Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 32


    జ్యోతి కనిపిస్తూనే ఉంది. ఇదివరకులా ఒక దారిలో సాగటం లేదు. ఒకచోట కనిపిస్తుంది, మాయమవుతుంది. మరోచోట వెలుగుతుంది.
    అడవిలో ఏ మూలో ఏ రోజు జ్యోతి వెలుగుతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు.
    భక్తులు మళ్ళీ ప్రవాహంలా రావటం మొదలుపెట్టారు కొండదేవత గుడికి. పోలీసులకి మళ్ళీ ప్రమధపురికి రాక తప్పలేదు.


                                *    *    *    *


    చిచ్చు కోయ యువకులతో తరచు సమావేశమవుతున్నాడు. గ్రామ సరిహద్దులు దాటాక అడవి లోపలికి కాకుండా, చెట్ల మధ్య తాటాకులతో షెడ్ లాంటిది ఏర్పాటు చేశారు కోయ యువకులు. అప్పుడప్పుడు కొన్ని రాత్రుళ్ళు చిచ్చు కోయ యువకులతో అక్కడే పడుకుంటున్నాడు. ఒక రాత్రివేళ ఎవరో తట్టి లేపినట్టయి కళ్ళు తెరిచాడు. ఎదురుగా పిచ్చిది.
    భయంతో అరవబోయాడు. పిచ్చిది నోటిమీద చెయ్యి వేసింది. రెక్క పట్టుకుని లేవదీసింది.
    బరబర ఈడ్చుకు పోతున్నట్టు నడిపించసాగింది.
    "ఏయ్! నన్ను వొదులు!" అన్నాడు, చిచ్చు రెండు మూడుసార్లు విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ. పిచ్చిది వినిపించుకోలేదు. "దానికి నిజంగా పిచ్చి ఉందేమో?" అని భయపడ్డాడు. ఎటు లాక్కెళ్ళిందో కూడా అర్థంకావటం లేదు. ఉండుండీ అడవి దరిదాపుల్లో భగ్గున మంటలు కనిపించాయి. ఆగి వెనక్కి తిరిగి చూశాడు. పిచ్చిది కూడా ఆగింది. అప్పటివరకూ చిచ్చు పడుకున్న తాటాకుల షెడ్ తగలబడిపోతోంది. తను మరో రెండు నిమిషాలు ఆ షెడ్ లోనే ఉండి ఉంటే. భయంతో శరీరం జలదరించింది చిచ్చుకి. పిచ్చిది మళ్ళీ అతన్ని రెక్కపట్టుకుని లాక్కుపోసాగింది. అతడికి మాట్లాడటానికి అవకాశం ఇయ్యటం లేదు. రైల్వేస్టేషన్ దగ్గరకి వచ్చారు ఇద్దరూ. అప్పుడు వదిలింది అతడి చెయ్యి.
    "బాబూ! ఇంక ఊళ్ళో ఉండమాక, వెంటనే రైలెక్కి వెళ్ళిపో."
    "ఎందుకూ?" మొండిగా అడిగాడు చిచ్చు.
    గదమాయిస్తున్నట్లు చూసింది పిచ్చిది.
    "తెలివి తేటలన్నీ నీ ఒక్కడి సొత్తే అనుకోకు. మీరంతా ఆ షెడ్ లో ఏం చేస్తున్నారో నామాలయ్యకి తెలవదనే అనుకుంటున్నావా? నిన్ను పేనాలతో వదులుతాడా? అయినా నువ్విక్కడుండి చేసే నిర్వాకమేంటయ్యా? యెల్లి ఇళమ్మని ఇడిపించే మార్గం చూడు! పో!"
    నివ్వెరపోయాడు చిచ్చు. ఈ పిచ్చిది ఎవరి పక్షం? తమ పక్షమే అయితే నామాలయ్యకు ఎలా తెలుస్తుంది! నామాలయ్య పక్షం అయితే తననెందుకు కాపాడుతుందీ?
    "పిచ్చీ! నువ్వెవరూ?" అడిగాడు.
    "ఇహ్హిహిహి! ఇహ్హిహ్హిహ్హిహిహి!"


