Previous Page Next Page 
ది సెల్ పేజి 19


                                        ఆఖరి లేఖ

    పబ్లిక్ గార్డెన్స్ లో ఆత్రుతతో ఎదురుచూస్తూ వుంది శ్రీలేఖ... ఎవరి రాకకోసమే?
    ఓ స్త్రీ ఆహ్లాదకరమైన ప్రకృతి - ప్రదేశంలో ఎవరికోసమో ఎదురుచూస్తుందంటే ఎవ్వరి మనస్సులోవన్న మొదటగా మెదిలే ఆలోచన "ప్రేమికుని కోసం". కాని శ్రీలేఖ విషయంలో అదిమాత్రం కాదు.
    శ్రీలేఖకి-శ్రీకాంత్ కి మధ్య గత మూడు నెలలుగా కలం స్నేహం ఉంది. ఈ వారంలో శ్రీకాంత్ పబ్లిక్ గార్డెన్ కు శ్రీలేఖను కలుసుకోవటానికి వస్తున్నట్లుగా ఉత్తరం రాశాడు. అందుకోసమే శ్రీలేఖ ఎదురుచూస్తుంది. అసలు శ్రీకాంత్ ను కలిసి మాట్లాడవలసిన వ్యక్తిగత విషయాలు ఉన్నాయి. అనుకోకుండా శ్రీకాంత్ తనే కలవాలంతూ రాయటం వలన శ్రీలేఖ, శ్రీకాంత్ ల కలయిక ఆ రోజు ఆ ప్రదేశంలో అనివార్యమయ్యింది.
    శ్రీకాంత్ రాగానే తన మనసులోని వ్యధనంతా వ్యక్తంచేసి అతనిని సలహా అడగాలనుకుంది. తన సమస్యకి అతను చక్కటి పరిష్కారం చెపుతాడన్న నమ్మకంతో ఉంది శ్రీలేఖ.
    శ్రీలేఖ మొదటిసారిగా శ్రీకాంత్ ని కలుసుకోబోతుంది. ఆమె మనస్సులో అనేక ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అతను ఎదురుపడగానే ఎలా గుర్తించాలి? ఎలా మాట్లాడాలి? ఎలా సంబోధించాలి. శ్రీకాంత్ ఇప్పటివరకు ఉత్తరాల ద్వారానే తనకి పరిచయం. అతని మనస్సుని, మనోభావాలని, అతని వ్యక్తిత్వాన్ని కేవలం ఉత్తరాల ద్వారానే చదివింది.
    ఎదురుగా వస్తున్న వ్యక్తి అడుగుల శబ్దానికి ఆలోచనల నుండి వాస్తవానికి వచ్చింది శ్రీలేఖ. అతన్ని చూడగానే శ్రీలేఖ ముఖం వివర్ణమయ్యింది. అప్పటివరకు ఆహ్లాదపరచిన ఆ పరిసరాలు చీమలు, జర్రేలతో నిండినట్లు కనిపించాయి. కోపం_ద్వేషం_పగ ఒకదానివెంట ఒకటి పోటీ పడుతుంటే నిస్సహాయురాలుగా మిగిలిపోయింది శ్రీలేఖ.
    "హలో బాగున్నారా?" - శ్రీలేఖ ఎదురుపడ్డ ప్రతిసారి అడిగేమాటే అది. ఇప్పటివరకు భరించింది. భరించక అబలగా ఓ రోడ్డు రోమియోను ఎలా ప్రతిఘటించగలదు? స్త్రీకి స్వేచ్చా సమానత్వం అన్న చట్టాలు నిజానికి ఉద్యోగం చేసుకునే స్త్రీకి ఏ రక్షణా కల్పించలేకపోతున్నాయి. ఒకవేళ వున్నా అవి కేవలం నామమాత్రమే.
    శ్రీలేఖ కాన్వెంట్ లో టీచరుగా జాయిన్ అయ్యి ఇప్పటికి మూడు నెలలు కావస్తుంది. ఆమె డ్యూటీలో జాయిన్ అయిననాటి నుండి అతను ఆమెను వెంబడిస్తున్నాడు. పోకిరీ వేషాలు వేస్తున్నాడు. ఆమెలోని సహనాన్ని పరీక్షిస్తున్నాడు.
