Home » Yandamuri veerendranath » మరో హిరోషిమా


    "అయితే తప్పు నాదేనంటావ్?" అయిదు నిముషాల సంభాషణ తరువాత అతడు అడిగిన ప్రశ్న ఇది.

    "తప్పెవరిదని కాదు ప్రశ్న, బృహస్పతిగారూ! మీరు ఇంకాస్త తెలివితేటలతో ప్రవర్తించి వుంటే- మీ చెల్లెలి శీలం రక్షింపబడి ఉండేది. 'అక్కడ రేప్ ఆపకపోతే ప్రాణాలు పోయినా ఫర్వాలేదు- ఆ డైరీల విషయం బయట పెడతానని' బెదిరించి ఉంటే ఆ దుర్మార్గులు జంకేవారు కాదా?"

    బృహస్పతి మాట్లాడలేదు.

    "ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు."

    "ఏమనుకుంటున్నాను నివాళీ?"

    "నా దారిన నేను వెళ్ళి వుంటే ఈ పాటికి మంత్రినై ఉండేవాడిని. నా స్నేహితుడు తాంత్రిక స్వామిగా దేశాన్ని ఏలుతూ ఉండేవాడు. అనవసరంగా నా పంథా మార్చుకున్నాను అనుకుంటున్నారు కదూ?"

    "లేదు నివాళీ! ఈ మార్పు నాకు బాగానే వుంది. అయితే దీని పరిణామాలే బాగాలేవు. నాకొక కథ గుర్తొస్తోంది. 'ముని - బుసకొట్టని పాము' కథ! నా పరిస్థితి అలా అయిపోయింది."

    "ఆ కథలో ముని పాముని కాటు వేయవద్దని చెప్పాడు. అది కాటువేయడం మానేసాక ప్రజలు అలుసుగా తీసుకుని రాళ్ళతో కొట్టి హింసించడం మొదలెట్టారు. ఆ తర్వాతెప్పుడో ఆ దారిన వచ్చిన మునికి ఆ సర్పం దీనావస్థలో కనబడింది. 'నేను కాటు వేయవద్దన్నాను తప్ప- బుసకొట్టద్దన్నానా? అన్నాడు ఆ ముని".

    "అంటే ఇప్పుడు నన్ను బుసకొట్టమని సలహా ఇస్తున్నావా?"

    "లేదు. కాటు వేయమని కోరుతున్నాను."

    బృహస్పతి అప్రతిభుడై "ఏమంటున్నావు నువ్వు?" అన్నాడు.

    "కొంతకాలం క్రితం నేను మీతో మాట్లాడిన మాటలే ఈ పరిణామాలన్నిటికీ కారణమని అనుకుంటుంటే నా మనసు చింతాక్రాంతమవుతోంది. నా మనసులో ఆ మాటలు ఇంకా సజీవంగానే వున్నాయి. 'మేమంతా సామాన్యులకి ప్రతినిధులం. మా భయాలకీ, అజ్ఞానానికీ, ఎవరి దగ్గరో భద్రతనీ, స్వాంతననీ పొందడం తప్ప మరో మార్గం లేదు. అందుకే బాబాలూ, రాజకీయ నాయకులూ మమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసినా భవిష్యత్తులో ఏదో మంచి జరుగుతుందన్న ఆశతో బతుకు వెళ్ళదీస్తున్నాం' అని మీకు నేను చెప్పాను. "సామాన్యులని పరిరక్షించడం కోసం తెలివైన వాళ్ళు తమ తెలివితేటలున్న వాళ్ళందరూ సామాన్యుల జీవితాలతో ఆడుకోవడం మొదలుపెడితే ఇక మేమెలా బతకాలి? అన్నాను కూడా."

    "అవును. నువ్విలా చెప్పడంవల్లే నేనూ నా పంథా మార్చుకున్నాను ఫలితం అనుభవిస్తున్నాను."

    "అక్కడే మీరు పొరపాటు పడ్డారు. 'బలహీనతల మీద ఆడుకోవద్దు' అంటే అస్త్ర సన్యాసం చేయమని కాదు.... మా తరఫున పోరాడమని!"

