Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 21


                                                          10


    క్లాసులో విద్యార్ధులందరూ రౌడీలుకాదు. సగానికిపైగా నిజంగా చదువుకుని బాగుపడాలనే వస్తారు. కానీ, అల్లరి మరిగిన విద్యార్ధులు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళను కూడా చదువుకోనియ్యరు- చదువుమీద శ్రద్ధఉన్న ఒక పాతికమంది విద్యార్ధులు చంద్రశేఖరం ఇంటికివచ్చి "సార్! మీరు చెప్పినట్లు ఎగ్జామినర్స్ కి నిజంగా కాపీకొట్టి వ్రాశారో, కాపీ కొట్టకుండా వ్రాశారో తెలుస్తుందా? కాపీ కొట్టకుండా వ్రాస్తే మంచి మార్కు లిస్తారా?" అని అడిగారు.
    చంద్రశేఖర్ సమాధానం చెప్పటానికి కొంచెంసేపు ఆలోచించ వలసివచ్చింది. పేపర్ చూడగానే అది కాపీకొట్టి వ్రాసిందో, కాపీ కొట్టకుండా వ్రాసిందో తెలిసిపోతుంది. అంతవరకూ నిశ్చయం-కానీ, కాపీకొట్టకుండా వ్రాసిన వాళ్ళకి ప్రత్యేకించి మంచి మార్కు లిస్తారో, లేదో, అన్నది తను నిశ్చయించలేదు__కానీ. చూస్తూ, చూస్తూ, చదువుమీది శ్రద్ధతో తన దగ్గరకు వచ్చిన విద్యార్ధులకు కాపీ కొట్టకుండా వ్రాసినందువల్ల ఏ ప్రయోజనమూ లేదని ఎలా చెప్పగలడు?
    "కాపీ కొట్టకుండా వ్రాస్తే ఎప్పుడూ ప్రయోజనం ఉంటుంది." అన్నాడు గడుసుగా, ఎటూకాకుండా-పాపం, అమాయకులైన విద్యార్ధులు ఆ మాటలను 'మంచి మార్కులు వస్తాయి' గానే అన్వయించుకుని వెళ్ళిపోయారు.
    పరీక్షలు దగ్గిర పడుతున్నాయి-తెలుగు క్లాసులకు పురాణం విన్నట్లు వినటానికి వస్తున్నారే తప్ప విద్యార్ధులలో ఏ ఒక్కరూ నోట్స్ వ్రాసుకోవటం లేదు.
    కథ విన్నట్లు వింటారేతప్ప ఏదీ నేర్చుకోరు-ఈ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించి చంద్రశేఖర్ "మీకు యెస్సే ఎలా వ్రాయాలో స్కేచ్ లా పాయింట్స్ ఇస్తాను. వ్రాసుకుంటారా?" అన్నాడు.
    "బోర్!-" అన్నాడు వెనకాలనించి ఎవడో.
    "బోర్! బోర్!" అని అరిచారు మరికొందరు.
    "పాయింట్స్ వ్రాసుకోవటం వల్ల మీకు చాలా లాభం ఉంది. పరీక్షలముందు మొత్తం పాఠం అంతా చదువుకో నక్కర్లేకుండా ఈ పాయింట్స్ చూసుకుంటే చాలు!"
    అల్లరిని అదుపులోకి తెస్తూ అన్నాడు చంద్రశేఖరం.
    చాలామంది పాయింట్స్ నోట్ చేసుకోవటానికి సుముఖులయ్యారు-అల్లరి విద్యార్ధులు కూడా పాయింట్స్ నోట్ చేసుకోవటం వల్ల కాపీ కొట్టి వ్రాయటం మరింత తేలికవుతుందని పాయింట్స్ వ్రాసుకోవటానికి సిద్ధపడ్డారు. చంద్రశేఖర్ పాయింట్స్ చెపుతున్నట్లుగా చెపుతూ, ఒక్కొక్క పాయింట్, వివరిస్తున్నట్లుగా మొత్తం పాఠం బోధపరచటానికి ప్రయత్నించేవాడు.
