నాకూ, నా భర్తకీ సెక్స్ లైఫ్ చాలా రోజులుగా లేదు. మా ఇద్దరిమధ్యా పూర్వపు దగ్గరితనం నెలకొనాలంటే మంచి సెక్స్ అవసరమని నాకు తెలుసు. సెక్స్ అంటే ఇక్కడ నా దృష్టిలో తనువులతోపాటు, మనసులని కూడా పంచుకోవడం. నా దృష్టినంతా నా మొదటి మ్యారేజ్ డే మీద కేంద్రీకరించాను. ఒక కొత్త మార్పు తీసుకురావాలంటే ఏదో సందర్భం వుండాలి కదా మరి!
నా మ్యారేజ్ డేకి ఇంకో వారముందనగానే ఎందుకైనా మంచిదని ఆ విషయం నా భర్తకి గుర్తుచేశాను. "ఏమండీ! ఆ రోజు మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం. వీలైతే ఆ రోజు రాత్రికి హోటల్ లో రూమ్ బుక్ చేసుకుందాం!" అన్నాను.
"డబ్బు చాలా అవుతుందేమో, నెలాఖర్లో అంత ఎలా తెస్తాం?" అన్నాడు.
అతని నుంచి ఆ అనాసక్తి నేనూహించాను. అందుకే ఏ మాత్రం తొణక్కుండా "డబ్బు గురించి మీరేం ఆలోచించకండి! ఆ సంగతి నేను చూసుకుంటాను" అన్నాను.
"అయితే, సరే!" అని మాటిచ్చేశాడు. నా హృదయం ఎంతో తేలికపడింది. నేనూహించినట్లుగా జరగబోతోంది కదా అని ఆనందమేసింది. అంతేకాదు, నన్ను సరిగ్గా గైడ్ చేసిన నా వదినంటే గౌరవం, కృతజ్ఞతా కూడా ఏర్పడ్డాయి.
తెలుపుకి ఎరుపు బోర్డరున్న పోచంపల్లి పట్టుచీర, అతనికో తెల్లని సిల్కు లాల్చీ, పైజామా కొన్నాను. అవేవీ అతనికి ముందే చూపించలేదు. హోటల్ గదిలో నేను ముందు స్నానం చేసొచ్చి, అతడు స్నానం ముగించేలోపు నా చీర కట్టేసుకుని అతని బట్టలు రెడీగా వుంచేసి అతి మామూలుగా కుర్చీలో కూర్చుని టీ.వీ. ఫిల్మ్ చూస్తుంటే ఒక్కసారిగా అతను ఆశ్చర్యపడేట్టూ, నా అందానికి ముగ్ధుడై తమకం ఆవేశంగా మారబోతుంటే, నేను చూలాలినన్న విషయం గుర్తొచ్చి, ఆవేశం ప్రేమగా, ఆప్యాయతగా మారి చిన్న పిల్లాడిలా నా ఒడిలో తలదాచుకుని.
ఓహ్! ఆ దుస్తులు కొన్నప్పటినుంచీ నాకు ఇంచుమించుగా అలాంటి కలలే! ఈ కలలు నాకు చాలా సంతృప్తినిచ్చేవి. నాకు నా భర్త నుంచి ప్రేమ తప్ప ఇంకేమీ అవసరం లేదు అన్న భావనని ఆ కలలు బలపర్చేవి! ఈ ప్రపంచంలో ఏ స్త్రీ కూడా తన భర్తని కాక వేరే ఎవరినైనా ప్రేమించాలని ఎందుకనుకుంటుంది? చివరి క్షణం వరకూ పోరాడి ఓడిపోయాకే కదా వేరే ప్రేమనీ, సానుభూతినీ ఆశించేది! నేనింకా నా ఇల్లు నిలబెట్టుకోవడానికి పోరాటం సాగిస్తూనే వున్నానన్న సత్యం నాకు సంతృప్తిని కలగజేస్తోంది.
ఆ రోజు కోసం ముందే సెలవు పెట్టేశాను. యూనివర్సిటీకి పేపర్స్ అప్పగించాల్సిన పనిని కూడా వాయిదా వేసుకున్నాను. థ్రిల్ తో ముందు రోజు రాత్రంతా నిద్రపట్టలేదు.
తెల్లవారుతుండగా నిద్రలోంచి మెలకువ రాగానే అతనికి దగ్గరగా జరిగి బుగ్గమీద ముద్దు పెట్టుకుని, "హేపీ ఏనివర్సరీ!" అన్నాను స్వీట్ గా. అతనూ అంతే తీయగా నవ్వేసి ప్రేమగా నా ముంగురులు సవరిస్తూ, "థాంక్యూ అండ్ విష్ యు ది సేమ్!" అన్నాడు.