    శ్రీలేఖకి ఈ ప్రపంచంలో నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. కాన్వెంట్ లో హెడ్ మాష్టారికి చెప్పుకుంటే తనని చులకనగా చూస్తారేమో? అన్న భయంతో చెప్పుకోలేకపోతుంది. పోలీసు రిపోర్టు ఇద్దామనుకుంటే ఉద్యోగం చేసుకునే స్త్రీకి ఎన్నాళ్ళు పోలీసులు రక్షణ కల్పించగలరు. అందుకే ఏదీ తేల్చుకోలేక, పెన్ ఫ్రెండ్ శ్రీకాంత్ ని శ్రేయోభిలాషిగా భావించి, తన సమస్య చెప్పుకుని అతని సలహా పాటిద్దామనుకుంది.
    జీవితం మహాసముద్రం లాంటిది. ఒడ్డుకు చేరాలంటే ఆటుపోటులకు తట్టుకోవాల్సిందే! అంత ఓపిక ఓర్మి వుండాల్సిందే! సమాజంలో తల ఎత్తుకుని తిరుగుతూ, తన కాళ్ళమీద తను నిలబడే స్త్రీకి సమస్యలు ఎదురవ్వక తప్పవు.
    ఉలుకు పలుకూ లేకుండా కూర్చున్న శ్రీలేఖ కళ్ళలో కళ్ళుపెట్టి చూస్తున్నవాడు కాస్త చొరవచేసుకొని శ్రీలేఖ ప్రక్కన బెంచిమీద కూర్చున్నాడు.
    పరిస్థితిని, పరిసరాలను గుర్తించింది శ్రీలేఖ. తను వున్న విషమపరిస్థితి అర్థంచెసుకొనటానికి ఎంతో సమయం పట్టలేదు. తనను తాను రక్షించుకునేందుకు చుట్టూ చూసింది. తన పిలుపు వినిపించేలోపులో ఎవరూ కనిపించలేదు. తను తెలివితక్కువగా ఒంటరితనంతోపాటు నిర్జీవంగా వున్న ప్రదేశాన్ని ఎన్నుకుంది.
    "చూడండీ...మీరు ఎవరో నాకు తెలియదు...తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు... తెలుసుకుందామన్న ఆకాంక్ష అంతకంటే లేదు_
    ...నా వెంటపడి నన్నెందుకు యిలా వేధిస్తున్నారు? మానసికంగా హింసిస్తున్నారు?..." కళ్ళవెంట నీరు ఉబికి వస్తుంటే పెదాల బిగువున అని క్షణం ఆగి వూపిరిపీల్చుకుని చెంగుతో ముఖం తుడుచుకుంది శ్రీలేఖ.
    "...జీవితంలో మోసపోయాను ఓ మోసగాడికి బలి అయ్యాను ఓ పిల్లకి తల్లిని అయ్యాను. అతను అప్పటికే ఇద్దరు పిల్లల తండ్రి. కన్నె అని చెప్పుకోనా? ఇల్లాల్ని అని చెప్పుకోనా? నన్ను నేను ఎలా సమర్ధించుకోను .... మీరు నా వెంటపడింది దేనికోసం. ఒకసారి తెలియక అమాయకంగా తప్పటడుగు వేశాను. దాని ఫలితం నరకం అనుభవిస్తున్నాను...తెలిసి మరలా ప్రేమపాఠాలు నమ్ముతాననుకున్నారా? బుల్ షిట్ డర్టీ లౌ"... శ్రీలేఖ గొంతు మూగబోయింది.
    అతను ఏదో చెప్పబోయాడు.

 Previous Page Next Page