రామం స్నేహితుడయిన ఆ మంత్రిగారి పేరు రాజారావు. అతడొక గూండా నాయకుడు. డబ్బుకోసం, పదవికోసం ఎంతటి దురాగతానికయినా పాల్పడతాడని దేశంలో గొప్ప పేరుందాయనకు
రాజారావు పదవిలో వుంటే తన పదవికి ముప్పని భయంతో ముఖ్యమంత్రి ఒక పథకం వేశాడు. డాక్టర్ల నియామకంలో రాజారావు బాగా డబ్బు తిన్నాడనీ, జూబ్లిహిల్స్ లో లక్షల ఖరీదు చేసే ప్రభుత్వ స్థలాలు కైంకర్యం చేస్తున్నాడనీ సాక్ష్యాధారాలు ఒక పత్రికకు యిచ్చి వూరుకున్నాడు. ఆ విషయంలో పెద్ద దుమారం లేచింది. రాజారావు ఆ సంగతి మర్చిపోలేదన్నమాట. మతకల్లోలాలను సృష్టించి ముఖ్యమంత్రిని పదవి నుంచి దింపడానికి భగవంతుడి సాన్నిధ్యంలో గూండా నాయకులతో పథకాలు చేస్తున్నాడు.
నా ఆలోచనలకు అంతం లేదు. ప్రయోజనం అంతకంటే లేదు. కాని ఎవరో అన్నట్లు నా బుర్ర డెవిల్స్ వర్క్ షాప్. అదలా నిరంతరం శ్రమిస్తూనే వుంటుంది. ఫలితం లేదని తెలిసినా...
* * * *
ఉదయమే పాపనాశనం చేరుకున్నాను. మనిషినీ, మనసునీ, మైమరిపించే అందమైన పరిసరాలు. అంతటి చలిలోనూ చల్లటి నీటి స్నానం ఎంతో హాయిని కలిగించింది. చాలామంది చలికి భయపడి నెత్తిన నీళ్ళు చల్లుకుని వెళ్ళిపోతున్నారు. స్నానం ముగించుకుని పక్కనే వున్న తోటలోకెళ్లి కూర్చున్నాను. చుట్టూ మనుషులు. గుంపులు గుంపులుగా కూర్చుని భోజనాలు చేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ గడుపుతున్నారు.
"దేశంలో ఇన్ని దేవాలయాలున్నా ఇంతమంది జనం ఇక్కడకు వస్తున్నారంటే దేవుడి మహిమకాక మరేమిటి?"
"నిజమే. ఈ మధ్య ఇక కేంద్రమంత్రి కూడా వచ్చి ఇక్కడే పెళ్ళి చేసుకున్నాడు. ఉత్తర భారత దేశస్థులకు కూడా ఈ దేవుడి మహిమ బాగా తెలిసింది. మన ఉపరాష్ట్రపతిగారు రెగ్యులర్ గా వస్తారు."
"నిజమే. మరి ఈ వైభోగం, దర్పం మరే దేవుడిలోనూ కనిపించవు. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న కళ్ళతో మరేదీ చూడాలనిపించదు కదా."
"ఒరేయ్! సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్ కూడా ఉంది రండి" ఎవరో అరిచారు.
మరుక్షణంలో అందరూ లేచి పరుగెత్తారు. నవ్వుకుంటూ చుట్టూ చూశాను. ఒక జంట మాత్రం మిగిలారు. ఆయన్ని గుర్తు పట్టాను. క్రితం రోజు తోటలో సంధ్యావందనం చేసిన వ్యక్తి. నేను 'మహర్షి' అని పేరు పెట్టుకున్న వ్యక్తి.
గడ్డిలో పడుకుని కళ్ళు మూసుకున్నాను. వాళ్ళ మాటలు నా చెవిన పడుతూనే వున్నాయి.
