Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 18


    "రండి సుష్మాజీ! ప్లీజ్..." అంటూ డోరు తెరిచాడు.
    ఆమె మళ్ళీ సిగ్గుపడుతుంటే క్యూ కట్టిన సంఘం వాళ్ళందరూ ఆమె చుట్టూ చేరి బ్రతిమాలసాగారు. "మాకు చాలా పనులున్నాయ్ మేడమ్! చాలా దూరం వెళ్ళాలి. మీరు కారులో కూర్చుంటేగానీ ఈ కారు కదలదు. ప్లీజ్...కారెక్కండి మేడమ్."
    ఆమెకు వాళ్ళందరి మీదా మళ్ళీ జాలి కలిగింది. "ఓ.కె" అంటూ కారెక్కి అతని పక్కనే కూర్చుంది. కారు స్టార్టయింది.
    "మీరెటు వెళ్ళాలి?" అడిగాడు ప్రకాష్ ఆనందంతో తేలిపోతూ.
    "దూరదర్శన్ కెళ్ళాలి"
    "ఫెంటాస్టిక్! నేనూ దూరదర్శన్ కే వెళ్ళాలి"
    ఆమె ఆశ్చర్యపోయింది "అదేమిటి? మీరు దూరదర్శన్ కెందుకెళ్తున్నారు?"
    అతను చకచక ఆలోచించాడు. "ఎందుకంటే- ఎందుకంటే - ఆ...నేను పాట పాడాలి. ఐ మీన్! సాంగ్ రికార్డింగ్."
    ఆమె ఆశ్చర్యపోయింది "మీరు పాటలు పాడతారా?"
    "అప్పుడప్పుడు మనసు బాగోకపోతే పాడేస్తుంటాను. దానికే దూరదర్శన్ వాళ్ళు పొంగిపోయి ఒకటే బలవంతం... మనసు బాగోనప్పుడల్లా వచ్చి స్టూడియోలో పాడమని."
    "మైగాడ్! పాటలంటే నాకెంతో యిష్టం"
    "అలాగా"
    కారు దూరదర్శన్ చేరుకుంది.
    ఇద్దరూ కారు దిగి లోపలకు నడిచారు.
    "మీకు దూరదర్శన్ లో ఏంపని?" అడిగాడతను.
    "డ్రామా రికార్డింగ్ వుంది"
    "ఓ...అలాగా!"
    "కానీ దానికింకా టైముందిలేండి! ఈలోగా మీ పాట వింటాను. ఎంతో ఆసక్తిగా వుంది మీ పాట వినాలని."
    ప్రకాష్ గతుక్కుమన్నాడు. "అలాగా! వినండి! నాకంతకంటె కావల్సిందేముంటుంది. మీకోసం అద్భుతంగా పాడటానికి ప్రయత్నిస్తాను. పోనీ ఇంకో రోజెప్పుడయినా వినకూడదూ మీరు."
    "ఊహు! ఇప్పుడు వినాల్సిందే."
    ఇద్దరూ ఫ్లోర్ లోకి చేరారు.
    ఎదురుగా కెమెరా ముందు కిక్కిరిసిపోయి పాతికమంది నిలబడి వున్నారు. వారి ముందు మైక్ లు! వాళ్ళల్లోనే ఇరుక్కుని మ్యూజిక్ డైరెక్టర్ నల్లూరి సుధీర్ కుమార్, అతనికెదురుగా ఇరుక్కుని మ్యూజీషియన్లు.
    "అరె! సాంగ్ రికార్డింగ్ స్టార్టవుతున్నట్లుంది. ఈ గ్రూప్ సాంగ్ లో పాడుతున్నారా మీరు!" అడిగింది సుష్మ ఆశ్చర్యంగా.
    "అవును!" అబద్ధమాడేశాడు ప్రకాష్.
    "అయితే మరివెళ్ళి జాయినవండి"
    ప్రకాష్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.
    "లైట్స్" అరిచారెవరో.
    ఠక్కున ఆ పాతికమంది మీదా లైట్లు వెలిగాయి. అందరూ లైట్స్ కాంతిలో మెరిసిపోతున్నారు.
    "అయ్యో వెళ్ళండి!" అతనిని తొందర పెట్టిందామె.
    ప్రకాష్ భయంగానే చకచక అడుగులు వేస్తూ వెళ్ళి ఆ పాతిక మందిలో దూరి మధ్యలో నిలబడ్డాడు. ఎవరూ తనను పట్టించుకోలేదు.
    "వన్- టూ- త్రీ-" అంటూ అరిచాడు మ్యూజిక్ డైరెక్టర్ నల్లూరి సుధీర్ కుమార్, అలా అనగానే సాంగ్ ప్రారంభమయ్యింది.
    భారతదేశం మనదేనోయ్-భారతీయులం మనమేనోయ్-కులాలన్నీ మనవేనోయ్-మతాలన్నీ మనవేనోయ్-
    అంతవరకూ పాడేసరికి ప్రకాష్ కి తెలిసిపోయింది. అది దేశభక్తిగీతమని. కనుక ఆ తరువాత చరణాలు తేలిగ్గా తనే ఓ అడుగు ముందుకువేసి పాడేశాడు. హిందూ- ముస్లిమ్ భాయ్ భాయ్ రామ్- రహీమ్- జీసస్- నానక్- అంతా ఒక్కటే అందరమొకటే అందరికోసం ఒకడు ఒక్కడికోసం అందరూ సారాజహాసె అచ్ఛా.
    పాట పూర్తయిపోయింది.
    సుధీర్ కుమార్ తనవంకే అనుమానంగా చూడటం గమనించి ప్రకాష్ వడివడిగా సుష్మ దగ్గరకొచ్చేశాడు.
    "రియల్లీ వండర్ ఫుల్! మీరు పాడిన చరణాల ట్యూన్ అద్భుతం! మీరింత మంచి గాయకులని నాకు తెలీదు" అందామె సంభ్రమంగా.
    "చెప్పాను కదండీ! ఏదో కాలక్షేపం కోసం. ఇంక వస్తానండీ. మనం మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందామన్నారు కదా! ఎక్కడ కలుసుకుందాం?"
    ఆమె ఆశ్చర్యపోయింది "నేనన్నానా అలా?"
    "అన్నట్లే గుర్తు! అనకపోయినా పర్లేదు. నాకలాంటి పట్టింపులేమీ లేవు. ఇప్పుడు చెప్పండి. ఎక్కడా?"
    ఆమె నవ్వేసింది. "ఓ.కె! బిర్లామందిర్! సిక్సోక్లాక్."
    "థాంక్యూ"
    అతను ఆనందంతో తేలిపోతూ బయటకు నడిచాడు.


