"ప్రతి దానికి ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? కొందరి జబ్బులు నయం కావటం నేను చూశాను. అందుకే ఇక్కడ అందరూ 'త్రిసికి'ని దేవతలా చూస్తారు. ఆవిడ నాకు గార్డియన్ గా ఉన్నంతవరకూ దేవనారాయణ్ గారికి నా శీలం గురించి భయం ఉండదు"
అనిల చెప్పేది రవి వినిపించుకోవటం లేదు. అతడి మస్తిష్కం ఆలోచనలతో మరిగిపోసాగింది.
"అనిలా, ఒకటి చెప్పు. నేను పిల్లాడిని తీసుకుని టౌన్ లో ఆస్పత్రికెళ్ళినప్పుడు త్రిసికి ఎక్కడికెళ్ళింది?"
"ఎక్కడికీ వెళ్ళలేదు. పూజ పూర్తయిన దగ్గర్నుంచీ నాతోనే వుంది. ఏడుస్తున్న తల్లి దగ్గిర కూర్చుంది!"
ఏదో పెద్ద తెలివిగా ఆలోచించాననుకుంటున్న రవి వుసూరుమని పోయాడు.
త్రిసికి వాళ్ళిద్దరికంటే ముందు నడుస్తోంది.
ముగ్గురూ డేరాలు సమీపించారు. రవి తన డేరాలోకి వెళ్ళకుండా త్రిసికిని చూస్తూ నిలబడిపోయాడు. ఆ చూపులకు త్రిసికి కోపగించుకోలేదు. ముడుచుకుపోలేదు! ఎప్పటిలా భావరహితంగా నిలిచిపోనూ లేదు.
ఆదరం వెల్లివిరుస్తోన్న చూపులతో అతడిని అభిషేకిస్తూ అంది.
"తుఎజమ్మ నక్ఖత్తం కహేహి?"
రవి, విష్ణువర్ధన్ ల టెంట్ లో అందరూ సమావేశమయ్యారు. విష్ణువర్ధన్ ప్రత్యేకించి ఆ టెంట్ విశాలంగా కట్టించడం వల్ల అందరూ కలిసి మాట్లాడుకోవటానికి ఆ టెంట్ అనుకూలంగా ఉంటుంది. పెద్ద టేబుల్ చుట్టూ కుర్చీలలో కూర్చున్నారు జెన్నిఫర్, విష్ణువర్ధన్ లు, అనిల, రవి, ప్రకాశం, టెక్నీషియన్స్, ఫోటోగ్రాఫర్, వగైరాలు...
"సూర్యనేత్రం కింద ఉన్న సమస్యలో మొదటి పాదం నాకు అర్థమయింది" అన్నాడు రవి.
అందరి కళ్ళూ అతడివైపు ఆశగా చూశాయి.
"ఇవాళ నృసింహస్వామిని దండలు తీసేసినప్పుడు చూశారా?"
గమ్మత్తుగా ఈ ప్రశ్నకి ఎవరూ వెంటనే సమాధానం చెప్పలేకపోయారు.
"నేను ఇక్కటి కస్టమ్స్ అబ్జర్వ్ చెయ్యటానికి వచ్చాను. నాకు మీ గాడ్ లో ఫెయిత్ లేదు" నిర్లక్ష్యంగా, కాస్త గొప్పగా అంది జెన్నిఫర్.
"నేను దేవాలయంలోకి వెళ్ళగానే భక్తిగా దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. హారతిచ్చినప్పుడు కళ్ళ కద్దుకుని, మనకి నిధుల రహస్యం దొరకాలని మొక్కుకున్నాను. కానీ, పూజారి దండలు తీస్తున్నప్పుడు మాత్రం, ఆ దండలు ఎవరెవరికిస్తున్నాడా అని పరిశీలించటంలో మునిగిపోయాను. ఇక్కడి వి.ఐ.పి.లెవరో తెలుసుకోవాలి కదా! ఆ రాస్కెల్ నాకు దండ ఇయ్యనేలేదు"
ఫక్కున నవ్వబోయి, ఆపుకున్నాడు రవి.
