Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 19


    అజ్మరాలీ మోసం తెలియక- అదే గొప్ప వరంగా- అజ్మరాలీ వైపు కృతజ్ఞతతో చూశాడు జగదీష్. అతడు మిగతా భారతీయ సైనికులతో కలుపబడ్డాడు. యుద్ధఖైదీలు అందరూ ఒకే కుటుంబంలా కలిసి వుండేవారు. స్వదేశానికి దూరంగా, భార్యాబిడ్డల్ని ఎప్పుడూ కలుసుకోలేమన్న నిరాశా నిస్పృహలతో జీవచ్చవాలుగా బ్రతికే ఆ ఖైదీలకి - కేవలం తమ తోటి ఖైదీల మధ్య వున్నామన్న ఆశ ఒక్కటే చీకట్లో చిరుదీపం! జగదీష్ అంటే వారికి గౌరవం. అతడి విజ్ఞానాన్ని వాళ్ళు గౌరవించేవారు. అతడు కనుక్కున్న విషయం సామాన్యమైనది కాదని వాళ్ళకి తెలుసు. జగదీష్ వున్న సెల్ లోనే ఇస్మాయిల్ కూడా వుండేవాడు.

    శాంతి ఒప్పందం క్రింద అప్పుడప్పుడు ఖైదీల మార్పిడి జరిగేది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో రెండు దేశాల యుద్ధ ఖైదీలు విడుదల అయ్యేవారు. భారతదేశం వచ్చిన ఖైదీలు, అక్కడ చెరసాలలో వున్న జగదీష్ గురించి ప్రభుత్వానికి చెప్పారు. భారత ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. ఆ పేరు మీద ఎవరు లేరన్నారు. అది అబద్ధమని అందరికీ తెలుసు. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇండియా నుంచి వచ్చిన పది సంవత్సరాల క్రితం సరిహద్దునుంచి దొంగతనంగా జగదీష్ ని పాకిస్తాన్ కి రావాణా చేసిన అధికారిని మార్షల్ లా క్రింద ఉరి తీశారు. జగదీష్ భార్యకి, ఆమె భర్త బ్రతికి వున్నట్టు తెలియజేయటానికి ప్రయత్నించింది- ప్రభుత్వం! ఆమె అనాధ అనీ, ఎక్కడ వుందో తెలీదని అధికారులు తెలియజేశారు.

    ఈ టైమ్ లో పాకిస్తాన్ జైల్లో ఒక సంఘటన జరిగింది. ఇస్మాయిల్, జగదీష్ వున్న సెల్ లో వరుణ్ అనే యుద్ధఖైదీని వుంచారు. అతను ఈస్టరన్ సెక్టార్ నుంచి పట్టుబడ్డాడు. రెండు రోజుల పరిచయం తరువాత అతను విషయం చెప్పాడు. "నేను ఆర్మీనుంచి రాలేదు! ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చాను. మిమ్మల్ని తీసుకుపోవటానికి సైనికుడిగా నటించి యుద్ధంలో దొరికిపోయాను."

    వారంరోజుల తరువాత వాళ్ళ ఆపరేషన్ పూర్తయింది. వరుణ్ మొత్తం వివరాలన్నీ సేకరించాడు.

    ఒక వర్షం కురుస్తున్న చీకటి రాత్రి వాళ్ళు ముగ్గురు ఆ ఆర్మీక్యాంప్ నుంచి తప్పించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు సరిహద్దు దాటకుండానే దొరికిపోయారు. వాళ్ళు పారిపోవటం గమనించిన గార్డులు వెనుకనుంచి రైఫిల్ పేల్చారు. భారతదేశపు సరిహద్దు" కొండల అవతల కనిపిస్తూ వుండగా జగదీష్ కూలిపోయాడు. అతడి కాలులో గుండు దిగబడింది.

    "కాస్త ఓపిక తెచ్చుకోండి. అరగంటలో సరిహద్దు దాటేస్తాం" చెయ్యి అందిస్తూ అన్నాడు వరుణ్.

    "లేదు బాబూ. ఈ వయసులో నేనిక శక్తి సమకూర్చుకోలేను. మీరిద్దరూ వెళ్ళండి."

    "నేను వెళ్ళను" అన్నాడు ఇస్మాయిల్. "మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళను. గార్డులు చంపినా సరే."

