"ఎన్నాళ్ళలో వస్తారు?" బయలుదేరుతుంటే అడిగింది.
"ఏం-ఎవడినైనా పిలిపించుకోవాలా? పిలిపించుకో, రాత్రీ పగలూ చాలా తపించిపోతున్నావుగా...."
"నేనేం తపించిపోవడంలేదు. ఇక ఆ ప్రస్తావన తేకండి. పొరపాటున అన్నాను" అంది కన్నీళ్ళతో ఆ మాట అన్నందుకు అప్పటికే చాలా కుమిలిపోతుందామె.
"ఎందుకు నేననకూడదు? ఇంకా గట్టిగా అరుస్తాను. చుట్టు ప్రక్కల వాళ్ళంతా విననీ. ఎవడో ఒకడు వచ్చి సాయంగా పడుకుంటాడు. లేకపోతే ముందే ఎవడితోనైనా సాగిస్తున్నావా?"
'ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు? ఆపండి వెధవ వాగుడు" కోపంగా అరిచింది.
"అవునే! కట్నం వద్దనేసరికి సంస్కారం వుందో లేదో అవసరం లేకపోయింది. ఇప్పుడవన్నీ గుర్తుకొచ్చాయి. ఆ సుదర్శనం గాడితో సాగించిన రంకు, సంసారం ఉన్నవాళ్ళు చేసే పనేనా?" అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు.
* * *
"పావనీ! మీ అమ్మ ఎన్నేళ్ళు జబ్బుతో మంచం మీదుంది?" పావని తలెత్తి తండ్రివైపు చూసింది. అతడే ఉద్దేశ్యంతో అడిగాడో అర్ధంకాలేదు.
"దాదాపు పదిహేనేళ్ళు అన్నేళ్ళలో నేనొక్కసారైనా తప్పుదారి తొక్కలేదు. మీ అమ్మను పల్లెత్తుమాటనలేదు. ఇదంతా నేను నా గొప్పగా చెప్పడంలేదు పావనీ! ఊహ వచ్చి అన్నీ గమనించిన దానివి. ణ అనుమ్చి చాలా నేర్చుకుంటావనుకున్నాను."
"తెలుసు నాన్నా.....! అంతా తెలుసు. మరొక పెళ్ళి చేసుకోమని బ్రతిమిలాడినా చేసుకొని ఉత్తమ పురుషుడివి....." పైకి అనలేదామె. తలదించుకొని కూర్చుంది.
"పెళ్ళయిన ఏడాదిలోనే నీ గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని నేనూహించలేకపోయాను పావనీ! నా పిల్లలకు ఏమీ యివ్వలేకపోయినా, సంస్కారవంతుల్ని చేశానని యిన్నాళ్ళూ గొప్పగా చెప్పుకున్నాను. మనూళ్ళో అంతా మనింటి గురించి ఉదాహరణగా ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఈ విషయం తెలిస్తే ఏమిటక్కడ మన పరిస్థితి?"
తండ్రి అంత కఠినంగా మాట్లాడటం పావనికెపుడూ అనుభవం కాలేదు. అదీ ప్రాణపదంగా చూసుకునే తనపట్ల!
"నా బాధ అనుభవించే వాళ్ళకిగానీ తెలీదు నాన్నా.....! ఈయన, వాసంతీ కలిసి ఎన్ని రకాలుగా హింసిస్తారో మీకు తెలీదు."
"ఏం.....వాళ్ళిద్దరికీ సంబంధం వుందని, అందుకే నిన్ను సరిగ్గా చూడటం లేదని నీ అనుమానమా?"
"లేదు నాన్నా! ఆ విషయంలో నా కెలాంటి సందేహం లేదు. కానీ ఏ అన్నాచెల్లెలూ అలా ప్రవర్తించడం చూడలేదు. అది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది."
"నేను ముందుగానే చెప్పాను.....అతనిలోనూ బలహీనతలు వుండవచ్చనీ, వాటికంత ప్రాముఖ్యం యివ్వవద్దని గోరంతలు కొండంత చేసే సమస్యలు కావు. నువ్వు కాస్త సహనంతో ప్రవర్తిస్తే ఆవేశంతో విచక్షనా రహితంగా మాట్లాడకుండా వుంటే చాలు. ఆ మాత్రం సహనం నీలో వుందనే ఇన్నాళ్ళు నమ్మాను. నా నమ్మకంమీద చాలా పెద్ద దెబ్బకొట్టావు పావనీ!"
పావనికి అర్ధమయింది ఒక్కటే! తండ్రి తన వాదన వినకుండానే తీర్పు యిచ్చేశాడు. ఆయన నుంచి ఎలాంటి సానుభూతి, సహకారం యిక తనకు లేవు. ఆయన సమస్యను అర్ధం చేసుకోలేక పోవడానికి కారణం ఏమిటి? తరాల అంతరం వల్లనా? లేక కేవలం తన అనుభవంలో నుంచే ఆయన జీవితాన్ని చూడటంవల్లనా?
