Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 28


    'రఘుకులపతి వారసులై
    యుద్ధభూమికే అధిపతులై
    జననీ జనకుల సహగమనానికి
    కారణభూతులు కుశలవులై...' "

    స్పాట్ లో నిలబడి వున్న విహారి దృష్టి ముందు వరుసలో కూర్చున్న పరమేశ్వరం మీద పడింది. అతడి స్మృతుల పుటల్లో ఏవో కదలికలు... గుర్తుకొచ్చింది.

    అంతే!

    గొంతు తడబడింది.

    చప్పున తల్లి కూర్చున్నవేపు చూశాడు.

    అప్పుడే ఆమె దృష్టి కూడా అటు పడినట్టుంది, ఆమె కుర్చీలోంచి లేస్తోంది.

    వెనుక తెరపడింది. ముందు స్పాట్ లో అతను వుండిపోయాడు. జనం నుంచి కరతాళధ్వనులు. అతడు వాటిని వినడంలేదు. తల్లినే చూస్తున్నాడు. పరమేశ్వరాన్ని చూస్తున్నాడు. పూజగదిలో ఫోటో అతని కళ్ళ ముందు కదలాడుతోంది.

    ఈ వ్యక్తే ... ఈ వ్యక్తే తన తండ్రి!

    మరణించాడనుకున్న తన తండ్రి... బ్రతికే వున్నాడు!!

    ఆ వ్యక్తి కూడా తల్లిని గుర్తించినట్టున్నాడు. ఇన్నాళ్ళ తర్వాత భర్తని కలిసిన ఆనందంలో తల్లి జనాన్ని మరచిపోయింది. విహారి గొంతులోంచి బయటకు రాబోయిన 'నాన్న' అనే పదాన్ని సంతోషం డామినేట్ చేసింది. వర్ధని కొడుకు చేతులు పట్టుకుని- "ఒరేయ్! గుర్తు పట్టావురా? మీ నాన్నరా.... మీ నాన్న" అంటూ ఏడ్చేసింది. పరమేశ్వరం ఆమె తలమీద ఆప్యాయంగా చేయివేసి నిమిరాడు. ఇన్నాళ్ళ తర్వాత వాళ్ళని కలిసిన ఆశ్చర్యం అతడి కళ్ళలో కనబడుతూంది. అయితే, తొందరలోనే అది సర్దుకుంది.

    ఇంతలో విహారి తండ్రికి దగ్గరగా వెళ్ళాడు. పాతిక సంవత్సరాల తర్వాత కలిసిన తండ్రిని ఎలా సంబోధించాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. తల్లి నిజమైన ఆనందాన్ని ఇన్నాళ్ళ తర్వాత మొదటిసారి చూస్తున్నాడు.

    ఈ ఇబ్బంది నుంచి తప్పించడానికా అన్నట్టు పరమేశ్వరమే మొదట చేయి సాచాడు. "పాతికేళ్ళ క్రితమైతే 'బాబూ' అని ఎత్తుకునే వాడిని. అడ్డాల్లో బిడ్డని ఇప్పుడు విధి గడ్డాల్లో పరిచయం చేస్తూంది. ఆశీర్వదించి ముద్దాడలేను. పరిచయం చేసుకుంటాను" అంటూ చేయి మరింత ముందుకు సాచాడు.

    "నేను... నేను విహారిని నాన్నగారూ" అంటూ ఆ చేయి అందుకున్నాడు విహారి.

    ఆ 'షేక్ హేండ్' వెచ్చగా వుంది.


                                                                     13


    విహారి అంత ఆనందంగా ఇంతకు ముందెన్నడూ లేడు. ఆ ఆనందం తండ్రి 'దొరకటం' వల్ల వచ్చింది కాదు. తల్లి ఆనందంగా వుండటాన్ని చూడటంవల్ల వచ్చింది. అతడికి వూహ తెలిసిన తర్వాత తల్లి సంతోషాన్ని మొట్టమొదటిసారిగా నిజంగా చూస్తున్నాడు. అది అతనికెంతో సంతృప్తినిస్తోంది.

    తన తండ్రి ఢిల్లీలో ప్రసిద్ధిచెందిన లాయర్ అని తెలిసి అతడు మరింత గర్వించాడు, ఆ సంతోషంలో ప్రవల్లిక చెప్పిన లాయర్ ఇతడే అన్న విషయం మర్చిపోయాడు. అతడికి ప్రవల్లిక ఏ పేరు చెప్పిందో గుర్తులేదు. అనంతానంతస్వామి కేసుల్లో వాదించేది తన తండ్రే అన్న విషయం అతడికి తెలిసే అవకాశం ఆ రెండు రోజుల్లోనూ రాలేదు.

