వేణుకి ఈ మీటింగ్ వ్యవహారాలు కొత్తగా వున్నాయి. జగపతిరావు ఎంతో పెద్ద బాధ్యత పెట్టాడు. కాంట్రాక్టులో ఏమాత్రం తప్పు వచ్చినా కొన్ని లక్షల నష్టం వస్తుంది. అతడు తన పగ, ఆశయం అన్నీ తాత్కాలికంగా మర్చిపోయి నిజంగా తను ఈ పని చెయ్యగలడా లేదా అన్నది నిరూపించడం కోసం సిన్సియర్ గా కష్టపడసాగాడు. ఆరోజు అతడు హోటల్ కి వచ్చేసరికి మధ్యాహ్నం మూడయ్యింది. వళ్ళు వెచ్చగా వున్నట్టు తోచి భోజనం చెయ్యకుండా నిస్త్రాణగా పడుకున్నాడు. ప్రేమా వాళ్ళు పొద్దున్న వెళ్ళి ఇంకా రాలేదు. కళ్ళకి చెయ్యి అడ్డుపెట్టుకుని అతడలా ఎంతసేపు వున్నాడో తెలీదు. తలుపు తెరుచుకుని ప్రసాద్ లోపలికి వస్తూ- "మహామంత్రి తిమ్మరుసుగారు ఇంకా యుద్ధరంగానికి వెళ్ళనట్లుందే" అన్నాడు. ప్రేమ వేణూని కూడా సమానస్థాయిలో తనతోపాటు ఒకే గదిలో వుండమనేసరికి అప్పటినుండీ ఈ సూటీపోటీ మాటలు ఎక్కువయ్యాయి.
వేణు మాట్లాడలేదు. ఈ లోపులో ప్రసాద్ తోపాటు లోపలికి వచ్చిన ప్రేమ, "అదేమిటలా పడుకున్నారు?" అంది.
వేణూ కళ్ళు విప్పి ఆమెని చూసి పక్కమీద నుంచి లేవడానికి ప్రయత్నిస్తూ విఫలుడయ్యాడు.
"మీ కళ్ళు ఎర్రగా వున్నాయి. ఒంట్లో బాగోలేదా?" అంది.
"లేదు లేదు. భోజనంచేసి ఇప్పుడే పడుకున్నాను. టైం ఎంత అయ్యింది?"
"మూడున్నర."
"అరరె! వాళ్ళు ఎదురుచూస్తూ వుంటారు" అని కంగారుపడుతూ లేచాడు వేణు. కొద్దిగా కళ్ళు తిరిగినట్టయి, వెంటనే నిలదొక్కుకున్నాడు. అతడినే పరీక్షగా గమనిస్తున్న ప్రేమ "ఏమయ్యింది? మీరు బాగానే వున్నారు కదా?" అంది.
ఈ లోపులో వెయిటర్ సంతకం కోసం బిల్లు పట్టుకొచ్చాడు.
ప్రసాద్ వాటిని అందుకుని సంతకాలు పెడుతూ, "ఇదేమిటి పన్నెండు 'టీ'లు వున్నాయి? ఇన్నెవరు తాగారయ్యా ఈ రూమ్ లో?" అన్నాడు.
"తెల్లవారుఝామున నాలుగింటివరకూ నేనే సప్లయి చేశాను కదండీ అయ్యగారికి" అన్నాడతను.
ప్రేమ ఈ సంభాషణంతా మౌనంగా వింటోంది.
వెయిటరు వేణూవైపు తిరిగి, "భోజనం వుంచమని చెప్పారు ఆలస్యం అయిపోతుంది, తెమ్మంటారా?" అని అడిగాడు.
ప్రేమా, ప్రసాద్ అప్రయత్నంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
"లేదు. నేను చేసేవచ్చాను" అంటూ వేణు తయారవసాగాడు.
ప్రేమ ముందుకి కదిలి, "ఏమిటి ఈరోజు చర్చించవలసిన విషయం?" అని అడిగింది.
"పెద్దగా ఏమీలేదు, ప్రొడక్షన్ విషయాలంతే! ఓ అరగంటలో అయిపోతుంది" అన్నాడు వేణు.