                                      14


    "ఇలాంటి లోకం కూడా ఉందా?" నిర్ఘాంతపోతోంది. వ్యభిచారిణులతో, దొంగలతో కలిపి లాకప్ రూంలో ఉంచారు ఇళని! న్యాయంగా వ్యభిచారిణులను కాని, మరెవరిని కానీ బంధించిన ఇరవై నాలుగు గంటలలోగా కోర్టులో హాజరు పరచాలి. కాని ఎప్పుడూ అలా చెయ్యరు. బంధించిన వాళ్ళు నేరం ఒప్పుకునేలా చెయ్యటానికి ప్రయత్నిస్తారు. వ్యభిచారిణులు తమలో తాము పచ్చి జోక్స్ వేసుకుంటూ విరగబడి నవ్వుకుంటున్నారు. రాత్రిళ్ళు తమ దగ్గరకి వచ్చేవాళ్ళ గురించి, ఒకరి అనుభవాలు మరొకరికి చెప్పుకుంటున్నారు. "ఈళ్ళు కోర్టుకెప్పుడు తీసుకెళతారు సచ్చినోళ్ళు" ఒకర్తి మెటికలు విరిచింది. "ఏమో! ఈళ్ళకేం పనులున్నాయో?" మరొకత్తె కన్నుకొట్టి విరగబడి నవ్వింది. దొంగతనం నేరంతో లాకప్ లో ఉంచబడ్డ నలభై ఏళ్ల మనిషి "నేనీసారి హాయిగా ఆర్నెల్లయినా జైల్లో ఉంటాను. తొందరగా పొమన్నా పోను. బయట బోరు కొడుతోంది" అంటోంది.
    "మరి నీ ఇల్లో!" ఎవరో అడిగారు.
    "నా ఇల్లూ, పిల్లలూ, ఆ గొడవలు అమ్మ చూసుకుంటుంది" అమ్మ అంటే ఎవరో ఆ తర్వాత వాళ్ళ మాటల బట్టి తెలిసింది. 'అమ్మ' అనబడే ఆవిడ డబ్బులేని బీదవాళ్ళని అన్ని వయసుల వాళ్ళనీ పోగుచేస్తుంది. వాళ్ళకి కొంతకాలం ట్రైనింగ్ ఇప్పిస్తుంది. తనే గొప్పవాళ్ళ ఇళ్ళలో పనికి కుదురుస్తుంది. కొంతకాలం పని చేసినట్లే చేసి చేతికందిన సొమ్ముతో పరారయి రావాలి. వాళ్ళు పోలీసులకందకుండా 'అమ్మ' కాపాడుతుంది. అదీ రాకెట్! ప్రస్తుతం పట్టుబడ్డ అమ్మాయికి పనిచెయ్యాలంటే విసుగ్గా ఉంది. అంచేత కొన్నాళ్ళు జైల్లోనే 'హాయిగా' ఉందామని కలలు కంటోంది.
    ఇళకి తల గిర్రున తిరుగుతోంది. ఆ పిల్లకి ప్రమధపురి తప్ప వేరే లోకం తెలియదు. అప్పటివరకూ దుర్గామాత ధ్యానం, భక్తులూ, తీర్థ ప్రసాదాలు ఈ పరిధిమించి ఆలోచించలేదు. విదుషి మాటలు మనసును కొంత మధించాయి. కానీ ఇలాంటి నికృష్ట లోకం గురించి ఎవరూ ఏనాడూ చెప్పలేదు. పాపం! ఈ ఆడవాళ్ళు డబ్బు కోసం తాము అంతగా అసహ్యించుకొనే మొగవాళ్ళతో గడపటం దేనికి? నడివయసులో వున్న స్త్రీ బయటకంటే జైలులోనే 'హాయిగా' ఉందనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది?
    ఇదంతా దుర్గామాత సృష్టేనా? జగజ్జనని కరుణామయి దుర్గామాత ఎందుకింతగా ఏడిపిస్తోంది ఈ మనుష్యుల్ని. వాళ్ళు ఏడవటం లేదు. నవ్వుతున్నారు. కానీ ఆ నవ్వులు చూస్తోంటే ఇళకి ఏడుపొస్తోంది. ఇటు నామాలయ్య, అటు పోలీసులు ఇళని ఎవరూ కలుసుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంచేత చిచ్చు ఇళని కలుసుకోవాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు.