అతనికి ఆ రోజు నేనే తలంటుపోయాలన్న కోరికని బలవంతంగా అణచుకున్నాను. అయినా టవల్ అందించే మిష మీద అతను స్నానం చేస్తూండగా బాత్రూమ్ లో దూరి చిలిపిగా అతని మీద చన్నీళ్ళు గుమ్మరించాను. అతను చలికి వణికిపోతూ, "అబ్బ! నీ మూడ్ తో నన్ను వొణికించేస్తున్నావోయ్!" అన్నాడు ముద్దుగా విసుక్కుంటూ. నేనూ అంతకంటే ముద్దుగా కళ్ళు తిప్పి, "ఇంకా ఏం చూశారు!" అని ఛాలెంజ్ చేసి బయటికొచ్చేశాను.
అన్నింటికంటే మొదటి ప్రోగ్రామ్ గా గుడికి వెళ్ళి పూజ చేయించాలని అనుకున్నాను. నా పెళ్ళి నాటి పట్టుచీరతో గుడికి బయల్దేరాం. దేవుడి మీద నాకు మరీ పెద్ద భక్తేమీలేదు. అలాగని అపనమ్మకమూ లేకపోవడంవల్ల అప్పుడప్పుడూ పూజిస్తూ వుంటాను. ఈసారి మాత్రం భక్తిగా, నిష్టగా పూజ చేయించాను. మళ్ళీ పెళ్ళి జరుగుతోందా అనేంత పవిత్ర భావన నన్ను ఆసాంతం ఆవరించింది. చాలా గొప్ప అద్భుతమైన భావన అది!
గుడినుంచి ఇంటికి తిరిగి వచ్చాం. ఇంట్లో అందరికీ ప్రసాదం పంచుతూ వుండగా ఆ రోజు నా ఆడపడుచు మొగుడు పుట్టిన రోజని నా అత్తగారు చెప్పింది. మా ఇంటినుంచి ఎవరైనా వెళ్ళి విష్ చేస్తే మర్యాదగా వుంటుందని కూడా అంది. ఆవిడ చెప్పినా, చెప్పకపోయినా నా భర్త వెళ్ళడానికి సిద్ధమవుతాడని నకు తెలుసు. సాయంత్రం ఎలాగూ డిన్నర్ బయట చేస్తాం కాబట్టి, కనీసం లంచ్ అయినా ఇంట్లో అందరం కలిసి తిందామనుకున్నాను. ఇప్పుడు లంచ్ కి వాళ్ళింటికి వెళ్ళాల్సిన పని పడింది.
నా ఫీలింగ్స్ మాత్రం చెడకుండా నా ఆడపడుచు ఇంటికి బయలుదేరాం. వాళ్ళు అప్పుడే పనిమీద బయటకు వెళ్ళారని తెలిసింది. పోన్లే, తొందరగానే వదిలించుకోవచ్చు కదా అని సంతోషించాను. మేము భోజనం చేయకుండా వెళ్ళడానికి వీల్లేదని నా ఆడబడుచు అత్తగారు పట్టుబట్టింది. బయటికెళ్ళిన బావగారూ, చెల్లెలూ రానిదే భోజనం చేస్తే బావుండదని నా భర్త భీష్మించుకు కూర్చున్నాడు. నేనక్కడికీ వుండబట్టలేక, "ఈ రోజు మా మొదటి మ్యారేజ్ డే అండీ!" అనేశాను.
"అలాగా! మరీ సంతోషం! ఈ సందర్భంలో మీకూ భోజనం పెట్టడం మా అదృష్టమనుకుంటాం!" అంది.
'నీ బొంద!' అని లోలోపలే తిట్టేసుకున్నాను. నా భర్త ఆవిడతో చాలా సంతోషంగా సంభాషణ జరుపుతున్నట్లనిపించింది. నాకు ఆశ్చర్యం కలిగింది. 'ఈ మనిషికి ప్రపంచంలో భార్యతప్ప మరే విషయమైనా ప్రసన్నతని ఎలా కలిగిస్తుందా?' అనిపించింది.