"హారతి భక్తిగా కళ్ళకద్దుకున్నాను!"
"పూజారి రాస్కెల్ నాకు దండియ్యలేదు" భక్తికి భలే నిర్వచనం!
"నేను చూశాను సార్. విగ్రహం చాలా ప్రాచీన కాలానిది. భుజాల దగ్గిర పై పాలిష్ పోయి లోపలి గరుకు శిల కనిపిస్తోంది" అన్నాడు ప్రకాశం.
"నాన్సెన్స్! పాలిష్ పోయినంత మాత్రాన ప్రాచీన కాలానిదని చెప్పలేం! ఏ దెబ్బలకయినా పాలిష్ పోవచ్చు. దెబ్బ తగలకపోతే ఆనాటి పాలిష్ ఎంత కాలమయినా, ఎండకి ఎండి, వానకి తడిసినా పోదు" అడ్డుకుంది అనిల.
"మిస్ అనిలా! మీరు చూశారా విగ్రహాన్ని దండలు తీసేసి నప్పుడు? ఏమైనా గమనించారా?" అడిగాడు రవి.
"చాలాసార్లు చూశాను. ప్రత్యేకించి గమనించటానికి ఏం ఉందీ? ఆ విగ్రహం ఆగమ శాస్త్ర ప్రకారం చెక్కినది! విష్ణుమూర్తికి సూర్యచంద్రులే రెండు నేత్రాలనే భావన ననుసరించి నృసింహస్వామి విష్ణుమూర్తి అవతారం కనుక, ఒక నేత్రం సూర్యుడుగా, మరో నేత్రం చంద్రుడుగా చెక్కాడు శిల్పి."
"అంతేనా మీరు గమనించింది? ఆ విగ్రహంలో నృసింహస్వామి ఊరు భాగాన కూర్చున్నది చెంచులక్ష్మి. నృసింహస్వామి శిరస్సులో ప్రత్యేకత గమనించారా! రెండు కళ్ళలో తేడా వుంది"
"చెంచుదొర ఒక కన్ను పశ్చిమాన తెరచుకున్నప్పుడు" అనిల విష్ణువర్ధన్ ఒకేసారి అన్నారు. అందరిలోనూ ఉత్సుకత ప్రవేశించింది.
"కిరాతుడి తల పువ్వు. అంటే చంద్రుడు కావచ్చు. కిరాతార్జునీయంలో శివుడే కిరాతుడయ్యాడు గదా! నాలుగు రేకులతో నవ్వినప్పుడు, అంటే-నాలుగు దిక్కులా వెన్నెల వ్యాపించినప్పుడు అని అర్థం చేసుకోవచ్చు. "రాకాశశి" అనే పదం వర్ణ సమీకరణం చెంది "రాకాసి" అయి ఉండొచ్చు. గోదావరి "గోదారి" లాగ. అంచేత పూర్ణిమా..."
రవి ఫక్కున నవ్వటంతో ఉత్సాహంగా చెప్పుకుపోతున్న అనిల వాక్ప్రవాహం ఆగిపోయింది, కోపంగా చూసింది.
"నా ఊహ తప్పా?"
"కిరాతుడి తలపూవు చంద్రుడు అనటం వరకు రైట్! మిగిలినవి అన్వయం కుదరటం లేదు సరిగ్గా. చెంచుదొర ఒక కన్ను చంద్రుడనే అనుకుందాం! కానీ పశ్చిమాన తెరచుకోవటం ఏమిటి? చంద్రుడు పశ్చిమాన ఉదయించడు గదా? వర్ణ సమీకరణం కారణంగా "రాకాశశి" "రాకాశి" అయిందనుకోవటం కూడా పొరపాటే! ఎందుకంటే 'రాకాసి' అనే పదం లోకంలో మరో అర్థంలో రూఢమై ఉంది. అలాంటప్పుడు వర్ణ సమీకరణం వల్ల ఈ రకమైన మార్పు రాదు. ఉదాహరణకి "ఫరవాలేదు" అనేదాన్ని కొందరు "పర్లేదు"గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మాట మరో అర్థంలో రూఢం కాలేదు గనుక, "గోదారి"లాగా "పర్లేదు"ని కూడా వాడుకోవచ్చు. అర్థం పూర్తిగా మారిపోయేలాగా వర్ణసమీకరణం ఎప్పుడూ జరగదు"
ఈ వాదన అనిల ఒప్పుకోక తప్పలేదు.
విష్ణువర్ధన్ నీరసపడిపోయాడు. అనిల ఉత్సాహంగా మాట్లాడుతుంటే అతడు "సూర్యనేత్రం" రహస్యం విడిపోయినట్లేనని సంబరపడిపోయాడు.
"డాక్టర్ రవీ? మన ప్రయాస అంతా వృధాయేనా? ఈ కొండ గుహ, గాలులూ తప్ప మనం ఏమీ తెలుసుకోలేమా?" నిరాశా, నిష్టూరమూ మేళవించి అన్నాడు.
"మీరిలా తొందర పడకూడదు సార్! ఇప్పటివరకు కూడా ఎవరూ అర్థం చేసుకోలేని పాత కాలపు లిపి విశేషాలు చాల ఉన్నాయి, ప్రయత్నిద్దాం."
టెంట్ ముందు జీప్ ఆగింది. సంభాషణ తాత్కాలికంగా ఆగిపోయింది.
వచ్చినవాడు, ఆ జంట గ్రామాలనేలుతున్న నారాయణ లిద్దరిలో ఎవరయి ఉంటారో అనుకున్నాడు రవి. ఎందుకంటే జీప్స్ ఉన్నవి వాళ్ళిద్దరికే!
స్వాగతం చెప్పటానికి విష్ణువర్ధన్ వెళ్తుంటే విధిలేక అతడితోపాటు నడిచాడు రవి.
జీప్ లోంచి దిగింది నారాయణులిద్దరిలో ఏ ఒక్కరూ కాదు. మేలి ముసుగులో ఉన్న విలసిత.
రాత్రి అంత పొద్దుబోయాక, జమీందారీ కుటుంబంలో స్త్రీ ఒంటరిగా జీప్ లో రావటం...
'ఈ గ్రామాలలో అన్నీ విడ్డూరంగానే వున్నాయి అనుకున్నాడు రవి.'
విష్ణువర్ధన్ గతుక్కుమన్నా, తన ఆశ్చర్యం అణచుకుని గౌరవం ఉట్టిపడేలా 'రండి? రండి?' అని ఆమెకి కుర్చీ చూపించాడు.
మహారాణిలా ఠీవిగా వచ్చి కూర్చుంది. మేలి ముసుగులో నుంచే మెరుపులు విరజిమ్ముతోంది ఆమె అందం.
అంత రాత్రివేళ ఒంటరిగా జీప్ లో తమ టెంట్ కి రాగలిగిన వ్యక్తికి మేలి ముసుగెందుకో అనుకున్నాడు రవి.
అనిల వైపు తిరిగి చిరునవ్వుతో "బాగున్నావా?" అంది విలసిత. ఏదో అపూర్వ మాధుర్యం ఆమె గొంతులో.
పెదవులు బిగించి తల ఊపింది అనిల. వాళ్ళిద్దరిమధ్య ఏదో 'టెన్షన్' ఉన్నట్లు తోస్తుంది ఎవరికైనా.
"ఎంతవరకూ వచ్చాయి మీ ప్రయత్నాలు?" రవిని ఉద్దేశించి అడిగింది.
ఆమె చూపుతున్న కుతూహలం ఏ రకమైనదో అర్థంకాక కొద్దిగా తికమక పడ్డాడు రవి. అయినా చెప్పాడు 'ఈ రోజు జాతరలో మీ నృసింహస్వామి నేత్రాలు చూశాను"