    "అదికాదు...." జగదీష్ చెప్పబోయాడు.

    "మీరింకేమీ చెప్పొద్దు" ఇస్మాయిల్ దృఢంగా అన్నాడు.

    జగదీష్ వరుణ్ వైపు తిరిగి "నువ్వు పారిపో, ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ మనిషివని తెలిస్తే వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరు" అన్నాడు.

    "ఎలాగయినా సరే నేను మిమ్మల్ని తీసుకువెళతాను" దృఢంగా అన్నాడు వరుణ్.

    "అది అయ్యేపని కాదు. గార్డులు నాలుగువైపుల నుంచీ చుట్టు ముడుతున్నారు. కనీసం నీ ప్రాణాలయినా దక్కించుకో."

    దూరంనుంచి రైఫిల్ చప్పుడు ఇంకా వినిపిస్తూంది.

    వరుణ్ లేచాడు. "జగదీష్ గారూ మనిషికన్నా ముఖ్యం దేశం. మా డిపార్ట్ మెంట్ లో చెప్పే మొదటి పాఠం అది. సైన్యంలో కూడా అదే చెబుతారు. ఇక్కడ సెంటిమెంట్స్ కి విలువలేదు. ఈ ఫార్ములా మన దేశానికి ఎలాగయినా చేరాలి. నేను ప్రాణం పోయేవరకూ మీతోనే వుండి మిమ్మల్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తాను. ఛస్తే ఇద్దరం చద్దాం. ఇస్మాయిల్ మాత్రం సరిహద్దు దాటి వెళ్ళిపోతాడు. అతడి ద్వారా ఫార్ములా పంపించేద్దాం."

    జగదీష్ మొహంలో వెలుగు కనబడింది. దాదాపు పది సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి!

    వరుణ్ అన్నాడు- "ఇస్మాయిల్ సరిహద్దు దాటి వెళ్ళేవరకూ మనం ముగ్గురం ఇక్కడే వున్నామన్న భ్రమ అవతలి వాళ్ళకు కలగజెయ్యాలి. మీరు తొందరగా ఆ ఫార్ములా వ్రాయండి. నేను గార్డులని ఏమార్చే ప్రయత్నంలో వుంటాను" అంటూ కాగితం ఇచ్చి అక్కణ్ణుంచి చీకటిలో మరోవైపు వెళ్ళి అక్కణ్ణించి లోయలోకి రాళ్ళు విసరసాగాడు. కాల్పులు అటు మళ్ళాయి. అయిదు నిమిషాలు గడిచాయి.

    జగదీష్ సగం ఫార్ములా వ్రాశాడు.

    అంతలో చెట్ల వెనుక చప్పుడైంది. నలుగురు గార్డులు ఊహించని రీతిలో బయటకొచ్చారు. ఇస్మాయిల్ చేతులు ఎత్తి నిలబడ్డాడు. వరుణ్ ప్రాణాలకు తెగించినట్టు వాళ్ళవైపు పరిగెత్తాడు. ఒక గార్డుని కూలద్రోసి రైఫిల్ లాక్కుని మిగతా వాళ్ళమీద ఎక్కుపెట్టాడు. నలుగురు గార్డులూ సరెండర్ అయ్యారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.

    "వీళ్ళ గురించి మీరు ఆలోచించకండి. వ్రాయటం పూర్తిచేయండి" అన్నాడు వరుణ్.

    అప్పటికే జగదీష్ తను వ్రాసిన కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపేశాడు.

    వరుణ్ మొహం వాడిపోయింది. "ఏమిటిది?" అన్నాడు.

    జగదీష్ అన్నాడు- "నువ్వు పాకిస్తానీ ఇంటెలిజెంట్స్ ఏజెంటువి- అవునా?"

    అక్కడ సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం. దాన్ని ఛేదిస్తూ "ఏం మాట్లాడుతున్నారు మీరు?" అన్నాడు కంగారుగా వరుణ్.

