Home » Yandamuri veerendranath » అష్టావక్ర


                          16

    "లేడీస్ అండ్ జంటిల్మెన్" అన్నాడు వైట్ షాడో.

    ఒక లక్షాధికారింట్లో ఏదో ఫంక్షన్ వుంటే తోటి జర్నలిస్టుతో పాటూ అతడూ వెళ్లాడు. మాటల సందర్భంలో అతడొ మెజీషియన్ అని తేలింది. దాంతో అందరూ అతని చుట్టూ మూగి ఏదైనా మ్యాజిక్ చెయ్యమని అడిగారు.

    కళ్ళజోడు తెల్లమ్మాయి బొద్దుగా, అందంగా వుంది. బాగా డబ్బుందేమో పొగరుగా కూడా వుంది. షాడో దృష్టి నాచురల్ గా ఆమె మీదే పడింది.

    "ఏం చెయ్యమంటారు మాడమ్" అని అడిగాడు నమ్రతగా.

    "మీకొచ్చింది చెయ్యగలరుగానీ, నేను చెప్పింది చేయగలరా?" అంది వ్యంగ్యంగా. అక్కడ అందరూ నవ్వేరు. మెజీషియన్లకి ఇలాంటి విసుర్లు మామూలే. షాడో నవ్వుతూ "పోనీ చెప్పకూడదా మాడమ్" అన్నాడు.

    "ఇదిగో ఈ సోఫాని ఇక్కణ్ణుంచి మాయం చెయ్యండి చూద్దాం".

    షాడో ఆ సోఫావైపు పరిశీలనగా చూసి, "దాన్ని చెయ్యలేనేమో గానీ, కావాలంటే ఇదిగో ఈ పదిపైసల బిళ్ళని మాయం చెయ్యగలను" అంటూ దాన్ని పక్కనున్న అసిస్టెంట్ నుదుటిమీద టాప్ మని అరచేత్తో కొడ్తూ-

    "చెక్ షాడో" అన్నాడు.

    అంతే పదిపైసల నాణెం మాయమైపోయింది. జనం క్షణంపాటు తెల్లబోయారు. ఇంతలో అసిస్టెంటు జేబులోంచి ఆ బిళ్ళ తీసి ఇవ్వటంతో జనం చప్పట్లు కొట్టారు.

    కళ్ళజోడు తెల్లమ్మాయి రోషంగా, "అసిస్టెంటు నా వాడైతే అతడి మీద నేనూ చెయ్యగలను ఈ ట్రిక్కు" అంది.

    "పోనీ మీ మీద చెయ్యమంటారా మాడమ్?" అంతే మర్యాదగా అడిగాడు.

    "చెయ్యండి చూద్దాం".

    పావలాకాసు తీసుకొని ఆమె తలమీద పెట్టి "చెక్ షాడో" అన్నాడు. కాసు మాయమైపోయింది. జనం మళ్ళీ చప్పట్లు కొట్టారు.

    ఆ అమ్మాయి ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే "ఏదీ నా పావలా?" అన్నాడు.

    "నాకేం తెలుసు?" అంది. "అదేమిటి? నా అసిస్టెంటు నాకు ఇచ్చెయ్యలే... అలాగే మీరూ ఇవ్వాలి. తొందరగా ఇవ్వండి" కంగారు పెట్టాడు.

    ఆమెచుట్టూ చూసింది. ఇద్దరూ తననే చూస్తున్నారు. కోపంగా "నా దగ్గిరలేదు. నాకు జేబుల్లేవు" అంది.

    "వెతకండి మేడమ్ పోనీ మీకు ఇక్కడ అభ్యంతరమైతే టాయిలెట్ లోకి వెళ్ళి..."

    అతడి మాట పూర్తికాలేదు. ఆమె ముక్కుపుటాలు అదురుతుండగా "యూ- ఇడియట్" అని అరిచింది. జనం పలు పలు విధాలుగా ఆలోచించి, నవ్వుకోసాగారు. ఇంతలో హోస్టు రావడంతో అందరి దృష్టి అటు మళ్ళింది. పార్టీ మొదలైంది.

    పది నిముషాలు గడిచాక, అందరూ పార్టీలో నిమగ్నమయ్యాక ఆ అమ్మాయి నెమ్మదిగా షాడో పక్కకి చేరింది.