    బృహస్పతి చివుక్కున తలెత్తి చూశాడు.

    "అవును! నేను చెపుతున్నది మీకు సరిగ్గా అర్ధం అయిందో, లేదో నాకు తెలీదు. ఈ దేశంలో చాలామంది తెలివయినవాళ్ళు రాజకీయ నాయకులుగా, కరప్ట్ కాంట్రాక్టర్లుగా, బోగస్ షేర్ మార్కెటీర్లుగా, పవర్ బ్రోకర్లుగా ధనాన్నీ, అధికారాన్నీ సుస్థిరం చేసుకుంటున్నారు. మిగతా కొద్దిమంది తెలివైనవాళ్ళూ లెక్చరర్లుగానో, నిజాయితీగల సివిల్ సర్వెంట్స్ గానో- మొత్తం మీద ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు. ఆ వర్గానికి మీరు నాయకులవ్వండి బృహస్పతిగారూ! అటువంటి తెలివైన నాయకుడికోసం మేమంతా ఆశగా, ఆర్తిగా ఎదురు చూస్తున్నాం. ఈ ఆధునిక కురుక్షేత్రంలో కొన్ని లక్షల ప్రాణులు పోయినా సరే; దుష్టశిక్షణ జరిగి తీరాల్సిందే! తాను తెలివితేటలు ఇచ్చినందుకు- కనీసం ఒక మనిషైనా సామాన్యుడి పక్షాన నిలబడి- ప్రజాస్వామ్యపు ముసుగులో, బ్రహ్మరాక్షసిలా పెరిగిపోయిన ఈ దుష్టరాజకీయాల్ని ఎదుర్కొన్నాడంటే- దేవుడికి అంతకన్నా సంతోషకరమైన విషయం ఉంటుందా? ఆ వ్యక్తి మీరే కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను."

    బృహస్పతి విభ్రమంగా ఆమెవైపు చూశాడు. ఆమె కళ్ళల్లో కనబడుతున్న అదో విధమయిన దీప్తి అతడిని ఉత్తేజితుడ్ని చేసింది. సాయంకాలపు నీడలు అదృశ్యమై, వెన్నెల తివాచీలా పరుచుకుంటోంది.


                   *    *    *


    ఇది జరిగిన గంటకి అతడు సంకల్పనాథ్ కి ఫోన్ చేశాడు.


                        21


    "చెప్పు ఏం నిశ్చయించుకున్నావ్?"

    అట్నుంచి సంకల్పనాథ్ అడిగాడు.

    "నేను మీతో కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడాలి" అన్నాడు బృహస్పతి ఫోన్ లో.

    "ఇంక మనం మాట్లాడుకోవలసింది ఏమీలేదు. నీకు ఇరవైనాలుగ్గంటలు టైమిచ్చాం. ఈ లోపల ఆ డైరీలు, ఫోటోలూ అందజేయకపోతే ఏమవుతుందో బహుశా నీ ఊహకందదు!"

    "ఒకసారి నన్ను చావు దెబ్బ కొట్టారు. రెండవసారి అంత కన్నా పెద్ద పరిణామాన్నే ఎదుర్కోవలసి ఉంటుందని నాకు తెలుసు. అందుకనే వాటిని పది కాపీలు తీసి, దేశంలోని వివిధ పత్రికల అడ్రసులు వాటిమీద రాసి ఉంచాను. ఇరవై నాలుగు గంటల తరువాత అవి పోస్టు చేయబడతాయి. ఎవరి ద్వారానో చెప్పను."

    అట్నుంచి ఓ క్షణం నిశ్శబ్దం. "....చెప్పు ఏం మాట్లాడాలి?"

    "ఫోన్లో లాభంలేదు. రాజకీయ నాయకుల ఫోన్ లు ట్యాప్ చెయ్యబడతాయన్న విషయం అందరికీ తెలిసిందే కదా!"

    "నేను ఎల్లుండి ఢిల్లీనుంచి బయలుదేరి వస్తున్నాను. అప్పుడు మాట్లాడుకుందాం."

