Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 23


    "చెంచు దొర ఒక కన్నుకీ... ఈ శిల్పానికీ ఏదో సంబంధం ఉన్నట్లుగా తోస్తోంది" తన ఆలోచనలన్నీ చెప్పాడు.
    "ఏదీ స్పష్టంగా తెలియటం లేదు" అన్నాడు కొంచెం నిరాశతో.
    "అయితే ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? వెళ్ళిపోండి!" నవ్వింది. హేళనతో కూడిన నవ్వు.
    లోలోపల ఉబుకుతున్న రోషాన్ని అణచుకున్నాడు రవి "నేను వెళ్ళదలచుకోలేదు.సూర్యనేత్రం రహస్యం తెలుసుకోకుండా వెళ్ళను."
    "ఒకవేళ అది మీకు ప్రమాదమయితే...?"
    "ఫరవాలేదు, ఎదుర్కొంటాను"
    "అన్నట్లు ఎడమచేతి వైపు ద్వారం మీది శిల్పాలు చూశారా?"
    "చూశాను తోరణాలూ-వాటి మధ్య ఉదయ సూర్యుని శిల్పం. కుడివైపు ద్వారం మీద ఉన్నట్లుగానే ఉంది. వ్యాళాసుర, వ్యాఘ్రాసురలకు సంబంధించిన లిపి మాత్రమే కుడివైపున లేనిది, ఎడమ వైపున ఉన్నదీ"
    విలసిత నవ్వింది, కొండరాళ్ళ మీద నుంచి సెలయేరు గలగల గెంతుతూ పారినట్లు...
    "మీరేం ఆర్కియాలిజిస్టూ? ఆ తోరణాల మధ్య అందమైన శిల్పాలున్నాయి. చూడండి!"
    "వెళ్తున్నాను" అని చెప్పకుండానే లేచి వెళ్ళిపోయింది విలసిత. విష్ణువర్ధన్ హడావుడి పడిపోతూ ఆమె వెంట జీప్ వరకూ వెళ్ళి అది కదిలే వరకూ ఉన్నాడు.
    రవి మాత్రం తను కూర్చున్నచోటే ఉండిపోయాడు. ఈవిడ తనను ప్రోత్సహిస్తుందో, నిరుత్సాహపరుస్తుందో అతనికి అంతుపట్టటం లేదు.
    అనిల లేదు. విలసిత వెళ్ళగానే లేచి తన టెంట్ లోకి వెళ్ళిపోయింది. తను విలసితతో స్నేహంగా మాట్లాడటం అనిలకి కష్టం కలిగించిందని ఊహించాడు రవి.
    అబ్బబ్బ! ఏం గ్రామాలివి? ఎక్కడికక్కడ అన్ని రంగాలలో స్పర్థలు,అన్ని వర్గాలలో కక్షలు, పోటా పోటీలు!
    విష్ణువర్ధన్ గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. రవికి నిద్ర రావటం లేదు. దూరం నుంచి ఆ ధ్వని వినిపిస్తోంది. కాషాయాంబధారి చెప్పింది నిజమే అయితే, దేవి ఆలపిస్తోన్న "జీవనాదం!"
    ఆ రోజు అనుభవాలన్నీ నెమరు వేసుకున్నాడు రవి. దేవి ఎవరైనా కానీ, ఆమె దుర్మార్గురాలు మాత్రం కాదు అనిపించింది.
    మళ్ళీ గాలులు! ఉధృతమైన గాలులు! ఈసారి అందరూ హెచ్చరికగా టెంట్స్ వదిలి వచ్చేశారు. మనిషికి అనుభవాని మించిన పాఠం లేదు. అందరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. కానీ వెనుకటిలా భయపడి పోవటం లేదు. ఆ ధ్వని వినిపిస్తోంది కానీ,అందరూ కూడ బలుక్కున్నట్లు ఎవ్వరూ దానిని గురించి మాట్లాడలేదు. ఈ సారి విష్ణువర్థన్ నలుగురు కూలీలని కూడా వర్కర్స్ టెంట్ లో వుంచాడు. అంచేత గాలి తగ్గిపోగానే టెంట్స్ వేసుకోవటం అంత కష్టం కాలేదు.
