Previous Page Next Page 
అష్టావక్ర పేజి 29


    ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, అష్టావక్రుడు పుట్టి, పెరిగి, ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి ప్రజలందరూ అతడికి అప్పటికే దాసోహమై వుంటారు.

    బాబా లేచి "పుట్టన్న సంగతి" అన్నాడు ఆఖరి అంశంగా, "...ఈ అష్ట పుట్టుకలకీ కారణం డాక్టర్ రంగప్రసాద్ అని చెప్పి అమెరికా వెళదామనుకుంటున్నాడు. మన సహాయం కోరాడు".

    "పుట్టన్న కన్నా రంగప్రసాద్ లాటి వాళ్ళని సపోర్టు చేయటమే మనకి లాభం రంగప్రసాద్ అంటే ఇక్కడ ప్రజలకి చాలా అభిమానం".

    "కానీ రంగప్రసాద్ ఉస్సోక్ లో చేరతాడని నేను అనుకోను" అన్నాడు రాకేష్.

    "అక్కర్లేదు" అన్నాడు మహాదష్ట. "సాతాను కావాలనుకుంటే మన మనిషే పదిహేను రోజుల్లో రంగప్రసాద్ గా తయారవుతాడు. అక్కర్లేదనుకుంటే అతడు-"

    "కేదారగౌరికి రంగప్రసాద్ ఆస్పత్రిలోనే ప్రసవం జరుగుతుంది. ఆమె దానికి చాలా పట్టుదలగా వుంది. ప్రసవం టైమ్ లో సిద్ధార్థ కూడా అక్కడే వుండేట్టుగా నేను చూస్తాను. అతడు కూడా మరణిస్తాడు. పోతే ఇక మిగిలింది రంగప్రసాద్. ఈసారి అతడు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇప్పటివరకూ జరిగిన పుట్టుకల వెనుక ఏముందో తెలుసుకోవటానికి అతడు చాలా పట్టుదలగా వున్నాడు. మహాదష్ట చెప్పినట్టు ఆపాటికే రంగప్రసాద్ స్థానంలో మన మనిషి వుంటే ఫర్వాలేదు. లేని పక్షంలో ప్రొఫెసర్ పుట్టన్న- వీటన్నిటికీ కారణం డాక్టర్ రంగప్రసాదే అని బాగా చెప్పవచ్చు..." అని ఆగి, నెమ్మదిగా అన్నాడు. "కృష్ణాపురంలో జరిగే ఎనిమిదో జననం అది. నా ఊహ కరెక్టయితే ఆ క్షణం అక్కడ ప్రజలు తండోపతండాలుగా ఉంటారు. బాబా చిన్న మాట జనంలోకి వదిలిన వెంటనే వాళ్ళే నక్కలూ, పులులూ అవుతారు. తోడేళ్ళయి ఆస్పత్రిని ధ్వంసం చేస్తారు. రంగప్రసాద్ నీ, సిద్ధార్థనీ చీల్చి చెండాడుతారు. నా ఉద్దేశ్యంలో అష్టావక్రుడు పుట్టగానే చంపి బీభత్సం సృష్టించటం అంటే అదే..."

    ఉస్సోక్- 

    సభ్యుల్లోంచి కరతాళధ్వనులు వినిపించాయి.

    రాకేష్ ఓరగా మాహాదష్టవైపు చూశాడు. దష్ట మొహంలో ఏ మార్పూ లేదు. కలకలం తగ్గగానే లేచి "ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడవలసింది వున్నదా?" అని అడిగాడు.

    చివరినుంచి ఒక సభ్యుడు లేచి, "అష్టావక్రుడు పుట్టే లోపులో చెయ్యవలసిన పనులు ఇంకాఏమైనా వున్నవా?" అని అడిగాడు.

    "లేవు. బహుశా అతడు పుట్టే వరకూ, ఇదే ఆఖరి సమావేశమవుతుంది. అప్పటివరకూ వీలైనంత ఎక్కువ మందిని, సైతాన్ వైపుకి తిప్పటానికి ప్రయత్నించండి. బాగా నమ్మకం కుదిరితే ఉస్సోక్ లో చేర్పించండి".

    సమావేశం ముగిసినట్టు గంట మ్రోగింది. ఒకరొకరే లేచి వెళ్ళిపోసాగారు.

    బాబా, రాకేష్ ఒకేసారి గుమ్మం దగ్గిరకు చేరుకున్నారు.