    "పావలా కాసు ఎలా మాయమైంది చెప్పరా?" అంది లాలనగా పాత పగ మర్చిపోయినట్టు.

    "చాలా కష్టం మాడమ్. అదృశ్యకరణి అన్న దేవతని పదిహేను రోజులు ఆరాధించాలి".

    "మైగాడ్!"

    "పోనీ అంతకన్నా సులభమైనది మరోటి చెపుతాను నేర్చుకుందురు గాని, ఒక న్యూస్ పేపర్ ఇవ్వండి".

    ఆమె టేబిల్ మీద నుంచి పేపర్ తీసి అందించింది. "ఇందులో ఒక వార్త ఏదైనా చదవండి, ఉదాహరణకి" అంటూ చూపించబోయి, చప్పున ఆగిపోయాడు.

    అతడి మొహంలో మారే భావాలు చూసి, ఆమె "ఏమైంది" అని అడిగింది.

    "ఈయన....ఈయన..." అన్నాడు ఫోటో చూపిస్తూ.

    ఆమె అతడి చేతిలో పేపర్ తీసుకుని, చూస్తూ, "ఈయన- తెలియక పోవటమేమిటి? ఓహో, మీది ఢిల్లీ కదూ. ఆ ఊళ్ళోపెద్ద బిజినెస్ మాగ్నెట్ ఈయన. మొన్ననే మరణించారు. ఈయన కూతురు నా క్లాస్ మేట్".

    "గౌరి"

    "అవును. కేదారగౌరి, మొన్న వేసవిలో పెళ్ళయింది. ప్రస్తుతం కృష్ణాపురంలో వుంటుంది".

    "గౌరికి పెళ్లికూడా అయిపోయిందా?"   

    "అయింది. అన్నట్టు మీరేమిటి అలా వున్నారు, భవానీశంకరం గారు మీకు తెలుసా?"

    "తెలుసు".

    "ఎలా?"

    "ఆయన నా తండ్రి".


                          17


    అవతార్ బాబా!

    మరొక సైకిక్.

    బాబా చిన్నప్పటి పేరు కృష్ణుడు. తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు.

    ఒకసారి అతడి పిన్నమ్మ, తమ ఊరికి బయలుదేరబోతూ వుంటే "ఇప్పుడు వెళ్ళొద్దే" అంటూ ఏడుపు మొదలు పెట్టాడు. సాధారణంగా చిన్న పిల్లలకు బంధువుల హడావుడి అంటే వుండే ఉత్సాహంతో వాడన్న మాటలకి వాడి తల్లి కూడా వంత పాడింది. వాడి పిన్నమ్మ ఆ రోజు ప్రయాణం ఆగిపోయింది.

    అదేరోజు ఆ బస్సుకి ఆక్సిడెంట్ జరిగి, అందులోని వారందరూ చనిపోయారు.

    దాంతో వాళ్ళ పిన్నమ్మ నలుగురికీ కృష్ణుడే తన ప్రాణాల్ని రక్షించినట్టు ప్రచారం చేసింది. సరే- ఈ ప్రచారం అలా కొనసాగుతూ వుండింది.

    ఒకరోజు వాడు తల్లిని 'అమ్మా, నాన్న చచ్చిపోతే మనకందరికీ ఇలాగే' అని అడిగాడు. మాడు పగిలిపోయేటట్టు మొట్టికాయ వేసింది వాడి తల్లి. ఇది జరిగిన నాలుగు సంవత్సరాలకి వాడితండ్రి చనిపోయాడు. శవం ముందు గుండెలు బాదుకుంటూ, "చిన్నోడి నోటివెంట బ్రహ్మ పలికించినా నేను వినిపించుకోలేదురో దేవుడో" అంటూ రోదించింది. దాంతో వాడి బంధువర్గాల్లో కాస్త కుతూహలం ఏర్పడింది".

    అతడి నోటి నాలుక మీద బ్రహ్మో, సరస్వతో ఆడుతూందని ఏకగ్రీవంగా నిర్ణయించారు! తనలో నిజంగానే ఏవో వున్నదన్న భ్రమ కలిగింది వాడికి.

    ఆ వయసులోనే అతడి మనసులో కొన్ని విషయాలు నాటుకు పోయినాయ్!