ఆమె ప్రసాద్ తో, "ప్రొడక్షన్ అయితే వాళ్ళతో నువ్వే చర్చించవచ్చుగా! వేణుని రెస్టు తీసుకోనివ్వు" అంది.
ప్రసాద్ గొంతులో ఏదో అడ్డుపడ్డటయింది. "నేనా?" అన్నాడు.
"అదేమిటి ప్రసాద్? ఇంతకాలంనుంచీ వ్యవహారాలు చూస్తున్నావు అతడు వచ్చి నెలకూడా కాలేదు. ఆ మాత్రం నువ్వు చూడలేవా?"
కలలోంచి లేచినవాడిలా వేణు చప్పున తేరుకుని, "అక్కరలేదు ఇప్పడేమయిందనీ. అయామ్ ఆల్ రైట్! నేను వెళ్ళొస్తాను" అని తొందరగా బయటికి వెళ్ళిపోయాడు.
ప్రసాద్ సంజాయిషీ చెపుతున్నట్లు ఏదో అనబోయి ప్రేమ దృష్టి ఎక్కడో వుండటం చూసి, తనూ అటు చూపు మరల్చాడు.
మంచం ప్రక్కన టాబ్లెట్ల తాలూకు రెండు ఖాళీ కవర్లున్నాయి.
మీటింగులో వేణు చురుగ్గా పాల్గొనలేకపోయాడు. టెంపరేచర్ మరింత పెరిగినట్లు అనిపించసాగింది. అదృష్టవశాత్తూ అయిదున్నరకే అది ముగిసింది. అతడు హోటల్ కి వచ్చేసరికి యధాతధంగానే ప్రసాద్ గదిలో లేడు.
కానీ ప్రేమ వుంది. అతడు రావటం చూసి తన గదిలోంచి వచ్చే "ఎలా వుంది" అని అడిగింది.
అతడు ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు.
"ఇదేమిటి? మీరెక్కడికీ వెళ్ళలేదా?"
ఆమె దానికి సమాధానం చెప్పకుండా తన ప్రశ్నని తిరిగి రెట్టించింది.
"నాకేమైంది? బాగానే వుందే!" అన్నాడు.
"టాబ్లెట్లు వేసుకున్నారు. పైగా భోజనం కూడా చెయ్యలేదు" పట్టుబడిపోయినందుకు అతడేం మాట్లాడలేదు.
"మాకు చాలా సిగ్గుగా వుంది" అంది ఆమె అప్రయత్నంగా.
అతడు చకితుడై ఆమెవైపూ చూశాడు.
ఆమె అంది- "మీరేమో తెల్లవార్లు మేలుకుని పనిచేస్తూ వుంటే అంతే బాధ్యతవున్న ప్రసాద్, నేనూ షికార్లు తిరుగుతున్నాం."
అతడు చప్పున "అదేమిటండీ! నేను మీ దగ్గర ఉద్యోగిని" అన్నాడు.
ఆమె తలెత్తి నెమ్మదిగా "ప్రసాద్ కూడా అంతేగా?"
అతడు ఆశ్చర్యపోయాడు. కానీ ఆ ఆశ్చర్యం రవ్వంత ఆనందాన్నే కలుగజేసింది.
"డాక్టర్ ని పిలిపించమంటారా? అడక్కుండానే పిలిపిద్దును గానీ మీరు డాక్టరేకదా! అందుకని...." అంటూ నవ్వింది.
ముగ్ధమనోహరంగా వున్న ఆ నవ్వువైపు చూస్తున్న అతడు క్షణంలో తెప్పరిల్లి తడబడుతూ "అక్కరలేదు" అన్నాడు.
ఇంతలో వెయిటర్ లోపలికి వచ్చి ప్రసాదు తాలూకు సూట్ కేస్ ను తీసుకువెళ్ళటానికి ఆయత్తమయ్యాడు.
వేణు విస్మయంగా "ఇదెక్కడికి" అని అడిగాడు.
ప్రేమ కల్పించుకుని "రాత్రి ప్రసాదు వచ్చేసరికి ఎంత ఆలస్యం అవుతుందో? అర్దరాత్రి వంట్లో బాగోలేక అలసిపోయి పడుకున్న మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు? మీకు సాయం చెయ్యటం పోయి పైగా ఇది కూడానా? అందుకనే ఇంకో రూమ్ ఇవ్వమని చెప్పాను. అది ఇప్పుడే ఖాళీ అయినట్టుంది, మీకేదైనా అవసరం వస్తే చెప్పండి. పక్క రూమ్ లో వుంటాను" అనేసి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోవటంతో ఆ గది అంతా నిశ్శబ్దం వ్యాపించింది. ఆమె తాలూకు పరిమళం మాత్రం ఇంకా ఆ గదిలో అలాగే వుంది. అతడి మనసంతా ఒక రకం మధురమైన సంతృప్తితో నిండిపోయింది. అతడి వూహ తెలిసిన తరువాత అతడి గురించి ఆమాత్రం పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు. చెల్లెల్ని చిన్న పిల్లలాగా చూస్తూ వచ్చాడు. ఇన్నాళ్ళకి ఇప్పుడు....
ఆ నిశ్శబ్దాన్ని తెగగొడుతూ ఫోన్ మ్రోగింది. రిసీవర్ ఎత్తి "హలో!" అన్నాడు.
"నేనయ్యా!" ప్రసాదరావుని.
ఆశ్చర్యంగా "ఎక్కడ్నించి" అని అడిగాడు.
"నీ రూమ్ కింద ప్లోర్ నుండి."
వేణు కెవ్వున అరచినంత పనిచేసి, "మీరెప్పుడొచ్చారు ఈ వూరు?" అని అడిగాడు.
"మీతోపాటే రెండురోజుల క్రితమే వచ్చాను. రేసులోకి గుర్రం వదిలాక దానితోపాటు తిరగాలి కదా! ఎలా వుంది నీ ఆరోగ్యం?"
వేణు మరింత ఆశ్చర్యంతో "నా ఆరోగ్యం గురించి మీకెలా తెలిసింది?" అని అడిగాడు.
"నిన్న రాత్రి నీ డిన్నరులో మూలికా కషాయం కలిపి నీ ఆరోగ్యం పాడుచేసింది నేనే కాబట్టి?"
"మిమ్మల్ని తగలెట్టా! చాటుగా వుండి గూఢచారి చర్యలు చేసింది చాలక ఇలాంటి పనికూడా పూనుకున్నారా?"
"నువ్వెన్నయినా చెప్పవయ్యా! హీరో హీరోయిన్లు దగ్గరయ్యేది జ్వరంలోనే, ఓదార్పుతోనే. నేను చెప్పితే నువ్వెలాగూ ఒప్పుకోవాయె! ఇప్పుడు నా ఊహే కరెక్టయ్యింది చూడు. వాడిని వూళ్ళోకి తోలేసి ఆమె పరామర్శకి నీ దగ్గరికి వచ్చింది."
ఆ చివరిమాటలు పట్టించుకోకుండా వేణు "మీ మందు ప్రభావం ఇంకా నా మీద ఎంతసేపు వుంటుందని మీ ఐడియా?"
"రేప్పొద్దున్న కల్లా గులాబీ పువ్వులా వుంటావు. ఏం?"
"రేపు మీటింగ్ లో ముఖ్యమైన విషయాలున్నాయి అందుకని."
"అమ్మాయినీ, ఇంత మంచి అవకాశాన్ని దగ్గర వుంచుకుని మీటింగేమిటయ్యా?"
"చూడండి ప్రసాదరావుగారూ! జగపతిరావు కుటుంబం మీద మీకెంత పగ వుందో దయానందం కుటుంబం మీద నాకూ అంతకన్నా ఎక్కువ వుంది. కానీ ఫాస్టుగా ఏ పనీ జరగదు. చిన్న చాక్లెట్ ఇస్తే ప్రేమలో పడిపోవటానికి ప్రేమ నవ నవలా కథానాయిక కాదు."
"కానీ అవకాశం...." అంటూ నసిగాడు.
"ఏమిటండీ అవకాశం! రేప్ చెయ్యమంటారా? మీకీ సాహిత్యం చదివి చదివి మతిపోయినట్టుంది. ఒకసారి రేప్ చేస్తే అందులోనూ కన్నెపిల్లని రేప్ చేస్తే గర్భం వస్తుందనేది కేవలం సాహిత్యానికే పరిమితమేమో! ఏ డాక్టరూకానీ- ఏ మెడికల్ మాగజైన్ గానీ దీన్నొప్పుకోదు. నేను కోరేదల్లా నాకు తెలియకుండా మీరేమీ ఎత్తుల మీద ఎత్తులు వెయ్యకండి. మీరీ ఊరునుండి వెళ్ళిపోండి మహాప్రభో! మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను."
"అలాగేలేవయ్యా! ఇవ్వాళ సాయంత్రమే వెళ్ళిపోతాను" అని ఫోన్ పెట్టేశాడు ప్రసాదరావు.
ప్రసాదరావు చెప్పినట్టే వేణుకి ప్రొద్దున్నకల్లా జ్వరం తగ్గిపోయింది. అతడు మామూలుగానే మీటింగ్ కి వెళ్ళాడు. అయితే ప్రసాద్ మొహంలో రూమ్ మార్చినందున కోపంగానీ, ఉక్రోషంగానీ కనబడకపోవటం వేణుకి ఆశ్చర్యంగా అనిపించింది. పైగా ప్రసాద్ చాలా ఆనందంగా, హుషారుగా కనబడ్డాడు కూడా.
దానికి కారణం ఆ రాత్రి అతడు ఏర్పాటు చేసుకున్న సముద్రం ప్రక్క బీచ్ రిసార్ట్ మకాం.
వేణుకి, ప్రేమతో కలిసి ప్రసాద్ వేసిన ప్రోగ్రాం సంగతి తెలీదు. అతడు మామూలుగా మీటింగ్ నుండి తిరిగి వచ్చేసరికి వాళ్ళిద్దరూ తయారై వెళ్ళిపోవడానికి సిద్ధంగా వున్నారు.
వేణు, "ఎక్కడికి?" అని అడిగాడు.
ప్రేమ ప్రసాద్ చెప్పింది చెప్పి_ "మీరుకూడా వస్తారా?" అని అడిగింది.
"వద్దులెండి. నేను రెస్టు తీసుకుంటాను" అన్నాడు.
ఆ సమాధానానికి ప్రసాద్ మొహంలో సంతోషం కొట్టిచ్చినట్టు కనబడింది.
"వెళ్ళేటట్లయితే తొందరగా బయల్దేరటం మంచిది. ఆలస్యం అయితే తిరిగి రావటం కష్టం అవుతుందేమో?" అన్నాడు వేణు.
"ఎందుకు? అక్కడ కాటేజ్ రిజర్వ్ చేశాను కదా!" అన్నాడు ప్రసాద్.
నమ్మశక్యం కాని విషయం విన్నట్టు వేణూ విస్మయంగా, "అంటే రాత్రి అక్కడే వుండిపోతారా?" అని అడిగాడు.
ప్రసాద్ ఆ మాటలు పట్టించుకోకుండా పళ్ళ బాస్కెట్ సర్దసాగేడు. వేణుకి ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకో ఎక్కడో ఏదో అపశృతి ధ్వనిస్తున్నట్టు అనిపించసాగింది. ప్రసాద్ ని, ప్రేమనీ మార్చి మార్చి చూశాడు. అతడు అనాలనుకోలేదుగానీ అప్రయత్నంగా నోటివెంట ఆ ప్రశ్న వచ్చేసింది_ "ఒక్క కాటేజేనా?" అని.
అలా అనేసిన తర్వాత ఎందుకన్నానా అని బాధపడ్డాడు. ఇది ఆమెని అవమానించటమే. ఒకవేళ ప్రసాద్ గానీ ఇద్దరికీ చెరొక కాటేజీ తీసుకుని వుండి వుంటే, ఇలా అడగటం కేవలం తన సంకుచితత్వాన్ని మాత్రమే తెలియపరుస్తుంది.
కానీ ప్రసాదు మొహం చూస్తూ వుంటే తన అనుమానం నిజమే అనిపించింది. ఇతడు ఎంతకయినా తగును.