సమస్య సంఘర్షణ కలిగిస్తుంది. సంఘర్షణ నుంచి ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన అంతర్మధనం అయినప్పుడు మనిషిలో మార్పు వస్తుంది. అతడి ఆలోచన సక్రమమైన మార్గంలో వుంటే మనిషి ఎదుగుతాడు. లేదా పిరికివాడౌతాడు. పిరికితనం అతడిని నాశనం చేస్తుంది మనిషిగా.
భర్త ప్రవర్తనా, తండ్రి ఆలోచనా ధోరణి పావనిని ఆలోచనలో పడేశాయి.
చిన్న ప్రారంభం అది.
4
అర్దరాత్రి దాటి వుంటుంది. సాహితికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. చాలా దాహంగా వుంది. మంచినీళ్ళకోసం చూసింది. గదిలో ఎక్కడా లేవు. ఆమెకు జ్వరం వచ్చినప్పటినుంచి నిర్మల ఆ గదిలోనే పడుకుంటోంది. ఆవిడ ఆరాటం చూసినప్పుడల్లా ప్రేమా, జాలీ ఉప్పొంగుతాయి. నిర్మల గాఢనిద్రలో వుంది.
సాహితికి నిద్ర పట్టటంలేదు. దాహం ఎక్కువైంది. తల్లిని లేపటం ఇష్టంలేక మెల్లిగా లేచింది. చాలా నీరసంగా అనిపిస్తోంది. అడుగులో అడుగు వేసుకుంటూ డైనింగ్ హాల్ కేసి నడిచింది. అక్కడంతా చీకటిగా వుంది. లైట్ స్విచ్ మీదకు వెళ్ళబోయిన చెయ్యి ఆగిపోయింది.
"ఏదో శబ్దం అయింది. అమ్మగారు లేచారేమో స్వామీ" రంగమ్మ స్వరం.
"ఉదయం దాకా లేవదు, ఫర్వాలేదు" అంటున్నాడు పరమహంస.
"నిజంగా నా కడుపున ఓ నలుసు పుడుతుందా స్వామీ?"
"తప్పకుండా నీకు పుట్టే బిడ్డలో దైవాంశ వుంటుంది. అది భగవంతుడి ఆదేశం! మొన్న నీతో పూజ చేయించినప్పుడే ఆ విషయం తెలిసింది నాకు."
"మీ ఋణం తీర్చుకోలేనిది స్వామీ! నాలాంటి దాసీదాన్ని కూడా కరుణించారు. నిజంగా భగవత్ స్వరూపులు" రంగమ్మ భక్తి పారవశ్యంతో మాట్లాడుతోంది.
సాహితి గదిలోకి తిరిగి వచ్చేసింది. ఒకప్పుడైతే ఈ సంఘటనకి దిగ్భ్రమ చెంది వుండేది. ఇప్పుడా స్థితి దాటిపోయింది. అన్నీ మామూలు విషయాలుగానే కనిపిస్తున్నాయి.
రంగమ్మ ఎంత గుడ్డిగా నమ్మిందతడిని? ఇలాంటి అసహాయులందరినీ దేవుడు పేరుతో నమ్మించి మోసం చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య కాబోలు. రంగమ్మసరే.....చదువులేదు, తెలివితేటలు లేవు. కానీ....తల్లి? అంత చదువుకొని అతడి నంతగా నమ్మడం, గుడ్డిగా ఆరాధించడం, ఆలోచించిన కొద్దీ బాధ, నిస్సహాయత, సాహితి లేచి పుస్తకాల బీరువా తెరిచింది. స్నేహితురాలు చెప్పిన పాన్ షాప్ లోనే దొరికిందా పౌడరు. కొద్దిగా వేసుకుని చప్పరించింది. అయిదు నిమిషాల తర్వాత కమ్మటి మగత.... గాలిలో తేలిపోతున్న భావం చింతలు వంతలు లేవు. ఆ మత్తు జోలతో ఊగి అలాగే నిద్రపోయిందామె. ఆ నిద్రలో ఆమెకి ఒక కల వచ్చింది. రంగమ్మనీ, పరమహంసనీ వంటింటి గచ్చుమీద నగ్నంగా చూసిన నిర్మల అపరకాళి అయింది. అతణ్ణి వీధిలోకి తరిమికొట్టింది.
మరుసటిరోజు ప్రొద్దున్న లేవగానే, జ్వరం పూర్తిగా తగ్గి పోయి ఫ్రెష్ గా అనిపించింది. ఆమెకి ఎవరో వచ్చిన శబ్దం విని తల తిప్పి చూసింది. పరమహంస చిరునవ్వుతో చూస్తున్నాడామెవైపు.
"ఏమ్మా డిస్టర్బ్ చేశానా?" ప్రేమగా అడిగాడు. సాహితికెందుకో గుణశేఖర్, భరద్వాజ గుర్తొచ్చారు. వాళ్ళలాగా తనూ ఇతన్ని ఏడ్పించగలిగితే ఎంత బావుణ్ణు అనుకుంటూనే పక్కమీద నుంచి లేస్తూ "లేదు అంకుల్! రండి" అని ఆహ్వానించింది.
"కూర్చో కూర్చో! నేనిచ్చిన మందు బాగా పనిచేసింది చూశావా? ఇవ్వాళ తేటగా కనిపిస్తున్నావు."