Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 35


    అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది సమస్య.

    అప్పుడామె ఇంటికి రాగానే తనెవరో తెలుస్తుంది. ఆమె ఏ మాత్రం తెలివయినదయినా (నిశ్చయంగా తెలివైనదే) తనకీ, వేణుకీ వున్న సంబంధం తెలుస్తుంది. తనిలా ఇంటికి వచ్చి పగ తీర్చుకుంటానని హెచ్చరించటం గురించి జగపతిరావు చెప్తాడు. (కథ సుఖాంతమైంది కాబట్టి- అఫ్ కోర్స్- నవ్వుల మధ్యే) దాంతో తన ఎత్తేమిటో క్షణాలలో అర్ధమవుతుంది ఆమెకి. వేణుని నిలదీస్తుంది! అతడిక ఆత్మవంచన చేసుకోలేడు! అంతా చెప్పేస్తాడు. 

    వేణు తనని ఇంతకాలం ప్రేమించలేదని, కేవలం తనని పాడుచెయ్యటానికే నియమింపబడ్డాడనీ తెలుసు. ఆమె మనసు పూర్తిగా విరిగిపోతుంది. ఆమెని పాడు చేయటానికి అతడు ఎంత మానసిక ఘర్షణకి గురి అయ్యాడో, ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నాడో తనలాటివాడు చెప్పినా ఆమె వినదు. ఇక జీవితంలో అతడిని క్షమించదు. అతడిని వివాహం చేసుకోటానికి అంత సుముఖత చూపించక పోవచ్చు కూడా!

    కానీ అప్పటికే ఆమె శారీరకంగా పాడయిపోయి వుంటుంది. కాబట్టి అయిష్టంగా వివాహానికి వప్పుకోవచ్చేమో!

    కానీ ఆ తరువాత ఆమె మానసికంగా అమితమయిన వ్యధ అనుభవిస్తూంది.

    ఆమె జీవితం నరకం అవుతుంది.

    నో.... అలా జరగటానికి వీలులేదు. తన చెల్లెలి....

    అతడు గిరుక్కున జగపతిరావు వైపు తిరిగి, "ఫోనెక్కడ?" అని అరిచాడు.

    "ఫోనా?" ఫోనెందుకు?"

    "అదంతా తరువాత చెప్తాను. ముందు ఫోనెక్కడ?" విసుగ్గా అరిచాడు.

    జగపతిరావు పక్కగదిలో వున్న ఫోన్ చూపించాడు. ఒక్క గెంతుతో దాన్ని అందుకుంటూ, "మీ గెస్ట్ హౌస్ నెంబర్ ఎంత?" అన్నాడు. అతడు దాన్ని చెప్పగానే డయల్ చేయబోయి, ఒక నెంబర్ తిప్పి, ఆగిపోయాడు.

    లైన్ లేదు. వర్షంవల్ల టెలిఫోన్ "డెడ్" అయింది.


                 *    *    *    *



    బయట వర్షం పడుతున్నా ఆమె నుదుటిమీద చెమట బిందువులు స్పష్టంగా మెరుస్తున్నాయి. ప్రధమ సమాకపు ఆరంభంలో స్త్రీకి సహజంగా వుండే ఉద్విగ్నతవల్ల ఆమె సగం స్పృహ, సగం మైకం లాంటి స్థితిలో వుంది.

    వేణు మాత్రం యాంత్రికంగా వున్నాడు.