నా ఆడపడుచు, తమ్ముడుగారు వచ్చేవరకూ మేము భోజనం చేయలేదు. తీరా చూస్తే వాళ్ళు తమ బావగారింట్లో భోజనం చేసి వచ్చారట. ఈయన పుట్టినరోజని వాళ్ళు భోజనం పెట్టకుండా వదల్లేదుట. "సారీ!" చెప్పేసి నా ఆడపడుచు మా ఇద్దరికి వడ్డించింది. భోజనాలై, తర్వాత కాసేపు పిచ్చాపాటీ అయ్యేసరికి నాలుగున్నరయింది. వెళ్ళాలన్న తొందర నా మొహంలో విసుగుగా కనపడుతోంది. అది అణచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను.
నా ఆడపడుచూ, ఆమె భర్త లేని సమయం చూసి, నా భర్త "మనం హోటల్ కి వెళ్దామనుకున్నాం కదా! దాని తాలూకు డబ్బు నీతోపాటు తీసుకొచ్చావా?" అని అడిగాడు. నాకు చాలా సంతోషం కలిగింది. అటునుంచటే హోటల్ కి వెళ్ళిపోదామనుకుంటున్న ఆలోచన కలిగినందుకు. "ఫర్లేదు, ఈయనకి కూడా కాస్త ముందు చూపుంది" అనుకుని, "తీసుకొచ్చా" నని చెప్పాను. నా పర్సులో క్రితం రోజే ఆ డబ్బు పెట్టేసుకున్నాను నేను.
నా ఆడపడుచు వాళ్ళు రాగానే వాళ్ళతో నాభర్త- "మనమందరం డిన్నర్ ఎటైనా బయటికెళ్ళి చేద్దాం!" అన్నాడు. నేను హతాశురాలినయ్యాను. నా తమ్ముడుగారు తెగ మొహమాట పడిపోయి, "అబ్బే! మేమిద్దరం సాయంకాలం బయటి కెళ్ళొద్దాం అనుకుంటున్నాం" అన్నాడు. నేను వెంటనే నా భర్త మొహంలోకి చూశాను. "అలాగా, వెరీనైస్ ఐడియా, వెళ్లిరండి!" అని ఆనందించాడు. నేను తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాను.
మేమిద్దరం బయటికొచ్చాం. సాగనంపటానికి నా ఆడపడుచు గడపవరకూ వస్తే, నా భర్త చనువుగా నా పర్సులో వున్న డబ్బుతీసి ఆమె చేతిలో పెడుతూ, "ముందే తెలియకపోవడంవల్ల ఏమీ తీసుకొచ్చే టైమ్ లేకపోయింది. మీరు బయటికెళ్లినప్పుడు 'నా తరఫు నుంచి అతనికి ఏదైనా మంచి గిఫ్ట్ కొనిపెట్టు" అన్నాడు. నేనటు తిరిగి దూరంగా వెళ్తున్న వాహనాలకేసి చూస్తున్నాను. సజలమైన నా కళ్ళు ఆ దృశ్యాన్ని కూడా అస్పష్టం చేశాయి.
దారిలో అతను సంజాయిషీగా ఏదో చెప్పినట్లు గుర్తు. అప్పటికే నా మనస్సు కవాటాల్ని తాళంవేసి మూసేశాను. మెదడులోకి ఆలోచనలు దూరకుండా సీల్ చేసేశాను.
మేము ఇంటికొచ్చేసరికి ఆరు దాటింది. అప్పటికి నా బావగారు ఆఫీసునుంచి ఇంటికి రాలేదు. నా భర్త అత్తగారితో 'అక్కడి' విశేషాలు చెప్తున్నాడు. ఆవిడ ఆనందంగా వింటోంది.
నేను గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని బీరువాలో వున్న నిద్రమాత్రల సీసా తీసి మాత్రలు వేసుకున్నాను. బీరువా తలుపు వేసేయబోతుంటే నేను కొన్న బట్టల ప్యాకెట్ వెక్కిరించింది. వెళ్ళి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాను.
మరుసటిరోజు డైనింగ్ టేబుల్ దగ్గర నా భర్త తనంతట తానే నాతో సంభాషణ కల్పించుకున్నాడు. "నేను అన్నయ్య దగ్గర డబ్బు అప్పు తీసుకుని హోటల్ కి వెళ్దామనుకున్నాను. తీరా చూస్తే నువ్వు మొద్దునిద్ర పోతున్నావు! పోనీ, కావాలంటే ఈ రోజువెళ్దా!" మన్నాడు.
నన్ను బాధించింది 'పోనీ, కావాలంటే...' లాంటి పదాలు కాదు! నిన్న నేను ఆవేశంలో వేసుకున్న నిద్రమాత్రల ఫలితం నా బిడ్డమీద ఏమైనా పడుతుందా అని ఆలోచిస్తున్నాను.
