ఆ గొంతులో భక్తి శ్రద్ధలు విన్నాక అతని మనసులో సందేహాలు బయటపెట్టలేక పోయాడు రవి.
అంతలో బెంచీ నెమ్మదిగా నేలమీదకు చేరుకుంది. కాషాయాంబధారి రవినీ, పిల్లవాడిని చెయ్యి పట్టుకుని దింపాడు.
"కళ్ళ గంతలు విప్పుతారా?" అడిగాడు రవి. తను ఎగిరి వచ్చిన ఆ వాహనాన్ని ఒక్కసారి చూడాలనే కుతూహలం అణచుకోలేక పోతున్నాడు.
"ఇప్పుడే కాదు?"
రవినీ, ఆ పిల్లాడినీ చెరొక చేత్తో పట్టుకుని కొద్దిదూరం నడిపించాడు. పక్షుల కలకలా రావాలు బాగా వినిపిస్తున్నాయి.
చివరకు కళ్ళ గంతలు విప్పాడు. కళ్ళు నులుముకుని చూశాడు రవి. సూర్యుడు అస్తగిరి చేరుకుంటున్నాడు. పక్షపాత రహితంగా ఆ కర్మ సాక్షి అందించిన నివేదిక అందుకుని సిగ్గుతో కందిపోతున్నట్లుగా ఉంది ప్రకృతి.
"అనంతమైన కాలవాహినికి ఈ క్షణం మాత్రమే శాశ్వతం కాదు. మళ్ళీ సూర్యోదయమవుతుంది. కర్తవ్య పాలనకు అవకాశమిచ్చే మరో రోజు వస్తుంది" అని ప్రకృతిని తన ఆర్ద్ర కిరణాలతో లాలిస్తున్నాడు లోకబాంధవుడు.
రవి ముందు కాలిబాట రెండు పాయలుగా చీలి వుంది. "ఎడమవైపు వెళ్ళండి ఆ కొండ మలుపు దాటితే నృసింహస్వామి లోయ."
రవి సమాధానం కోసం ఆగకుండా అడవిలోకి మాయమైపోయాడు కాషాయాంబరధారి.
ఏదో కలలోంచి మేల్కొన్నట్లుగా ఉంది రవి మానసిక పరిస్థితి. అనేక ఆలోచనలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఏ ఆలోచనా తోచటం లేదు.
ఇప్పుడు పిల్లాడే రవిని చెయ్యి పట్టుకు నడిపిస్తున్నాడు. అతడికా దారులన్నీ కొట్టిన పిండి!
జాతర అయిపోయినట్లుంది. అయినా గ్రామవాసులెవరు ఇళ్ళకి వెళ్ళలేదు. అందరూ రావి చెట్టు కింద గుమిగూడి ఉన్నారు. అనిల ఉంది. త్రిసికి కూడా అక్కడ చేరింది. ఏడుస్తున్న తల్లికి ధైర్యం చెప్తోంది.
"అమ్మా" అంటూ వెళ్ళి తల్లిని వాటేసుకున్నాడు పిల్లాడు. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు పిల్లాడిని తడిమి తడిమి చూసుకుంటూ "వచ్చావా? వచ్చావా?" అంటోంది తల్లి కన్నీళ్ళతో.
గ్రామవాసులు కూడా ఏదో విడ్డూరాన్ని చూసినట్లే చూస్తున్నారు.
"ఆస్పెటాలుకెళ్ళి బతికొచ్చినాడా?"
"డాకటేరు మందేసినాడా?"
"ఆడ డాకటేరున్నాడా?"
ఒకరిని మించి మరొకరు బుగ్గలు నొక్కుకుంటూ వింతగా అడుగుతున్నారు. నమ్మలేనట్లు చూస్తున్నాడు రవిని.
ఈ ప్రశ్నలతో టౌన్ హాస్పిటల్ చరిత్ర రవికి అర్థమయిపోయింది. ఈనాడు తనకెదురయిన అనుభవం ఒక్క ఈ నాటిదే కాదన్నమాట. ఈ గ్రామీణులంతా అలాంటి అనుభవాలు రుచి చూసినవారేనన్నమాట!
అందుకే వాళ్ళు హాస్పిటల్ లో డాక్టర్ వైద్యం కంటే త్రిసికి మంత్రాన్నే నమ్ముకుంటారన్నమాట! ఇలాంటి మూఢ నమ్మకాలతో చేజేతులా ప్రాణాలని...
చటుక్కున ఆగిపోయాయి రవి ఆలోచనలు. ఏవి మూఢ నమ్మకాలు? ఈ మూఢ నమ్మకాలు కాదని ఈనాడు తను సాధించినదేమిటి ఈ ఆధునిక సమాజంలో? చివరకు ఆ పిల్లాడు బతికింది దేనివల్ల?
అనుకోకుండా అతడి చూపులు త్రిసికి చూపులతో కలుసుకున్నాయి. ఆమె చాలాసేపటినుండి అతడిని చూస్తోంది. ఆ చూపులతో ప్రభావితుడు కావటం వల్లనే అతని చూపులు ఆమెవైపు తిరిగాయి. ఆ చూపుల నిండా వాత్సల్యం! చిరునవ్వులో అంతులేని ఆదరం, వీటినిమించి ఆ కళ్ళలో ఒక అవగాహన.