    రాకేష్ గొంతు చిన్నది చేసి, "నేను కొంచెం మాట్లాడాలి" అన్నాడు.

    బాబా కూడా అదే గొంతులో "నాకు తెలుసు! మనం ఈ విషయం మాట్లాడుకునే అవసరం లేదు రాకేష్! సాతాను నీ విషయం కూడా నాకు చెప్పాడు. అష్టావక్రుడు పుట్టేవరకూ నువ్వు బైటపడక. ముఖ్యంగా మహాదష్ట సమక్షంలో మనపని కంట్రోలులో వుంచుకో!" అంటూ వడివడిగా అక్కడినుండి వెళ్ళిపోయాడు.

    రాకేష్ నిశ్చేష్టుడయ్యాడు.


                           19


    "క్షమించమని అడగడానికి కూడా నోరు రావటంలేదు. కానీ ఒక్క విషయం మాత్రం నమ్మండి. నేనే దురుద్దేశంతోనూ మీ మనవరాల్ని అక్కడికి తీసుకువెళ్ళలేదు. కేవలం అతడు కపట బాబా అనుకుని, ఆ బండారం బైట పెట్టడానికి రంజితసాయం కోరానంతే. ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు".

    అతడు తలెత్తాడు. అతడి మొహం వృద్ధాప్యంవల్ల ముడతలు పడివుంది. కనుబొమలు తెల్లగా వున్నాయి. వాటిక్రింద కళ్ళలో ఏదో దివ్యమైన తేజస్సు వుంది. అనుభవం గాంభీర్యంతో రంగరించుకుని, జ్ఞానమై- మొహంమీద అద్దినట్టు వుంది.

    అతడు జయదేవ్!

    ప్రొఫెసర్ జయదేవ్!!

    "విషయం మనవరకూ వచ్చేసరికి ఎంత దృఢమైన మనస్తత్వం వున్నవారైనా, మానసిక దృఢత్వం లేకపోతే అతీత శక్తులని నమ్ముతారని చెప్పటానికి రంజిత మంచి ఉదాహరణ".   

    షాడో విస్మయంతో చూస్తూ "అదేమిటి జయదేవ్ బాబూ- తప్పు రంజిత మీద వేస్తున్నారా?" అన్నాడు.

    "రంజిత మీద కాదు. మొత్తం మా కుటుంబం మీదే! ఎంతో గొప్ప హేతువాదులుగా పేరుపొందిన మావాళ్ళు- ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా? దర్గా దగ్గరకి తీసుకువెళ్ళి ఆమె చేతికి తాయెత్తు కట్టిస్తున్నారు". అంటూ లేచి కిటికీ దగ్గరకి వెళ్ళి బయటకు చూస్తూ "శారీరక సంబంధం లేకుండా, కేవలం ఒక బాబా మాటలవల్ల ఒకమ్మాయికి గర్భం వస్తుందా? అదెంత హాస్యాస్పదమో- ఆ గర్భం రాకుండా వుండటానికి చేతికి తాయెత్తు కట్టడం కూడా అంతే హాస్యాస్పదం కాదూ? చెప్తే ఎవరు వింటారు?" అన్నాడు నిస్పృహగా.

    షాడో మొహం విప్పారింది. "కనీసం మీరైనా నమ్ముతున్నారు కదూ?" అన్నాడు.

    "ఇక్కడ నా నమ్మకం కాదు ముఖ్యం. రంజిత జీవితం! ఆమెని ఈ షాక్ నుంచి బయటకు తీసుకురావాలి. ఆమె తిరిగి కృష్ణాపురం వెళ్ళేలా చూడాలి. తోటి విద్యార్థినుల్లో ఏమీ జరగలేదన్నది ప్రస్పుటం కావాలి. నిజంగా ఆమె చేసిన పని చాలా గొప్పది. తనకున్న పరిధిలో ఒక పెద్ద పనిని చేయాలని ప్రయత్నించి ఓడిపోయింది. కానీ ఎవరు అర్ధం చేసుకుంటారు? అర్ధం చేసుకోవడానికి బదులు అదోలా చూస్తారు. నేను ఊహించగలను. రేపు ఆమె తిరిగి చదువుకోడానికి వెళ్తే ప్రతీవాడి చూపూ ఆమె కడుపుమీదే పడుతుంది. కొన్ని కళ్ళు నవ్వుతాయి- కొన్ని కళ్ళు పరీక్షించి చూస్తాయి. సున్నిత మనస్కురాలైన ఆ అమ్మాయి దీన్ని తట్టుకోగలదా? బహుశా నా వుద్దేశం నిజమైతే..." అని ఆగి-

    "రవీ! నువ్వు రంజితని వివాహం చేసుకో" అన్నాడు.