    తండ్రి లభించిన సందర్భంగా అతడు హౌస్- వార్మింగ్ పార్టీ ఇచ్చాడు. తన స్నేహితులకేకాక ఊళ్ళో చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు. ఈ ఊళ్లో కూడా తన తండ్రికున్న పలుకుబడిని చూసి అతడు ఆశ్చర్యపోయాడు.

    "నాన్నగారూ! ఒక్కసారయినా ఇటువేపు పేపర్లో మీ ఫోటో వచ్చి వుంటే మీరు మాకెప్పుడో లభ్యమై వుండేవారు" అన్నాడు.

    పరమేశ్వరం ఆప్యాయంగా నవ్వి, "ఫోటో చూసి గుర్తుపట్టేసేవాడివా?"

    "గుర్తుపట్టలేకపోవటం ఏమిటి నాన్నగారూ? చిన్నపట్నుంచీ అమ్మ ప్రతిరోజు మీ ఫోటోకి దణ్ణం పెట్టిస్తుంది."

    పరమేశ్వరం ఆశ్చర్యంగా, "ఇరవై అయిదు సంవత్సరాల్నుంచీ" అని ప్రశ్నించాడు.

    "అవును. ప్రతిరోజూ... ఇరవై అయిదు సంవత్సరాల్నుంచీ..." అంటూ తల్లివేపు చూశాడు. కాసింత సిగ్గు మిళితమైన స్వరంతో, వర్ధనమ్మ తనని తానే మందలించుకున్నట్టు, "ఎంత పాపిష్టి దాన్ని- ఫోటోకి దండ వేశాను" అంది. పరమేశ్వరం నవ్వుతూ ఆమె భుజం తట్టాడు.

    విహారి తల్లివేపు చూశాడు.

    ఈ 'బొట్టు' అనేదాన్ని ఏ భారతీయుడు కనిపెట్టాడోగానీ అతడికి సహస్రకోటి వందనములు. సైన్స్ పెరిగేకొద్దీ రకరకాల లిప్ స్టిక్స్, ఐ- లైనర్స్, క్రీమ్స్ కనిపెట్టబడి, ప్రపంచపు స్త్రీలందర్నీ మరికాస్త అందగత్తెల్ని చేస్తే చేసి వుండొచ్చుగాక?... కానీ "బొట్టు"లా స్త్రీ ముఖానికి అందాన్నిచ్చేది గత పదివేల సంవత్సరాల్లో మరేదీ కనిపెట్టబడలేదు.

    తల్లి నుదుటిమీద అది మరింత హుందాతనాన్ని సంతరించుకుని ప్రకాశిస్తూంది.

    "నీ తప్పేముంది వర్ధనీ. తప్పంతా నాది! రైలు ఆక్సిడెంట్ లో నెలరోజులు ఆస్పత్రిలో వుండి వస్తే ఇల్లు ఖాళీగ వుంది. మీ తండ్రిగారి దగ్గరికి వచ్చి వాకబు చెయ్యాలన్న ఆలోచన రాకపోవటం నాదీ తప్పు-" అన్నాడీ లోపులో పరమేశ్వరం.

    ఆ సంభాషణ అంతటితో ముగిసింది.

    ఆ రాత్రి పన్నెండింటికి విహారి మంచినీళ్ళకోసం ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి వస్తూ, తెరచివున్న కిటికీలోంచి లోపలికి చూశాడు. తండ్రి కాళ్ళ దగ్గిర తన తల్లి కూర్చుని కాళ్ళు వత్తుతూ కనిపించింది. నీరవపు ఆస్తిత్వాన్ని ఆపాదించుకున్న రాత్రి తాలూకు ప్రశాంతతలో, ఆ దృశ్యం అతడికెంతో మనోహరంగా కనిపించింది. గ్రామపు పొలిమేరలో, గుడిసె ముంగిట్లో, రాట్నం ముందు కూర్చుని ఈ లోకపు బాధలలోనూ, వ్యధలతోనూ నిమిత్తం లేకుండా నూలువడికితే వృద్ధురాలి మొహంలో కనిపించే ఆనందాన్ని ఏ రచయిత వర్ణించగలడు? శబరి వణికే చేతులూ, జటాయువు విరిగిన రెక్కలు 'సేవ'లో వుండే ఆనందాన్ని తెలుపుతాయి. తననితాను అర్పించుకోవటం ద్వారా స్త్రీ పొందే ఆనందానికి వయసుతో నిమిత్తం లేదు.

