Previous Page Next Page 
నానీ పేజి 18


    నానీ చదివేస్కూల్లో క్లాస్ టీచర్ ని కలుసుకున్న యశస్వి హెడ్ మిస్ట్రెస్ ముందే నానీకి సంబంధించిన అతిముఖ్యమైన వివరాలు కొన్ని సేకరించగలిగాడు.

 

    "వయసుకు మించిన తెలివితేటలతోపాటు అమ్మన్నా, తాతయ్యన్నా చాలా ఎక్కువగా ఇష్టపడే మనస్తత్వం నానీది. అదికాదు నానీలో మిమ్మల్ని ఎక్కువ ఆకట్టుకున్న విషయం. బహుశా తాతయ్య ప్రభావమో, తల్లి పెంపకంలోని ప్రత్యేకతో అబద్ధమంటే గిట్టనివాడు నానీ... ఎప్పుడన్నా క్లాసులో "సత్యవాక్పరి పాలన" అన్న అంశం గురించి చెప్పమంటే హరిశ్చంద్రుడు మొదలుకుని శిబిచక్రవర్తిదాకా గడగడా చెప్పేసేవాడు. పిల్లలకేకాదు నానీ మాకూ చాలా కాలక్షేపం. హి ఈజ్ రియల్ పాజిటివ్ ఎగ్జాంపల్ ఫర్ చైల్డ్ హుడ్. అలాంటిది పాపం మానసికంగా చాలా దెబ్బతినేశాడు" అంతేకాదు. మరెన్నో యశస్వి ఆశ్చర్యపోయే విషయాల్ని కథలు కథలుగా చెప్పింది.

 

    అప్పుడు చూశాడు దూరంగా స్కూలువేపు నడుచుకొస్తున్న నానీని.

 

    దిగమింగుకోలేని ఏ బాధనో మోసుకొస్తున్నట్టు నడుస్తున్న నానీని చూస్తుంటే నిజంగా యశస్వికి మనసు తరుక్కుపోయింది.

 

    "నానీ అంటే ప్రత్యేకించి నాకూ ఓ ఇష్టంలాంటిది ఏర్పడి ఇలా వచ్చాను టీచర్. అంతకుమించి మరే విశేషం లేదు. నానీతో కొన్ని నిముషాలు మాట్లాడాలనుంది. కాస్త ఒంటరిగా... కెన్ యూ పర్మిట్ మి."

 

    ఒక పోలీసాఫీసర్ అలాంటి ఉత్సుకతను ప్రదర్శించడం అసహజంగా కనిపించినా హెడ్ మిస్ట్రెస్ ఆ విషయంగురించి లోతుగా ఆలోచించదలుచుకోలేదు.

 

    అందుకే ఖాళీగావున్న ఓ క్లాస్ రూమ్ లో కూర్చుని మాట్లాడుకునే అవకాశం కల్పించింది.

 

    "నానీ" యశస్విని చూడగానే గుర్తుపట్టేశాడు నానీ. "నేను పోలీసంకుల్ ని గుర్తుపట్టావా?"

 

    తలూపాడు.

 

    ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేసరికి ఆ మాత్రం ఆత్మీయతకు మొహం వాచిపోయినట్టు వెక్కివెక్కి ఏడ్చేశాడు.

 

    నిజమే...

 

    నానీ ఇప్పుడు రాత్రిళ్లు నిద్రపోవడంలేదు.

 

    అమ్మలేని ఇంటిలో అమ్మలా లాలించగలిగేవ్యక్తి దొరక్క ఉన్న తాతయ్య నోరు మెదపకుండ కళ్ళనీరు పెట్టుకుంటుంటే ఓదార్పు అందక రాత్రుళ్ళు కుమిలిపోతున్నాడు.

 

    మంచంపై పడుకుంటే తను రోజూ కాలువేసే అమ్మపొట్ట గుర్తుకొస్తూంది.

 

    అంతకుమించి అమ్మ తెలుసుకోమన్న 'జవాబు' మరీమరీ వేధిస్తూంది.

 

    "పాలు తాగేవా నానీ" ఖాళీగావున్న గదిలో నానీ కళ్ళు తుడుస్తూ అడిగాడు యశస్వి.

 

    "నేను తాగనుగా" మరోమారు రెట్టించాడు.

 

    "అవునుకదూ... మీ అమ్మ చెప్పింది."

 

    ఉలికిపాటుగా చూశాడు నానీ.

 

    "అవును నానీ... మీ అమ్మ నాకు అక్కలాంటిది కదా. రాత్రి కలలోకొచ్చి చెప్పింది" నానీని సైకలాజికల్ గా డీల్ చేయాలన్న సంకల్పంతో ముందు తను దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు "అనవసరంగా అబద్ధం చెప్పానూ అంటూ తెగ బాధపడిపోయింది."

 

    "కలలోకొచ్చా" నానీ కళ్ళలో అణువంత మెరుపు. "మరి అబద్ధమెందుకు చెప్పిందీ?"

 

    పాపం అందుకే బోలెడంత బాధపడింది. నిన్ను తలచుకుంటూ ఎంత ఏడ్చిందో తెలుసా?"

 

    నానీకూడా ఏడ్చేస్తున్నాడు.

 

    "అమ్మంటే నీకు చాలా ప్రేమట కదా."

 

    తలూపాడు.

 

    "అమ్మ ఏం చెబితే నువ్వది చేసేవాడివట కదా?"

 

    "అవును."

 

    "చెప్పింది... ఆరాత్రి..." నానీ కళ్ళల్లోకే చూస్తూ నెమ్మదిగా ఒక్కోపదాన్ని కూర్చుతున్నట్టుగా అన్నాడు యశస్వి. "ఆ... మంటల్లో అసలు- నువ్వు- పాలు- అడగలేదని- చెప్పింది."

 

    "నేను అడగలేదంకుల్."

 

    "అదే నేనూ అన్నానూ... ఏడ్చేస్తూ ఏమందో తెలుసా? అబద్ధమంటే మా నానీకి అసలు గిట్టదు. అందుకే వాడ్ని అడిగితే అంతా చెప్పేస్తాడు. వెళ్ళు తమ్ముడూ అంటే ఇలా వచ్చాను."

 

    అమ్మనే పదాన్ని ఉపయోగించి తెలివైన నానీ వయసుకి పరిమితమైన అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని యశస్వి యుక్తిగా వివరాల్ని ఎలా సేకరించాడూ అంటే అయిదునిముషాలలో మొత్తం కథ తెలుసుకున్నాడు.

 

    ఆ కథలో కామేశ్వరి మొదలుకుని సరళ, రాజారావు గురించేకాదు పావని కాలిపోతూంటే అంతా చూస్తూ ఎలా నిలబడిందీ, తను వెళ్ళబోతుంటే తండ్రి ఎలా ఆపేసిందీ అన్నీ చెప్పేశాడు.

 

    పూర్తిగా బోధపడిపోయి యశస్వి పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

 

    తన అంచనా తప్పుకాలేదు.

 

    పావని మరణించింది ప్రమాదంలో కాదు.

 

    ఒక పథకం ప్రకారం జరిగిన హత్యది!

 

    "చూడు నానీ" యశస్వి ఫైవ్ స్టార్ చాక్ లెట్ అందించాడు "ఇదంతా అంటే నేను నిన్ను కలిసింది మీ నాన్నగారికి చెప్పకూడదు."

 

    "ఎందుకు?" అమాయకంగా అడిగాడు.

 

    "ఎందుకంటే ఇవన్నీ మీ అమ్మ నిన్ను కోర్టులోనే అంటే తప్పు చేసినవాళ్ళని శిక్షించే జడ్జిగారుంటారే! వాళ్లముందుమాత్రమే చెప్పమంది. మీ నాన్నక్కాదు సరేనా?"

 

    "ఓ" తలూపాడు. "లేకపోతే అమ్మకి మళ్ళీ కోపమొస్తుందిగా!"

 

    "గుడ్... బహుశా మూడురోజుల్లో నువ్వు కోర్టులో ఇలాగే అన్నీ చెప్పాల్సి వుంటుంది. భయపడవుగా?"

 

    అడ్డంగా తలూపాడు భయపడనన్నట్లు!

 

    యశస్వి నానీకి ముద్దుపెట్టి వెళ్ళిపోయాడు.

 

    చాలా సునాయాసంగా వివరాల్ని సేకరించగలిగిన యశస్వి సాయంకాలానికల్లా సరళ, కాంతమ్మ, చంద్రాల పేరున సమన్స్ పంపాడు సరిగ్గా మూడు రోజుల్లో కోర్టుకి హాజరు కమ్మని.

 

    అప్పటికే ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ స్కూలుకివచ్చి నానీని కలిసిన విషయాన్ని తెలుసుకున్న చంద్రం ఎంత కంగారుపడ్డాడూ అంటే విచక్షణ కోల్పోయిన అతడు మరో అఘాయిత్యానికైనా సిద్ధాపడేట్టున్నాడు.

 

    సరిగ్గా అప్పుడు గదిలోకి అడుగుపెట్టాడు నానీ.      

 Previous Page Next Page