Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 19


    ఇప్పుడామె గొంతు కొద్దిగా వణికింది. "మీ కోసం వెయిట్ చేస్తుంటాను."

    "వెయ్యి కళ్ళతోనా" నవ్వేసి "అదే పదివేలు" అన్నాడు. "కాని ఆ తర్వాతయినా ఒక విషయంలో గట్టిగా హామీ ఇవ్వలేను."

    "ఏమిటది?" సాలోచనగా అంది.

    "జారిపోకుండా లుంగీ కట్టుకోగలనని."

    జీపు కదిలింది...ఆ జీపునిప్పుడు ప్రసన్న నడుపుతున్నాడు. అతని ప్రక్కగా లల్లీ, జయేంద్ర కూర్చున్నారు.


                         *    *    *    *


    సిటీకి దూరంగా హయత్ నగర పదహారో మైలురాయి దగ్గర జీపు ఆగింది.

    క్షతగాత్రి అయిన వృద్ధనగరంలా చీకటి చత్వారపు కళ్ళతో చూస్తూంది. రాత్రి గుండెమీదలేచిన మంటల్లా పరిసరాల పొదల్లోనుంచి మిణుగురులు కదులుతున్నాయి. గర్భంస్రావం అయిన నిశ్శబ్దంలా కీచురాళ్ళు రొదపెడుతున్నాయి.

    రోడ్డుకిరుప్రక్కలా పొదలు. పొదలవెనక చెట్లు చలిదెయ్యాల్లా తలలూపుతూ. దూరంగా కొండల్ని తాకిన గాలికెరటాలు గుండెలర్చే వ్యధతో దూసుకొస్తున్నాయి.

    అదే బ్లాక్ మాంబా చెప్పిన ప్రదేశం.

    ప్రసన్నకి తెలుసు ఆ చుట్టుప్రక్కల ప్రత్యర్ధుల మనషులుంటారని. జయేంద్ర జీపు దిగుతూ లల్లీని అందుకోబోతుంటే "నేనెందుకూ" అంది కంగారుగా.

    "కథ చెబుతానన్నానుగా..."

    "డాడీ" దీనంగా తండ్రిని చూసింది. "వద్దు డాడీ. నేను నీతో వచ్చేస్తాను. నాకు భయమేస్తూంది."

    గట్టిగా ఏడుస్తూంది.

    ప్రసన్న మనసు మెలిపెడుతూంది.

    ఒక వేళ లల్లీ తిరిగి రాకపోతే ఇదే ఈ పిలుపే తను చివరగా వినేది.

    ఏం చేస్తున్నాడు తను. ఒక స్మశాన వైరాగ్యంలాంటి భావం తృటిలో మెరిసి మాయమైపోయింది.

    ఉన్మాదిగా మారి వున్న ఒక్క బంధాన్ని తెంచుకుంటూ కన్నతండ్రైకూడా తనే కసాయివాడై బిడ్డని కత్తుల బోనులోకి పంపుతున్నాడు కదూ....

    వినలేకపోతున్నాడు లల్లీ ఏడుపుని...మరో క్షణం వుంటే ఓడిపోయేట్టున్నాడు. జయేంద్ర చేతుల్లోవున్న లల్లీ కాళ్లూ చేతులూ విదిలించుకుని ఏడుస్తూంది "ఏం చేస్తావు డాడీ...నన్నెందుకిక్కడ వదిలేస్తున్నావు? మరి మమ్మీ..."

    మెదడు నరాలు తెగిపోతున్నాయి. నెమ్మదిగా జీపువేపు నడుస్తుంటే "డాడీ" పరుగున వచ్చి చుట్టేసింది? "నన్ను ఇచ్చేయకు డాడీ! నేను నీమంచి లల్లీనిగా డాడీ! నన్ను వదలొద్దు డాడీ..." అసలిదంతా ఏమిటో అర్ధంకాని లల్లీ గుండెలార్చేలా కుదిపేస్తూంది. వ్యవధి లేదు. ప్రత్యర్ధిచ్చిన గడువు దాటి అప్పటికే అయిదు నిముషాలైంది.

    ఒక ప్రక్క జయేంద్ర లల్లీని బుజ్జగించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు చూశాడు జయేంద్ర-ప్రసన్న కళ్ళలోనుంచి నీళ్ళు జలజలా రాలుతున్నాయి.

