ఏంటీ...ఈ మేరువు. ఇలా ద్రవిస్తుందేమిటీ అనుకుందేమో ఆయాసంతో రోప్పుతూనే "ఏదీ...మన లల్లీ ఏదీ..." అంది.
పక్కలో బాంబుపడ్డట్టు అదిరిపడ్డాడు.
"బా...బాగుంది."
"ఎక్కడ..." గభాలున పైకి లేచి తూలి పడబోతుంటే ప్రసన్న ఆసరా ఇచ్చాడు. "చూడండి...లల్లీ...ఎక్కడ?" బ్రతికే వుందా?"
"ఉంది సబితా...లల్లీకేం కాలేదు."
"ఏదీ..." పసిపిల్లలా మారాంచేస్తూ అంది. "చూపించండి. ఉంటే నాకు...వెంటనే...ఇప్పుడే...ఇక్కడే..."
"తప్పకుండా చూపిస్తాను."
"ఎప్పుడు." ఆమె నొసలు చిట్లించింది. "ఎక్కడండీ! ఉంటే నా వరాలతల్లేదీ...నా చిట్టికొండెక్కడ... బ్రతికేవుంటే..."
"సబితా..." ఇప్పుడు ప్రసన్న అరుపులో ఆ గది కంపించిపోయింది. "వాట్స్ దిస్ నాన్సెన్స్... ఎందుకు నన్నిలా టార్చర్ చేస్తున్నావు...బాగుందని చెబుతుంటే వినిపించడంలేదూ...వై ద హెల్ యూ సస్పెక్ట్ మీ" తన నిస్సహాయత అతడి సహనాన్ని హరించి పిచ్చివాడ్ని చేస్తుంటే అస్థిమితంగా కేకలు పెట్టాడు.
సబిత పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి... పెదవులు ఓ వారగా వంగిపోతున్నాయి. ఒక నమ్మకమేదో సన్నగిల్లిన చివరి సాక్ష్యంగా ఆమె స్పృహతప్పిపోతూ గోడకి జారగిలబడింది.
ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి ఆగకుండా.
"అయామ్ సారీ మిస్టర్ ప్రసన్నా" ప్రసన్నని పక్కకు లాక్కుపోయాడు డాక్టర్. "మీరెందుకిలా ఆవేశపడుతున్నారో నాకు అర్ధంకావడం లేదు. షీ ఈజిన్ ఆన్ బేరబుల్ మెంటల్ ఏగనీ. ఇప్పుడు మీరు చేయాల్సింది కోపం తెచ్చుకోవడం కాదు...మీ పాపని తీసుకురావడం..."
ఎలా...ఎలా చెప్పగలడు పాప తన దగ్గర లేదని.
నగరపు ఆవలి ఒడ్డున చెదిరే కన్నులతో తనను చుట్టుకున్న లల్లీకూడా అమ్మకోసం యిలాగే ఆరాటపడినా గుండెపంజరపు నాడుల్ని త్రెంచుకుని ఏ విలువల వెలుగుల్లో తడవాలనో దూరంగా నెట్టి వెనక్కి తిరిగొచ్చిన తను ఈ తల్లి తపన ఎలా తీర్చగలడు.
అందరూ పాపులేకాని తానే భగవదాంశసంభూతుడన్న స్వాతిశయంతో తండ్రిగా తన బ్రతుకు సంధ్యాగగనంపై కోరి ఎర్రని ఆందోళన నింపుకున్న తానిప్పుడు ఏం చెప్పి ఈ తల్లిని ఓదార్చగలడు.
"పాప ఇక్కడ లేదు డాక్టర్..." సృష్టి చివరి శూన్యాన్ని చూస్తున్నట్టు కలలోలా అన్నాడు.
"ఎక్కడున్నా తీసుకురావాలి మిస్టర్ ప్రసన్నా. ఇట్సె మస్ట్ నౌ...ఇప్పుడామె సబ్ కాన్షన్ లో కంగారు పడుతున్నది పాప బ్రతికిలేదేమో అని...ప్లాసిబో ఇంజక్షన్ సైతం ఆమె ఆరాటాన్ని తగ్గించలేకపోయిందీ అంటే ఆమె పాపకోసం ఎంత ఆరాటపడుతూందీ అర్ధం చేసుకోండి...ఇంకా ఆలస్యం చేస్తే..." ఆర్దోక్తిలో ఆగిపోయాడు.