    "ఇదయిపోగానే ఈమెకంతా చెప్పేస్తాను. ఈ నాటకంలో కేవలం నేనొక నటుడిని అన్న విషయం చెప్పేసి ఇక్కడనుంచి వెళ్ళిపోతాను. ఇక ఎవరికీ కనపడను. ప్రసాదరావు చెప్పిన పని మొత్తం పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా అవుతుంది కాబట్టి నేను నా మాట నిలబెట్టుకున్నట్టే. ఆ తరువాత అతడు వారిని బ్లాక్ మెయిలే చేస్తాడో, వాళ్ళ బాధచూసి ఆనందిస్తాడో అతడిష్టం. ఈ కృత్రిమ వేషాల్ని మరో నాల్గయిదు నెలలపాటు అభినయించటం నా చేతకాదు. ఆమెకంతా చెప్పేయాలి. ఇదంతా ప్రేమ కాదు. కేవలం నిన్ను పాడుచెయ్యటానికి మేము వేసిన ఎత్తు అని చెప్పగానే ఈమె ఏం చేస్తుంది? కోపంతో కత్తి తీసుకుని పొడి చేస్తుందా? శీలం పోయినందుకు ఆత్మహత్య చేసుకుంటుందా? చేసుకోనీ నాకేం....? అసలీ పనికి వప్పుకున్నప్పుడే వుండాలి ఈ ఆలోచన అంతా భగవంతుడా! నాకు కొద్దిగా శక్తినివ్వు! ఇదంతా అయిపోయాక ఈమె పట్ల ప్రేమ ఏమాత్రం బయటపడకుండా, రెక్ లెస్ గా.... నిర్లక్ష్యంగా- ఈ నాటకం గురించి ఆమెకి వివరించే ధైర్యాన్ని ఇవ్వు. చాలు....


                     *    *    *    *


    "నాకు కారు కావాలి."

    "ఎందుకు?"

    "అదంతా వివరించే టైమ్ లేదు. నాకు అర్జంటుగా కారు కావాలి. మీ గెస్ట్ హవుస్ కి వెళ్ళాలి."

    జగపతిరావు అతడివైపు అర్ధంకానట్లు చూసాడు. "కారు పోర్టికోలో వుంది. డ్రయివర్ కూడా...." అతడి మాటలు ఇంకా పూర్తికాలేదు. ప్రసాదరావు బయటకొచ్చి కారులో కూర్చుని, "ఫ్యాక్టరీ గెస్ట్ హవుస్ కి పోనీ అర్జెంట్" అన్నాడు.

    కారు కదిలింది.

    అతడి ఉద్దేశ్యం ఒకటే ప్రేమని రక్షించుకోవాలి. ఆ తరువాత ఆమె వేణుని చేసుకుంటుందా లేదా అన్నది వేరేసంగతి. అది ఆమె ఇష్టం.

    పాతిక సంవత్సరాల క్రితం ఒక చచ్చు ఎత్తువేసి, చెల్లెల్ని అనాధని చేసి జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు మరో చచ్చు ఎత్తువేసి తన మేనకోడలి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు.

    "తొందరగా.... ఇంకా తొందరగా...." అని డ్రయివర్ ని హెచ్చరించాడు.

    "రోడ్డు బాలేదు సాబ్. అన్నీ గతుకులు....నీళ్ళు"

    "ఇంకా ఎంతసేపు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి?"

    "గంటా_గంటన్నర పట్టొచ్చు సాబ్."

    "మైగాడ్!" అనుకున్నాడు ప్రసాదరావు.

    ఈ లోపులో అంతా అయిపోతుంది. మరి బయటికి రావటానికి వీల్లేనంత అపార్ధం అనే వూబిలో వేణు మెడలవరకూ కూరుకుపోతాడు. తనకింత సాయం చేసిన ఆ యువకుడికి తను తిరిగి సాయం చేయదల్చుకుంటే- మరింత తొందరగా ఏదో ఒకటి చేయాలి!

    ప్రసాదరావు విసుగ్గా నుదురు కొట్టుకున్నాడు.

    కారు వూరి పొలిమీరలు దాటుతూంది.

    అంతలో అతడికి ఒక ఆలోచన స్పురించింది.

    కేవలం జగపతిరావు ఫోన్ డెడ్ అయింది. మిగతావి బాగానే వుండొచ్చుగా?