    అప్పటివరకూ మామూలుగా వింటున్న షాడో ఉలిక్కిపడి "ఏమిటీ?" అన్నాడు- తన చెవులు సరిగ్గా విన్నాయా అన్న భ్రాంతితో.

    "అవును. నీ కభ్యంతరం లేకపోతే-"

    అప్పటికి తేరుకున్న రవి- "అభ్యంతరమా?" అన్నాడు. "ఇంతకన్నా ఆనందకరమైన విషయం ఇంకొకటి వుంటుందని నేను అనుకోను" అన్నాడు. "ఏదైనా అభ్యంతరం వుంటే రంజితకే వుండాలి".

    అలా అంటున్నప్పుడు అతడి కళ్ళముందు రంజిత కదలాడింది. చీపిరికట్టతో అపరకాళిలా నిలబడి, "పెళ్ళయ్యాక ఇంకొక అమ్మాయి ఎవరితోనైనా మాట్లాడినట్టు తెలిసిందా? ఈసారి నీ ముఖ్యమైన అవయవాలన్నీ శాశ్వతంగానే మాయం చేస్తాను" అంటున్నట్టు అనిపించింది.

    అతడి ఆలోచన్లని చెదురుస్తూ జయదేవ్, "రంజితకి ఏమీ అభ్యంతరం వుండదు. ఆమె తల్లి దండ్రులకు కూడా వుండదు. భవానీశంకరం మాకు బాగా తెలుసు" అన్నాడు.

    షాడో చప్పున అడ్డుపడ్డాడు. "ముందు నన్నొక విషయం చెప్పనివ్వండి. మా నాన్నగారి ఆస్థి నాకు సంక్రమించదు. అంతా పార్టీకి వెళుతుంది. ఆ విషయం ముందు చెప్పి, ఆమె తల్లిదండ్రులు వప్పుకుంటేనే ఈ వివాహం జరుగుతుంది. నా ఆనందం కోసం సిద్దాంతాన్ని బలిపెట్టలేను".

    జయదేవ్ నవ్వి "ఇదంతా నాకు ముందే తెలుసు. రంజిత తల్లికి డబ్బు ఆశ ఎక్కువ. కానీ ఈ పరిస్థితుల్లో ఆమెకూడా అడ్డు చెపుతుందని అనుకోను" అన్నాడు. షాడో లేచి చెయ్యి అందిస్తూ "వెళ్ళొస్తాను" అన్నాడు.

    జయదేవ్ కూడా లేచాడు. "ఎంత తొందరగా ఈ వివాహం జరిగితే అంత మంచిది".

    "ఇంకో నెలలో నా చెల్లెలు డెలివరీ వుంది. ఆ తరువాత నెలలో...."

    "దట్స్ గుడ్. అసలీ వార్త తెలియగానే రంజిత సగం సరిగ్గా అవుతుంది అనుకుంటాను".

    "నేనూ అలాగే అనుకుంటున్నాను. వెళ్ళొస్తాను".

    "మంచిది".

    షాడో గేటు తీసుకుని బయటికి నడిచాడు.

    కిటికీ వెనుక నిలబడి అప్పటివరకూ వారి సంభాషణ వింటూ, పైట నోట్లో కుక్కుకుని నవ్వాపుకోలేక అవస్థ పడుతున్న రంజిత చివర్లో ఈ సంభాషణ అనుకోకుండా ఈ మలుపు తిరిగేసరికి, సిగ్గుతో లోపలికి తప్పుకుంది. విషయం ఇలాగే మలుపు తిరుగుతుందని తెలుసు. కానీ, మరీ ఇంత తొందరగా ఈ ప్రసక్తి వస్తుందని అనుకోలేదు. 'డబ్బు' అంటే తెగ ఆశ వున్న తన తల్లిని- "కూతురికి నిజంగా పెళ్ళవదేమో" అన్న అనుమానపు స్థితికి తీసుకువెళ్తే తప్ప, ఏదో సిద్ధాంతం కోసం ఆస్తినంతా దానం చేస్తున్న షాడోలాటి బేవర్సుగాడిని అల్లుడిగా చేసుకోవటానికి ఇష్టపడదు అని ముందే వూహించింది. షాడోలాటి అందమైన, బేవార్సైన అబ్బాయిల కోసం అమ్మాయిలు ఎంతైనా తెగిస్తారు అని నిరూపించింది.