    "ప్రసన్నగారూ....." జయేంద్ర గొంతులో అనూహ్యమైన ఆర్ధ్రత "ఎప్పుడో చదువుకున్నాను లేగదూడకి పాలిచ్చి వచ్చాక తను ఆహారంగా మారతానన్న ఆవూ, పులీ కథని. ఇక్కడ మీకేమీ కాని మనుషులకోసం అంతా అర్పించటానికి సిద్ధపడుతున్న మిమ్మల్ని చూస్తూంటే నా బ్రతుకు ఇంతకాలం ఎంత నిస్సారంగా గడిపిందీ అర్ధం చేసుకుంటూ ఒక్క హామీ మాత్రం ఇస్తున్నాను. ఒక పోలీసాఫీసర్ గా మీ గెలుపు గురించి చెప్పలేనుగాని పాపకి తండ్రిగా మీకు ఓటమి లేకుండా చేస్తాను. బై" జీప్ కదిలింది.

    ఇప్పుడు పాప నిస్సహాయపు ఆర్తనాదంతో ప్రకృతి ప్రతిధవనించిపోతూంది. స్థాణువులా నిలబడ్డ జయేంద్ర చూస్తుండగానే రివర్స్ చేయబడిన జీప్ పట్నంవేపు దూసుకుపోతూంది.

    అతడు అలా నిలబడి వుండగానే పొదలమధ్యనుంచి ఓ కారు వేగంగా రోడ్డుపైకి వచ్చింది.

    చీకటిలో దెయ్యాల్లాంటి నాలుగు ఆకారాలు క్రిందికి దిగి జయేంద్రని సమీపించాయి.

    అతడు ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు. ఇద్దరు వ్యక్తులు అతడిని ఒడిసి పట్టుకుని వుండగా మరో వ్యక్తి భుజంలో గుచ్చాడు. ఏదో ఇప్పుడు లల్లీని అందుకున్నారు. మరో ఇంజక్షన్ పాపభుజంపై... తను ఏ తప్పు చేశానో తెలీని లల్లీ అరణ్యరోదన చేస్తూనే క్రమంగా మగతలోకి జారిపోతూంది.

    రెండు నిముషాల్లో జయేంద్రకి బోధపడింది. ప్రయాణంలో పరిసరాల్ని గమనించకుండా హెవీ డోసెస్ లోనే సెడేటివ్స్ ఇచ్చిన విషయం. ఇప్పుడు అతడి కళ్ళు బరువుగా వాలిపోతున్నాయి.

    ఇద్దర్నీ కారులోకి నెట్టేరు. జయేంద్రకి కలగా గుర్తుంది. కారు విజయవాడవేపు దూసుకుపోతూందని.

    కారుకి అభిముఖంగా వస్తున్న మరో టాక్సీలో హైద్రాబాద్ వేపు సాగిపోతున్న వ్యక్తి అది గమనించిన సూచనగా అప్పటికే మరో అయిదు కిలోమీటర్ల అవతలవున్న ఇంకో కారులోని వ్యక్తితో వైర్ లెస్ లో మాటాడేడు.

    "కారు విజయవాడవేపు సాగిపోతూంది. ఫాలోయిట్."

    జయేంద్ర లల్లీవున్న కారులోని వ్యక్తులు హెడ్ లైట్స్ కాంతిలో గమనించారు. సుమారు అయిదు కిలోమీటర్లు దాటాక మరో కారు రోడ్డుపై ఆగివుండటాన్ని. 

    కారు బోనెట్ ని తెరిచిన ఇద్దరు వ్యక్తులు వైర్ లెస్ మెస్సేజ్ ని రిసీవ్ చేసుకుని ఏదో రిపేరు చేస్తున్నట్టు అభినయిస్తున్నారు.

    అది తమను వెంటాడే ప్రయత్నంగా పోలీసులు ఏర్పాటుచేసిన సిబ్బందని గుర్తించడానికి ముందుకు దూసుకుపోతున్న అంబాసిడర్ లోని వ్యక్తులకి అట్టే టైమ్ పట్టలేదు.

    "బాస్టర్డ్స్" పళ్ళునూరేడు డ్రైవరు పక్కకూర్చున్న ఓ వ్యక్తి. పోలీసులు ఇచ్చిన మాట తప్పారని ఖచ్చితంగా తెలియజెప్పే సాక్ష్యంలా ఇప్పుడు కారు వెంటాడుతుంది దూరంగా.

    ఒక పథకం ప్రకారం అంతా నిర్వహించగలుగుతున్నామని పొరపాటుపడిన పోలీస్ కమీషనర్ ప్రత్యర్ధిని తక్కువగా అంచనా వేసింది ఇక్కడే...