    "నేను రేప్పొద్దున నాగపూర్ వెళుతున్నాను. ఎల్లుండి మీరోస్తున్న ట్రెయిన్ నాగపూర్ లో ఎక్కుతాను. మీ కూపేలో ఖాళీ ఉంచగలరా?"

    అట్నుంచి సంకల్పనాథ్ రే ఒక్కక్షణం ఆగి "సరే!" అన్నాడు.

    ఆ రోజు సాయంత్రమే బృహస్పతి నాగపూర్ వెళ్ళాడు.

    వెళ్ళే ముందు అతడు ఒక విషయం నిర్దారించుకున్నాడు.

    దావూద్ హర్షద్ హైదరాబాద్ లోనే ఉన్నాడనీ, మరో రెండు రోజులు అక్కడే ఉంటాడనీ!


                                          *    *    *


    నాగపూర్ స్టేషన్ లో రైలాగింది. ప్లాట్ ఫామ్ మీద నిలబడివున్న బృహస్పతిని "....రండి, మీకోసమే మంత్రిగారు చూస్తున్నారు" అంటూ ట్రైన్ లోకి ఆహ్వానించాడు పి.యే.

    సాయంత్రం ఆరయింది. మరో అయిదు నిముషాలకి ట్రైన్ బయలుదేరింది. ఇద్దరు మనుషులు కూర్చునే కూపే అది. మంత్రి తాలూకు సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది పక్క కూపేలో వున్నారు.

    "చెప్పు, ఏమిటి నాతో మాట్లాడదలుచుకున్నది?"

    "అదేమిటండీ? ఇప్పుడే కదా వచ్చానూ.... రేపొద్దున్న వరకూ ఇదే కంపార్ట్ మెంట్ లో కలిసి ప్రయాణం చెయ్యబోతున్నాం. ఈ ట్రైన్ హైదరాబాద్ వెళ్ళేసరికి పొద్దున్న ఏడవుతుంది. తొందరేముందీ? అన్నట్టు బాటిల్ ఏదీ?"

    సంకల్పనాథ్ మొహం చిట్లించి "బాటిల్ ఏమిటి?" అన్నాడు.

    "ఇద్దరు విలన్స్ మాట్లాడుకునేటప్పుడు సాధారణంగా బాటిల్ ఉంటుంది కదా! ఆఫ్ కోర్స్ అర్ధనగ్నంగా అమ్మాయి నాట్యం చెయ్యడానికి ఈ కూపేలో చోటు సరిపోదనుకోండి."

    "జోకులు మానేసి అసలు విషయం చెప్పు."

    బృహస్పతి ప్యాంట్ జేబులోంచి బాటిల్ తీశాడు. మూతవిప్పగానే గుప్పున వాసన కొట్టింది. సంకక్పనాథ్ అసహ్యంగా మొహం పెట్టి "ఏమిటిదీ?" అన్నాడు.

    "బాగ్ పైపర్. ప్రొహిబిషన్ వచ్చాక మా రాష్ట్రంలో ఇది తప్ప ఇంకేం దొరకడం లేదు. నిన్న రాత్రిది మిగిలింది."

    "దాన్ని బయటికి గిరాటేయ్" అంటూ బ్రీఫ్ కేస్ లోంచి బ్లాక్ డాగ్ తీశాడు.

    "ఓ! స్కాచ్!! గుడ్.... ఇలాంటిది చూసినప్పుడే రాజకీయాల్లో ఎందుకు కొనసాగలేదా అనిపిస్తుంది."

    నౌఖరు వచ్చి గ్లాసులూ, జీడిపప్పులూ సర్ది పక్కకూపేలోకి వెళ్ళిపోయాడు.

    "ఛీర్స్..." అంటూ సంభాషణ ప్రారంభించాడు బృహస్పతి. "ఫోటోలూ, డైరీలూ మీకు అప్పగిస్తాను. ఆ తర్వాత నా మీద మీరు దాడి జరపరని నమ్మకం ఏమిటి?"

    "ఎందుకు జరుపుతాం?"

