"ఎక్కడో ఆశ. మిమ్మల్ని మార్చుకోగలనేమోనని"
"నీ భర్త అంత చవటనుకున్నావా? నువ్వు చెప్పినట్టు వినడానికి?"
"భార్య మాట వినడం చవటలే చేయరు"
"నేను మగవాడిని, వగరూ పొగరూ వున్న మగవాడిని. నువ్వు చెప్పావుకదాని నేను బుద్దిమంతుడైన బాలకుడినైపోను. ఇంకెప్పుడూ నన్నవమానించే సాహసం చేయకు. మన వైవాహిక జీవితంలో ఇదే మొదటిసారీ, ఆఖరిసారీ కావాలి. కాకపోతే ఆ తాళి నీ మెడలో వుండే అవసరంలేదు" ఆగ్రహంగా వెళ్ళిపోయాడు.
మండే మంటల మీద ఆజ్యం పోసినట్టుగా అయింది రాజ్యలక్ష్మి పరిస్థితి
ఎంత పెడసరితనం
భార్య అంటే ఎంత చులకన?
పదహారేళ్ళ వైవాహిక జీవితంలో తను అనుకూలవతిగా వున్నన్ని రోజులు అతడి ఆంతర్యం తెలిసే అవకాశం లేకపోయింది.
ఈరోజు ఎదురు నిలిచి ఒక ప్రశ్న వేసినందుకు ముఖంమీద కొట్టినట్టు ఎటువంటి జడవాబు లభించింది?
రాజ్యలక్ష్మి పరితాపానికి అంతులేకుండా పోయింది.
ఆమె పధ్నాలుగో ఏట వివాహమై ఆ ఇంట అడుగుపెట్టింది. ఏడాది తిరక్కుండానే బిడ్డ తల్లి అయింది. బలహీనంగా పుట్టిన ఆ బిడ్డ నెల తిరగకుండా కడతేరిపోయింది. మళ్లీ పదేళ్లకుగానీ ఆమె కడుపు పండలేదు. ఈసారి పుట్టిందికొడుకు. పండంటి కొడుకు. ఇంటి ఇలవేల్పు ఆంజనేయస్వామి పేరుమీద అతడికి హనుమాన్ ప్రసాద్ అని పెట్టుకున్నారు. హనీ అన్న ముద్దు పేరుతో పెంచుకుంటున్నారు. అతడికిప్పుడు నాలుగేళ్ళు.
ఆరోజు నుంచి భార్యాభర్తలు ఎడమొఖం పెడముఖం కావడం గమనించిన తుంగభద్ర ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఒక వార్త మోసుకెళ్లి ఒక పండంటి జీవితాన్ని బలిగొంది. ఇప్పుడు ఆ వార్త తాలూకు వివరాలు దొరసాని చెవిలో ఒక పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది.
"మీకా విషయాలన్నీ నేను చెప్పకుండా వుండాల్సింది. మీ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పాపినయ్యాను నేను" ఒకరోజు విలపించింది తుంగభద్ర.
"నిజంగా మాది పచ్చనికాపురమా? అవతల ఎందరో స్త్రీల జీవితాలతో చెలగాటమాడుతున్న మగాడితో కాపురం పచ్చని కాపురమేనా? ఇంకా ఆత్మవంచన ఎందుకు తుంగభద్రా? మా కాపురంలో పచ్చదనం ఎండిపోవడమే మంచిది అది మళ్ళీ చిగురించాలన్న ఆశ కూడా నాకు లేదు. నా మనసెప్పుడో విరిగిపోయింది."
"అలాగంటే ఎలా అమ్మగారూ"
"ఎప్పుడో వద్దనుకునే తాళి ఇప్పుడే త్రెంచి ముఖంమీద పారేసిపోవాలని వుంది. కానీ ఆడదానికి ఆత్మాభిమానం ఒక్కటే ముఖ్యంకాదు. పుట్టింటి, మెట్టినింటి పరువు ప్రతిష్టలు, వంశ గౌరవాలు, ఎన్నో చూడాలి. తాళి తెంపి పుట్టిల్లు చేరితే కన్నవాళ్లు ఎంత బాధపడతారు? పోతే నా కొడుకు. మాతృత్వం కోసం తపించి తపించి కన్న కొడుకు వాడు. వాడి భవిష్యత్తు కూడా నాకు ముఖ్యమేకదా. నేనిక్కడి నుండి నిష్క్రమిస్తే అతడికి ఎవరో ఒక్కరే మిగులుతారు. తల్లీ లేక తండ్రి. కన్నవాళ్ళిద్దరూ బ్రతికే వుండి ఒక్కరి చేతిలోనే పెరగాల్సివస్తే వాడికి అంతకంటే అన్యాయం ఏం జరగాలి? నా కొడుక్కోసం నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఇక్కడుండాల్సి వస్తోంది తుంగభద్రా" మనస్సు విప్పి తన ఆవేదన చెప్పుకుంది రాజ్యలక్ష్మి.