    మొదటిది- అడిగేవాళ్ళకి సాధ్యమైనంత వరకూ మంచే జరుగుతుందని చెప్పాలి. పోతే టైమ్ ని కాస్త అటూ ఇటూ జరుపుతూ వుండాలి. ఎవరికీ చెడు గురించి చెప్పకూడదు. చెప్పినా అది తొందరలోనే పోతుందని చెప్పాలి. దేముని బిడ్డగా అది తన కర్తవ్యం.

    రెండోది- రోగంతోనే రొష్టుతోనో బాధ పడేవాడు ముందు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, అక్కడ తగ్గక ఆ తరువాత తమ దగ్గరికి వస్తాడు. అలాటి వారికి ఎన్ని చెప్పినా తలకెక్కదు. బాధ తగ్గటం ముఖ్యం. తన మీద వుంచిన నమ్మకమే ఆ బాధని తగ్గిస్తుంది. తనే వాళ్లని ఓదార్చి ఆదరించాలి. దేముడి బిడ్డగా అది తన కర్తవ్యం.

    ఈ విధమైన సెల్ఫ్-హేమ్యూసినేషన్ (భ్రాంతి) అతడికి బాగా లాభించింది. అయితే అప్పటికే అతడు తను దేవుడి అంశ అన్న భ్రాంతిలోకి పూర్తిగా వెళ్లిపోయాడు. హారతి వెలిగించి తన చుట్టూ తనే తిప్పుకునేవాడు. అగరొత్తులు వెలిగించి తన గుండెల దగ్గిర తనే పొగని స్వీకరించేవాడు.

    సంవత్సరాల తరబడి కడుపు నొప్పితో బాధపడే ఒకడు అతడి దగ్గరికి వచ్చి, అతడు ముట్టుకోగానే, ఎవరో తీసేసినట్టు నొప్పి పోయి బాగుపడటంతో అతడికి ఫెయిత్ హీలర్ అన్న పేరొచ్చింది. (ఎన్నాళ్ళ నుంచో ఆ నొప్పి వున్నవాడు అతడిమీద నమ్మకం పెట్టుకుని రావటంవల్ల అతడు ముట్టుకోగానే నొప్పి పోయిందన్న భ్రాంతి కలిగింది. ఆ భ్రాంతి ఒకటి రెండు రోజులు అతడిమీద పనిచేసి, తిరిగి మామూలుగా నొప్పి రావటం మొదలుపెట్టింది. కానీ నొప్పి తిరిగి వచ్చిందన్న వార్త కన్నా, వెంటనే తగ్గిందన్న వార్త ఎక్కువ ప్రాచుర్యం పొందింది.)

    ఆ తరువాత కృష్ణుడు 'అవతార్ బాబా' గా వ్యవహరించబడ్డాడు. అతడికీ కొంతమంది శిష్యులు, మందీ మార్బలం ఏర్పడ్డారు.

    పత్రికలో పడ్డ వింత శిశువుల జననం గురించిన వార్త చదివిన రోజు బాబా కలలో ఇంద్రుడు కనబడ్డాడు. ఐరావతం ఎక్కి వజ్రాయుధం చేతబట్టి - బాబాని వెంటనే కృష్ణాపురం వెళ్ళమని శాసించాడు.

    దేముడిచ్చిన ఆజ్ఞ ననుసరించి దేముడి పుత్రుడు ఆ మరుసటిరోజే శిష్యులతో సహా కృష్ణాపురం బయల్దేరి అక్కడ మకాం పెట్టాడు. కృష్ణాపురపు ప్రజల్ని దుష్టదేవతల బారినుంచి రక్షించుకోవటానికి అవతార్ బాబా తనతోపాటు శుద్ధి చేసిన మంత్రజలాన్ని తీసుకువెళ్ళాడు.


