Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 23


    "వచ్చి ఏమన్నాడు? కట్నం తాలూకు డబ్బు ముందే ఇమ్మన్నాడా? పెళ్ళికూతురికి వితంతు గండం వుంది.... అందుకని చేసుకోం అన్నాడా?"

    అంత దుఃఖంలో కూడా నాయనమ్మ ఆశ్చర్యంగా తలెత్తి "నీకలా తెలిసిందే తల్లీ" అనడిగింది.

    ప్రశాంత నివాళి నిర్లిప్తంగా నవ్వింది. "....ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి పెద్ద మేధస్సు అక్కరలేదు నాయనమ్మ! ఏం జరిగిందో చెప్పు."

    "నీ వితంతు గండం పోగొట్టడం కోసం బాబాతో పూజలు చేయిస్తున్నామన్న విషయం మగపెళ్ళివారికి తెలిసినట్టుంది. మధ్యాహ్నం ఆయన వచ్చి ఆ విషయమే వాకబు చేసారు. నువ్వనుకున్నట్టే కట్నం సొమ్మంతా ముందే యివ్వమన్నారు. పూజకోసం పాతికవేలు బాబాకి యిచ్చాం కదా! కట్నంలో పాతికవేలు తక్కువైందనీ తర్వాత ఇస్తాననీ చెప్పాను. కోపంతో మండిపడ్డాడు. అసలు వాళ్ళు వచ్చింది ఇంకో పాతికవేలు ఎక్కువ అడగడానికట!"

    "దేనికి?"

    "వితంతు గండం ఉన్నా కూడా పట్టించుకోకుండా చేసుకోవడానికి"

    ప్రశాంత నివాళి వదనంమీద బాధావీచిక కదలాడింది. చాలాసేపు మినుకు మినుకుమని వెలుగుతున్న హరికెన్ లాంతరు వైపు చూస్తూ స్థబ్దుగా వుండిపోయింది. ఆ నిశ్శబ్దంలోంచి నాయనమ్మ అంది-

    "ఉన్నదాంట్లోనే పాతికవేలు తక్కువయ్యాయంటే మరొక పాతికవేలు ఎక్కడినుంచి యిచ్చుకోగలమన్నాను. పెళ్లి వద్దనేసి వెళ్లిపోయాడు"

    నివాళి నాయనమ్మ భుజాలచుట్టూ అనునయంగా చేయివేసి "ఇక దాని గురించి మర్చిపో నాయనమ్మా! ఈ పెళ్ళిళ్ళూ.... కట్నాలూ నా కిష్టం లేదని నీకు తెలుసు. కేవలం నీ సంతృప్తి కోసమే ఒప్పుకున్నానని కూడా నీకు తెలుసు. పాతికవేలు ఎక్కువిస్తే కొడుక్కి మరణ గండం వున్నా ఫర్వాలేదా....? ఇలాంటి సంబంధం తప్పిపోయినందుకు మనం సంతోషించాలి నాయనమ్మా" అంది.

    ముసలావిడ మాట్లాడలేదు.

    "ఇక పడుకో" అంటూ నివాళి నిద్రకి ఉపక్రమించింది. ముసలావిడకి నిద్రపట్టలేదు. నెలరోజుల్లో జరగాల్సిన పెళ్ళి తప్పిపోవడం అంతులేని ఆవేదన కలిగిస్తోంది. అంతకన్నా పెద్ద ఆవేదన కలిగించే విషయం మరొకటుంది.

    ఆ రోజు మధ్యాహ్నం మగపెళ్ళి వారు వచ్చి వెళ్ళగానే తాను మళ్ళీ ఓంఫట్ బాబా దగ్గరికి వెళ్ళాననీ, ఇంకో పాతికవేలిస్తే మళ్ళీ యింకొక పూజచేసి ఆ వివాహం జరిగేలాగ చేస్తానని బాబా చెప్పడంతో కట్నం కోసం తీసి వుంచిన డబ్బులోంచి అదికూడా సమర్పించుకున్నాననీ- ప్రస్తుతం వున్న డబ్బంతా ఆ విధంగా ఖర్చయిపోయిందనీ ఆవిడ మనవరాలికి చెప్పలేదు.

