బెడ్ మీద పడుకున్నా నిద్రపోలేకపోయిందామె.
ఎంత వున్నా ఇంతకాలమూ కొంతేదో లేదనిపించింది ఎందుకో అర్దమవుతూంది.
" 'ప్రేమని 'పంచం' అని దాచుకుంటే అసంపూర్తిగా మారిపోతుందని ప్రపంచం'
ఎప్పుడో ఆమె చదివిన వాక్యాలు గుర్తుకొచ్చి అప్పుడు అర్దంకాని ఏ భావాన్నో ఇప్పుడు కొత్త కోణంలో చూస్తుంటే...
మండుతున్న ఖాండవవనంగా మనసుని ఇంతగా అంటించిన మనిషెవరా అని మరోసారి ఆలోచించింది.
తూర్పు సంధ్యలో విరిసే సుమదలంగాను వినిపించే సుమధుర గళంగానో దర్శనమిచ్చాడు రుత్వి.
* * * *
"హల్లో"
ఉదయం పది గంటల సమయం.......
పాయలుగా చీలిన సూర్యకిరణాలు బంగారు కెరటాల్లా నేలపై జారుతుంటే....
ఒక శ్రుతిలా వినిపించిన కారులోని కంఠానికి చకితుడై చూశాడు రోడ్డుమీద నడుస్తున్న రుత్వి.
ముందు పిలుస్తున్నదెవరో అర్దంకాలేదు.
అతడు అర్దం చేసుకునే లోగానే కారులో నుంచి బయటికి వచ్చింది విజూష.
"మీరా?" అన్నాడు తనూ ఆశ్చర్యంగా.
"నడుచుకుంటూ వెళుతున్నారేంటి?"
అడిగింది విజూష.
అది అడగాలని అడగటమో లేక తనను కలుసుకోవాలని వచ్చి కోరి పలకరించడమో తోచలేదు.
"మిమ్ముల్నే"
మృదువుగా నవ్వుతూ అంది మరోసారి.
"నడుచుకుంటూ వెళుతున్నారేం?"
ఇంకా రెప్పవాల్చకుండా చూస్తున్న రుత్విని చూస్తూ -
"కాళ్లున్నది నడవటానికేగా అని జవాబు చెప్పకండి" అంది.
"అబ్బే..... " తనూ నవ్వాడురుత్వి.
"నేనలా అనాలనుకోలేదు."
"మరి అంతగా ఆలోచిస్తున్నారేం?"
"గుర్తుకొచ్చింది"
"ఏమిటి?"
"చెప్పక తప్పదంటారా?"
"అవును"
నిన్న రాత్రి గ్రాండ్ పాతో ఎంత మొండిగా మాట్లాడిందీ గుర్తు చేసుకుంటూ అతడి నుంచి ఏమాత్రం అనుకూలమైన జవాబు వచ్చినా చాలు దేనికయినా సిద్దపడాలన్నట్టు
స్థిరంగా అంది.
"జవాబు చెబితే సంతోషిస్తాను.
"మీరు సంతోషిస్తానూ అంటే తప్పకుండా జవాబు చెబుతాను"
అతడి గొంతు గంధర్వగానమైన విజూష మనసుని తాకింది.
అదికాదు...
తనలాగే తన గురించి అతడూ ఆలోచిస్తున్నాడనిపించింది అరక్షణంపాటు.
"గిరి పుత్రి కడగంటి
మణిదీప్తి విరిసికొని
హిమశైల శిఖరమ్ము
కటకమ్ము నొరిసి కొని
నాలోన
లోలోన
గుండెలను చుట్టుకుని
బ్రతుకునే మలచుకుని
గళసీమ నవజాత
మకరంద ధారగా
మనసులో అరవింద
మోరలా వ్రాలగా
నాలోన
లోలోన
ఒక శ్రుతి
ఒక గతి..."
ఆగాడు క్షణం.
"అర్దం కాలేదు కదూ?' అడిగాడు రుత్వి.
"అవును."
ఆమె నేత్రాలు అరమోడ్పులయ్యాయి.
"నేను చెప్పింది నాది కాదు. తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి లోది"
తనని చూడగానే అతడు రవ్వంత పారవశ్యానికి గురయినట్టు మాత్రం బోధపడ్డ విజూష -
"మీరు అందంగా మాట్లాడతారు కూడా" అంది అతడ్ని వుత్సాహాపరుస్తున్నట్టుగా.
"నేను అందంగా మాట్టాడటమే కాదు అందంగా వుంటాను కూడా" క్షణం ఆగిన రుత్వి "అని అంటుంటారు అంతా" అనేశాడు.
'అంతా' అనే పదంలో విజూషకి ముందుగా ధ్వనించింది సశ్య.... తన శత్రువు.
తరలిపోవటానికి సిద్దంగా వున్న హిమగిరుల తరంగంలా అతడు కనిపిస్తుంటే సశ్యపై తను గెలవాలనిపించింది ఎలాగైనా సరే.