    "ఒక కాపీ నా దగ్గరుంచుకున్నానన్న అనుమానం మీకు కలగవచ్చు."

    "రాజకీయంలోనూ, వ్యాపారంలోనూ నమ్మకం ముఖ్యం." 

    "నమ్మకం ఉండకూడనిది అక్కడే" బృహస్పతి నవ్వాడు. "ఒక నమ్మకాన్ని కూలదొయ్యడానికి రెండు మీటర్లు చాలు" అన్నాడు.

    "రెండు మీటర్లేమిటి?"

    "ఆల్ మట్టి ఆనకట్ట ఎత్తు" విశదీకరించాడు బృహస్పతి.

    "అసలు విషయంలోకి రా!"

    "మీమీద నాకు నమ్మకం కలిగించుకోడానికి మీరు నాకు కొన్ని విషయాలు చెప్పవలసి ఉంటుంది. అలాగే నేను చెప్పే కొన్ని విషయాల్లో సహాయపడవలసి ఉంటుంది" రెండో పెగ్ పోసుకుంటూ అన్నాడు బృహస్పతి.

    "షరతులు విధిస్తున్నావా?"

    "కాదు. అగ్రిమెంట్ కుదుర్చుకుందామనుకుంటున్నాను. చూడు సంకల్పనాథ్! నువ్వొక క్రిమినల్ వి. కానీ నాకలాంటి చరిత్ర ఏమీలేదు. నువ్వు డబ్బు, అధికారం, పరువు ప్రతిష్ట ఉన్నవాడివి. నేను తాడూ బొంగరం లేనివాడిని. ఈ వ్యవహారం ఏదయినా బెడిసికొడితే నాకు పోయేదేం లేదు. మంత్రి పదవిపోయి, జైల్నించి బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ కూచోవలసింది నువ్వు!"  

    అతడి ఏకవచన సంబోధనానికి బాగా ఇరిటేట్ అయిన సంకల్పనాథ్, అతి కష్టం మీద నిభాయించుకున్నాడు. "చెప్పు.... ఏమిటి నీ షరతులు?"

    "నేనో రెండు ముఖ్యమైన పాయింట్లు నీతో చెప్పదలుచుకున్నాను. మొదటిది- ఆర్.బి.ఎల్. భరత్ గురించి."

    "అతడి గురించి చెప్పడానికేముంది?"

    "అసలీ కథేమీ జరక్క ముందునుంచీ మా ఇద్దరి మధ్య వైరం వుంది. అతడేదో గొప్ప ప్లాన్ వేశాననుకుని ఒక మీటింగ్ లో నన్ను స్టేజిమీదకి పిల్చి తనని పొగడమన్నాడు. నేను నిరాకరించాను పెద్ద గొడవయింది. ఇప్పుడు నేను ఈ విషయంలో అతడికి తగిన బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో నువ్వు కల్పించుకోకూడదు. ఇది నా మొదటి షరతు."

    సంకల్పనాథ్ రాజీ కుదురుస్తున్నట్టు "అదేమిటి బృహస్పతీ? మనం.... మనం ఒకటి! నువ్వు చెప్పేది చాలా చిన్న విషయం. ఏదో సర్దుకుపోవాలి కానీ, ఇంతదానికి పగలూ, కక్షలూ పెంచుకుంటారా?" అన్నాడు.

    "ఒక పోలీసు ఉన్నత అధికారి ఒక స్త్రీ పిరుదల మీద కొడితే 'ఇది చాలా చిన్న విషయమమ్మా! సర్దుకుపో' అని గవర్నరు చెప్పినట్టు చెప్తున్నారు. అలా సర్దుకుపోయే మనస్తత్వం కాదు నాది. ఒక లేడీ ఇన్ స్పెక్టర్ చేత నా చెంపమీద కొట్టించాడు. దానికి ప్రతీకారం తీర్చుకోవలసిందే! అయినా ఇది నాకూ, అతడికి సంబంధించిన విషయం. నేను మిమ్మల్ని కోరేది మిమ్మల్నిందులో కల్పించుకోవద్దని మాత్రమే!"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra