తన మనోభావాలు దాచుకోవటానికి అలవాటుపడిన మాధవరావు మాత్రం తన ఆశ్చర్యాన్ని బయట పడనీయలేదు. చిరునవ్వుతో బాపీనీడుని విష్ చేసాడు.
"మీ మాటే అనుకుంటున్నాం. మీకు నిండా నూరేళ్ళు ఆయుర్దాయం. మీరు కూడా ఉంటే బాగుండేదని."
"ఆహ్హహ్హ" అని నవ్వాడు బాపీనీడు. "నాకు నూరేళ్ళు ఆయుర్దాయం ఎందుకండీ" బ్రతికి ఏం చెయ్యాలి?" అన్నాడు.
"ఆహా అలా అనకండి. మీలాంటి వాళ్ళు దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఇంకా చెయ్యాలి.'
"మా దేముంది లెండి. చేస్తున్నది మీరు."
"ముందు మీరు చేస్తోంటే మీ వెనకాల మేమూ, మేం చెయ్యవలసింది చేస్తున్నాం."
కళ్ళు చిట్లించి చూడబోయిన బాపీనీడు చేతికి చిరునవ్వుతో ఫలహార పళ్ళెం అందించి "తీసుకోండి!" అన్నాడు.
బాపీనీడు , మాధవరావు ఇద్దరూ నామ మాత్రంగానే తిన్నారు. అప్పటికి రాగిణి కొంచెం కోలుకుంది. మామూలు వయ్యారాలు కురిపిస్తూ మాట కలిపింది.
"చూసారా! ప్రేమ ఉన్నచోట పిలిస్తే పలుకుతారు అని అంటారు. నేను మిమ్మల్ని తలుచుకున్నాను. మీరు వచ్చారు."
"ఇలా తలుచుకున్నప్పుడల్లా వస్తూనే ఉంటాను." గట్టిగా నవ్వుతూ అన్నాడు బాపీనీడు. అందులో వెటకారం ఎవరికైనా స్పష్టంగా అర్ధమవుతుంది. ఎంత ప్రయత్నించినా నవ్వలేకపోయింది రాగిణి.
బాపినీడు మాధవురావుతో మాటలు మొదలుపెట్టాడు. "శ్యామలాంబ గారు రాగిణికి పెళ్ళి చేసుకోవాలని ఉంది అని నాకు చెప్పారు. మొదట కొంచెం సందేహించినా చివరకు నేనే చేసుకుంటానని అన్నాను. స్త్రీ కోసం కాదు. స్త్రీలు , అందాలు బోలెడు బజార్లో దొరుకుతాయి. కుప్పలు తిప్పలుగా. ఇల్లు దిద్దుకోవటానికి ఒక ఆడదాని అవసరమూ లేదు నాకు. మా ఆవిడకే ఏమీ పనిలేదు. ఏందరో పనిమనుష్యులున్నారు. కానీ, రాగిణి లాంటి యువతిని ఒక్కతెను కాపాడినా, ఒక మంచి పని చేసినట్లే ననిపించింది. ఏముందండీ , ఇలాంటి వాళ్ళ జీవితాలు, ఈనాడు సొగసు వయ్యారాలు గుమ్మరిస్తుంటే ఆనందించి ఏదో ఇంత ముఖాన్న పారేస్తారు. రేపు వయసు మళ్ళాక వీళ్ళకు విలువేమిటి? రూపం ఆధారంగా బ్రతికేవాళ్ళకు ఆ రూపం నశించగానే ఏం రక్షణ? ఈనాడు అవసరమయి ఉపయోగించుకున్న వాళ్ళే ఆనాడు ఛీ కొడతారు. అనాటిదాకా ఎందుకూ, ఇప్పుడే ఛీ కొడతారు. పబ్లిక్ లో ఎదురయితే! రాగిణిని పెళ్ళి చేసుకోవటం వల్ల నేను ఎంతో అవమానం ఎదుర్కోవాలి అని నాకు తెలుసు! అందరూ "నీ కిదేం ఖర్మ!" అని జాలిపడుతున్నారు. అంతే మరి, ఒక మంచి పని చెయ్యాలంటే కొన్ని అవస్థలు ఎదుర్కోక తప్పదు. నావల్ల ఒక అభాగ్యురాలి మనసుకి కొంత అనందం కలిగితే ఫరవాలేదు నేను ఏమైనా తట్టుకుంటాను.'
తలపైకెత్తి అలవాటైన ధోరణిలో అహంకారంతో గర్వంగా నవ్వాడు బాపీనీడు.
ఆ ఇంట్లో అడుగుపెట్టాక అంత సేపటికి అప్పటికి రాగిణి ముఖంలోకి పరిశీలించి చూసాడు మాధవరావు.
రాగిణి కూర్చుంది అక్కడే. ఎక్కడికి కదలగలదు? వింది బాపీనీడు మాటలన్నీ. వినక? నవ్వింది! అంతే! అదొక్కటే చెయ్యగలదు మరి!
రాగిణి ముఖానికి క్రీం పూసుకుంది. ఆపైన ఫారిన్ పౌడరు అద్దుకుంది. కనుబొమ్మలు దిద్దుకుంది. పెదవులకు లేత ఎరుపురంగు లిప్ స్టిక్ ఖరీదైనది పెట్టుకుంది. వీటన్నిటినీ కరిగిస్తూ బిందెలతో బాపినీడు మాటలు గుమ్మరించిన కుళ్ళు నీటి చారలు ఆ ముఖం మీద, ఆ నవ్వులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అక్కడే ఉండి ఆ చిత్రహింస చూడలేక పోయాడు మాధవరావు.