ప్రసన్న నిర్లిప్తంగా తలతిప్పి చూసాడు.
"ఇట్ మే లీడ్ టు ఇంటర్నల్ హెమరేజ్... ...పాము ప్రభావంనుంచి నెగ్గుకు రాగలిగిన ఆమెకిప్పుడు పాప లేదన్న భీతే హిమోటాక్సిన్ గా పనిచేసే అవకాశముంది. ప్లీజ్...హర్రియప్...
స్థాణువులా నిలబడిపోయాడు ప్రసన్న.
పరిస్థితి పూర్తిగా బోధపడినా పరుగెత్తలేదు...అసలు ఎక్కడికి వెళ్తాడని...వెళ్ళి ఏం చేయగలడని.
ఇప్పుడతడి మనస్సు హోరైజాన్ నుంచి వేగంగా ఒడ్డుకి వచ్చిన కెరటంలా విరిగి వెనక్కి ముందుకు పోతూంది.
ఆదర్శం కాక ఒక నిజాయితీతో అసాధారణమైన నిర్ణయం తీసుకున్న మహోన్నతుడైన వ్యక్తికిది నిజంగా బాధాకరమైన స్థితే.
* * * *
చీకటిలో మృత్యునాల్కలా ముందుకు దూసుకుపోతూంది అంబాసిడర్...
దాన్ని వెంటాడుతున్న పోలీసులు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు... అప్పటికే రెండు మూడు సార్లు వారి దృష్టి నుంచి తప్పించుకుంది.
ఎప్పటికప్పుడు వైర్ లెస్ లో కంట్రోల్ రూంలో ఆపరేషన్ స్వయంగా నిర్వహిస్తున్న కమీషనర్ కి తెలియచేస్తూనే వున్నారు.
వారికున్న ఆదేశాలు ముందు వెళుతున్న అంబాసిడర్ ని వెంటాడి ఎటు వెళ్ళేదీ తెలుసుకోవడమేతప్ప నిరోధించడం కాదు.
సుమారు గంటకి వంద కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ప్రత్యర్ధుల కారుని అనుసరించడం కష్టంగా వుంది.
ఆ నిశ్శబ్ద నిశీధి కార్ల రొదతో హోరుమంటూంది.
ఓ మలుపు తిరుగుతుండగా ఎదురైన లారీని ఢీ కొట్టబోయేంత ప్రమాదం వెంట్రుకవాసిలో తప్పిపోయింది.
అప్పటికే ముందుకెళ్తున్న అంబాసిడర్ అదృశ్యమైపోయింది.
అయిదు నిముషాలపాటు కారు వేగాన్ని పెంచి ముందుకువెళ్ళిన పోలీస్ సిబ్బంది హఠాత్తుగా ఓ చోట ఆగిపోయారు.
అక్కడ...
అప్పటికే రోడ్డువారగా వున్న చీకటి లోయలో పడిపోయిన అంబాసిడర్ సెగలుకక్కే నల్లని కంబళిలా మంటల్లో తగలబడిపోతూంది. ఒక యాత్ర అర్ధాంతరంగా ముగిసిన సాక్ష్యంగా.
* * * *
నిర్విణ్ణులై నిలబడి పోయారు డి.జి.పి., పోలీస్ కమీషనర్ కూడా...
ఓ పది నిముషాల క్రితమే హయత్ నగర్ చేరుకున్న పోలీస్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. అంబాసిడర్ లోయలో పడిపోవడం గురించి. చీకటి దట్టంగా ఆవరించి వుండటంతో కారుని సమీపించే అవకాశం లేకపోయిందని తెలియచేయడంతో అయిదు నిముషాల క్రితమే 'రెస్క్యూ టీం' పంపబడింది.
అది కూడా కాదు డి.జి.పి.ని అంతగా కదిలించింది.
అంత ప్రమాదం జరిగాక ఏ ఒక్కరైనా బ్రతికి వుంటారన్న ఆశలేదు...
ప్రసన్న తీసుకున్న అసాధారణమైన నిర్ణయంతో ప్రత్యర్ధుల మూలంగా కాక తమ తొందరపాటుతో పాప బలైపోయింది.
"గాడ్..." బాధగా కణతలు నొక్కుకున్నాడు. ఎందుకిలా జరిగింది...