                            *    *    *    *


    మార్కండేయులు క్లబ్ లో కూర్చుని ఓ బ్యాంక్ తాలూకు జనరల్ మేనేజర్ కి మస్కా కొడుతున్నాడు. "మొన్నే మీ యింటి మీదనుంచీ కార్లో వెళుతూ మీ కుక్కపిల్లను గేటు దగ్గర చూశాను. చాలా ముద్దొస్తూంది! ఎంత ముద్దొస్తూందో చెప్పలేను. ఇంక వుండబట్టలేక కారు బ్యాక్ చేయించి గేటు ముందాపి దాన్ని తనివితీరా ముద్దు పెట్టుకున్నాను. మీ వాచ్ మెన్ చెప్పేవుంటాడు మీకు."
    "అవునవును చెప్పాడు. నిజంగా చాలా ముద్దొస్తుందది."
    "నిజంగా అలాంటి అందమయిన కుక్కపిల్ల వుండటం గొప్పవరం అనుకోండి! దేవుడు అందరికీ అంత మంచి కుక్కపిల్లనివ్వడు. మీలాంటి మంచి హృదయం గల యజమానులకే ఇస్తాడు."
    "ఆ కుక్కపిల్ల తల్లికూడా అంతే! ఇప్పటికీ చాలా ముద్దొస్తుంటుంది."
    "అయితే రేపే వచ్చి దాన్నికూడా ముద్దు పెట్టుకుంటాను."
    "మీకు కుక్కలంటే ఇష్టం అనుకుంటాను."

 Previous Page Next Page