    ఇటువంటి వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి నమ్మి భారం వేయలేరు- హేతువాదంతో ఆలోచించనూ లేరు.

    ఆవిడ సగటు మనుషులకి ప్రతీక.


                        13


    జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఏం చేయాలో తోచని ఓటరులాగ- 'బుద్ధిలేని పాలెం' ఊరి మధ్యలో వున్న రావిచెట్టు గాలికి నిర్లిప్తంగా వూగుతోంది. రాత్రి పన్నెండయింది. ఊరు ప్రశాంతంగా నిద్రపోతోంది.

    ఆ సమయంలో కేవలం నల్గురు మాత్రమే ఆ ప్రాంతంలో మెలకువగా వున్నారు. చెట్టుకింద బృహస్పతి, రావులు- చెట్టు మీద యిద్దరు దొంగలు.

    "చాలా సంపాదించినట్టున్నావే!" అంటున్నాడు బృహస్పతి.... "కానీ ఒక కొత్త పార్టీ స్థాపించాలంటే ఇది సరిపోదనుకుంటాను. విరాళాలు వస్తాయనుకో.... అది వేరేసంగతి"

    "డబ్బు గురించి నువ్వు ఆలోచించనక్కరలేదు. నేను ఇక్కడే సెటిల్ అవుదామనుకుంటున్నాను. 'బుద్ధిలేనిపాలెం' ప్రజలు ఇలా ఉన్నంతకాలం మనకి ఆర్థిక వనరుల సమస్యరాదు. దేశంమీద పడడానికి నువ్వు సన్నాహాలు మొదలు పెట్టచ్చు".

    "నేను ప్రధానమంత్రిని అయితే, నువ్వు హరిస్వామివి అవుతావన్న మాట"

    రావు నవ్వాడు.

    "నువ్వు ప్రధానివైతే నాకు ఢిల్లీ నడిబొడ్డులో ఆశ్రమం కట్టుకోవటానికి నాకు పదెకరాలు కావాలి సరేనా?"

    "పదవిమీద ఒట్టేసి వాగ్దానం చేస్తున్నాను" నవ్వాడు బృహస్పతి. ".... ఇంతకీ డబ్బు భద్రంగా దాస్తున్నావుగదా!"

    "ఆహా! శుభంగా .... మనం పడుకున్న చోటే తలకింద" అన్నాడు రావు. "ఈ రోజే ఆ ప్రశాంత నివాళి నాయనమ్మ కూడా పాతికవేలు తీసుకొచ్చి యిచ్చింది.

    బృహస్పతి మాట్లాడలేదు.

    "మనం మాత్రం తొందరలో ఒక ఆశ్రమం లాంటిదైనా కట్టుకోవాలి. ఇలా చెట్టుకింద నిరాడంబరంగా వుండడం వలన జనంలో నమ్మకం పెరగవచ్చేమో కానీ ఇంత డబ్బు ప్రతిరోజూ తలకింద దాయడం కష్టం అవుతోంది!"

    చెట్టుపైనున్న దొంగలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. నక్సలైట్లు వచ్చి ఇద్దర్నీ 'లేపెయ్యక' ముందే దోచుకోవాలని వాళ్ళు ఆ రోజు ముహూర్తం పెట్టుకున్నారు. ఇప్పుడు డబ్బు ఎక్కడుందో కూడా తెలియడంతో వాళ్ళ పంట పండినట్టయింది.

    .... ఈలోగా అడుగుల చప్పుడు వినిపించి బృహస్పతి తల తిప్పి చూశాడు. సరళరేఖ వస్తోంది. అంత చీకట్లో ఆ అమ్మాయి మొహం దీపంలా వెలిగిపోతోంది. పార్టీ టికెట్ కూడా రాలేదేమోనని దిగులుపడుతున్న వాడిని ప్రధానమంత్రి పిలిచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ప్రపోజ్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఎలా సంభ్రమ చెందుతాడో- అలా ఉద్విగ్నంగా వుందామె మొహం.

    రాగానే - "హరిహరీ!" అంది.