    "సద్యోగర్భమా! నీకు కృతజ్ఞతలు" అని అనుకుంది. కుంతీ దేవికీ సూర్యుడికీ పదేపదే కృతజ్ఞతలు తెలుపుకుంది.

    అయితే తరువాత రవితో చిక్కు వచ్చి పడింది.

    కలిసినప్పుడల్లా ఏడిపించసాగాడు. "ఎక్కడో చదివినానోయ్- ఆడవాళ్ళ తెలివి వాళ్ళ మెదడుకీ సరిగ్గా మూడడుగుల క్రింద వుంటుందట! భలే నిరూపించావు".

    రంజిత ఉడుక్కుంటూ "ఎందుకు?" అనేది.

    "వెళ్ళేటప్పుడు పులిలా వెళ్లావు. ఆ బాబా ఏదో శాపం ఇచ్చేసరికి పిల్లిలా తిరిగి వచ్చావు. అయినా దెయ్యాల్నీ, శాపాల్నీ నమ్మే వాళ్ళు యిలాంటి అడ్వెంచర్స్ కి దూరంగా వుండాలమ్మాయ్! లేకపోతే నీలాగే బెదిరిపోతారు".

    రంజిత ఓరగా చూసేది. "ఔను అలాగే అనుకుంటూ వుండు కాబోయే మొగుడా! మొదటిరోజు రాత్రి వామ్ టింగ్ చేసుకుని, నిన్ను కూడా బెదరకొట్టకపోతే నా పేరు రంజితే కాదు..."


                                           *    *    *    *


    రోజు రోజుకీ అతడంటే రంజితకి ఇష్టం పెరుగుతూంది.

    ఇష్టం ప్రేమగా మారాలంటే నిశ్చయంగా దానికి గౌరవం తోడవ్వాలి. అతడిలో వున్న ప్రత్యేకత అది. పైకి ఎంతో సరదాగా, 'మామూలుగా' కనపడే అతడు- లోతుకు వెళ్ళేకొద్దీ సంక్లిష్టంగా తోస్తాడు. అతడిమీద అందరికీ అభిమానాన్ని పెంచేది అదే! అందుకనే తను తీసుకున్న నిర్ణయానికి రంజిత ఎప్పుడూ గర్వపడేది.

    భవానీశంకరం ఆఫీసు గదిలో మిగిలిపోయిన వస్తువులు సర్దుతూంది ఆమె.

    'అలసిపోయాను బాబూ' అంటూ గంట క్రితమే రవి లోపలి కెళ్ళి ముసుగు తన్ని పడుకున్నాడు.

    ఒక్కో వస్తువే తీసి నోట్ చేసుకుని వేరుగా పెడుతూంది రంజిత. చివరికి టేబిల్ లో టేప్ రికార్డరు, డెక్టాఫోనూ కనబడ్డాయి. అవి కూడా ఇచ్చెయ్యవచ్చు. కానీ క్యాసెట్టు మాత్రం తమ దగ్గిర వుంచుకోవలసిన వస్తువుల్లో ఒకటి.

    భవానీశంకరం సెక్రటరీకీ చెప్పిన ఆఖరి ఉత్తరమో- సూచనో అందులో వుండి వుండవచ్చు. ఆయన జ్ఞాపకార్ధం దాన్ని వుంచాలి.

    అదేమిటా అని ఆమె టేప్ నొక్కి, క్యాసెట్ చివరివరకూ వచ్చి ఆగిపోయిందని గ్రహించి, వెనక్కి రివైండ్ చేసి, 'ప్లే' బటన్ నొక్కింది.

    ఏదో దబ్బుమని పడిన శబ్దం... జరిగిన ధ్వని. తరువాత కంఠం- 

    ముసలోడా...నువ్వన్నావే శాడిస్ట్ అని, నిజమే. దానికన్నా మంచి పదం వుంది...జాగ్రత్తగా విను...నీ కూతురి మీద ఇంతకన్నా దారుణంగా కసి తీర్చుకోబోతున్నాను... కుట్టిసైతాన్ అష్టావక్రుడి రూపంలో ఈ భూమ్మీదకు రాబోతున్నాడు... పుట్టగానే తల్లిని చంపుతాడు. ఆ అష్టావక్రుడు పుట్టేది నీ కూతురి కడుపునే.

 Previous Page Next Page