Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 23


    వాళ్ళు బయల్దేరేముందు ప్రనూష పాస్ పోర్ట్ లో తండ్రి పేరు మారేలా చేద్దామన్నాడు చైతన్య. ప్రనూష అక్కర్లేదంది. ఎక్కడో వున్న అజ్మరాలీకి తన పాస్ పోర్ట్ వెతికే అవసరంగానీ, దాన్ని చూసి తనెవరో నిర్ధారించుకునే అవసరంగానీ రాదనుకుంది. ఆ విషయమే అతడితో వాదించింది. అప్పట్లో చైతన్యకి ఆమె వాదన కరెక్టనిపించింది. నిజంగా అజ్మరాలీ ఆమెను గుర్తుపడితే ఇక పాస్ పోర్ట్ పరీక్షచేసే అవసరమే అతడికి లేదు. గుర్తుపట్టకపోతే పాస్ పోర్ట్ తనిఖీ చేసే ఆలోచనే అతడికి కలగదు.

    వాదన వరకూ ఇది బాగానే వుందిగానీ-

    ఎక్కడో ఏదో తెలియని ఇబ్బంది!

    అతడా సాయంత్రం వరకూ ఆ ఆలోచనతోనే కొట్టుమిట్టాడాడు. ఆ సాయంత్రం అతడు హోటల్ నుంచి బయటకు వచ్చి పబ్లిక్ ఫోన్ నుంచి హోటల్ కి ఫోన్ చేశాడు.

    భారతదేశంలో ప్రనూష అతడితో ఈ పని గురించి చెప్పినప్పటినుంచీ అతడు సిస్టమాటిక్ గా కొన్ని అభ్యసించాడు. మంచులో నడవటం నుంచీ మిషన్ గన్ ఆపరేషన్ వరకు అందులో వున్నాయి. అలాంటి వాటిలో ఒకటి "ఉర్దూ" స్వచ్చంగా మాట్లాడటం.

    అదే ఇప్పుడు అతడికి ఉపయోగపడింది. అజ్మరాలీ పోలికవున్న అధికార స్వరంతో అతడు హోటల్ కి ఫోన్ చేసి "ఎవరూ ఆపరేటరేనా?" అని అడిగాడు.

    "అవునుసార్" అట్నుంచి వినిపించింది.

    "హోటల్ నుంచి బయటకు వెళ్ళే ఫోన్ కాల్స్ మీదా, కొన్ని గదులకు వచ్చే కాల్స్ మీద నిఘావేసి వుంచమని చెప్పాం కదా."

    "అవును సార్"

    "ఏమైనా కాల్స్ వెళ్ళినాయా?"

    "లేదు. ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు ఏ ఫోనూ రాలేదు." చైతన్యకి భూమి కంపిస్తున్నట్టు అనిపించింది.

    "ఏ గదిని 'వాచ్' చెయ్యమన్నానో గుర్తుందిగా."

    "ఉంది సార్. ప్రనూషది. 314 గది."

    చైతన్య నుదుట చెమట పట్టింది. బింకం సడలకుండా ఆఖరి ప్రశ్న అడిగాడు "నేనీ విధంగా సూచనలు ఇచ్చినట్లు ఎవరికీ తెలియనివ్వకు. ఇంతకీ నేనెవర్ని మాట్లాడుతున్నానో తెలుసుగా?"

    "తెలుసు. అజ్మరాలీ సాబ్."

    చైతన్య ఫోన్ పెట్టేశాడు.

    అజ్మరాలీ ప్రనూషని గుర్తుపట్టేశాడని అర్ధమైపోయింది. అంతకు ముందురోజు స్టేజిమీద ప్రోగ్రాం ఇస్తున్నప్పుడే అతడు ఆమెని గుర్తుపట్టి హోటల్ వారికి ఇన్ స్ట్రక్షన్ ఇచ్చి వుంటాడు.

    పులి మేకను చంపేటప్పుడు, ఆ మేక ఇక ఎటు వెళుతోంది నిశ్చయించుకున్నాక వెంటనే చంపకుండా దానితో ఆడుకుంటుంది!!!

    ఆ విధంగా ప్రనూషతో ఆడుకోవటం మొదలుపెట్టాడేమో!

    ఆ ఆలోచన వచ్చేసరికి చైతన్యమరి ఆగలేదు. ఆఘమేఘాలమీద హోటల్ కి బైలు దేరాడు. అతడు ఫోన్ చేసిన పబ్లిక్ బూత్ హోటల్ కి కాస్త దూరంలోనే ఉంది కాబట్టి టాక్సీరాదు. అతడు నడవవలసి వచ్చింది. దాదాపు పరుగెత్తాడు. విచిత్రంగా చూసే జనాన్ని పట్టించుకోలేదు. గడుస్తున్న ప్రతి నిమిషమూ ప్రనూషని మరణానికి దగ్గరగా చేరుస్తున్నట్లు ఫీలయ్యాడు.

    అతడు హోటల్ దగ్గరికి చేరుకునేసరికి హోటల్ పోర్టికోలో రెండు మిలటరీ వ్యాన్ లు, రెండు కార్లు వున్నాయి. అతడి ట్రూప్ అప్పటికే వ్యాన్ ఎక్కి అతడికోసం ఎదురుచూస్తూ వుంది. కార్లో అతడి తల్లి కూర్చుని వుంది. లక్ష్మి అతడి దగ్గరికి వస్తూ, "రండి మీ కోసమే వెయిటింగ్" అంది.

    అతడు ఆదుర్దాగా, "ప్రనూష ఏది?" అని అడిగాడు.

    "అజ్మరాలీగారు ఆయన కార్లో తీసుకెళ్ళారు"

    చైతన్య వెన్ను జలదరించింది.


                        12


    గంటకి వంద కిలోమీటర్ల వేగంతో కారు వెళుతోంది. అజ్మరాలీ డ్రయివ్ చేస్తున్నాడు. పక్కనే ప్రనూష కూర్చుని వుంది. మొహంనిండా కూలింగ్ గ్లాస్, తలకి స్కార్ఫ్.

    ఆమెకి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్ధంకాలేదు. మరుసటిరోజు ఆర్మీ క్యాంప్ లో డాన్స్ ప్రోగ్రాం వుందంటే- అందరితో కలిసి బయల్దేరవచ్చు అనుకుంది. ఆ సాయంత్రమే అజ్మరాలీ ఇలా వాహనాలు ఏర్పాటుచేసి తమని తీసుకు వెళతాడని ఊహించలేదు. అందులోనూ తనని ప్రత్యేకంగా, "ఒంటరిగా" కారులో బయల్దేరా తీస్తాడని అనుకోలేదు. ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినిపించుకోలేదు. రోడ్డు కిరువైపులా చెట్లు, పొలాలు, సరిహద్దువైపు వెళుతోంది కారు. దాదాపు నాలుగు గంటల ప్రయాణం.

    అజ్మరాలీ మిలటరీ డ్రస్ లో వున్నాడు. కారు బయలుదేరి నప్పటినుంచీ ఆపకుండా మాట్లాడుతున్నాడు. ఆమె జవాబు చెప్పటం లేదు. "ఏమిటి? మీ వాళ్ళు రావటం లేదే అని కంగారుపడుతున్నావా? వాళ్ళే వస్తారులే" అంటూ నవ్వేడు.

    "అటువంటిదేమీ లేదు."

    "టీ తాగుతావా?"

    "ఊహూ".

    "వెనుక సీట్లో ఫ్లాస్క్ వుంటుంది పోసివ్వు."

    ఆమె వెనుతిరిగి ఫ్లాస్క్ తీసుకుంది. అలా తిరిగినప్పుడు అతడి దృష్టి తన కడుపు ముడతమీద నిలిచినట్టు ఆమె గుర్తించీ, గమనించనట్టు వుండిపోయింది. అతడు కారు వేగం తగ్గించాడు. తగ్గిస్తూ అన్నాడు- "మీ దేశం అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. సై అంటే సై అనేట్టూ వుంటారు. కాస్త పొగరు కూడా వుంటుంది. ఆడాళ్ళకి ఆ మాత్రం పొగరుండటం మొగాడికి చాలా బావుంటుంది. ముఖ్యంగా నాలాంటి సైనికాధికారికి."