    ఆ తర్వాత రవికి నిద్ర రాలేదు. గజ్జెల చప్పుడు వినిపించింది బయటి నుంచి! కాషాయాంబధారి వేళాకోళంగా నవ్వుతూ "గజ్జెల దయ్యాలు!" అనటం గుర్తొచ్చింది.
    విష్ణువర్ధన్ మంచం వైపు చూశాడు. అతడి గుర్రు వినిపిస్తోంది. చప్పుడు చెయ్యకుండా లేచాడు. నైట్ గౌన్ తొడుక్కున్నాడు. పెన్ టార్చి, రివాల్వర్ జేబులో పెట్టుకున్నాడు. నిశ్శబ్దంగా బయటికి వచ్చాడు. గజ్జెల చప్పుడు వినిపిస్తోంది. ఎవరూ కనపడటం లేదు. స్నేక్ పిట్స్ దాటి వెళ్ళటమా, వొద్దా అని సందేహించాడు. ఎవరినైనా లేపాలనుకున్నాడు. కానీ మిగిలిన వాళ్ళలో లేనిపోని భయాలూ, అనుమానాలూ కలిగించటం ఇష్టంలేక ఆ ఆలోచన వదిలేశాడు.
    కాగడా చేతిలో పట్టుకుని టెంట్స్ చుట్టూ తిరుగుతున్నాడు వాచ్ మెన్. నలుగురు కూలీలు వంతుల వారీగా వాచ్ మెన్ గా వుంటున్నారు. బయటికి వచ్చిన రవిని చూసి "ఎవరూ?" అన్నాడు గట్టిగా.
    రవి చప్పున అతడి దగ్గిరకి వచ్చి "నేనే! అరవొద్దు!" అన్నాడు. అతడు ఆశ్చర్యపోవటానికి మారుగా ఏదో అర్థమయినట్లు నవ్వాడు.
    "మీకూ బేరం కుదిరిపోనాదేటి, దొరా! నా మామూలు మాట మరిసిపోకండి!"
    మళ్ళీ నవ్వాడు-ఏవో అర్థాలు స్ఫురించే నవ్వు. తెల్లబోయాడు రవి.
    "బేరం ఏమిటి? మామూలు దేనికి?" వాచ్ మెన్ కంగారు పడిపోయాడు.
    "ఏం లేద్దొరా! ఓటనబోయి మరోటనేశాను. ఇటొచ్చినారేంటి?"
    అతడి గొంతులో వణుకు! మాటలలో తొట్రుపాటు!
    "ఆ చప్పుడు..."
    మాట్లాడుతున్నవాడు ఆగిపోయాడు రవి. కొంచెం దూరం నుంచి ఎవరో స్త్రీమూర్తి చకచక టెంట్స్ వైపు వస్తోంది. రవి బాణంలా అటువైపు దూసుకుపోయి, ఆమె ముఖం మీదకి టార్చ్ ఫోకస్ చేసి విభ్రాంతితో "మీరా?" అన్నాడు.
    ఆమె అనిల.
    అనిల కూడా పట్టరాని ఆశ్చర్యంతో "మీరు ఇక్కడే ఉన్నారా?" అంది.
    "నేనిక్కడ వుండక ఎక్కడ వుంటాను?"
    "మరి జెన్నిఫర్ కలుసుకున్నది ఎవరిని?"
    "జెన్నిఫర్...?"
