Previous Page Next Page 
దశావతారాలు పేజి 23


    విలసిత అడిగేసింది.
    "ఈవిడెవరు? ఇక్కడెన్నాళ్ళుంటుంది?"
    టక్కున వచ్చినది సమాధానం__
    "అవన్నీ నీ కనవసరం!"
    "పోనీ, ఎప్పుడెళ్తుంది?"
    "అసలు వెళ్ళదు."
    "నన్ను వదిలేస్తారా?"
    ఈ ప్రశ్న అడిగిన విలసిత కంఠంలో ఆవేదన లేదు. ఆశ ఉంది. అతడు తనను వదిలేస్తే_హాయిగా సుధను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే...నలుగురూ మొగుడు వెళ్ళకొట్టాడని తననుచూసి జాలిపడుతోంటే...ఏ సుఖమూ లేకపోయినా సుధను చూసుకుంటూ ప్రశాంతంగా బ్రతక గలిగితే...
    పెద్ద పెట్టున నవ్వాడు రామారావు.
    "నిన్ను వదిలెయ్యటమా? ఎందుకు వదిలేస్తాను?"
    "ఆవిడుండగా నేనెలా ఉంటాను?"
    "ఒకమూల నోరుమూసుకుని పడిఉంటావు..."
    "అదిమాత్రం ఎందుకూ? నన్ను పంపెయ్యండి."
    "నువ్వుంటేఎంత? పోతే ఎంత? కానీ నలుగురూ ఫలానివాడు పెళ్ళాన్ని వదిలేసారని చెప్పుకుంటారు. అది నాకు అప్రతిష్ట. బెంగ పెట్టుకోకు! నేను నిన్ను వదిలెయ్యను?" అభయమిచ్చాడు రామారావు.
    ఆ అభయంతో పూర్తిగా అణిగిపోయింది విలసిత...ఏం చెయ్యాలి?' సమాధానం దొరకని ప్రశ్న, దారీ, తెన్నూ తెలియని అంధకారం...
    ఇవీ ఒక కష్టాలేనా అని చప్పరించే మేనత్తలూ...ఏదో ఒకటి చిలవలు పలవలు చేర్చి చెప్పుకునే అమ్మలక్కలూ__'పరువు' అంటూ గుండె బాదుకునే తండ్రులు__వీటన్నిటినీ మించి అందం యవ్వనం ఉన్న ఆడది కనిపించగానే కబళించే రాబందులు ... ఏం చెయ్యలేదు విలసిత. మహాపతివ్రతాశిరోమణిలాగ భర్త ఆజ్ఞ శిరసావహించి ఒకమూల నోరుమూసుకుని పడి ఉండటానికే నిశ్చయించుకుంది. తన సుధ...దానికోసం బ్రతకాలి! అవును బ్రతకాలి. ఎందుకో ఒకందుకు __పుట్టినందుకు బ్రతకాలి...
    ఒకనాడు రామారావుకి అకస్మాత్తుగా తన కూతురు చిక్కిపోతున్నట్లు తోచింది...
    "ఇదెందుకు ఇలా చిక్కిపోయింది? అని గర్జించాడు. విలసిత వణుకుతూ నించుంది. రామారావు "చిక్కిపోయింది" అన్నాక మరో మాటకి తావేలేదు.
    "ఏడుపుగొట్టు మొఖం పిల్లకి వేళకి తిండి తిప్పలు చూడటం కూడా చేతకాదు" అని విలసితను చీదరించుకుని "ఇవాళ నుంచి ఈ సుధను అన్నం పాలు అన్నీ నువ్వే చూసుకో!" అన్నాడు తన వయ్యారితో ... ఆ వయ్యారి విలాసంగా నవ్వి "అలాగే సుధ నాకు మాత్రం కూతురు కదూ!" అంది__అని సుధను దగ్గిరకు తీసుకోబోయింది. సుధ చీదరించుకుని విదలించుకుని తల్లి దగ్గరకు వచ్చింది. ఇంక సహించలేకపోయింది విలసిత. తన దగ్గిరగా వచ్చిన సుధ చుట్టూ చేతులేసి గట్టిగా అదుముకుని "వీల్లేదు__నా సుధమీద మరొకరి నీడపడనియ్యను. నా కూతుర్ని నేనే పెంచుకుంటాను." అంది గట్టిగా.