    వయసులో వున్న అమ్మాయి ఆర్ధరాత్రి దగ్గర కొచ్చి 'హరిహరీ' అంటే ఏమని అర్ధం చేసుకోవాలో తెలీలేదు మిత్రులిద్దరికీ. విషయం ఏమిటన్నట్టు కళ్ళు ఎగరేసాడు బృహస్పతి.

    "మళ్ళీ "హరీ" అంది.

    "ఆర్ధరాత్రి శ్రీ మహావిష్ణువు ఎందుకు గుర్తు వచ్చాడు?" అని అడిగాడు.

    "హ.... హ.... హ.... హరిస్వామి వస్తున్నారు."

    అర్థంకానట్టు .... "నువ్వు చెప్పేది ఢిల్లీ స్వామి గురించా?" అనడిగాడు.

    "అవును! ఆయన తల్చుకుంటే సి.ఎం. ని, ఎమ్మెల్యేని ఎం.పీని పి.ఎం.నీ చేయగలడు. ఆ స్వామే స్వయంగా వస్తున్నాడు...." అంది- 'ఆయన కంటపడటమే తానొక ఎం.పి. అయిపోవటానికి మొదటి మెట్టు' అన్నట్టుగా.

    ఆమె ఎందుకంత ఎగ్జయిట్ అవుతోందో అర్ధమై బృహస్పతికి నవ్వొచ్చింది. "ఇక్కడివరకూ వచ్చినవాడు మన దగ్గిరకి రాకమానడు గదా! రానీ మేము మాట్లాడు కుంటున్నప్పుడు మాత్రం మూడో వాడెవడూ రాకుండా చూడు."

    "నేనిక్కడ సెక్యూరిటీ ఇన్ స్పెక్టర్ ని తప్ప మీ పి.యేని కాదు" కోపంగా అంది.

    "నీ గురించి హరిస్వామికి చెప్పాలంటే నన్ను మంచి చేసుకోవలసి వుంటుంది. మొగుడు మరణించాక ముఖ్యమంత్రి అవడంకన్నా ఇది దగ్గర దారి" అన్నాడు.

    సరళరేఖ ఒక్కసారిగా మెత్తబడిపోయి "సరే.... సరే...." అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది.

    కొంచెం సేపటికి రామస్వామి అక్కడ ప్రవేశించాడు. పాత స్నేహితుణ్ణి చూసిన ఉత్సాహంతో మొహం విప్పారగా బృహస్పతి చేతులు చాచి ఆప్యాయంగా ఆహ్వానిస్తూ.... "ఎలా ఉన్నావ్ ఇబ్రహీంఖాన్?" అన్నాడు.

    హరిస్వామి దిగ్భ్రాంతుది బృహస్పతి వేపు చూసాడు. బృహస్పతి నవ్వుతూ .... "ఈ కాషాయ బట్టలేమిటి.... ఈ వేషమేమిటి? మోహంలో ఏ మార్పూ లేదు కాబట్టి నేను గుర్తుపట్టగలిగాను కానీ, లేకపోతే - ఇబ్రహీంఖాన్ అనగానే నాకు గుర్తొచ్చేది భుజానికి రైఫిలూ, తోట పటకా...."

    "ష్!" అన్నాడు హరిస్వామి ఇబ్బందిగా సరళరేఖ వేపు చూస్తూ.

    అప్పుడే వచ్చిన సరళరేఖ తనని పరిచయం చేయమన్నట్టు చూస్తోంది.

    "ఈమె పేరు సరళరేఖ. ఇక్కడ ఇన్ స్పెక్టర్. భవిష్యత్తులో మీతో ఈవిడకి చాలా పనుంది. కాస్త దయ చూపించండి" అని కన్నుకొట్టాడు.

    రేఖ వినయంగా నమస్కరించింది. మామూలు పరిస్థితుల్లో అయితే దగ్గరగా హత్తుకుని ఆశీర్వదించేవాడేమోగానీ, ప్రస్తుతం వున్న పరిస్థితిలో అతడింకా షాక్ నుంచి తేరుకోలేదు కాబట్టి నెమ్మదిగా తల వూపి ఊరుకున్నాడు.

    "ఇక నువ్వెళ్ళు, మేము ఏకాంతంగా మాట్లాడుకోవాలి. నువ్వుకూడా నీ పని గురించి ఆయన్ని ఏకాంతంగా కలుసుకో. ముఖ్యమయిన పనులన్నీ ఏకాంతంలోనే జరుగుతాయి. తెలుసుకదా!" అన్నాడు బృహస్పతి.