అంతలో నా బావగారు వచ్చారు. చేతిలో వున్న బట్టల ప్యాకెట్లు టేబుల్ మీద వుంచుతూ- "నిన్న మాట్లాడే వీలులేక పోయింది. మ్యారేజ్ డేని ఎందుకలా గడపటం? నిన్న మీ ఇద్దరికని కొన్న బట్టలు ఇవ్వడమే కుదర్లేదు. అయినా మీరిద్దరూ దొరకలేదు కూడా!" అని తమ్ముడిని సన్నగా చీవాట్లేస్తున్నాడు. నేను కళ్ళెత్తి కూడా చూడలేదు. చూస్తే కన్నీళ్ళు రాలిపోతాయేమోనన్న భయం నన్నాపని చేయనివ్వలేదు.
ఫలితంగా నేను, నా బావగారు నా కాలేజీ విడిచిపెట్టే టైమ్ కి ముందుగానే అతని కారులో వున్నాం. అతను నన్నేం అడగలేదు. ముందు సీట్లో అతని పక్కన కూర్చుని నేను మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. నేను నా కన్నీళ్ళనీ, బాధనీ దాచుకునే ప్రయత్నమేమీ చేయలేదు. ఆ క్షణంలో ఎవరు నన్ను కదిలించినా, నేను బరస్ట్ అయ్యే స్థితిలో వున్నాను.
అతను స్టీరింగ్ మీద వున్న చేతిలోకి తలానించి చాలాసేపు నన్నే చూస్తూ గడిపాడు. ఇక ఆగలేనట్లు నా తలమీద చెయ్యివేశాడు. ఆ దొరికిన ఆలంబనని వదులుకోలేనట్లుగా ఒక్క ఉదుటున అతన్ని అల్లుకుపోయాను. అతను రెండు చేతులతో నన్ను చుట్టేసి తన నాలుకతో నా కన్నీళ్ళని తుడిచాడు. నేనతని గుండెల్లో మొహం దాచుకుని చాలాసేపు నిశ్శబ్దంగా గడిపాను.
నాకా క్షణం నా వదిన గుర్తు రాలేదు. క్రితంరోజు పొద్దున్న వరకూ నేను చేసుకున్న శపధాలూ అస్సలు గుర్తుకు రాలేదు. నా భర్త, అత్తగారు ఏదీ తెలియలేదు. ఎంతకాలంగానో పోగొట్టుకున్నదేదో దొరికిన తర్వాత పసిపిల్లలకి కలిగే సంతృప్తి భావంతో కళ్ళు మూసుకుని పడుకుండిపోయాను. చరిత్రకారులు, నైతిక సిద్ధాంత ప్రచార ప్రవక్తలూ, నన్ను క్షమించుదురుగాక! కానీ నాకు ఓ...దా...ర్పు... కావాలి! ఓదార్పు కోసం స్త్రీ ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది.
17
జీవితంలో సాధారణంగా ఏ సమస్యకైనా ఆటోమేటిగ్గా పరిష్కారాలు దొరికిపోతాయి. కాలమే సగం సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఆ కాస్త వ్యవధిలో తొందరపాటు చర్యలకి పాల్పడకపోవటమే వ్యక్తి మెచ్యూరిటీని సూచిస్తుంది. ఆ అయోమయంలో దిక్కుతోచని వాళ్ళు ఏదో ఓ కొత్త అడుగు వేస్తారు. ప్రస్తుతం గురించి ఆలోచనే తప్ప మరో కొత్త ఊబిలో కూరుకుపోతున్నానేమోననే రిస్క్ అనాలసిస్ ఆ క్షణంలో తట్టదు. ఆ సమయంలో తార్కిక జ్ఞానం పూర్తిగా నశిస్తుంది. నేను నా బావగారి పక్కలో తేలడానికి బేసిస్ అదే... నా ఫ్రస్టేషన్....
నా బావగారితో నా ప్రణయం తొందరపాటు నిర్ణయమని నా మధ్యవయస్సులో పడక్కుర్చీలో కూర్చుని కూడా స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే ఆ సమయంలో అంతకంటే వివేకంతో నేను ప్రవర్తించలేకపోయేదాన్నేమో! ఆ క్షణంలో నాకది మనశ్శాంతి నిచ్చింది. వ్యక్తి ఆనందంకంటే విలువలు గొప్పవనే సిద్దాంతం ఆ సమయంలో నేనొప్పుకునేదాన్ని కాదేమో!