    "నువ్వు గార్డులతో ప్రవర్తించిన విధానం చూస్తే నాకు అనుమానం వచ్చింది. మనల్ని చూడగానే గార్డులు ఎందుకు ఆగిపోయారు? నువ్వు దగ్గరికి వెళుతూంటే వాళ్ళు ఎందుకు కాల్పులు సాగించలేదు?" జగదీష్ ఆగి, మళ్ళీ అన్నాడు- "పది సంవత్సరాలు నన్ను ఒంటరిగా వుంచి హింసించినా నేను మీకేమీ చెప్పలేదు. అందుకే బహుశా మీరీ ఎత్తువేసివుంటారు. నన్ను మామూలు ఖైదీల్లో కలిపి, అదే సెల్ లోకి వచ్చిన యుద్ధఖైదీలా నువ్వు నటించావు. దేశభక్తి అనే సెంటిమెంట్ మీద నాటకమాడి నాతో ఈ ఫార్ములా విషయం చెప్పించటానికి ప్రయత్నించారు అవునా?"  

    వెనుకనుంచి చప్పట్లు వినిపించాయి. చెట్ల చాటునుంచి అజ్మరాలీ వచ్చాడు. "సరిగ్గా గ్రహించావు జగదీష్. నేను రాగానే చేసిన పని అదే. నీతో నిజం చెప్పించటానికి వేసిన ఎత్తు. ఇదిగో ఈ విధంగా వీరివల్ల ఫెయిలయింది" అంటూ జేబులోంచి పిస్టల్ తీశాడు.

    ఆ అడవిలో అతడి చేతిలో పిస్టల్ నాలుగుసార్లు ప్రతిధ్వనించింది. నలుగురు గార్డులూ నేలకూలారు.

    "తమ పోర్షన్ సరిగ్గా వెయ్యలేని పాత్రదారులు రంగస్థలం మీద అనవసరం." పిస్టల్ జేబులో పెట్టుకుంటూ అన్నాడు అజ్మరాలీ. వరుణ్ భయంగా అతడివైపు చూస్తూ "సారీ సర్! ఒక్కసారిగా నలుగురొచ్చేసరికి నేనేం చేయాలో అర్ధంకాలేదు" అన్నాడు. "నువ్వు చెయ్యగలిగింది ఏమీలేదు. ఏదయినా చేస్తే- అది ఇతడితో రహస్యం చెప్పించగలగటమే."

    "ఇక ఆ విషయం నాకు వదిలిపెట్టండి" వరుణ్ అన్నాడు.

    (అతడి అసలు పేరు ఖాన్ అని తరువాత తెలిసింది)

    ఇస్మాయిల్ నీ, జగదీష్ నీ తిరిగి ఆర్మీ క్యాంప్ కి తీసుకొచ్చారు. ఖాన్ ఇది తన ప్రిస్టేజిగా తీసుకున్నాడు. ఎన్నో రకాలుగా జగదీష్ చేత రహస్యం చెప్పించటానికి పూనుకున్నాడు.

    జగదీష్ చెప్పలేదు. అసలు మాట్లాడలేదు.

    అసలెవరితోనూ మాట్లాడలేదు. తనవాళ్ళు, పరాయివాళ్ళు, శత్రువులు, మిత్రులు ఎవరితోనూ మాట్లాడలేదు. ఒక మునిలా, నిశ్శబ్దంగా, మౌనంగా వుండిపోయాడు. తను నోరు విప్పి ఒక్క అక్షరం మాట్లాడినా దాన్ని శత్రువులు 'డీ కోడ్' చేస్తారేమో అన్నట్టు పెదవి కదపలేదు. దాహంతో గొంతు ఎండిపోతున్నా 'నీళ్ళు' అని అడగలేదు. పది సంవత్సరాల్నుంచి అతడి స్వరం ఉచ్ఛారణని మర్చిపోయింది. ఒకచోట ఒంటరిగా కూర్చోవటం, గార్డులు ఏదైనా పెడితే తినటం, లేకపోతే అలా వుండిపోవటం.

    అతడి కళ్ళు నిస్తేజాలయ్యాయి.

    అతడిని వృద్ధాప్యం ఆక్రమించింది.

    ఒక జీవచ్చవంలా...... మరణం కోసం ఎదురుచూస్తూ అలా శత్రు శిబిరంలో వుండిపోయాడు.

    ఇంకా అలాగే వున్నాడు.


                  *    *    *    *


    "అదీ బాబీ జరిగింది" పూర్తిచేశాడు ఇస్మాయిల్.