"ఈ రోజుల్లో భగవంతుడి దర్శనంకంటే సినిమా యాక్టర్ల దర్శనంతో తృప్తిపడిపోతున్నారు జనం. ఏమిటో ఆ పిచ్చి" తిట్టుకుంటోందావిడ.
"భగవంతుడిని ఎప్పుడంటే అప్పుడు చూడవచ్చు. వీళ్ళ దర్శనం దొరకడం సులభం కాదుగా. అసలు వీళ్ళలో భక్తి అనేది ఎక్కడేడ్చింది? అంతా పైపై పటాటోపం. ఎవర్నయినా మోసం చేయగలరేమోగాని ఆ భగవంతుడి కళ్ళు కప్పగలరా?" వాపోయాడు మహర్షి.
"ఏమండీ!" ఆవిడ మెల్లగా పిలుస్తోంది. నా ఉనికిని గమనించి నేనంతా వింటున్నానని ఫీలవుతుందేమోనని కదలకుండా పడుకున్నాను.
"ఏమండీ! అక్కడ అదేమిటో మెరుస్తోంది" అందావిడ. ఆయన కదలిక స్పష్టంగా తెలుస్తోంది. వెళ్ళి పట్టుకొచ్చాడు.
"ఉంగరమే, బావుందికదూ?" అన్నాడు మెల్లిగా.
"బంగారమేనా?" అడుగుతోందావిడ.
"ఆ! నవరత్నాలున్నాయి. చాలా ఖరీదుంటుంది."
"ఇందాక అక్కడ కూర్చున్నాయనదనుకుంటాను."
"ఎవరిదైతే మనకేం? మనకు దొరికిందని చెప్తే పదిమందీ నాదంటే నాదని వస్తారు. ఆ భగవంతుడే మనకిది చూపించాడనుకుందాం. పద వెళ్ళిపోదాం" లేచి అన్నీ గబగబా సర్దేసుకున్నాడు మహర్షి.
"పోనీ-వాళ్ళు వచ్చాక అడిగి......" ఆయన ఉరిమి చూశాడేమో ఆవిడ ఆగిపోయింది.
వాళ్ళు వెళ్ళిపోయారు. క్రితం రోజు అతడిమీద కలిగిన గౌరవభావం అంతా తుడిచి పెట్టుకుపోయింది. లేచి బస్టాండు చేరుకున్నాను. ఆ జంట దిగువ తిరుపతికి వెళ్ళే బస్సులో కనిపించారు. భగవంతుడినించి దూరంగా పారిపోతున్నారా అనిపించింది.
కాటేజీకి చేరుకునేసరికి నీరసంగా అనిపించింది. రాత్రి ప్రయాణం. కాస్సేపు విశ్రాంతి తీసుకోవాలి తప్పదు. తాళం తీయబోతూ ఆగిపోయాను. పక్క కాటేజీ దగ్గర జనం గుంపులు గుంపులుగా నిలబడి వున్నారు. పోలీసు జీపు, అంబులెన్స్ ఆగివున్నాయి. గాభరాగా వెళ్ళాను.
అక్కడ దృశ్యం చూస్తూంటే కడుపులో దేవినట్లనిపించింది. నేను దీపికగా భావిస్తున్న ఆ పదిహేనేళ్ళ పడుచుపిల్ల శవంగా పడుంది. బంగారపు రంగు వంటి ఛాయ నల్లగా కమిలి భయంకరంగా కనిపిస్తోంది.
వాళ్ళిద్దరూ ప్రేమికులట. ఆ అమ్మాయి మైనర్.
ఇక్కడికొచ్చి రెండురోజులు భగవత్ సాన్నిధ్యంలో గడిపి, జంటగా ఉరి వేసుకున్నారు.
ఆ చావుకూడా ఒకర్నొకరు కౌగిలించుకునే మరణించారుట.
నేను చూస్తుండగానే శవాన్ని అంబులెన్స్ లో వేసి తీసుకుపోయారు. పోలీసుల ప్రశ్నలకు నాకు తెలిసిన జవాబులు చెప్పి గదికి వచ్చాను. దిగులుగా పడుకున్నాను.