    మూడు వంతుల మంది తమకు తెలియకుండానే వినేవారు__ఇక అంతకంటె ఆ వాతావరణంలో తను చెయ్య గలిగినది లేదనుకున్నాడు చంద్రశేఖర్.
    పరీక్షలు ప్రారంభమయ్యాయి-ఆ పరీక్షలవంతు కేవలం ఒక ప్రహసనమే! పరీక్షలని ఒక్క విద్యార్ధి కూడా పుస్తకాల ముందు కూచుని చదవడు- పేపర్ ఔటవుతుందని రాత్రంతా ఊరిమీద తిరుగుతారు. ఎలాగో పేపర్ సంపాదిస్తారు-అప్పటికప్పుడు కూచుని అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చీటీలు తయారు చేసుకుని పరీక్షలకు హాజరవుతారు.
    పరీక్ష హాల్లో దర్జాగా ఆ చీటీలు చూసుకుని సమాధానాలు వ్రాసేస్తారు. ఇన్ విజిలేటర్స్ ఉంటారు. కానీ, వాళ్ళ పని అలా చీటీలు చూసి సమాధానాలు వ్రాసే వాళ్ళను చూస్తూ కూచోవటమే! అప్పుడప్పుడు విద్యార్ధికి ప్రశ్నకు సమాధానం పుస్తకంలో ఎక్కడుందో కూడా తెలియదు. అప్పుడు ఇన్ విజిలేటర్ నే తనకు సమాధానం ఎక్కడుందో వెతికి పెట్టమని అడుగుతాడు. ఇన్ విజిలేటర్ వెతికి పెడతాడు సాధారణంగా.
    మూర్తి చాలా హుషారుగా తన సబ్జెక్టులో అందరికీ సమాధానాలు చెప్పేశాడు. పుస్తకాల్లో, గైడ్లలో, ఎక్కడెక్కడున్నాయో చూపించాడు. విద్యార్ధులు మహోత్సాహంతో, పరీక్ష హాల్లో కూచుని చూసి వ్రాతలు వ్రాస్తున్నారు. అది కూడా చేతకాని ప్రబుద్ధులు కొందరు చూసి వ్రాయటంలో కూడా తప్పులు వ్రాస్తున్నారు.
    "ఇది మరీ దారుణం కదూ!...." అన్నాడు చంద్రశేఖర్ మూర్తితో.
    "దారుణం ఏముందోయ్! అందరూ చేస్తున్న పనేగా! మనం చెయ్యకపోతే ఎలాగ? మన కాలేజి ప్రిస్టేజ్ ఏమయిపోతుంది?"
    ధీరోదాత్త నాయకుడిలాగ అన్నాడు మూర్తి.
    'అందరూ చేస్తున్న పని....' 'కాలేజి ప్రిస్టేజ్....' ఈ మాటలకు సమాధానం చెప్పలేక పోయాడు చంద్రశేఖర్.
    చివరకు 'ప్రిస్టేజ్' కి అర్ధం ఎంతకు దిగింది?
    పరీక్షలు స్ట్రిక్టుగా సాగించాలని కొంత పైపై హడావుడి జరుగక పోలేదు. ప్రతి కాలేజికి పరీక్షలు ఎలా జరుగుతున్నాయో, పరీక్షించటానికి Flying squad వచ్చేది. అయితే, Flying squad రావటానికి ముందే వాళ్ళు వస్తున్నట్లు వార్త కాలేజికి అంది పోయేది. అందరూ ఎక్కడి పుస్తకాలక్కడ బయట పారేసి పరీక్షలు వ్రాస్తున్నట్లు నటించేవారు. వచ్చినవాళ్ళు లాంఛనంగా అటూ-ఇటూ తిరిగి వెళ్ళిపోయేవారు.

 Previous Page Next Page