Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 36


    దీనినిబట్టి ఆలోచిస్తే త్రిసికి మాటలు నిజమైనా, అబద్దమైనా ఇక్కడ ఎక్కడో నిధి ఉన్న మాట నిజమై వుండాలి! నిధి లేకపోతే ఇప్పటికీ పద్మరాణి ఆత్మ కాపలా కాయవలసిన అవసరం ఉండదు. ఇక్కడివారు ఎవరైనా నిధిని తెలుసుకుంటే దానిమీద ఇతరుల కన్ను పడకుండా, త్రిసికి ద్వారా ఈ నాటకం ఆడిస్తూ వుండాలి! అంటే ఇంకా నిధి ఇక్కడ ఉందన్నమాట! లేకపోతే నాటకం ఆడవలసిన అవసరం ఉండదు కదా?
    ఆ తరువాత దేవితో మొదటిసారిగా పరిచయం అయినరోజున త్రిసికి మాట్లాడిన మాటలు.
    "తు ఎ జమ్మనక్భత్తం కహేహి!"
    ఈ వాక్యానికర్థం - "నీ జన్మ నక్షత్రం ఏమిటి?"
    ఈ మాటలకి అర్థం మాత్రం రవికి కొరుడుకు పడలేదు. తన జన్మ నక్షత్రం త్రిసికి ఎందుకు అడగాలి? తను అనుమానపడుతున్నట్లు, ఇక్కడివారు ఇతరులను బెదిరించడానికి సృష్టించిన కల్పన త్రిసికి అయితే, తన జన్మ నక్షత్రం తెల్సుకుని ఏం చేస్తుంది?
    అసలు త్రిసికి పేరు ఏమిటి? త్రిసికమ్మా దేవాలయం ఉందని అనిల చెప్పింది. ఆ దేవాలయం చూస్తే దీని కథ తెలుస్తుందేమో?
    అనిల గిరిజనుల గ్రామాలలోనే ఉంది. వాళ్ళ ఆడవాళ్ళకి ధైర్యం చెప్తూ-కావలసిన ధన సహాయం చేస్తూ...
    తన సంచి మోసుకుంటూ ఆ గ్రామాలవైపు నడిచాడు రవి. ఇప్పుడిప్పుడు అతనికీ అడవి దారులన్నీ కొద్ది కొద్దిగా పరిచయమవుతున్నాయి.
    కొండదారి- ఒక్కోసారి ఎత్తుగా గుట్ట, అంతలో లోయ, జనం నడవటం వల్ల ఏర్పడిన మెట్లు కాని మెట్లు, రకరకాల చెట్లు, పొదలు, తుప్పలు, కొంత ఇబ్బంది ఉన్నా ఏదో ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం. నిర్భయంగా దుముకుతూ పరుగులు పెట్టే కోళ్ళగుంపులు చుట్టుపక్కల కౄరమృగాలు లేవని చెప్తున్నాయి. ఉండుండి ఒక చెవుల పిల్లి ఏ పొదచాటు నుంచో మరొక పొదచాటుకు పరుగుతీస్తోంది. గాలికి కదిలే రకరకాల చెట్ల ఆకులు ఏవో వింత సంగీతం వినిపిస్తున్నాయి. కొందరు కోయ దొరలు వెతుక్కుంటున్నారు వన మూలికల కోసమో? లేక చెవుల పిల్లుల కోసమో?
    గ్రామాల మధ్యకు వెళ్ళేసరికి రెండు మూడు గ్రామాల ప్రజలూ ఒక బయలులో సమావేశమయి ఉన్నారు. అంతమంది ఒకచోట గుమిగూడేసరికి ఏం జరుగుతుందో? అనుకున్నాడు రవి.
    గుంపు మధ్యలోంచి విచిత్రమైన మాదకతతో కూడిన వాయిద్యంతోపాటు ఏదో పాట కూడా వినిపిస్తోంది. ముగ్గురు కలిసి పాడుతున్నారు. వాళ్ళ మధ్య అనిల కూడా కూర్చుని ఉంది. ఈ వాయిద్యంలో ఏదో హిప్నోటైజ్ చేసే లక్షణం ఉంది.