    విహారి నిశ్శబ్దంగా అక్కడనుంచి కదిలాడు.


                        *    *    *


    "ఎలా చెప్పను నాన్నా అతడికి? 'నేను ఉదాహరించిన ఢిల్లీ లాయర్ నీ తండ్రే' అని విహారికి ఎలా చెప్పను? అతడి ఆనందాన్ని ఎలా పాడు చెయ్యను?" బాధగా అంది ప్రవల్లిక.

    "వద్దమ్మా, చెప్పకు. లాయర్ గా అతడు చేసిన తప్పేమీ లేదు. మనకు చాలా పెద్ద తప్పుగా తోచింది అవతలివాళ్ళకు చాలా చిన్నదిగా తోచవచ్చు. అయినా మనకీ-స్వామికీ మధ్య వున్నంత స్పర్ధ విహారికీ- స్వామికీ మధ్య లేదుకదా. ఈనాటితో అదీ సమసిపోవచ్చు. లేదా, కొత్తగా వచ్చిన ఈ బంధాలవల్ల పరమేశ్వరమే అనంతానంతస్వామి నుంచి క్రమంగా దూరం కావొచ్చు. మనం తొందరపడి అబ్బాయికి ఏదైనా చెప్తే అతడు అపార్ధం చేసుకునే ప్రమాదం వుంది."

    "కానీ విహారికి ఎప్పుడో ఒకప్పుడు తన తండ్రే స్వామి కుడిభుజం, ఆ సుప్రీంకోర్టు లాయర్ అని తెలియక తప్పదు."

    "తెలియనీ. కానీ మన ద్వారా వద్దు అంటున్నాను."

    ప్రవల్లిక సమాధానం చెప్పలేదు. ఆమె మనసేమిటో కీడు శంకిస్తూంది. పరమేశ్వరం తెలివితేటలు ఆమెకు తెలుసు. తన సంసారంపట్ల అతడు చూపించేది నిజమయిన ప్రేమ అయిన పక్షంలో అంతకన్నా కావల్సిందేముంది?

    ఆ ఆలోచనతో ఆమె మనసు తేలికయింది. తండ్రి చెప్పినట్టు తను అనవసరంగా ఎక్కువ ఊహిస్తూందేమో! భార్యాబిడ్డలంటే ఎవరికి ప్రేమ వుండదు.

    కూతురి మౌనాన్ని ప్రతాపరావు ఇంకోలా ఇంకోలా అర్ధం చేసుకున్నాడు.

    "ఈ సమయంలో నేను పెళ్ళి సంబంధం మాట్లాడితే అంత బావోదనుకుంటానమ్మా. తన కొడుక్కి నిన్ను చేసుకోవటానికి అతడు నిరాకరించవచ్చు" అన్నాడు. ఆమె అసలు ఆ కోణంలో ఆలోచించలేదు. విహారి తండ్రెవరో తెలిసినప్పటి నుంచీ అతడేమైనా ప్రమాదాల్లో చిక్కుకుంటాడేమో అని ఆలోచించిందే తప్ప, తన ప్రేమ గురించి ఆలోచించలేదు.

    ఆమె మనసంతా వాసిలేటింగ్ గా తయారైంది. ఈ కొత్త సమస్య ఆమెని మరింత కృంగదీసింది. ఒకవేళ విహారేగానీ తన తండ్రి ఎటువంటివాడో తెలిశాక కూడా ఆయన్నే సమర్ధిస్తే...

    ప్రిన్సిపుల్స్ వేరు. జీవితం వేరు.

    చాలా కొద్దిమందికి మాత్రమే వాటిమధ్య సయోధ్య కుదురుతుంది.

    అయితే ప్రవల్లిక ఆ కొద్దిమందిలోనే వుంది.

    ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. వేచి చూడటం... అదే ప్రస్తుత పరిస్థితుల్లో సరైన మార్గం.

    ఒకసారి ఈ నిర్ణయానికి వచ్చాక ఆమె ఇక తన ఆఫీసు విషయాలు గురించి ఆలోచించసాగింది.