    ఆమె జవాబు చెప్పలేదు.

    "కొన్ని సంవత్సరాల క్రితం ఒకమ్మాయి కలిసింది. మీ దేశం అమ్మాయే. భలే పొగరులే. నన్ను చంపుతానని ఛాలెంజ్ చేసింది. పాపం ఎక్కడుందో?"

    కారు రోడ్డు పక్కకి తీసి ఆపుచేశాడు.

    బెల్టులోంచి పిస్టల్ తీశాడు.

    ప్రనూష పిడికిళ్ళు బిగించింది.

    ఎలాగూ మరణం తప్పనప్పుడు పోరాడి చావడం మంచిది. కానీ ఒక్కటే విచారం. తన ప్రతిజ్ఞ తీరకుండానే మరణించవలసి వస్తోంది.

    ఆమె ఆలోచనల్లో వుండగానే అతడు పిస్టల్ ని ఇద్దరిమధ్య సీట్లో పెట్టాడు. కారు దిగుతూ, "ఇప్పుడే వస్తాను జాగ్రత్త. పిస్టల్ లోడైవుంది" అంటూ చెట్టు వెనక్కి వెళ్ళాడు. ఒక్కసారి బరువు తొలగినట్టు ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.

    అతడికి తనమీద అనుమానం లేదు. అది ఋజువైంది. అంతే చాలు. అనవసరంగా చైతన్య ఏమేమో ఆలోచించి కంగారు పడ్డాడు. తనమీద ఏ అనుమానమూ లేదు కాబట్టి అజ్మరాలీ ఇలా తన దగ్గర పిస్టల్ వదిలేసి వెళ్ళగలిగాడు.

    పిస్టల్ ఆలోచన వచ్చేసరికి ఆమె దృష్టి అతడు వెళ్ళిన వైపు పడింది. చెట్టు వెనుకనుంచి అతడి కాళ్ళు కనపడుతున్నాయి.

    మళ్ళీ పిస్టల్ ని చూసింది.

    దాన్ని చేతుల్లోకి తీసుకుంటే...

    అతడు వస్తూండగా వరుసగా మూడు గుళ్ళు.... అంతే.

    తన శపధం నెరవేరుతుంది! తన తల్లిదండ్రుల మరణానికి తగిన జవాబు చెప్పగలుగుతుంది.

    పెద్ద కష్టం కూడా కాదు. కార్లో అత్యాచార ప్రయత్నం చేస్తూ వుండగా, చంపేనని చెప్పవచ్చు. బుల్లెట్స్ పేల్చి ఇట్నుంచి ఇటే భారత రాయబారి కార్యాలయానికి వెళ్ళటమే! అక్కడ ఆశ్రయం దొరుకుతుంది. ఆ తర్వాత భారతదేశం వెళ్ళిపోవచ్చు.

    అతడు బెల్టు సర్దుకుంటూ వస్తున్నాడు.

    ఆమె చెయ్యి పిస్టల్ వైపు సాగబోయి... ఆగిపోయింది.

    తను పిస్టలు పేలిస్తే....

    మరిక చైతన్యకి అతని తండ్రిని విడిపించుకునే దారే వుండదు. అన్ని దార్లూ మూసుకుపోతాయి. ఈ వార్త పేపర్ల కెక్కగానే అందరి దృష్టి ఇటే కేంద్రీకృతమవుతుంది. చైతన్యా, అతడి తల్లీ వెలుగులోకి వస్తారు. ఇంతవరకూ సజావుగా జరిగిన ప్లాన్ ని తన స్వార్ధంకోసం పాడు చేసినట్టు అవుతుంది.

    "అజ్మరాలీ కనపడగానే చంపేస్తాను" అని ఒకప్పుడు అన్నది తనే! కానీ ఇప్పుడు అనలేదు.

    ముందు చైతన్య ఆశయం నెరవేరాలి! తర్వాత తనది!!