    ఇంతసేపూ తనకీ ఆలోచన తట్టనందుకు తిట్టుకుని కారు ఆపుచేయమన్నాడు. అక్కణ్నుంచి ఫ్యాక్టరీ వరకూ ఒకటే ఎక్సేంజీ! షాపు కెళ్ళి డైరక్టరీ తీసుకుని గబగబా నెంబరు వెతికాడు.

    గెస్టుహవుస్ నెంబర్ లేదందులో.

    మనసులోనే తిట్టుకుంటూ, ఫ్యాక్టరీకి ఫోన్ చేసాడు. 

    అదృష్టవశాత్తు రింగయింది అటువైపు.

    నిముషం తరువాత ఆపరేటర్ లైనులోకి వచ్చి, "హల్లో" అన్నాడు విసుగ్గా.

    "మీ గెస్టుహవుస్ నెంబరు ఎంత?"

    "మీరెవరు?"

    "జగపతిరావు స్నేహితుడ్ని" ఆ మాటలు ఆపరేటర్ కంఠంలో మార్పు వచ్చింది. నమ్రతగా- "గెస్టుహవుస్ కి విడిగా నెంబరు లేదు. ఎక్స్ టెన్షన్ వుంది. ఇమ్మంటారా?" అని అడిగాడు.

    "తొందరగా."

    కొద్ది క్షణాలు నిశ్శబ్దం ప్రసాదరావుకి తన గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ తరువాత అట్నుంచి ఒక కుర్రవాడి కంఠం- "హలో" అని వినిపించింది.

    "గెస్టుహవుస్?"

    "యస్సార్."

    ప్రసాదరావు గుండెల్నిండా తేలిగ్గా గాలి పీల్చుకుని, "అక్కడ వేణు వుంటాడు. అర్జెంటుగా పిలువు" అన్నాడు.

    "వేణునా? అలాంటి వారెవరూ ఇక్కడ లేరే" అన్నాడు కుర్రాడు.

    ప్రసాదరావుకి షాక్ తగిలినట్టు అయింది.

    "వెళ్ళిపోయారా?" అన్నాడు తడి ఆరిన గొంతుతో.

    "అసలు రాలేదు."

    "ప్రేమ- జగపతిరావుగారి కూతురు."

    "మీరెవరు?"

    ముందు చెప్పిన సమాధానమే చెప్పాడు. "జగపతిరావుగారి స్నేహితుడిని."

    అతడు చేసిన తప్పు అదే.

    గెస్టుహవుస్ కుర్రవాడు చాకులాంటివాడు. అలాంటి వాడినే దయానందం అక్కడ పెట్టేడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఆ గెస్ట్ హౌస్ ని రహస్యంగా, ఒకరికి తెలియకుండా ఒకరు వాడుకునేవారు. ప్రసాద్ కి మరీ అమ్మాయిల పిచ్చి ఎక్కువ.

    గెస్ట్ హౌస్ కుర్రాడికి ఇటువంటి వాటిలో అనుభవం వుంది.

    అతడికి వీళ్ళిద్దరి దగ్గిరనుంచీ, బాగా టిప్ దొరుకుతూ వుండేది. ఫ్యాక్టరీకొచ్చిన గెస్టుకన్నా, వీళ్ళే ఎక్కువ డబ్బు ఇచ్చేవారు. ఆ విధంగా తర్ఫీదు అయ్యాడు. ఇలాటి విపత్కర పరిస్థితుల్ని తట్టుకోవడం ఆ కుర్రవాడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే వేణు గురించి వాకబు చేస్తూ ఫోన్ రాగానే, తడుముకోకుండా, లేడని చెప్పాడు.

    నిజానికి, తన యజమాని కూతురు వేణుతో కలిసి రావటం చూసి, అతడు తల మునకలయ్యేటంతగా ఆశ్చర్యపోయాడు. అయితే వాల్లిద్దర్లో ముఖ్యంగా ప్రేమ మొహంలో ఏ విధమైన గిల్టీకాన్షన్ నెస్సూ కనపడలేదు. ఏదో ఇద్దరు స్నేహితులు వెళ్ళినట్లు లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికీ వాడు తన ప్రొఫెషనల్ కంఠంతో, "కాఫీ కావాలా అమ్మగారూ" అని అడిగాడు కూడా. ఆమె వద్దంది.