    అతడి మాటల్లో వ్యంగ్యం గుర్తించకుండా సరళరేఖ ఏదో ట్రాన్స్ లో వున్నదానిలాగ.... కలలో నడుస్తున్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

    "ఊ.... చెప్పు ఖాన్. ఎలా ఉన్నావు.... ఏమిటి? మన వాళ్ళంతా బావున్నారా? ఎక్కడ వున్నారు? ఏం చేస్తున్నారు? నేను మరణించిన తర్వాత ఛంబల్ వాలీని వదిలేసినట్టున్నారు కదూ! 'గ్యాంగ్ ఆఫ్ ఫోర్' గురించి పేపర్లో ఎక్కడా చదవలేదు. మనతోపాటు పక్క అడవిలో వుండేదో పూలన్ దేవి అనీ.... ఆవిడ మాత్రం రాజకీయాల్లో చేరుతోందని చదివాను. ఆఫ్ కోర్స్! బృహస్పతిగా వున్నప్పుడు ఈ రాజకీయాలమీద నాకంత ఇంట్రస్ట్ వుండేది కాదనుకో. అన్నట్టు ఇంతకీ మనవాళ్ళిద్దరూ ఎక్కడ వున్నారు?"

    హరిస్వామి ఎంతో ప్రిపేరయి వచ్చాడు. ఎన్నో ప్రశ్నలు వేద్దామనుకున్నాడు. గతంలో నలుగురి మధ్యా సంభవించిన సంఘటనలు చూచాయగా చెప్పి, మిగతా వివరాలు రుజువులుగా అడుగుదామని అనుకున్నాడు. కానీ బృహస్పతి ఇంత చనువుగా పాత స్నేహితుణ్ణి పలకరించినట్లు పలకరించేసరికి ఇక ఏ అనుమానమూ లేకపోయింది.

    హరిస్వామి వెంటనే సమాధానం చెప్పకపోవడంతో బృహస్పతి మొహం వాడిపోయింది. ".... నువ్వుకూడా నన్ను నమ్మడంలేదు కదా ఇబ్రహీంఖాన్?"అన్నాడు నిష్టూరంగా. ".... విలేఖరులకి చెప్పినట్టే నీకు కూడా కొన్ని రుజువులు చూపించాలి కదూ! సరే విను. నా భార్య రత్నాబాయి అడవిలో ప్రసవించినప్పుడు బిడ్డ బొడ్డు కోయడానికి మన దగ్గర ఆయుధం లేకపోయింది. మన కత్తులతో కొస్తే ప్రమాదం అనుకున్నాం. నువ్వు పళ్ళతో పేగు తెంపావు. గుర్తొచ్చిందా?" అన్నాడు.

    హరిస్వామి ఒక్క ఉదుటున ముందుకొచ్చి బృహస్పతిని కౌగిలించుకుని "మంగళ్!" అన్నాడు.

    "ఇబ్రహీం" అన్నాడు బృహస్పతి ఆప్యాయంగా.

    కొంచెంసేపు ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకున్నారు.

    "నీకు గుర్తుందా? మనం ఒకరోజు అడవిలో వేటకి వచ్చిన ఒక చీఫ్ మినిష్టర్ ని చంపాం. ఆయన రెండో భార్య ఆయన 'మొండాన్నీ', ఆయన మొదటి భార్య 'తల'నీ తీసుకెళ్ళి విడివిడిగా దహనం చేసారు. అస్తినిమజ్జనం కూడా విడివిడిగానే ఒకే నదిలో చేసారు. మనకేమీ అర్ధంకాలేదు. తర్వాత తెలిసిందేమిటంటే ఆయన వదిలి వెళ్ళిన పదవికోసం ఆ విధంగా బూడిదని పంచుకున్నారని! బందిపోట్లమైన మనమే వాళ్ళ చర్యల్ని చూసి ఆశ్చర్యపోయాం"

    "నీకు ఆ విషయాలన్నీ బాగా గుర్తున్నట్టున్నాయే మంగళ్!"

 Previous Page Next Page