    ఈ లోకంలో లేనట్లుగా ఊగిపోతూ వాయిస్తున్నాడు. రవి వచ్చిన సంగతి అక్కడ ఎవరూ గమనించలేదు. అనిల ఆడవాళ్ళ మధ్య కూర్చుని వుంది. రవికూడా ఆ గుంపులో చేరి కూర్చున్నాడు. రేణుకా యెల్లమ్మ కథ అది. దీర్ఘాలు తీస్తూ ఒక్కొక్క చరణమూ రెండేసిసార్లు పాడుతూ తన్మయత్వంతో కధలో లీనమయిపోతున్నారు పాటగాళ్ళు.
    రేణుక రోజూ నదికి వెళ్ళి మట్టికుండ తయారుచేసి దానితో నీళ్ళు తెస్తుంది.
    ఒకరోజు గంధర్వుల్ని చూసి రేణుక మనసు చలించటం వల్ల మట్టికుండ నిలవలేదు. జమదగ్నికి కోపం వచ్చి రేణుకని చంపమని కొడుకులను ఆజ్ఞాపించాడు.
    పెద్ద కొడుకులు తల్లిని చంపటానికి ఒప్పుకోలేదు. పరశురాముడు చంపాడు. తండ్రి మెచ్చుకుని వరం కోరుకోమంటే తల్లిని బతికించమని కోరుకున్నాడు. మొండేనికి శిరసు అతికించడంలో పొరపాటున రేణుక శిరసును ఆమె స్నేహితురాలిన మాతంగి మొండేనికి అతికించాడు.
    తలలేని రేణుక భూదేవిగా వెలసింది. భూదేవిని కొలిచిన వారికి సంతానం కలుగుతుంది. ఎల్లమ్మ పాడిపంటలను కాపాడుతుంది. సర్వశుభాలనూ ఇస్తుంది.
    ఇదీ పాట! ఆ పాట వింటూండగానే కొందరికి యెల్లమ్మ పూనింది. తనకు పూజలు చెయ్యమని అడిగింది. అంతా చాలా గమ్మత్తుగా ఏదో అద్భుతలోకంలో ఉన్నట్లుగా ఉంది.
    అప్పుడు చూసింది అనిల, రవిని... "మళ్ళీ వచ్చారా?" అంది. ప్రాణం లేచొచ్చినట్లుగా ఉన్నాయి ఆమె చూపులు! మాటల్లో ఆత్మీయత.
    "మీరెలా ఉన్నారో చూద్దామని వచ్చాను. త్రిసికి లేదా?"
    "ఇంతకుముందే వెళ్ళింది. నేను ఈ జనం మధ్య ఉన్నంతవరకూ నాకే భయం లేదు"
    ఎల్లమ్మ పాట పూర్తికాగానే జనమంతా ఎవరి గుడిసెల్లోకి వాళ్ళు ఎవరి పనులమీద వాళ్ళు వెళ్ళిపోయారు.
    "ఈ వాయిద్యం ఏమిటి? చాలా గమ్మత్తుగా ఉంది. నాకే మైకం వచ్చినట్లుగా అయింది. ఇలాంటి వాయిద్యం ఎక్కడా చూడలేదు. ఈ పాట వింటుండగా ఇంతమందికి యెల్లమ్మ పూనటం ఏమిటి? నటనలా అనిపించటం లేదు."
    "నటన కాదు-సెల్ఫ్ హిప్పోటిజమ్! మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు తెరమీద పాత్రలతో లీనమయిపోయి, ఒక్కొక్కప్పుడు మనకు తెలీకుండానే కన్నీళ్లు కారుస్తుంటాము. ఇంచుమించు అలాంటిదే! ఆ ప్రభావం అంతా పాటగాళ్ళది! వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చే విద్య ఇది! బాగా సాధన చేస్తారు. నాగరికులమైన మన మనసులనే వశపరచుకుంటుంది. ఆ పాట, ఆ వాయిద్యం..."
    "దీని పేరు?"
    "జమిడికి అంటారు"
    "దేంతో తయారుచేస్తారు?"