ఒకవేళ తమను పోలీసులు వెంటాడుతున్నారన్న అనుమానంతో ప్రత్యర్ధి తప్పించుకునే ప్రయత్నంలో అంత రఫ్ గా నడిపి ప్రమాదాన్ని కొనితెచ్చికుని వుంటే ఈ దారుణానికి పూర్తిగా తనే బాధ్యుడు.
ఇలాంటి తెలివితక్కువ నిర్ణయం మూలంగా ఇప్పుడు ఒక తండ్రి త్యాగం నిష్పలమైపోవడం మాత్రమేకాదు... ... ప్రత్యర్ధిని ప్రత్యక్షంగా రెచ్చగొట్టినట్టయింది.
ఆయన అసహనంగా నలిగిపోతున్న సమయంలోనే ఫోన్ రింగయింది.
వెళ్ళిన రెస్క్యూ టీమ్ అప్పుడే ఆ ప్రదేశాన్ని చేరివుండదని తెలుసు. అయినా ఉద్వేగంగా అందుకున్నాడు రిసీవర్ని. ఒక్క చిన్నవార్త...లల్లీ బ్రతికే వుందన్న ఒక మంచి కబురు తెలిస్తే చాలు "యస్."
"బాస్టర్డ్స్" ఉలికిపడ్డాడు బ్లాక్ మాంబా గొంతు వినిపించగానే. "చర్చలు జరుగుతుండగా నేను దారుణాలు చేశానని యుద్ధనీతి గురించి నియమాల గురించి మాట్లాడిన మీరు చేసిందేమిటి ఒప్పందాన్ని ఉల్లంఘించి మా వాళ్ళని వెంటాడారు... పసికందు కాలి బూడిద కావడానికి మీరే కారణమయ్యారు..."
డి.జి.పి. నుదుట ముత్యాల్లా పేరుకుంటున్నాయి స్వేదబిందువులు.
"మిస్టర్ డి.జి.పి. నువ్వు నన్నెంత రెచ్చగొట్టావూ అంటే ఇప్పుడు అంటే సరిగ్గా మరికొన్ని క్షణాలలో చాలా ఖరీదైన నష్టానికి గురికాబోతున్నావు. ఆ దెబ్బ ఎంత బలంగా వుంటుందీ అంటే రాష్ట్రం మొత్తం పునాదుల్తో కదిలిపోతుంది. బహుశా నీ ఉద్యోగమే ఊడిపోతుంది. గెట్ రెడీ" అల్టిమేటమ్ ఇచ్చిన మరుక్షణం ఫోన్ క్రెల్ డిచేసిన చప్పుడు...
సరిగ్గా అప్పుడు గదిలో అడుగుపెట్టాడు ప్రసన్న.
వాతావరణం చాలా అసహజంగా వుంది.
ఇప్పుడు డి.జి.పి.లో అలజడి ఉధృతమైంది.
ఏమి జరిగిందీ ప్రసన్నకి చెప్పలేదు.
కాని వెంటనే ఏం జరగబోతున్నదీ అన్న విషయం గురించే ఆందోళనగా ఆలోచిస్తున్నాడు.
అప్పుడు టైం రాత్రి ఎనిమిదిన్నర కావస్తూంది.
* * * *
రవీంద్రభారతి ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది.
వేదిక విద్యుద్దీపాల కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోతూంది.
ముందు వరసలో కూర్చున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక ఎక్కి ఎప్పుడు మైక్ పట్టేద్దామా అన్నంత ఉద్వేగంతో నలిగిపోతున్నారు.
అతడి సమీపంలో వంది మాగధులైన మంత్రిమండలి ముఖ్య అనుచరులతోబాటు వెనుక ఆడిటోరియం ప్రేక్షకులకి బదులు పార్టీ కార్యకర్తలతో నిండిపోయి వుంది.
సరిగ్గా అప్పుడు లోపలికి ప్రవేశించిన కాంట్రాక్టరూ, ప్రముఖ పారిశ్రామికవేత్త శివానంద్ సరాసరి ముఖ్యమంత్రిని చేరి అభివాదం చేస్తుంటే లేచి నిలబడటానికి ఇదో అవకాశమన్నట్టు అమాంతం ముందు కురికిన ముఖ్యమంత్రి ఆయన్ని కావలించుకుంటూనే ప్రేక్షకుల్ని చూస్తూ చేతిని చేటలా వూపారు...