    ఎన్నడూ లేనిది అంత గట్టిగా అరిచే విలసితను చూచి ఒక్కక్షణం విస్తుపోయాడు రామారావు. అంతలో వెటకారంగా నవ్వాడు.
    "నీ కూతుర్నా" అన్నాడు వెక్కిరిస్తూ...
    "అవును నా కూతురు__ఇదొక్కర్తేనా బ్రతుకులో 'నా' అనే ప్రాణి"
    "సుధా! ఇలారా!"
    పిలిచాడు. తండ్రి కోపం సుధకు బాగా అనుభవం. అతి తేలికగా తనను తను మరిచిపోయి చావబాదగలడు. వణికిపోతూ ముందుకు అడుగు వెయ్యబోయింది సుధ. గట్టిగా పట్టుకుంది విలసిత...
    "వద్దు సుధా! ముందుకడుగు వెయ్యకు. నిన్నేమీ చెయ్యను. నా ప్రాణం పోతేగాని నీ వంటిమీద చెయ్యి వెయ్యనియ్యను..."
    సుధ తల్లిని కరుచుకుపోయింది.
    రామారావు ఒక్కసారి ఆ తల్లీ కూతుళ్ళను చూసి బయటికి వెళ్ళిపోయాడు.
    ఏదో ప్రళయం సంభవించబోతుందని ఊపిరిబిగపట్టుకున్న విలసిత తెల్లబోయింది. కన్నీళ్ళతో సుధను మరింత దగ్గిరకు తీసుకుంది.
    పదినిముషాల్లో తిరిగివచ్చాడు రామారావు. చేతిలో కాడర్ బరీ చాక్ లెట్లు__సుధ నోరూరించే చాక్ లెట్లు..."సుధా! ఇదిగో నీకు..."
    అతి ప్రేమగా చుట్టుకున్న తల్లిచేతులను విదిలించి తండ్రి దగ్గిరకొచ్చింది సుధ...అవును మరి! తల్లి చేతుల్లో ఉన్న ప్రేమ చాక్ లెట్లు పెట్టలేదుగా...
    "నేను చెప్పినట్లు చేస్తే ఈ చాక్ లెట్లన్నీ నీకు! చెప్పినమాట వినకపోతే...తెలుసుగా..."
    తల ఊపింది సుధ...
    "అమ్మా! నాకునువ్వొద్దు__పో!" అను." గతుక్కుమంది సుధ__ఎనిమిదేళ్ళ సుధ...బిత్తరపోయి తల్లివంక చూసింది.జీవం నశించినట్లు చూస్తోంది విలసిత...
    "సుధా!"  
    తండ్రి పిలుపు__ఆజ్ఞాపిస్తున్నట్లున్న పిలుపు. ముందుకు జాపిన చేతిలో చాక్ లెట్లు కమ్మని చాక్ లెట్లు... అమ్మ ఏనాటికీ కొనీయ్యలేని చాక్ లెట్లు__ ఆ కళ్ళల్లో ఎరుపు __ భయంకరమైన ఎరుపు. దెబ్బలకు ఒళ్ళు చిట్లినప్పుడు కారే రక్తంలాంటి ఎరుపు. సుధ గిర్రున తల్లి వంక తిరిగింది.
    బిత్తరపోయిన ముఖంతో గద్గదికంగా అంది.
    "అమ్మా! నాకు నువ్వొద్దు__పో!"
    "అలా కాదు గట్టిగా అనాలి__" చిరునవ్వుతో రామారావు.
    సుధ పిచ్చిదానిలా గట్టిగా అరిచింది.
    "అమ్మా! నాకు నువ్వొద్దుపో!"
    "వెరీగుడ్! ఇప్పుడెళ్ళి మీ అమ్మను చెంపమీద దెబ్బ కొట్టిరా! గట్టిగా కొట్టాలి!..."
    పదేళ్ళ సుధ ఏదో పూనకం పూనిన దానిలాగే అయింది. పిచ్చిపట్టినదానిలా వచ్చి తల్లిని చెళ్ళు చెళ్ళున లెంపమీద కొట్టింది.
    రామారావు పకపక నవ్వాడు. విరగబడి నవ్వాడు.

 Previous Page Next Page