    రంగనాయకి నిశ్శబ్ద రోదన ఆ గదిలో శబ్దాన్ని భయపెడుతూంది. చైతన్య మోకాళ్ళ మీద చేతులాన్చి మొహాన్ని అరచేతుల మధ్య దాచుకుని చాలాసేపు వుండిపోయాడు.

    నిమిషం తరువాత ఆవేశంగా లేచాడు. "మొత్తం ప్రభుత్వాన్ని కదుపుతాను. నాకున్న పలుకుబడి అంతా ఉపయోగిస్తాను. డబ్బు వెదజల్లుతాను. నా తండ్రిని అక్కడనుంచి వెనక్కి రప్పిస్తాను."

    ఇస్మాయిల్ అడ్డంగా తలూపుతూ, "ప్రభుత్వం ఆ పని ఎప్పుడో చేసింది. ఎందరో సీక్రెట్ ఏజెంట్స్ ని పంపింది. కానీ, లాభంలేదు. అటువంటి సైంటిస్టు ఆ దేశానికి ఎంత అవసరమో, మన దేశానికి అతడు "దక్కకపోవటం" శత్రువులకి అంతే అవసరం. మన ప్రభుత్వం తరఫున మరీ ఎక్కువ వత్తిడి తెస్తే అతన్ని చంపేసి, రికార్డుల్లోంచి శాశ్వతంగా పేరు చెరిపెయ్యవచ్చు కూడా! జగదీష్ ఎప్పటికైనా నోరు విప్పుతాడన్న ఆశతోనే వాళ్ళు అతన్ని బ్రతికి వుండనిస్తున్నారు."

    "నేను వెళతాను. బాంబులు వేసి ఆ జైళ్ళు బ్రద్దలు కొట్టయినా సరే, నా తండ్రిని వెనక్కు తెస్తాను."

    "అదంత సులభం కాదు బాబూ! నీ కన్నా సమర్ధవంతులు, ఇటువంటి విషయాల్లో ఎంతో అనుభవం వున్న భారత గూఢచారులూ చాలా ప్రయత్నించి విఫలమయ్యారు."

    "అంటే... అక్కడికి చేరుకోలేకపోయారా? నా తండ్రిని కలుసుకోలేక పోయారా? ఆ జైళ్ళు అంత దుర్భేద్యమైనవా?"

    "దుర్భేద్యమైనవే. అయినా అదికాదు సమస్య."

    "మరి?"

    "నీ తండ్రి నమ్మడు. అసలు మాట్లాడనే మాట్లాడడు. ఇండియన్ ప్రెసిడెంట్ స్వయంగా ఉత్తరం వ్రాసి సంతకం పెట్టి 'ఇతడు మన సీక్రెట్ ఏజెంట్' అని చెప్పినా, నువ్వు స్వయంగా వెళ్ళి 'నేను మీ కొడుకుని' అని చెప్పినా నమ్మడు. ఇందులో ఆయన్ని తప్పుపట్టలేం. జరిగిన సంఘటనలు అలాంటివి. ఆనాడు సీతకోసం రాముడు పంపిన గుర్తులాంటిది ఏదైనా వుంటే తప్ప ఆయన్ని నమ్మించటం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అలాంటి గుర్తుని కూడా నమ్మడు."

    ఆ గదిలో చాలాసేపు నిశ్శబ్దం తాండవించింది.

    ముగ్గురూ ఏమీ తోచనట్టు అలాగే మౌనంగా వుండిపోయారు. చైతన్య పచార్లు చేస్తున్నాడు. చాలా అసహనంగా, చిరాగ్గా, మధ్య మధ్యలో తనలో తనే ఏదో గొణుక్కుంటూ తల విదిలిస్తూ... నడుస్తున్నవాడల్లా చటుక్కున ఆగాడు.

    అతడి దృష్టి తన తల్లిమీద పడింది.

    తల్లి!!!

    తన తండ్రి నమ్మే ఏకైక గుర్తు.

    "నేను నాతోపాటు అమ్మని తీసుకు వెళతాను"

    అతడు క్లుప్తంగా అన్న మాటలు అర్ధం కావటానికి ఇస్మాయిల్ కి కొద్ది క్షణాలు పట్టింది.

    ఇస్మాయిల్ దిగ్భ్రమతో లేచాడు.

 Previous Page Next Page