ఆ రోజు మురళి పరీక్ష వ్రాస్తున్న హాల్ కి ఇన్ విజిలేటర్ గా వచ్చాడు చంద్రశేఖర్. జరుగుతోన్న వాటికి సాక్షీభూతుడుగా నిలిచిపోవటం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాడు. మురళి కూడా నలుగురి లాగే రెండు జేబుల్లోనూ, మేజోళ్ళలోనూ, చొక్కా చేతి మడతలలోనూ, లెక్కలేనన్ని చీటీలు తయారుచేసి తీసుకొచ్చాడు. అదీగాక ఎందుక్తెనా మంచిదని లావాటి పుస్తకాలు కూడా మోసుకొచ్చాడు. అతనే కాదు. ఆ హాలులో అందరూ కూడా ఏనాడూ కాలేజికి తీసుకురాని పుస్తకాలన్నీ ఆనాడు కాలేజికి మోసుకొచ్చారు. మురళి చంద్రశేఖర్ ని చూసి ఒక్క క్షణం సంకోచించాడు. కానీ, తరువాత ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా తన చీటీలన్నీ బయటికి తియ్యసాగాడు. చంద్రశేఖర్ చూశాడు. దగ్గిరకు వెళ్ళి మందలించాలనుకున్నాడు.... కానీ, ఆ చివరి క్షణంలో తను ఏం చెప్పీ ప్రయోజనం లేదని ఊరుకున్నాడు.
Flying squad వస్తున్నట్లు వర్తమానం వచ్చింది.... వెంటనే విద్యార్ధులంతా పుస్తకాలు ఎక్కడివక్కడ సర్దేసి హాలు బయటికి విసిరేశారు. మురళి కూచున్న హాలులో విద్యార్ధులు చూసి వ్రాత వ్రాయటంలో నిమగ్నులయిపోయి పుస్తకాలు బయట పెట్టటంలో కాస్త ఆలస్యం చేశారు. అంతలో Flying squad మెట్లెక్కి వచ్చేస్తోందని తెలిసిపోయింది. అక్కడితో విద్యార్ధులు తమ పుస్తకాలన్నీ ఇష్టం వచ్చినట్లు చెల్లా చెదరుగా బయటికి విసిరేశారు. అవన్నీ Flying squad తలల మీద పూల జల్లులా కురిశాయి. కానీ, అవి పూలు కావు గనుక__లావుపాటి పుస్తకాలు గనుక అందరికీ తలలు బొప్పి కట్టాయి. అంత ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తున్నా ఏమీ పట్టనట్లు ఊరుకుంటే పరువు నష్టం. అంచేత ఆ రోజు Flying squad ఎప్పటిలా ఒక్కసారి తిరిగి వెళ్ళిపోకుండా, అక్కడే ఉండిపోయింది.
పరీక్ష వ్రాయటానికి ఇచ్చే కాలవ్యవధి రెండున్నర గంటలు.... అందులో మొదటి అరగంట, తమ చీటీలలో, పుస్తకాలలో, ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, వెతుక్కోవటంతోనే సరిపోతుంది. రెండో అరగంటలో వ్రాయబోతుండగానే Flying squad వచ్చేసింది. వచ్చినవాళ్ళు గంటన్నర పైగా మురళి హాలులోనే ఉన్నారు. భయంతో, కంగారుతో మురళి ఏమీ వ్రాయలేక పోయాడు. తన దగ్గిర ఉన్న చీటీలు Flying squad కంటికి కనపడకుండా జాగ్రత్త పడటమే సరిపోయింది అతనికి. చివరకు Flying squad వెళ్ళిపోయేసరికి అరగంట కూడా మిగల లేదు. మురళి ఏదో వ్రాయాలని ప్రయత్నించి కొంత వ్రాసేటప్పటికే టైం అయిపోయింది. అందరి దగ్గిరా పేపర్లు తీసుకుంటూ మురళి దగ్గిరా తీసుకోబోయాడు చంద్రశేఖర్.
మురళి ఏడుస్తూ "నేను ఏం వ్రాయలేదు సార్! నాకు కొంచెం టైం కావాలి!" అన్నాడు.
ఆ హాలులో అందరూ ఏడుస్తూనే ఇచ్చారు పేపర్లు. సత్యవతిగారు గుర్తుకొచ్చి మురళి మీద ఒక్క క్షణం జాలి కలిగినా అంతలో కోపమూ వచ్చింది.
"అయామ్ సారీ! నువ్వు చక్కగా చదువుకుని వస్తే హాయిగా వ్రాయగలిగేవాడివి కదా! ఎందుకొచ్చిన తిప్పలు ఇవన్నీ! నీకు టైం ఇయ్యటానికి వీల్లేదు...." అని పేపర్ తీసుకోబోయాడు.
"సార్!....సార్!" అని ప్రాధేయ పడ్డాడు మురళి, పసిపిల్లాడిలా ఏడ్చేస్తూ.
"నో! నీ ఒక్కడికి ఇయ్యటానికి వీల్లేదు. అందరికీ ఇయ్యటానికి రూల్స్ అసలు ఒప్పుకోవు. పేపర్ ఇచ్చేసి వెళ్ళిపో! సప్లిమెంట్ కయినా, బాగా చదువుకో!" అని మురళి చేతిలోంచి పేపర్ లాగేసుకున్నాడు.
మురళి అక్కడే కూచుని డెస్క్ మీద తల ఆనించుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు. చంద్రశేఖరానికి జాలి కలుగుతోంది కాని, జాలి చూపించవలసిన సందర్భం కాదది....
ఆ సమయంలో పక్క హాల్లో కూచుని పరీక్ష వ్రాసిన రవి వచ్చాడు. ఏడుస్తోన్న స్నేహితుణ్ణి చూసి "ఏం జరిగింది?" అని అడిగాడు.
మురళి ఏడుస్తోనే జరిగిన సంగతి చెప్పాడు.
"సార్! మురళికి పేపర్ ఇయ్యండి. ఆన్సర్స్ వ్రాసి ఇస్తాడు. ఒక్క గంటలో వ్రాసేస్తాడు లెండి...." దర్పంగా ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు రవి.
ఆ ధోరణికి నిర్ఘాంతపోయాడు చంద్రశేఖర్. అతనికి రవి పట్ల ఎప్పుడూ మంచి అభిప్రాయం లేదు. తెలివిగా చదవని ఏ విద్యార్ధి పట్లా లెక్చరర్ కి మంచి అభిప్రాయం ఉండదు-