    "అవును. నిద్రలో ఉండగా గజ్జెలచప్పుడు వినిపించి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచేసరికి జెన్నిఫర్ టెంట్ లోంచి బయటికి వెళ్తూ కనిపించింది. టాయిలెట్ కి అనుకున్నాను. కానీ పావుగంట దాటినా రాకపోయేసరికి బయటికొచ్చి చూశాను. ఒక రూపాయి టిప్ ఇస్తే జెన్నిఫర్ బయటికి వెళ్ళిందని వాచ్ మెన్ చెప్పాడు. ఎవరో మొగవాడు, ఆమెకోసం కాచుకుని ఉన్నాడని కూడా చెప్పాడు. నేను జెన్నిఫర్ ని వెతుకుతూ వెళ్ళాను. కొండ మలుపు దగ్గిర కనిపించింది. ఎవరో మొగవాడితో దగ్గిరిగా గుసగుసగా మాట్లాడుతూ... ఎక్కువసేపు అది గమనిస్తూ నుంచోలేక పోయాను. జెన్నిఫర్ తో మాట్లాడుతున్నది..." ఆగిపోయింది అనిల.
    "నేనే అనుకున్నారు..." రోషంగా పూర్తి చేశాడు రవి.
    "సారీ!" తల వంచుకుంది అనిల.
    "ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి. ఆవిడ ఎవరితో మాట్లాడుతుందో?"
    "ఊహు! నేను రాలేను. తలనొప్పిగా ఉంది. పడుకుంటాను"
    "తలనొప్పా?"
    అతనికీ సరిగా అర్థంకాని కలవరం మనసులో. ఏం చేస్తున్నాడో ఆలోచించకుండా ఆమెతోపాటు వాళ్ళ టెంట్ లోకి నడిచాడు. ఆ క్షణంలో వదిలిపోయినట్లు కనిపిస్తున్న ఆమెని వంటరిగా వదలాలనిపించలేదు. అంతకు మించి ఆలోచించలేదు.
    అడుగుల చప్పుడు విని దిగ్గున లేచి కూర్చుంది మంచంలో పడుకున్న జెన్నిఫర్. రవిని చూసి చిన్న కేక పెట్టింది గాభరా పడుతున్నట్లు.
    "వాటీజ్ దిస్ రవీ? ఈ నైట్ టైమ్ లో మా టెంటులోకి ఎందుకొచ్చారు! ఇఫ్ యు వాంట్ అనిలా, యు కెన్ టేక్ హర్ అవుట్! ఓట్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు ఎంటర్ ఇన్ టు అవర్ టెస్ట్!" కోపంతో కాస్త గట్టిగానే అంది జెన్నిఫర్.
    మతిపోయిన వాడిలా అనిలనీ, జెన్నిఫర్ నీ మార్చి మార్చి చూసి గిర్రున తిరిగి తన టెంట్ లోకి వచ్చేశాడు రవి.
    అంత రాత్రిలో జెన్నిఫర్ తో ఘర్షణ పడటం ఇష్టంలేదు. అదీగాక ఈ ఘర్షణతో ఒక అయినింటి అమ్మాయి మాన మర్యాదలు ముడిపడి వున్నాయి.
    విష్ణువర్ధన్ గుర్రు పెడుతూనే ఉన్నాడు. బలవంతాన కళ్ళు మూసుకున్నాడు రవి. మెదడు మాత్రం మరిగిపోతూనే వుంది.
    ఏం జరిగింది? అనిల అబద్ధం చెబుతోందా? జెన్నిఫర్ అబద్ధం చెబుతుందా?
    అనిలకి అబద్ధం చెప్పవలసిన అవసరమేముందీ? అయితే, తను జెన్నిఫర్ మాట్లాడుతున్నది ఎవరితోనో చూద్దామంటే రాననటం దేనికి?
    తలనొప్పి నిజమేనేమో! ముఖం వడిలి ఉంది.
    కొండ మలుపు దగ్గిర అనిల జెన్నిఫర్ ని చూశానంటోంది! మరి జెన్నిఫర్ టెంట్ లో పడుకుని ఉండటం ఎలా జరిగింది?
    అప్పుడే పక్కలోంచి లేచినట్లు జెన్నిఫర్ మాట్లాడినా, ఆ అమ్మాయి ముఖం నిద్రలోంచి లేచిన దానిలా లేదు.

 Previous Page Next Page