    తన యజమాని కూతురు గెస్టుహవుస్ కి ఒకబ్బాయితో కలిసిరావటం కలిగించిన షాక్ నుంచి అతడు తేరుకోకముందే, తన యజమాని స్నేహితుడంటూ ఇంకొకరు ఎంక్వయిరీ చేయటం అతడిని అయోమయంలో పడేసింది. అయినా అనుభవజ్ఞుడు కనుక వెంటనే తేరుకుని, "ప్రేమగారిక్కడి కెందుకొస్తారు సార్. భలేవారే!" అన్నాడు.

    ప్రసాదరావుకు తను చేసిన తప్పు అర్ధమై ,వెంటనే దాన్ని సరిదిద్దుకుంటూ, "నేను జగపతిరావు ఇంటినుంచే మాట్లాడుతున్నానయ్యా. వాళ్ళు అట్నుంచి అక్కడ కొచ్చారు. మేమూ ఇట్నుంచి రావాలి. అందుకే వచ్చారా అని అడుగుతున్నాను" అన్నాడు.

    "ఒక్క నిముషం సార్" అని ఫోన్ పక్కన పెట్టాడు కుర్రవాడు.

    తన బాణం తగలవలసిన చోటే తగిలింది అనుకున్నాడు ప్రసాదరావు.

    అక్కడే అతడు పప్పులో కాలు వేసాడు.

    గెస్టుహవుస్ కుర్రవాడు అనుకున్న దానికంటే తెలివైనవాడు. ఒక్క నిముషం సార్_ అని అన్న తరువాత ఫోన్ పక్కన పెట్టినట్టు నటించి కొంచెంసేపు అక్కడే ఆగి, మళ్ళీ ఎత్తి "వాళ్ళు ఇంకా రాలేదు సార్" అన్నాడు.

    రూమ్ లో వున్నవాళ్ళని ఎటువంటి పరిస్థితులలో అయినా డిస్టర్బ్ చేయకూడదన్నది అతడు అక్కడ నేర్చుకున్న మొదటి పాఠం.

    ప్రసాదరావుకి మతిపోయింది. వేణు తనకి ఏ గెస్టుహవుస్ నుంచి ఫోన్ చేశాడు? ఇక్కడినుంచి కాదా? ఒకవేళ ఇక్కణ్నుంచి కాకపోతే అంతదూరం వెళ్ళి లాభం ఏమిటి?

    అతడు ఫోన్ పెట్టెయ్యబోతూ వుంటే అవతల్నుంచి దూరంగా "ఎవరదీ?" అన్న కంఠం వినిపించింది.

    అది వేణుది!

    ప్రసాదరావు గుండె ఆగి తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. "హల్లో_ హల్లో" అని అరిచాడు. ఇంతలో ఫోన్ చేతులు మారిన శబ్దం వినిపించింది. తరువాత వేణు లైన్ లోకి వచ్చి "హల్లో" అన్నాడు.

    టెలిఫోన్ శబ్దం విని, కాలింగ్ బెల్ అనుకుని బయటికొచ్చిన వేణు కుర్రవాడు తమ గదివైపు చూడటంతో దగ్గిరకొచ్చి "ఎవరిది?" అన్నాడు. "మీ కోసమే సార్. లేరని చెప్పాను" అన్నాడు కుర్రవాడు. తను అక్కడున్నట్టు తెలిసింది ప్రసాదరావుకి ఒక్కడికే. అందుకే వేణు ఫోన్ అందుకుని "హలో" అన్నాడు.

    "నేను ప్రసాదరావుని."

    "చెప్పండి."

    "ఏమైనా అయిందా?"

    వేణుకి కోపం వచ్చింది. "మీరు నన్నిలా వెంటాడితే...." అంటూ విసురుగా ఏదో అనబోయాడు.

 Previous Page Next Page