    ఇళకి శరీర బాధ బాగా తెలుస్తోంది. లాకప్ లోని రణగొణ ధ్వనుల మధ్య ధ్యానం కుదరటం లేదు. పోలీసులు పడేసే రొట్టె, కూర తినాలనిపించడం లేదు. ఎప్పటిలా పళ్ళూ, పాలూ తీసుకోవాలని వుంది, ఎవరిస్తారూ!
    పత్రికా విలేకరులు ఎలాగైనా లాకప్ లో వున్న ఇళ ఫోటో సంపాదించాలని తాపత్రయపడుతున్నారు. ఇళ అరెస్టయిన వారత్ అప్పటికే పేపర్లో వచ్చేసింది. పత్రిక వాళ్ళు దరిదాపులకి రాకుండా పోలీసులు చాలా జాగ్రత్త తీసుకున్నారు. కానీ పోలీసులు అదుపు తప్పి ప్రవాహంలో పత్రికల వాళ్ళు వచ్చిపడే సంఘటన ఒకటి జరిగింది. పోలీసులు ఒకమ్మాయిని లాకప్ రూంలోకి తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి నిండా పద్దెనిమిదేళ్ళు కూడా వుండవు. అందంగా, ఆరోగ్యంగా హుందాగా ఉంది. చిరునవ్వుతో విజయగర్వంతో వచ్చింది. లోపలికి ఆమెను తీసుకొస్తున్న మహిళా కానిస్టేబుల్స్ ముఖాలే వెలవెలపోతున్నాయి. ఆమెతోపాటు ఎందరో విద్యార్థినులు, విలేఖరులు లాకప్ రూం దగ్గరికి వచ్చేశారు. వాళ్ళని కంట్రోలు చెయ్యటం ఎవరితరమూ కాలేదు. పోలీస్ స్టేషనులో మహిళా పోలీసులకి ఒక ప్రత్యేక విభాగం ఉంది. అక్కడ ఆడ పోలీసులు సాధారణంగా నవలలు చదువుకుంటూ కూర్చుంటారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లోనూ, మిలటరీ డిపార్ట్ మెంట్ లోనూ కూడా డిసిప్లిన్ పేరిట, క్రింది అధికారుల మీద పై అధికారుల బాసింగ్ శృతిమించి ఉంటుంది. ఆ ఆనవాయితీతో మొగ పోలీస్ అధికార్లు సహితం ఆడ పోలీసుల మీద అధికారం చెలాయిస్తూ మాట్లాడతారు. కొందరు చాలా చులకనగా తీసిపారేస్తున్నట్టే వ్యవహరిస్తారు. పాపం మహిళా పోలీసులు తమ పై అధికారుల ముందు "యస్! యస్!" అంటూ సెల్యూట్ చేసి, ఆ కోపం అంతా తమకు లోకువగా వున్న బందీల మీద ప్రదర్శిస్తారు. రెండు రోజుల్నించీ మహిళా కానిస్టేబుల్స్ నేరస్థులతో వ్యవహరిస్తున్న తీరు ఇళ చూస్తూనే వుంది. బాధతో, ఆశ్చర్యంతో, జాలితో ఇళకి మతిపోయినట్లు అవుతోంది కానీ, ఈవిడెవరో మహారాణిలా వచ్చింది. మహిళా పోలీసులు అగ్గగ్గలాడుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. పత్రికల వాళ్ళు ఆ అమ్మాయి "ఫోటోలు తీస్తున్నారు. పనిలోపనిగా కొందరు ఇళ ఫోటోలు కూడా తీసుకున్నారు. విలేఖరులు ఆ అమ్మాయిని ఏవేవో ప్రశ్నలడుగుతున్నారు. దర్జాగా సమాధానాలు చెప్తోంది. విద్యార్థినులు కటకటాలముందు దడి కట్టినట్లే కిక్కిరిసిపోయారు. ఒక మహిళా కానిస్టేబుల్ లాఠీ ఎత్తబోయింది. ఇద్దరు విద్యార్థినులు అది లాక్కుని దూరంగా విసిరేశారు. "జాగ్రత్త! మా జోలికి రావద్దు" హెచ్చరించింది మరో విద్యార్థిని. ప్రేక్షకుల్లాగా కాస్త ఎడంగా నిలబడ్డారు మహిళా పోలీసులు. దాదాపు గంట తర్వాత విలేఖరులు వెళ్ళిపోయారు. విద్యార్థినులు కన్నీళ్ళతో ఆ అమ్మాయితో "వెళ్ళొస్తాం!" అన్నారు.

 Previous Page Next Page