Previous Page
అజ్ఞాత బంధాలు పేజి 27


    మణిమాల ఒక్క కేక పెట్టలేదు. వదిలించుకోవటానికి ప్రయత్నించలేదు. ఆ హింసనంతా భరిస్తూ అలాగే కూచుంది.
    డాక్టర్ వినోద్ ని అరెస్ట్ చెయ్యటానికి పోలీసులు వచ్చేసరికి మణిమాల శరీరం అతని చేతుల్లో వేలాడుతోంది.
    కొన ఊపిరితో ఉన్న మణిమాల అస్పష్టంగా "మాధవ్" అనగలిగింది.
    క్షణాలలో మణిమాలను మాధవ్ ఉన్న హాస్పిటల్ కే తీసికెళ్ళారు. మణిమాలను ఆస్థితిలో చూసి మాధవ్ కు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పాపం! అతనిది లేవలేని పరిస్థితి.
    మాధవ్ ని చూస్తూ మాట్లాడటానికి విశ్వప్రయత్నం చేసింది మణిమాల.
    "మాధవ్! అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు."
    కష్టంమీద ఆ మాత్రం అనగలిగింది. అవే మణిమాల చివరి మాటలు. ఆ తరువాత రెండు మూడు గంటల్లోనే మణిమాల ఆత్మ విశ్వంలో లీనమయిపోయింది.
    