భగవంతుడి కోసం నిర్దేశించబడ్డ తోటలో ఒక పువ్వుని కోసినా నేరంగా భావిస్తారు. కాని అమాయకులైన ఒక జంట దారుణంగా చచ్చిపోతోంటే ఆపే శక్తి ఆ భగవంతుడికి కూడా లేకపోయిందా?
ఆ సంఘటన నన్ను చాలా కృంగదీసింది. కళ్ళు మూసినా, తెరిచినా ఆ అమ్మాయి రూపమే కళ్ళల్లో కదులుతోంది. లేచి సామాను సర్దుకున్నాను. రామాన్ని కలవాలని కూడా అనిపించలేదు. తిరుపతి నుంచి హార్స్ లీ హిల్స్ వెళదామనుకున్నవాడిని అది కాన్సిల్ చేసుకుని హైదరాబాద్ ట్రైనెక్కాను.
2
ఇల్లు చేరేసరికి బాగా జ్వరం వచ్చేసింది. పనమ్మాయి లక్ష్మి వచ్చి కాఫీ చేసిచ్చింది. మందు వేసుకుని పడుకున్నాను. ఆఫీసు వాళ్ళకు ప్రసాదము పంపడం మర్చిపోలేదు. తిరుపతి లడ్డూని ప్రసాదంగానే కాక రుచికోసం కూడా ఇష్టపడతారంతా. క్రిష్టియన్లు, ముస్లిమ్ లు కూడా తీసుకుంటారు. అందుకే ఎక్కువగానే పంపాను.
పక్క పోర్షన్ లో అబ్బాయి డాక్టర్ని తీసుకొచ్చాడు. వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోమన్నాడాయన. శెలవు పొడిగించాను. పనమ్మాయి వంటకూడా చేసి పెడుతోంది. చుట్టుపక్కలవాళ్ళు వద్దన్నా వినకుండా ఏదో ఒకటి పంపుతారు. వంటరివాడిని, మంచి జీతం వస్తున్నవాడిని. ఎవరికే అవసరం వచ్చి అడిగినా కాదనకుండా యిస్తుంటాను. ఆ కృతజ్ఞతని ఈ రకంగా చూపించుకుంటారు. ఆప్యాయంగా, ఆత్మీయంగా వుంటారు.
కష్టసుఖాలని పంచుకోవడం వేరు. ఆలోచనలను భావాలను పంచుకోవడం వేరు. అందుకే అంతమంది శ్రేయోభిలాషుల మధ్య కూడా ఒంటరిగానే ఫీలవుతుంటాను.
నాకు బాగోలేదని తెల్సి ఆఫీసు కొలీగ్స్ స్వామినాధం, శర్మా వచ్చారు.
"థాంక్సండీ! ప్రసాదం ఎక్కువగా పంపారు. అందరం తృప్తిగా సేవించాం" అన్నాడు శర్మ.
"వెంకట్ గారు ఎప్పుడూ అంతే. ఏం చేసినా మనస్పూర్తిగా చేస్తారు. అన్నట్లు దర్శనం అదీ బాగా జరిగిందా? ఎక్కువగా రష్ లేదనుకుంటాను. శూన్యమాసం కదా" అన్నాడు స్వామినాధం.
"బాగానే జరిగింది. మామూలు దర్శనమే కాదు- యింకా చాలా చూశాను" అన్నీ వివరించి చెప్పాను.
"ఎంత అదృష్టవంతులండీ. చిన్నప్పటినుంచి వెళుతున్నాను. నాకు అలాంటి అదృష్టమే కలగలేదు. మీరెంతో పుణ్యం చేసుకునుంటారు. అందుకే స్వామిని అంత దగ్గరగా చూడగలిగారు" అన్నాడు శర్మ తన్మయత్వంతో. అతడి కళ్ళలో నా పట్ల గౌరవం, ఆరాధనాభావం కనిపించాయి. స్వామినాధం కాస్త అసూయగా చూస్తున్నాడు.