                                            *    *    *    *


    ప్రొఫెసర్ పుట్టన్న జెనెటిక్స్ డిపార్ట్ మెంట్ హెడ్ గా దాదాపు పది సంవత్సరాల్నుంచీ ఆ యూనివర్శిటీలో పని చేస్తున్నా చాలా మంది ప్రొఫెసర్ల లాగే అతడంటేనూ విద్యార్ధులకి గౌరవం లేదు. కేవలం తమ పనులు చేసుకోగలిగే లౌక్యం తెలిసిన విద్యార్ధులు మాత్రం అతడిని కాకా పడుతూ వుంటారు. జెనెటిక్స్ అన్న పదం'జి'తో మొదలవుతుందా- లేక 'జె' తో మొదలవుతుందా అని గట్టిగా నిలదీసి అడిగితే తడబడే ఆ ముసలి ప్రొఫెసరు చిరకాల వాంఛ 'అమెరికా' వెళ్ళటం. దానికి అతడు పలు విధాల ప్రయత్నం చేశాడు. కాని కుదర్లేదు.

    అదే సమయంలో అతడు "కృష్ణాపురంలో వింత జననాలు" అన్న వ్యాసం చదివాడు. వెంటనే అతడి తలలో ఏదో మెరిసింది.

    కొన్నేళ్ళక్రితం అతడేదో చౌకబారు ఇంగ్లీషు నవలలో, నీళ్ళలో కలిసిన మెర్క్యురీ (పాదరసం) లాటి పదార్ధాలు మ్యూటేషన్స్ కి దారితీసి, పిల్లలు అస్తవ్యస్తంగా పుడతారని చదివాడు. అంత పెద్ద జెనెటిక్స్ ప్రొఫెసరూ ఫ్యాక్టరీలనుంచి విసర్జితమయ్యే పదార్ధాలు కేవలం కేన్సర్, క్షయలాటి వ్యాధుల్ని కలిగిస్తాయే తప్ప, జీన్స్ మీద అంత పెద్ద ప్రభావాన్ని చూపించలేవని ఆలోచించలేకపోయాడు. అతడు చదివిన శాస్త్రం కన్నా- అతడు చదివిన నవల ఎక్కువ జ్ఞాపకం వుండటం అతని యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్ధుల దురదృష్టం! దౌర్భాగ్యం!! మొత్తంమీద ఇన్నాళ్ళకి తనకో అవకాశం ఇలా లభించినందుకు అతడు పొంగిపోయాడు. కృష్ణాపురం వెళ్ళి శోధించదల్చుకున్నాడు. 

    అమెరికాలో వున్న తన మిత్రుడికీ, భారతదేశంలో తనకి 'సహాయం' చేసే పరిచయస్తులకీ ఫోన్ చేసి, అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. "భారతదేశపు ఒక పల్లెటూళ్ళో ఇటీవలి విధి వైపరీత్యాలు"- అన్న విషయంమీద సైటో జెనెటిక్స్ ఆధారంగా తను తయారుచేయబోయే రిపోర్టు చదవటానికి అతడికి ఆహ్వానం లభించింది.

    మెరికల్లాటి తన స్టూడెంట్స్ ఇద్దరిని తీసుకుని (రిపోర్టు తను వ్రాయలేడు కాబట్టి) అతడు కృష్ణాపురం బయల్దేరాడు.

    మొత్తంమీద అన్ని వైపుల్నుంచి అతిరథ మహారధులు అందరూ- కృష్ణాపురం చేరుకున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఒక్కటే.

    ఉస్సోక్ వీళ్ళందరినీ గమనిస్తూంది!

    అవతార్ బాబా అక్కడికి చేరేసరికి ఆ ఊరు అట్టుడికినట్టు ఉడికిపోతూంది. ఒక చిన్న రూమరు వెయి రూమర్లయి, వేలు లక్షై పాకిపోతున్నాయి.

    మాస్ హిస్టీరియా మొదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. పూనకాలు ఎక్కువయ్యాయి. ప్రజలు భీతిల్లసాగారు. దేవాలయాల్లో పూజలు ప్రారంభమయ్యాయి. కొండదేవతలకి బలులు మొదలయ్యాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలున్న కుటుంబాలు కలత చెందసాగాయి. ఇంకో రెండు మూడు జననాలు యిటువంటివి కొనసాగితే కుటుంబాలు వలస వెళ్ళిపోవటం మొదలైనా ఆశ్చర్యపోనక్కరలేదు. మొత్తంమీద అప్పటివరకూ సుభిక్షంగా, ప్రశాంతంగా వున్న కృష్ణాపురం యిప్పుడు అనుక్షణం భయంతో భీతిల్లుతూంది. ఏ క్షణం ఏ వికృత శిశువు జన్మిస్తుందో అని కలవర పడుతూంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra