ఆగర్భ శ్రీమంతురాలై పెరిగిన కోడలు, తనయింటికి వచ్చి కష్టపడునేమో? కుఱ్ఱవాడు ఎక్కడో ఉద్యోగమో, న్యాయవాదిపనియో చేసికొనును. వాడు సంపాదించుకొనకున్నను భగవంతుని కృపచేత వానికి అన్నవస్త్రములకు లోటు లేదు. దాసదాసీజనములు బెట్టి చేయించుకొను శక్తియున్నది. నారాయణ దుర్వ్యయములకు లోనుగాకున్న జాలును. ఎట్టికొఱతయు నుండదు. బుద్ధికి బృహస్పతియయిన తన కుమారుడు, కుటుంబమునకు విఖ్యాతి తెచ్చుచున్న తన నారాయణుడు సంపాదింపలేని అప్రయోజకుడగునాయేమి? ఈ రోజులలో బ్రాహ్మణులకు ఉద్యోగములు దొరకనిమాట నిజమే. సంపాదనకు వుద్యోగమే కావలయునాయేమి? చెన్నపట్టణములో న్యాయవాదియైన లక్షలార్జింపవచ్చును. కుమారునకు మొదటినుండియు 'లా' యన్న యసహ్యమనుట నిజమే. తన ప్రోద్బలము వలననే కుమారుడు ఎంత ఇష్టము లేకున్నను న్యాయకళాశాలలో ఏది ఎట్లయినను ఆ విషయముల దాను తర్కింపబనిలేదు. గాంధీతత్వపూర్ణుడైన నారాయణుడు, ఏదియు వలదని యన్నను సరియే. ఆలోచింపవలసినది కోడలి విషయమే.
ఆ బాలిక ఎట్టిది యగునో? సర్వసాధారణముగ నీ జమిందారీ కుటుంబములలో గర్వమెక్కుడు. జమిందారుల ఇంటి యాడుబిడ్డ తనవంటి సంసారి యింత నతుకుట కష్టమే. నీటి నుండి తీసిన చేపవలె తనఇంట బాధపడునేమో? కాని బుద్ధి తెలిసిన పిల్ల గావున ఆమె అభిప్రాయము తెలిసికొనక వియ్యంకుడు తన కుమారుని అల్లునిగా నిశ్చయించియుండడు. కోడలికి నారాయణపై ఆపేక్ష కుదిరియుండును. అందును నారాయణుడెట్టివారి హృదయమునైనను చూరగొనగల గుణసంపత్తిగలవాడు. బాలికలు వీనిని భర్తగా బడయుట తమ జన్మములకు సార్థకతయని సంతసించునంతటి రూపవంతుడు. ఇంతకు ఈ రాజ సంబంధము మంచికి వచ్చినదో, చెడ్డకు వచ్చినదో? అంతయు దైవాధీనము. ఎవరి ప్రారబ్దమెట్లున్నదో? ఆ పరమేశ్వరుని విలాసము లెవరికి దెలియును! నేటివరకు దానుపట్టినదెల్ల బంగారమగుటయే గాని ఒక్క కార్యముగూడ గలసిరాకపోవుట యన్నది లేదు. ఏనాటికే విచిత్రములు జరుగనున్నవో!
సుబ్బారాయుడు గారు గంభీర హృదయుడు. ధైర్యస్థైర్యము లాయన సొమ్ములే. చిన్ననాటనే తండ్రిపోయినను మనస్సు చెదరనీక నడిసంద్రమున నల్లాడు సంసార నౌకను చుక్కాని చేబూని చెక్కుచెదరకుండ గట్టున జేర్చినాడు. ఇతరులడెందములు నొవ్వకుండ న్యాయమార్గమున తన పితృస్వమును వేయిరెట్లు వృద్ధి చేసి పిల్లజమీందారుడనిపించుకొనినాడు. 'గోదావరికి అద్దరిని ఇద్దరినీ సుబ్బారాయుడు గారి మాటయు భీష్ముని మాటయు నొకటే' యనిపించుకొనినాడు. నేలమాళిగలో నసంఖ్యమై మూలుగుచున్న నగదులో నిరువదియైదువేల రూప్యములు కుమారుని పెండ్లికి వెచ్చించినాడు. తనయంతవాడైన పెద్దకుమారుని మనస్సేమనుకొనునోయని సందేహించనైనా లేదు.
శ్రీరామమూర్తికి వెచ్చపెట్టుటన్న దలనొప్పియే కాని, అవసరము వచ్చినప్పుడు మాత్రము వెనుదీయడు. తన నలుగురు చెల్లెళ్ళ వివాహములకు ముగ్గురు చెల్లెళ్ళ పునస్సంధానమహోత్సవములకు, బండుగలకు పబ్బములకు సుబ్బారాయుడుగారు లెక్కతెలియని ఖర్చు చేయుచున్నను శ్రీరామమూర్తి అడ్డుపెట్టలేదు సరికదా, తండ్రి మరచిపోయినచో దానే జ్ఞప్తిచేసి ఖర్చు పెట్టించెడివాడు.
సుబ్బారాయుడు గారు తాను వరశుల్కము గ్రహింపనని తొలుతనే స్పష్టమొనర్చుటచే, జమిందారల్లునికి నలువది యకరముల ఈనాము భూమి, తన జమిందారీలోనిది గాక, తనకున్న రైతువారీ భూములలోని సుక్షేత్రము, తణుకు తాలూకాలో తన గ్రామమునకు దగ్గరనున్న గ్రామములోనిది అరణ మొసంగినాడు. తన కుమార్తెకు నిరువది యకరముల భూమి వ్రాసిచ్చినాడు. మఱియు నిచ్చిన వస్తువాహనములకు లెక్కయే లేదు. ఆమె పేరున బ్యాంక్ లో ఏబదివేలు రొక్కము నుంచినాడు.