రోజులు గడిచిపోతున్నాయి.
మోహనవంశీ భార్యకేసి కన్నెత్తి చూడడంలేదు. పన్నెత్తి పలుకరించడంలేదు. ఆయనకి వచ్చిన ఆగ్రహం మామూలుది కాదని స్పష్టమౌతూనే వుంది.
రాజ్యలక్ష్మి మనసెప్పుడో విరిగిపోయింది. ఆమె అతడికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడంలేదు.
ఆ ఇరువురి మధ్య వాలిన తెర రోజురోజుకూ చిక్కనవుతుండగా మూడో వ్యక్తి ప్రవేశం జరిగింది.
ఆమె పేరు సౌదామిని.
ఒక సాయంత్రం.వేళ కొడుకుని ఆడిస్తూ బాల్కనీలో కూర్చుని వుంది రాజ్యలక్ష్మి.
ఆవరణలో సర్రున దూసుకువచ్చిన కారు నుంచి మోహనవంశీ దిగాడు. కారులో కూర్చున్న యువతికి చేతిని ఆసరాగా ఇచ్చి దించాడు.
కోమలమైన తన చేతిని ఆయన చేతిలో పెనవేసి నడవసాగింది ఆమె. తెల్లగా విరజాజి పువ్వంత సుకుమారంగా వుంది. అందంకంటే కోమలత్వం ఎక్కువగా అగుపిస్తుంది ఆమెలో.
ఒకరినొకరు అనుకున్నట్లుగా ఎంతో సన్నిహితంగా మెట్లెక్కి మోహనవంశీ వుండే మూడో అంతస్థుకు వెళ్లిపోయారు. నౌకర్లు, భార్య కళ్లప్పగించి చూసారు.
ఆ తరువాత కొద్ది నిముషాలలోనే అందరికీ తెలిసిపోయింది ఆమె ఆయన కోరి తెచ్చుకున్న కొత్త చిలువ అని, ఆమె పేరు సౌదామిని అని.
సౌదామినికి బస మూడో అంతస్తులోనే ఏర్పాటయింది.
ఇలా ఎప్పుడూ జరగలేదు. ఎవరిని తెచ్చుకున్నా గెస్ట్ హౌస్ లోనే దించేవాడు. ఆయన వినోద విలాసాలు అక్కడే సాగిపోయేవి. అందుకు విరుద్దంగా ఆడవాళ్లను తెచ్చి ప్యాలెస్ లోనే వుంచుతున్నాడంటే తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి తన స్త్రీ వ్యసనాన్నే ఆయుధంగా ఉపయోగిస్తున్నాడన్నమాట అనుకుంది రాజ్యలక్ష్మి.
మూడో అంతస్థు సంగతులు ఎప్పటికప్పుడు దాసీలవల్ల తెలుస్తూనే వున్నాయి ఆమెకు.
"దొరవారి అభిరుచి మరీ ఇంత దిగజారిపోయిందేమిటమ్మా? ఎక్కడో దొమ్మరి ముండని తెచ్చి వుంచుకున్నారు. మగాళ్లలా పాంట్లు, షర్టులు వేసుకుంటుంది. లేకపోతే పై నుండి కిందివరకూ అదేదో గౌను దిగేసుకుంటుంది. టేప్ రికార్డర్ లో ఇంగ్లీసోళ్లపాటలు వేసుకుని జుట్టు విరబూసుకుని ఒళ్లంతా ఊపుతూ కోతిలా ఆవిడ గెంతుతుంటే వావ్వా అని దొరవారు ఆనందించడం, ఇద్దరు కలిసి సీసాలు సీసాలు ఖాళీచేయడం, డబ్బు పెట్టి పేకాట ఆడడం........ ఇలాంటి సిగ్గుమాలిన పనులు ఈ ప్యాలెస్ లో ఎప్పుడూ జరగలేదమ్మా?"