    "ఇంత సమ్మోహనకరమైన సంగీతం వెనుక చాలా భీభత్స ప్రధానమైన చరిత్ర ఉంది. ఇక్కడ యెల్లమ్మ దేవతకి గొర్రెలనీ, పొట్టేళ్ళనీ బలి ఇస్తారు. ఇప్పటికీ...ఆ బలి ఇచ్చే విధానం కూడా భీభత్సంగానే ఉంటుంది. గొర్రెలనీ, పొట్టేళ్ళనీ కత్తితో నరకరు. మెడ దగ్గర పళ్ళతో కొరికి చంపుతారు. ఆ నెత్తురు అన్నివైపులకీ చల్లుతారు. మనం చూడలేం! అలా బలి ఇచ్చిన గొర్రె చర్మంతోనూ, దాని నరాలతోనూ తయారుచేసిన వాయిద్యం ఇది"
    జుగుప్సతో శరీరం జలదరించింది రవికి. అనిల మళ్ళీ అంది "ఇక్కడి వాళ్ళందరూ జాతరలలో, పూజలలో పాల్గొంటారు. బలులు చూస్తారు. పూజారులు వెర్రెత్తినట్లు ఊగిపోవటం చూస్తారు. యెల్లమ్మను మనసారా మూఢ భక్తితో నమ్ముతారు? అంచేత జమిడికి వాయిద్యం మీద యెల్లమ్మ కథ భావస్ఫోరకంగా పాటగాళ్ళు పాడుతుంటే, యెల్లమ్మ భావం అతి తేలికగా ఈ అమాయకులను ఆవహిస్తుంది. ఇలాంటి పూనకాలు తరచుగా చూడబట్టే ఆ రోజు ఆంజనేయస్వామి పూనినట్లు నటించగలిగాను."
    "మీకు ఆంజనేయస్వామి నిజంగా పూనాడని నమ్మారా? వీళ్ళందరూ?"
    నవ్వింది అనిల.
    "నమ్మినా నమ్మకపోయినా నా పూనకం అబద్ధం అనటానికి భయపడతారు. ఏమో? ఒకవేళ నిజంగా ఆంజనేయస్వామే అయితే? అలా ఆలోచిస్తారు."
    రవి నవ్వలేదు. నిట్టూర్చాడు. ఈ ఆచారాలూ, మూఢనమ్మకాలు, చూస్తున్న కొద్దీ అతనికి మతి పోతోంది.
    "ఎల్లమ్మ కథ కూడా గమ్మత్తుగానే ఉంది. రేణుకాదేవికి మాతంగిని ఎలా స్నేహితురాలు అయింది? ఆమె శిరసు మాతంగి మొండేనికి అతికించినంత మాత్రాన ఆమె మాతంగుల దేవత ఎలా అయింది?"
    "జానపద గేయాలలోని కథల్లో చాలావాటిల్లో కార్యకారణ సంబంధాలు అంత తార్కికంగా ఉండవు. కానీ, జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ కథల వెనుక సమాజస్వరూపం కనిపిస్తోంది. తమపై జరుగుతున్న అత్యాచారాలను బాహాటంగా ప్రకటించుకోలేని జానపదులు ఈ గేయాల చాటున తమ అక్కసు వెళ్ళబోసుకుంటున్నారా? అని కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎల్లమ్మ దేవత ఎందుకయిందో, ఎలా అయిందో, ఆ విషయం ఎలా వున్నా, ఎల్లమ్మ దేవత పేరిట కొన్ని కుటుంబాలలో ఆడపిల్లలను అర్పించటం జరుగుతోంది. అలాంటి ఆడపిల్లలను పెరులాలవాళ్ళు అనుభవించవచ్చు. వీళ్ళని 'బసివి' అనీ 'భైరవి' అనీ రకరకాలుగా పిలుస్తారు. ఈ ఆచారం ఇదివరలో సర్వసాధారణంగా వుండేది. ఇప్పటికి అక్కడక్కడ వుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఎల్లమ్మకి కన్యలను అర్పించేది మాతంగ కులంవారే! అనుభవించేది మాత్రమే అగ్రవర్ణాలు! ఎల్లమ్మ మాతంగుల దేవత అనటానికీ ఇలా కన్యలను అర్పించే ఆచారాన్ని ఏమైనా సంబంధం వుందేమో ఆలోచించండి!"

 Previous Page Next Page