సుబ్బారాయుడుగారు కూడా పెద్దకోడలికిచ్చినట్లు పదివేలరూప్యములు చిన్నకోడలికాభరణముల నిమిత్తమిచ్చినారు.
గృహప్రవేశము
గృహప్రవేశమునకు పెండ్లికుమార్తెతో శకుంతలాదేవియు, జమిందారు గారి వేలువిడిచిన మేనకోడలు లలితయూ, వరదకామేశ్వరీ దేవి పుట్టినింటి చుట్టము సరోజినియు, జమిందారుగారి కుమారుడు కేశవచంద్రుడును వెళ్ళినారు. సుబ్బారాయుడు గారు తన చుట్టములందరిని పరునారురోజుల పండుగ వరకు నుండుడని కోరినారు. సుబ్బారాయుడు గారు బంధుసముద్రుడు. మర్యాదలు సలుపుటలో జనకమహారాజు. ఆయన బంధువులు, జానకమ్మగారి బంధువులు, బిడ్డల చుట్టములు గలపి మూడువందలమంది వివాహమునకై చేరినారు. వారిలో ఎక్కువ మాజమంహేంద్రవరము నుండియే వెళ్ళిపోయినారు. కొన్ని కుటుంబముల వారు కొత్తపేట వెళ్ళినారు. కొత్తపేటలో ఎనమండుగురు తెలుగు వంట బ్రాహ్మణులను ఇరువురు దాక్షిణాత్య బ్రాహ్మణుల నియమించి సుబ్బారాయుడు గారు వధూవరుల గృహప్రవేశ మహోత్సవము పెండ్లివలె జరిపినారు. ఒకనాడు కోనసీమలోని పెద్దలందరూ విందుకు ఆహ్వానింపబడిరి. వధువుతో నరుదెంచిన బంధువులకు రాజభోగము లర్పింపబడినవి.
వివాహమున నన్నియు ఖద్దరు వస్త్రములే యుపయోగించినారు మగ పెండ్లివారు. తప్పని సరియైనప్పుడు స్వదేశీ వస్త్రములు, పట్టువస్త్రములిచ్చినారు. ఆడపెండ్లివారు పెండ్లికుమారునికి, ఇతర మగవారికి ఖద్దరు వస్త్రములనిచ్చినారు. ఆడువారికి వారికి దోచినట్లు పట్టుచీరలు, రవికలు, విదేశీ చీరలు మొదలగునవి యొసంగినారు.
శారద అత్తవారి ఇల్లు విచిత్రముగానే యున్నది. తన తండ్రిగారి మేడలో నున్న సోఫాలు, మరదిండ్లకుర్చీలు లేవు. ఒకటి రెండు తివాసీలు చిన్నవి యచ్చట నున్నవేమో! తన మేడలో అన్నియు తివాసీలే. గోడలకెన్నో చిత్రములైన బొమ్మలు అచ్చట తగిలించి యున్నవి. చిత్రవిచిత్రముగా నగిషీలు చెక్కిన బల్లలు, మేజాలు, కుర్చీలు, బీరువాలు, అలమారులు, పనితనముగల వెండి, ఇత్తడి, రాగి బొమ్మలు చైనా దేశాపువి, ఆగ్రా, అజిమీరు, లక్నో ప్రాంతములవి, బర్మా కఱ్ఱ చెక్కడపు బొమ్మలు, లక్కబరిణలు, రవివర్మ బొమ్మలు, పాశ్చాత్య తైలవర్ణ చిత్రములు తమ పెద్ద మేడనిండా నున్నవి. తన తండ్రిగారిది, తాతగారిది, తల్లిది, బామ్మగారిది ఇంకను పూర్వీకుల బొమ్మలు దమ గదులనిండ నలంకరింపబడియున్నది. ఇచ్చటనో తన భర్తగది యొకటి మాత్రము చాలా అందముగా నున్నది. ఇల్లంతయు సూర్యకాంతం చూపించినది. భోషాణములట! తంజావూరి బొమ్మలట! మామూలు కుర్చీలు, పేము పడక కుర్చీలు, ఆ కుర్చీలపై మామూలు పరుపుదిండ్లు. తమ మేడయంతట తండ్రిగారు స్వంతముగా విద్యుచ్చక్తి దీపములు, వీవనలు పెట్టించినారు. అత్తవారింట లష్టరు దీపాలట, పెట్రోమాక్సు దీపాలట! ఛీఛీ! ఇది ఏమిటమ్మా!
శకుంతలా దేవి చెల్లెలిని జూచి 'ఒసే శారదా! మా అత్తవారి మేడలో మన మేడలోనున్నన్ని వింతలు విచిత్రాలు లేకపోయినా అదీ జమిందారీ కోటలాగే ఉంటుందే. కాని ఇలాంటి పల్లెటూరు కొంపలో పడ్డావేమిటే? వంద మంచాలూ, పరుపులూ ఉంటేమాత్రం జమిందారీ దర్జా వస్తుందటే? వచ్చి వచ్చి ఒక పల్లెటూరి వెంకయ్యగారి ఇంట్లో పడ్డావేమిటే? ఎంతో డబ్బుందట. చాలా భూమి ఉందట. ఏమి భాగ్యం? దర్జా పుట్టుకతో రావాలి గాని, తెచ్చిపెట్టుకుందామంటే వస్తుందటే?
'వీళ్ళ కట్లు, బొట్లు, మాటలు అన్నీ చాదస్తంగా ఉన్నాయి అక్కయ్యా.'