కాస్సేపు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఆలోచనలు. ఇలాంటి మనుషులతో నా ఆలోచనలు ఎలా పంచుకోను? నాకు తెల్సినంతవరకు నా పరిధిలో నా భావాలను అర్ధం చేసుకునే వాళ్ళెవరూ లేరు.
ఒంటరితనం, ఏకాంతం నన్ను బాధ పెడుతున్నాయి. నాకు తోడు కావాలి. కష్టసుఖాలను పంచుకునే అర్ధాంగి అనే తోడు కాదు. అయిదేళ్ళ దాంపత్య జీవితంలో సుజాత నాకు జీవితాంతం సరిపడే ప్రేమని పంచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శారీరకసుఖం కోసం నా శరీరం ఏనాడూ అలమటించలేదు.
నాకు తెలుసు. నేను స్నేహరాహిత్యంతో బాధపడుతున్నాను. మనసులోని భావాల్ని కనీసం విని అర్ధంచేసుకునే స్నేహితులు లేక అలమటిస్తున్నాను. ఎక్కడో, ఎవరో నా భావాలను పంచుకునే వాళ్ళుండే ఉంటారు కాని వాళ్ళను కలుసుకునేదెలా? పుస్తకాలవాడు కొన్ని పత్రికలు యిచ్చి వెళ్ళాడు. ఏదో ఇంగ్లీషు మ్యాగజైన్ తిరగేస్తుంటే కనిపించిందా ప్రకటన.
"తోడు కావాలి. అరవై యేళ్ళ రిటైర్డ్ ఆఫీసరికి తోడుగా వుండడానికి నలభై యేళ్ళ పైబడ్డ స్త్రీ కావాలి. విధవరాలయినా ఫర్వాలేదు. ఆధ్యాత్మిక చింతనలో శేషజీవితాన్ని గడపాలనుకునే వాళ్ళయితే మంచిది."
అది చదువుతుంటే అనిపించింది అలాంటి ప్రకటన నేనూ ఇస్తే? నాకు స్త్రీయే కావాలని లేదు ఇలాంటి భావాలు చిన్న వయసు స్త్రీలలో ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది.
ఆ రోజంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రయత్నం చెయ్యడంలో తప్పులేదు. కొంత డబ్బు తప్ప వచ్చే నష్టం కూడా లేదు.
మర్నాడు ప్రొద్దుటే ఓపిక చేసుకుని ఎక్స్ ప్రెస్ ఆఫీసుకి వెళ్ళి నాకు కావల్సిన విధంగా ప్రకటన ఇచ్చి వచ్చాను. ఆదివారం స్పెషల్ లో వేస్తానన్నారు. జవాబుకోసం మరో పదిహేను రోజుల పాటైనా ఎదురుచూడాలి. ఆ విషయం మర్చిపోవడం మంచిదిక.
* * * *
నెలలో చివరి రోజుల్లో మా ఆఫీస్ లో పని చాలా ఎక్కువగా ఉంటుంది. ముసలి, ముతకా స్త్రీలు, పురుషులు పెన్షన్ కోసం వస్తూంటారు. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు డిపార్టుమెంటు వారీగా విడదీసి పెన్షన్లు ఇవ్వబడతాయి. ఫ్యామిలీ పెన్షన్లు విడిగా ఉంటాయి. పాతిక రూపాయలనించి మూడువేల పై చిలుకు వరకు పెన్షన్లు ఇవ్వబడతాయి. సాధారణంగా నెలలో చివరి వారం నుంచి మొదటి వారం వరకూ ఎవరూ లీవు పెట్టరు. పెన్షన్ దార్లకు డబ్బులిచ్చే రోజులని కాదు. డబ్బులొచ్చే రోజులని.