                                            21
    
    పూలూ, పళ్ళూ స్వీట్స్ తీసుకుని సంబరంగా వచ్చాడు రాజు లలిత ఇంటికి. రాజు ముఖంలో అంత వికాసం ఇటీవలి కాలంలో చూడలేదు లలిత.
    "కంగ్రాచ్యులేషన్స్ రాజూ!" అంది చిరునవ్వుతో.
    "థేంక్యూ లలితా! నిజంగా మళ్ళీ నాడ్యూటీలో నేను చేరగలిగానంటే అది నీ చలవే! మెనీ మెనీ థేంక్స్."
    లలిత ముఖం చిట్లించుకుంది.
    "అలా మాట్లాడకు రాజూ. నేను నీకోసం చేసింది ఏంలేదు. రాగిణి చేసింది. నీకోసమని చెప్పలేననుకో! కానీ పాపం, ఇదంతా రాగిణి చలవ.మిగిలినదేమైనా ఉంటే మాధవరావుగారి సహాయం. అంతే! నాదేం లేదు."
    "పోనీలే! ఎలా అయితేనేం? శనిరోజులు పోయాయి. ఎప్పటి నుండో నీతో చెప్పాలనుకుంటున్న సంగతి ఇప్పుడు నిస్సంకోచంగా చెపుతున్నాను లలితా! ఇదివరకే చెప్పాలనుకొన్నాను. కానీ, అప్పుడు నేనున్నా దశలో ఆ మాటలకు విలువ ఉండదేమోనని చ చెప్పలేదు."
    "ఏమిటది రాజూ?"
    "నేను నిజంగా నిన్ను ప్రేమించాను లలితా! నిజం ఒప్పుకుంటున్నాను. నాలో చాంచల్యం ఉంది. రాగిణితో ఇంకా రాగిణి లాంటి మరికొందరితో సంబంధాలు పెట్టుకున్నాను. కానీ నా మనసు ఎప్పుడూ నీకోసమే అలమటించేది. ఏదో గొప్ప సంబంధం చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఎవరిని చూసినా నా మనసులో నువ్వు మెదిలి ఎవరినీ చేసుకోలేకపోయాను. ఇప్పటికయినా మనం పెళ్ళి చేసుకుందాం లలితా!"
    రాజు ముఖంలో సిన్సియారిటీ చూసి లలిత తడబడింది.
    రాజు ఎప్పటిలా సెల్ఫిష్ గా మాట్లాడితేనే బాగుండేది. "వద్దు రాజూ! నా మాట విని హాయిగా ఎవరైనా గొప్పింటి అమ్మాయిని చేసుకో! సుఖపడు!"
    "ఇంకా నామీద కోపం పోలేదాలలితా! దెప్పుతున్నావా?"
    "నో! నో! నిజం! నీమీద నాకే కోపమూ లేదు. నువ్వు సుఖపడాలానే చెప్తున్నాను నాకు తెలుసు. నువ్వు సుఖపడగలవు..."
    "సరేలే! నీకంత అహంకారమయితే, నేనేం చెయ్యగలను?"
    కోపంగా వెళ్ళిపోయాడు రాజు. ఆ కోపం చూసి 'హమ్మయ్య.' అనుకుంది లలిత ఫరవాలేదు. రాజు తప్పకుండా త్వరలోనే ఏదో "మంచి" సంబంధం చూసి పెళ్ళి చేసుకుంటాడు.
    ప్రతిరోజూ సాయంత్రం నాలుగింటికి మాధవరావు ఇంటికెళ్ళి వీలయినంతసేపు కూచుని వస్తోంది లలిత మాధవరావుకి ఎడంకాలు మోకాలివరకు తీసెయ్యవలసి వచ్చింది ఎడంచెయ్యి పూర్తిగా విరిగిపోయింది. పోలీస్ ఆఫీసర్ గా పనిచెయ్యగలిగే అవకాశం లేక ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది. పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడూ చదువుతూ ఉంటాడు. "బిజీగా పనిచెయ్యటానికి అలవాటు పడినవాణ్ని ఊరికే కూచుంటే ఎలా తోస్తుందా అనుకునేవాణ్ని. ఈ పుస్తకాలు చదువుతోంటే చాలా హాయిగా ఉంది లలితా!" అన్నాడు. అతని ముఖంలో చిరునవ్వు చూసి లోలోపల మెచ్చుకుంది లలిత.
    సాయంత్రం అయ్యేసరికల్లా అతని స్నేహితులు చాలామంది వచ్చేవారు. డిపార్ట్ మెంట్ విషయాలు చెప్పేవారు, అతని సలహాలు తీసుకునేవారు "చూశావా! నా స్థితి ఇలా మారకపోతే, నా కింత మంచి మంచి స్నేహితులున్నారని తెలిసేదేకాదు." అనేవాడు హుషారుగా.
    వాళ్ళతో ఏ కోశానా ఈర్ష్యలేకుండా ఆప్యాయంగా మాట్లాడే మాధవరావును ఆశ్చర్యంగా చూస్తూ కూచునేది లలిత. మాధవరావు స్నేహితులందరికీ కూడా లలితను మాధవరావు యింట్లో చూడటం అలవాటైపోయింది. వాళ్ళందరికీ కాఫీలు లలితే అందించేది.
    అతని గదిలో బల్లమీద మణిమాల ఫోటో ఉంది. అది చూసి నప్పుడు మాత్రం అతని ముఖాన్న మబ్బులు క్రమ్మేవి. అప్రయత్నంగా  ఒక్క నిట్టూర్పు వెలువడేది.
    ఆ రోజు లలితను చూడగానే ఆనందంతో "కంగ్రాచ్యులేషన్స్!"  అన్నాడు మాధవరావు.
    "దేనికి?"
    "నిన్న రాజు నా దగ్గిరకు వచ్చాడు త్వరలోనే నిన్ను పెళ్ళిచేసుకోబోతున్నానని చెప్పాడు"
    "ఇందాకే రాజుతో చెప్పేసాను అతన్ని చేసుకోలేనని"
    "లలితా" నిజంగా ఆశ్చర్యపోయాడు మాధవరావు.
    "రాజు మంచి ఉద్యోగంలో ఉన్నవాడు అందగాడు నిన్ను కోరి చేసుకుంటానంటున్నాడు ఇంతకంటే ఏం కావాలి?"
    "మానవ జీవితాల్లో విషాదాల కన్నింటికీ మూలం ఏమిటో తెలుసా? మనకేం కావాలో మనకు తెలియకపోవటం ఏదో ఏదో కావాలని దేనివెనకో పరుగులు పెడతాం చివరికెప్పుడో అర్ధమవుతుంది, మనకు కావలసింది అదికాదని"
    "ఓహ్! అయితే ఇంతకూ నీకు కావలసిందేమిటో నీకు తెలుసా?"
    "తెలుసుకున్నను ఎవరిదగ్గిరనుండో తెలుసా? మీ దగ్గిరనుండే!"
    "నా దగ్గిరనుండా? నీకు కావలసింది నేను చెప్పానా? ఏమిటది?"
    "మానవత్వం! నాకేకాదు ఏ మనిషికిఅనా కావలసింది మానవత్వం అదొక్కటే అతనికి సుఖాన్నీ, సంతృప్తినీ, ఆనందాన్ని ఇవ్వగలిగింది ఈ విషయం తెలుసుకున్నాను మీ దగ్గిరనుండి"
    "అనవసరంగా నన్ను గొప్పచేసి మాట్లాడుతున్నావు లలితా! మనందరికీ ఏం నేర్పినా ఈ జీవితమే నేర్పుతుంది ఏమయినా నువ్వు చేసింది మంచి పనికాదు ఎంతకాలం పెళ్ళి చేసుకోకుండా ఉంటావ్?"
    "పెళ్ళి చేసుకోకుండా ఉండాలని నాకేం లేదు మీరు ఒప్పుకుంటే ఈ క్షణంలో మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను" గబగబ అనేసింది లలిత.
    "లలితా" ఆశ్చర్యంతో ఇంక మాట్లాడలేకపోయాడు.
    "నన్ను క్షమించండి! నాకా అర్హత లేకపోవచ్చు నా మనసులో ఆశ బయట పడేసుకున్నాను"
    "పిచ్చిగా మాట్లాడకు" తనకున్న ఒక్క చేతినీ జాపి లలితను దగ్గిరగా తీసుకున్నాడు మాధవరావు.
    "ఈ సృష్టిలో ఎప్పుడు ఏ విధంగా సమన్వయం సిద్దిస్తుందో మనం నిర్ణయించుకోలేం! ఒక దురదృష్టం నన్ను బాధించిందనుకున్నాను అదే దురదృష్టం, మరొక అదృష్టం నన్ను వరించడానికి కారణమయింది"
    "ఇది నిజంగా అదృష్టమనే అనుకుంటున్నారా?"
    మాధవరావు సమాధానం చెప్పలేదు లలితను మరింత దగ్గిరకు తీసుకున్నాడు.   
    
                                              * సమాప్తం *

 Previous Page