    జయేంద్ర ఉన్న కారిప్పుడు గంటకి వందకిలోమీటర్ల వేగంతో రోడ్డుపై పరుగెడుతూంది. ఏ క్షణంలో అయినా ప్రమాదంలోకి జారేట్టుగా.


                          *    *    *    *


    మరో పది నిముషాలకల్లా హాస్పిటల్ ఆవరణలోకి అడుగుపెట్టిన ప్రసన్నని సమీపించాడు డాక్టర్.

    "నా భార్యకెలావుంది?" భావ రహితంగా అడిగాడు. అతడి గొంతులో అన్ని మార్గాలూ మూసుకుపోయిన క్షణంలో ఒక మనిషిలో సహజంగా ధ్వనించే తాత్వికత...

    "అదే మీతో చెప్పాలనుకుంటున్నాను" కొద్దిగా తటాపటాయిస్తూ అన్నాడు. "ఇంచుమించుగా ప్రమాదంనుంచి తప్పించుకున్నట్టే. కాని బ్లడ్ ప్రెషెర్ దారుణంగా పెరిగిపోతూంది. ఐ థింక్...షి ఈజ్ అండర్ ట్రెమెండస్ మెంటల్ ప్రెషెర్..."

    అప్పటికే సబితవున్న బెడ్ ని చేరుకున్నాడు "సబితా!"

    సబిత ఎగిరెగిరి పడుతూంది. అంతకుమించి ఆమె కనుపాపలు ఆందోళనగా కదులుతున్నాయి. భర్తని చూడగానే ఆమె కళ్ళ నుంచి జలజలా నీళ్ళు రాలుతున్నాయి తప్ప మాటాడలేకపోతూంది.

    "యూ ఆర్ ఆల్ రైట్ సబితా. నీకేం కాలేదు." ఆమెనాస్థితిలో చూడలేకపోతున్నాడు. రెప్పపాటులో పైకి లేచి అతడ్ని చుట్టేసుకుంది. దారుణంగా కంపించిపోతూందని గ్రహించిన ప్రసన్న "నువ్వు పూర్తిగా కోలుకున్నావు సబితా... మనం ఇంక ఇంటికెళ్ళి పోవచ్చు."

    అయినా వణికిపోతూనే వుంది.

    అప్పటికీ ఆమెలో మానసికమైన రిలీఫ్ కోసం 'ప్లేసిబో' ఇంజక్షనిచ్చారు డాక్టర్లు...దాని ప్రభావానికే ఆమెలో సంచలనం తగ్గిపోవాలి కాని అదికూడా పనిచేయలేదు.

    "మీరు..." రొప్పుతూందామె. "మీరు...ఎక్కడున్నారు...ఇప్పుడు....ఎక్కడ?"

    "నీతోనే...నీ చేరువలోనే..." ప్రసన్న కళ్ళు నీటికుండలయ్యాయి...ఇప్పుడామె పరిస్థితి మెరుగవుతుందో విషమిస్తుందో తెలీని స్థితిలో నలిగిపోతున్నాను. "నిజం సబితా...నేను నీ ప్రసన్నని... ఇంక నీకేమీ కానివ్వను...నిన్నీ క్షణం నుంచీ జాగ్రత్తగా కాపాడుకుంటాను. నీ మీద ఒట్టు."

    "లేదు...మీరు...డ్యూటీ...మీకు డ్యూటీ..." ఉద్వేగంతో ఒక ఉన్మాదిలా కుదిపేస్తూంది. మీకు మీవాళ్ళ కన్నా డ్యూటీ ముఖ్యమన్న భావమో లేక రక్షించుకోవాల్సిన విధి మీదికాదా అన్న ఆలోచనలో ఆమె లల్లీలా అతడి చెంపల్ని పట్టుకుని కుదిపేస్తూంది.

    "సబితా...ప్లీజ్...సబితా" అతడి కళ్ళ నీళ్ళు ఆమె చెంపలపై పడ్డాయి... ఆ నీళ్ళు క్రమంగా ఆమె పెదవుల్ని చేరుకున్నాయి... ఆనక అతి ఉప్పగా నాలుకని తడిపేసాయి. హఠాత్తుగా ఆగింది. పిచ్చిదానిలా రెప్పలు టపటపలాడిస్తూ అతడి కళ్ళలోకి చూసింది.  

 Previous Page Next Page