    తన ఆఫీసు నుంచి ఎవరో రహస్యాల్ని బయటకు చేరవేస్తున్నారన్నది నిర్వివాదం. ముందు వాళ్ళని పట్టుకోవాలి.

    దానికోసం ఆమె చిన్న ట్రిక్ ఉపయోగించదల్చుకుంది.

    అయితే ఆ ట్రిక్కే ఆమెని ప్రాణాపాయంలో పడేసింది.


                       *    *    *


    'ఉద్యోగం పురుష లక్షణం' అన్న ప్రవల్లిక మాటలకి ప్రభావితుడయిన రోజు నుంచీ ఇప్పటివరకూ విహారి ఆఫీసు వ్యవహారాలన్నీ దాదాపు ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. పరమేశ్వరం కొడుకుని అభినందించాడు.

    "అన్నీ చాలా అప్-టు-డేట్ చేశావే?"

    "నెల - రెండు నెలల్లో చేశాడండీ" అంది తల్లి పక్కనుంచి.

    "నిజమా?"

    "నిజమే నాన్నగారూ! అకౌంటింగూ, బేసిక్ ఇన్-కంటాక్స్ సిద్దాంతాలూ మొదట్లో అర్ధంకాలేదు, ఓ పదిరోజులు కష్టపడితే అంతా తెలిసిపోయింది."

    విహారి వెళ్ళిన తరువాత పరమేశ్వరం భార్యతో అన్నాడు. "నా కొడుకు ఇన్ని తెలివితేటలున్నవాడు అవుతాడనుకోలేదు సుమా! మంచి క్రమశిక్షణతో పెంచావు."

    "ఆ నాటకాలొక్కటే లేకపోతే ఇంకా బావుండేదండీ."

    "ఏం తప్పేముంది? బాగా కష్టపడే ప్రతి మనిషికీ రిలాక్సయే ద్వారం ఒకటుండాలని ఇంగ్లీషులో ఒక సామెతుంది. నాటకాలాడటం ద్రోహమేమీ కాదే. అదొక హాబీ!"

    ఆ మాట విహారికి తెలిసి కదిలిపోయాడు. ఇన్నేళ్ళ జీవితంలో తన వాళ్ళలో ఒక్కరూ ఈ హాబీని మెచ్చుకున్నవరు లేరు. తల్లితో సహా అందరూ విమర్శించేవారే. థాంక్స్ నాన్నగారూ" అన్నాడు మెరుస్తూన్న కళ్ళతో, "ఇన్నాళ్ళకు మీరొక్కరు నన్ను సమర్ధించారు."

    ఆ ఇంట్లోకి మూడో వ్యక్తి ఆగమనం అతడికెంతో బావుంది. తనూ, తన తల్లీ వున్నప్పుడు అదోరకమైన నిశ్శబ్దం గూడుకట్టుకుని వుండేది. ఆ ఇంట్లో ఎంత ఆప్యాయతలున్నా వయసు తేడా- ఆ తల్లీ కొడుకుల్ని వేరు వేరు అంతస్థుల్లో బిగించింది. కేవలం ఒకే ఒక వ్యక్తి రాకతో ఆ నిశ్శబ్దం పటాపంచలై పోయింది. స్తబ్దతతో జారే పొద్దు ఆ ఇంట్లో హడావుడిని కొత్తగా కొనితెచ్చుకుంది.

    రాత్రి చాలా పొద్దుపోయేవరకూ ఈజీచైర్ లో కూర్చుని పరమేశ్వరం చదువుకునేవాడు. అతడి పక్కనే స్టూలుమీద పీనల్ కోడ్ నుంచి కేస్ స్టడీస్ వరకూ పెద్ద పెద్ద బౌండు పుస్తకాలు దొంతర్లుగా పేర్చబడి వుండేవి. ఆ దృశ్యం ఒకటి విహారికి బాగా నచ్చేది. తమ తమ సబ్జెక్టులో బాగా లోతుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఆ రంగపు వ్యవహారాల్లో లీనమై వున్నప్పుడు ఎంత తాదాత్మ్యం చెందుతారో బయట ప్రపంచాన్ని ఎంత ఏకాగ్రతతో మర్చిపోతారో అతడు ప్రత్యక్షంగా చూడటం అదే మొదటిసారి. అందుకే తన తండ్రి అంత పెద్ద లాయరయ్యాడని అతడు అనుకున్నాడు. అతడికా వూహే ఎంతో గర్వాన్ని కలిగించేది.

 Previous Page Next Page