ఇదేమిటి? ఏం జరిగిందో త్రిసికి తెలుసా? ఆమె మంత్రగత్తె అని అందరూ అనే మాట నిజమేనా?
రవి కళ్ళలోని ప్రశ్నలకు సమాధానమా అన్నట్లు భావ రహితంగా వుండే త్రిసికి పెదవుల మీద చిన్న నవ్వు తెర కదిలి క్షణంలో మాయమైంది.
సంధ్య గడిచిపోయి చీకటి పడసాగింది. జనం ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరారు. ఎంతగా అలవాటయినా, అడవి దారుల్లో రాత్రిపూట తిరగదు. "రండి? మనమూ వెళ్దాం!" అంది అనిల రవితో. అప్పటికిగాని అనిల అక్కడ వున్నది తనకోసమేనని స్ఫురించలేదు రవికి.
ఆ అమ్మాయి సాహసానికి ఆనందం కంటే భయమే ఎక్కువ కలుగుతుంది అతనికి! ఈ పల్లెటూరి పెద్దల ప్రతీకార జ్వాలలు ఎలా వుంటాయో అతనికి తెలుసు!
జెన్నిఫర్ విష్ణువర్ధన్ లు వెళ్ళిపోయారు. ప్రకాశం వగైరాలు గ్రామాల్లోకి వెళ్ళారట! వాళ్ళని సహకార సంఘాల సుబ్బయ్య విందుకు పిలిచాడట.
"మీరు జెన్నిఫర్ వాళ్ళతో కాని లేదా దేవనారాయణ్ గారితో గాని వెళ్ళిపోయి ఉండవలసింది" నిజంగా నొచ్చుకుంటూ అన్నాడు. అతడి కంఠంలోని అసహనం అనిలని హర్ట్ చేసింది.
"సారీ! నాతో రావటం మీకు ఇబ్బందిగా ఉంటే మీరు వెళ్ళిపోండి. నేను ఒంటరిగా రాగలను"
చటుక్కున నిలబడిపోయింది అనిల. అతడిని ముందుకు సాగిపొమ్మన్నట్లు. ఆమెతో పాటు త్రిసికి కూడా ఆగింది.
అనిలకు కోపం వచ్చిందనుకునేసరికి గాభరా పడిపోయాడు రవి "నేను ఆ అర్థంతో అనలేదు"
"ఏ అర్థంతో అన్నా ఫరవాలేదు" సీరియస్ గా అంది అనిల. ఆ తీవ్రతకి తట్టుకోలేకపోయాడు రవి.
"రండి వెళ్దాం" బతిమాలుకుంటున్నట్లు అన్నాడు.
"నేను రాను!"
"సరే అయితే, నేనూ ఇక్కడే వుంటాను. ఇద్దరమూ ఇక్కడే కూచుందాం! ఈ సంగతి తెలుసుకుని దేవనారాయణ్ గారు తుపాకి తీసుకుని వస్తారు?"
నవ్వింది అనిల.
"అదా మీ భయం?"
"నాకోసం కాదు మీ కోసం! మన సమాజం ఆడపిల్లల మీద అపనిందలు వెయ్యటానికి ఎప్పుడూ కాచుకుని ఉంటుంది"
"మహాశయా! తమరు నా గురించి దిగులు పడక్కర్లేదు. మన సమాజం గురించి మీకు తెలిసినంత నాకూ తెలుసు. మీకు తెలీని మరో సంగతి ఉంది. త్రిసికి నాతో ఉన్నంతవరకూ ఈ రెండు గ్రామాల ప్రజలూ, మీరే స్వయంగా నా మీద అపనిందలు వేసినా నన్ను అనుమానించరు."
"ఎందుకని?"
"దీనికొక చిన్న కథ వుంది. ఈ రెండు గ్రామాలకీ కొద్ది దూరంలో 'త్రిసికమ్మ' దేవాలయం వుంది. ఆ ఆలయం పూజారికి ఓ రోజు త్రిసికమ్మ కలలో కనిపించి "రేపు ఉదయం నా అంశ గల నా భక్తురాలు నా దేవాలయానికి వస్తుంది. ఆమె నా వరం వల్ల మీ రెండు గ్రామాలకూ ఏ ఆపదా రాకుండా కాపాడుతుంది" అని చెప్పిందిట. మరునాడు ఈవిడ వచ్చింది దేవాలయానికి. సాధారణంగా దేవాలయంలోనే ఉంటుంది. గ్రామస్తులలో ఏ స్త్రీ ప్రసవ వేదన పడుతున్నా వెళ్ళి సుఖప్రసవం చేసి వస్తుంది. ఈవిడ చేతి చలవ గొప్పదంటారు. ఈ పల్లెటూళ్ళలో కొంతమందికి ఏమీ చదువుకోకుండానే ఇలాంటి వాటిల్లో నైపుణ్యం వస్తుంది. ఇంతేకాక ఇక్కడి గ్రామస్తులలో ఎవరికి జబ్బు చేసినా మంత్రజలం ఇచ్చి వాళ్ళ రోగాలను పోగొడుతుందట."
నడుస్తున్న వాడు చటుక్కున ఆగిపోయాడు "మంత్రజలం"
తనలో తను అనుకుంటున్నట్లు అన్నాడు.
"అవును, ఆవిడ దగ్గర కమండలంలో ఆ పూజా తీర్థం ఉంటుంది."
"కమండలంలో"