Previous Page Next Page 
నివేదిత పేజి 22


    సీత ఏమీ కలవరపడలేదు. అణుమాత్రమైనా భయపడలేదు. "ఏ పరాయి వ్యక్తి నాకు బోధించలేదు. మీరే....స్వయంగా మీరే చెప్పారు"అంది నిశ్చలమైన కంఠంతో.

 

    "నేనా? త్రాగుబోతుని కదా అని వేళాకోళం పట్టిస్తున్నావా?"

 

    "నేనేమీ వేళాకోళం పట్టించటం లేదండీ! మీరే.... ఎన్నోసార్లు నిద్రలో వేదితా వేదితా అని కలవరించారు. పేరు పిలిచి వూరుకోలేదు. మీ కలవరింతలవల్ల ఆమెమీద మీరు ఎంత వ్యామోహం పెంచుకున్నారో, ఆమెను గురించిన తలపుల్లో మీ మనస్సుని ఎలా నలిపేసుకుంటున్నారో అర్థమయింది."

 

    అతను హతాశుడై ఆమెవంక చూడలేక తలవంచుకున్నాడు.

 

    "అంతే కాదు. మీరింతగా ఆరాధిస్తున్న ఆమె ఫోటోలు కూడా చూశాను" సీత ఊరుకోకుండా అంది.

 

    కోపంతో అతని ముఖం ఎరుపెక్కింది. "నేను ఇంట్లో లేనప్పుడు దొంగచాటుగా నేను దాచుకున్న ఫోటోలు చూశావా? ఈ మాట బయటకు చెప్పటానికి నీకు సిగ్గులేదూ? పతివ్రతలాగా ఇన్ని కబుర్లు చెబుతావు! ఇదేనా నీ సభ్యత, సంస్కారం?"

 

    సీత అతని అరుపులకు చలించలేదు. అతని దగ్గరగా అలానే నిలబడి "నేను సిగ్గులేనిది, అసభ్యమైనదీ ఏమీ చేయలేదు. భార్యకు చెప్పటానికి భయపడి పెనిమిటి మానసిక వేదనతో, సంక్షోభంతో కుమిలిపోతూంటే, ఏ విధాన్నైనా సరే అతని దుఃఖానికి కారణం కనుక్కొని ఆ దుఃఖాన్ని రూపుమాప ప్రయత్నించటం భార్య కర్తవ్యం. నాకు చెప్పకుండా ఏదన్నా రహస్యం గోప్యంగా వుంచుకుంటే అది మీ తప్పు. దాన్ని వెలికితీయాలని ప్రయత్నించటం నా ద్రోహంకాదు. ఇది మీకెంత స్వవిషయమో, నాకూ అంతే స్వవిషయం. భర్తను త్రికరణశుద్ధిగా ప్రేమించే ఏ స్త్రీ అయినా యీ మాటే చెబుతుంది" అన్నది.

 

    ఆమె కంఠంలో నిశ్చలత విని అతడు విచలితుడయాడు. అయినా తన తొట్రుపాటును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ "భార్యాభర్తల సంబంధం అనీ, ప్రేమ అనీ చాలా కబుర్లు చెప్పావు. సరే, ఇన్నాళ్ళూ నేను మధనపడిన నా ఆంతరంగిక రహస్యం తెలుసుకున్నావు. బాగానే ఉంది. ఇప్పుడేం చేస్తావు చెప్పు" అన్నాడు.

 

    సీత అతని ముఖంవంక జాలిగా, దీనంగా చూసింది. ఆమె హృదయ కుహరంలో ఒకానొక భయం జరజర ప్రాకింది.

 

    ఉన్నట్లుండి అతని పాదాలమీదకు ఒరిగింది ఆమె. అతను తృళ్ళిపడి పాదాలను వెనక్కి లాక్కుంటూ "అదేమిటి? నా కాళ్లు పట్టుకుంటా వేమిటి? వదులు " అన్నాడు.

 

    సీత అతని పాదాలను వదలకుండా వాటిని తన చేతులతో గట్టిగా బంధించి, కన్నీళ్లతో అభిషేకం చేస్తూ "ఏమండీ! మీ గురించి మీరే కాకుండా నా గురించికూడా ఒకసారి ఆలోచించండి. మీ సుఖం, శ్రేయస్సు మీకంటే నాకెక్కువ అవసరం. ఏమండీ! మీరు పాపం చేస్తున్నారండీ. వేదిత గుణాన్ని మీరెరుగరు. ఆమెని చూసి పిన్నలు, పెద్దలు పవిత్ర భావంతో తలవంచుతారు. ఆమె ఎంత నిష్కల్మష హృదయో అంత దైవభక్తురాలు. ఎంత పునీతురాలో అంత నిప్పు వంటిది. మీరు ఆమెను గురించి పాపపు టాలోచనలు మానివేయండి. ఆమె శ్రేయస్సు కోరినవారికి ఆమె ప్రశాంత సాగరం. కీడు తలపెట్టిన వారికి ఈమె బడబాగ్ని. ఇంద్రియాలను జయించిన అతీతురాలామె ఆమె జోలికి పోయారంటే మీకు, నాకు మన కుటుంబానికి వినాశనం తప్పదు. ఆమె తన సేవలను భగవంతుడికి కైంకర్యం చేసిన త్యాగమయి. ఆమె మనస్సు, శరీరం ఆమెవి కావు, పరమేశ్వరుడివి. ఆమెను పాపపు దృష్టితో చూశారంటే మీరు అగ్నిలోపడిన శలభంలా మాడి, మసైపోతారు. నా మనస్సు కీడును శంకిస్తోంది. మీ వినాశాన్ని నేను భరించలేను. నా మాట వినండి. మనం యీ ఊళ్లో ఉండవద్దు. మీ యిష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోదాం. నా మీద మీరు ఆదరణ చూపనక్కర్లేదు. మీ పరిచర్యలు చేస్తూ, మిమ్మల్ని చూసుకుంటూ కాలం గడుపుతాను కాని యిది మాత్రం వద్దండీ - మీరు నాకు ఏ అన్యాయం చేసినా భరిస్తానుగాని - ఈ అన్యాయం మాత్రం చేయవద్దండి."   

 

    అతనికి మొదట ఏడుపు వచ్చింది. తర్వాత ఓ విధమైన నిర్లక్ష్యం ఆవహించింది. తర్వాత పిచ్చియెత్తినట్లు అయింది.

 

    పెద్దపెట్టున, వికటంగా నవ్వాడు. భుజాలెగురేశాడు. "పాపం, పుణ్యం, అన్యాయం, ద్రోహం - యివన్నీ నా ముందు గ్రుడ్డిగవ్వ విలువ చెయ్యవు. నేను నాస్తికుడ్ని. నాకు దేవుడు లేడు. సెంటిమెంట్ల మనుష్యులంటే అసహ్యం నాకు. సీతా! నా మనస్తత్వం నీకు వికృతంగా తోచవచ్చు. నన్ను భరించలేకపోతే విడాకులివ్వు. కాని నాకు యీ నీతి సూత్రాలు నూరిపొయ్యకు. సీతా! నువ్వంటే నాకు జాలి. కాని ఏం చెయ్యను? నీ కోసం నేను మారటానికి అంత శక్తి నీలోనూ లేదు. నాలోనూ లేదు. నేను చెయ్యి దాటిపోయాను సీతా! ఏం చేస్తానో, ఏం జరుగుతుందో నాకే తెలియదు!

 

    ఆమె తలయెత్తి అతని ముఖంలోకి చూసింది. యెర్రగా, అభేద్యమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రస్ఫుటపరుస్తూ కనిపించి ఆమెకు జీవితంలో ఎప్పుడూ వెయ్యనంత భయం వేసింది. హడలిపోయింది. ఆమె మనసు తీవ్రమైన ఆశుభాన్ని శంకించింది. గోడమీద దీపం గాలికి రెపరెపలాడుతోంది. అతని ముఖంమీద నీడలు కదులుతున్నాయి. ఆమె వంట్లోబలం నశించింది. శరీరం యెక్కడికో గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. ఆమె చేతులు అతని పాదాలమీదే ఉన్నాయి. అతను కాళ్లు లాక్కోటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె చేతులు జారిపోతున్నాయి. కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి.

 

    "కారణం యేమైనా కానీ, వేదితా! ఈ సమయంలో నువ్వు నా బద్ధ శత్రువు. నువ్వు అంతమైతేగాని నాకు శాంతిలేదు. నాకు అపకారంగా పరిణమించిన నీ ఉనికి నాకు పరమరోత, నువ్వు అంతంకావాలి. నువ్వు అంతం కావాలి."

 

    ఆమె ఆలోచనలలోని భయంకరత్వాన్ని ఆమే భరించలేకపోయింది "అమ్మా!" అని ఒక్కసారి మూలిగి అతని పాదాలమీదపడి మూర్ఛపోయింది.

 

                                           * * *

 

    మరునాడంతా సీత ప్రవర్తనలో అతనికి మార్పు కనబడసాగింది. అంతకు ముందు యెన్నడూ కనబడని తీవ్రత, మనిషిలో గాంభీర్యం అతనికి గోచరించసాగాయి. ఉదయం అతనికి కాఫీ అందిస్తున్నప్పుడూ, స్నానానికి రమ్మని పిలిచినప్పుడూ , తను స్నానంచేసి వస్తూండగా ఆమె యెదురు పడినప్పుడూ తనకు రోజూ కనిపించే సీతగాక - ఓ కొత్తవ్యక్తి, దారి తెలియని పాంధురాలు తారసపడినట్లయింది.

 Previous Page Next Page