    ఆ ఆలోచన రాగానే ఆమె తన చేతిని వెనక్కి తీసుకుంది. అజ్మరాలీ వచ్చి కారెక్కాడు. పిస్టలు తీసి బెల్టులో పెట్టుకోబోతూ ఆగి "నీకు బాతుమాంసం అంటే ఇష్టమేనా" అని అడిగి ఆమె సమాధానం కోసం ఆగకుండానే దూరంగా పొలం పక్క కాలువలో ఈదుతున్న బాతుకేసి గురిచూసి పిస్టల్ పేల్చాడు.

    అది పేలలేదు.

    ఆమె పళ్ళు బిగపట్టి చూస్తోంది. అతడు కూడా అర్ధంకానట్టు పిస్టల్ విప్పి చూసి బిగ్గరగా నవ్వేడు. "చూసేవా నాది ఎంత మతిమరుపో! లోపల గుళ్ళు పెట్టడం మరిచిపోయాను" అంటూ కారు స్టార్ట్ చేశాడు.

    ఆమె ఇంకా దిగ్భ్రమనుంచి తేరుకోలేదు.

    ప్రమాదం ఎంతలో తప్పిపోయిందో తల్చుకుంటే ఆమె చేతులు వణకసాగాయి. తొందరపడి పిస్టల్ పేల్చి వుంటే ఈ పాటికి మృత్యు ముఖంలో వుండేది.

    కారు వేగం పుంజుకుంది.

    ఆమె సీటు వెనక్కి తలవాల్చి భారంగా విశ్వసించి, నిశ్చింతగా కళ్ళు మూసుకుంది.

    ఆ నిశ్చింత తాత్కాలికమని ఆమెకి అరగంట తరువాత తెలిసింది.


                  *    *    *    *


    తన మిగతా ట్రూప్ తో ఆర్మీ క్యాంప్ చేరుకునే వరకూ చైతన్య కంగారుగానే వున్నాడు. ఏ వార్త వినవలసి వస్తుందో అని గాభరాపడుతూ వున్నాడు. 

    అజ్మరాలీ కారులో ప్రనూష వెళ్ళిన అరగంటకి చైతన్య అక్కడికి చేరుకున్నాడు. ఒక ఆర్మీ బిల్డింగ్ వాళ్ళకి విడిదిగా యిచ్చారు. లోపలి గదిలో ప్రనూష కనపడగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.

    "ఏం జరిగిందో తెలుసా?" అంటూ హుషారుగా చెప్పబోతున్న ప్రనూషని కళ్ళతోనే వారించి బయటకి తీసుకొచ్చాడు. చుట్టూ ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక అన్నాడు- "ఆ బిల్డింగ్ లో మనం ఏం మాట్లాడుతున్నామో వినటంకోసం రహస్యంగా మైక్రోఫోన్ లు అమర్చి వుంటారని నా అనుమానం."

    "ఎందుకా అనుమానం?"

    "నువ్వెవరో అజ్మరాలీకి తెలిసిపోయింది" అంటూ హోటల్ లో ఆమె ఫోన్ ట్రాప్ చేయబడిన విధానం గురించి చెప్పాడు. ఆమె మొహం తెల్లగా పాలిపోయింది.

    "నేను ప్రనూషనని అతడికి తెలిసిపోయిందా?" స్వగతంగా అనుకుంది. "మరి ఆ పిస్టల్ అలా ఎందుకు వదిలాడు?"

    "పిస్టల్ వదలటం ఏమిటి?"

    ఆమె కార్లో జరిగిన సంఘటన గురించి చెప్పింది. "నన్ను అనుమానించినవాడు కార్లో నా పక్కనే తన పిస్టల్ ఎందుకు వదిలి వెళతాడు?"

    "అనుమానించాడు కాబట్టే పిస్టల్ వదిలి వెళ్లాడు" అన్నాడు చైతన్య. "అందులో గుళ్ళు లేవని అతడికి ముందే తెలిసి వుండవచ్చు. నువ్వా పిస్టల్ పేల్చటానికి ప్రయత్నించి వుంటే ఆట పట్టించినట్టు నవ్వుకునేవాడు."

    "మైగాడ్! నేనిదంతా ఆలోచించలేదు" అంది ప్రనూష.

 Previous Page Next Page