"ఇంక వెళ్తాను." అని లేచాడు.
16
బాపినీడు సగర్వంగా అట్టహాసంతో తను చేసిన 'త్యాగాన్ని' వివరిస్తుంటే , నిస్సహాయంగా కూర్చున్న రాగిణి ముఖం మాధవరావుకు మరుపు రావటం లేదు. అంతకంటే కూడా మరొక విషయం అతణ్ణి ఆకర్షించింది. బాపినీడు మరునాటి వరకు రాడని చెప్పింది రాగిణి . అలాంటి వాడు ఆ సమయంలో రావటం కాకతాళీయమేనా? ఎందుకో అలా అనిపించలేదు మాధవరావుకి. ఆ విషయం నిర్ధారించుకోవాలనిపించింది.
వెంటనే రాగిణికి ఫోన్ చేసాడు.
మాధవరావు కంఠం విన్న రాగిణికి ఆనందంతో పిచ్చెక్కినట్లయింది. "మీరేనా?" నిజంగా మీరేనా?" అంది.
కలుక్కుమంది మాధవరావు మనసు. రాగిణి తన ఎదురుగా నిలబడి విలాసాలు గుమ్మరిస్తూ "మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అన్నప్పుడు ఏ వికారమూ కలగలేదు. కానీ ఈనాడు ఈ మాటలు వింటుంటే ఎలాగో అనిపించింది.
"అవును . నేనే! నువ్వోక్కసారి మా ఇంటికి రా? రాగలవా?"
"ఎందుకు రాలేను? తప్పకుండా వస్తాను. ఇప్పుడే వస్తాను."
ఫోన్ పెట్టేసి క్షణాలలో తయారయింది. గాలిలో తేలిపోతున్నట్లు ఇల్లు దాటగలిగింది. కాంపౌండ్ గేట్ దాటలేకపోయింది. గేటు దగ్గిర చౌకీదార్ "ఎక్కడికీ?" అన్నాడు.
నిర్ఘాంతపోయింది రాగిణి.
"ఎక్కడికో నీకు చెప్పాలా! గేటు తెరు!" అంది కోపంగా. వాడు నిర్లక్ష్యంగా , నిరసనగా నవ్వాడు.
"మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అయ్యగారు మిమ్మల్ని ఎక్కడికీ కదలనియ్యద్దని అన్నారు." తల గిర్రున తిరిగింది రాగిణికి.
ఎదురుగా రాక్షసుడిలా నవ్వుతూ చౌకీదార్.
తిరిగి ఇంట్లో కొచ్చేసింది. కోపంగా బాపినీడుకి ఫోన్ చేసింది.
రాగిణి గొంతు వినగానే బాపినీడు చికాకు పడ్డాడు.
"ఏం భార్యామణి! నీ మాయప్రేమ కాస్త తగ్గించు తల్లీ! నాకు పనులున్నాయి.'
"నన్ను బయటకు వెళ్ళనీయోద్దని చౌకీదార్ కి చెప్పారా?"
ఈ మాటలు వింటూనే విరగబడి నవ్వాడు బాపినీడు. "మహాతల్లివి ఎక్కడకు బయలుదేరావ్?"
"నేనడిగినదానికి సమాధానం చెప్పండి?"
"అవును. నేనే చెప్పాను. నువ్విప్పుడు బాపినీడు భార్యవి. ఊరి మీద పడి తిరగటానికి వీల్లేదు. నా మర్యాద నేను నిలుపుకోవాలి!"
"ఆ సంగతి నాకు చెప్పొచ్చుగా! ఆ చౌకీదారుతో చెప్పించటం దేనికి?"
"నీకు చెప్తాను, నువ్వు వింటావు? ఆహ్వాహ్వ! కనకపు సింహాసనమున కూర్చోబెట్టినా వెనుకటి గుణాలు పోవని నాకు బాగా తెలుసు. ఎటు తిరిగింది గాలి?"
ఫోన్ పెట్టేసింది రాగిణి.
శ్యామలాంబ సేవాసదనంలో చేరాక రాగిణి ఎప్పుడూ ఏడవలేదు. ఆనాడు కుమిలి కుమిలి ఏడ్చింది.
మాధవరావు తనంతట తను ఫోన్ చేశాడు. ఎన్నడూ ఎరగనంత ఆర్ద్రంగా మాట్లాడాడు. ఆ మాటలు వింటుంటే కేవలం ఆ పొడి మాటలు ..........ఏమిటి విశేషం లేని మాటలు కొద్దిపాటి ఆర్ద్రతతో వినిపించిన మాటలు వింటుంటే మనసుకు కలిగినంత హాయి ఏనాడు కలగలేదు. మాధవరావు తనను రమ్మన్నాడు. కానీ తను వెళ్ళలేకపోయింది. ఏదో భరింపరాని అశాంతితో రేగిపోసాగింది మనసు. తనను ప్రేమగా పలకరించే ఒక స్నేహ స్వరం వినాలనిపించింది. వెంటనే గుర్తుకొచ్చిన వ్యక్తీ లలిత.