అతను పరుగుతో బయటికొచ్చాడు మళ్ళీ. 8 డౌన్ అప్పటికే సిగ్నల్ లోపలికొచ్చేసింది. హాండ్ సిగ్నల్ లాంప్ డేంజర్ లోవుంచి పట్టుకున్నాడతను, ఇంజన్ స్టేషన్ ముందుకొచ్చేసింది. డ్రైవర్, అసిస్టెంట్ ఇద్దరూ ఇంజన్ డోర్ దగ్గరే నిలబడివున్నారు. ఇద్దరి మొఖాల్లోనూ కనబడుతోన్న టెర్రర్.
ఇద్దరూ బిగ్గరగా అరుస్తున్నారు చేతులూపుతూ,
కానీ తనకు ఆ ఇంజన్ మోతలో ఏమీ కనిపించటంలేదు. మరుక్షణంలో డెటోనేటర్స్ భయంకరమయిన శబ్దంతో ప్రేలినయ్. ప్రభాకర్ కి అప్పటికే అర్ధమయిపోయింది. 8 డౌన్ ఆగకుండా వెళ్ళటం డ్రైవర్ నిద్రపోవటంవల్ల కాదు. 'బ్రేక్ పవర్' ఫెయిలయి వుండవచ్చు లేదా యింకేదయినా ప్రాబ్లమ్ కావచ్చు.
పరుగుతో స్టేషన్ లోకి నడిచి బ్లాక్ బెల్ మోగించి ఫోన్ అందుకున్నాడు.
"హలో దాస్! 8 డౌన్ ఆగలేదు. డ్రైవర్ దే మీ ప్రాబ్లమ్ లేదు. మేలుకునే వున్నాడు. ఇంజన్ లోనే ఏదోట్రబులుంటుందనుకుంటాను".
దాస్ కంగారు పడ్డాడు "అలాగా! ఇప్పుడేమిటి చేయడం?"
"గూడ్స్ ట్రెయిన్ సైటయిందా?"
"ఇప్పుడే అయింది"
"అంటే 8 డౌన్ వచ్చేలోగానే అది లూప్ లైన్లోకి క్లియరయ్యే ఛాన్సుందా?"
"ఏమో! వుంటుందనే అనుకుందాం-"
అప్పటికే స్టేషన్ లోని ఆఫ్ డ్యూటీ స్టాఫ్ అందరినీ పిలిపించేశాడు దాస్. యాక్సిడెంట్ జరగబోతోందని అందరికీ తెలిసిపోయింది.
* * *
డాక్టర్ సంగీతకు మనసంతా విచిత్రమయిన భావాలతో, ఆలోచనలతో నిండిపోయింది. తనూ విజయ్ కుమార్ విడిపోయాక యింతకాలం తను మరో పురుషుడి గురించి ఆలోచించనే లేదు.
ఎందుకో ఇంకో పెళ్ళంటేనే చిరాకు కలిగింది. కానీ గత ఆరు నెలలుగా తన ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆ మార్పుకి కారణం వంటరితనం-దానికి తోడు మిగతా డాక్టర్లు, నర్సులు, యితర హాస్పిటల్ సిబ్బంది తాలూకు వ్యక్తిగత జీవితాలు తనలోనూ కోర్కెలు కలిగించటం-
సరిగ్గా ఆ సమయంలో తన హాస్పిటల్ కి హౌస్ సర్జన్ గా వచ్చాడతను. మొదట్లో అతనిని పట్టించుకోలేదు. కానీ అతనే చాలా తరచుగా తనతో మాట్లాడ్డానికి ప్రయత్నించటం, ఎన్నో సీరియస్ కేస్ ల గురించి తననడిగి తెలుసుకోవటం, తనకు అవకాశం దొరికినప్పుడల్లా కూల్ డ్రింక్, కాఫీలు సర్వ్ చేయటం-
రాన్రానూ అతని చూపులు, అతని కళ్ళల్లో కదలాడే కోరికలు- తనకు అనుమానం కలిగించినాయ్
"మీరు మరోలా భావించకపోతే మీకో మాట చెప్పాలనుకుంటున్నాను" అన్నాడో రోజు.
"ఏమిటది?" నవ్వుతూ అడిగింది తను.
"మీ అంత అందమయినస్త్రీని నేనింతవరకూ ఎక్కడా చూడలేదు-"
తనకేం మాట్లాడాలో అర్ధం కాలేదు.
"ఎగ్జాగరేషన్" అంది తను అతని మాటలుపట్టించుకోనట్లు.
ఓ పండుగ రోజున అతను ఇంటికి వచ్చాడు. ఆరోజు వంట మనిషిరాకపోవడంతో తను హోటల్ కెళ్ళిభోజనం చేయాలనుకుంది. తనతో అతనూవస్తాననేసరికి కాదనలేకపోయింది. సుష్మతో పాటు ఇద్దరూహోటల్ కెళ్ళారు. తను వారిస్తున్నా వినకుండా బిల్ అతనే కట్టేశాడు. ఆ తరువాత అతనేసినిమా ప్రపోజల్ పెట్టాడు.
"ఇవాళ ఎలాగూ హాలీడేయేకదా! ఏదయినా సినిమా చూసి ఇంటికి వెళ్దాం మేడమ్!" తనకు ఇష్టం లేకపోయిందిగానీ సుష్మ కూడా వెళ్దామనిమారాం చేసేసరికి సినిమాకెళ్ళక తప్పలేదు.
రాత్రి ఇంటికి చేరుకునేసరికి తొమ్మిదయిపోయింది. పదకొండుగంటలవరకూ ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూనేవున్నారు. తీరా అతనుబయల్దేరే సమయానికి పెద్దగా వర్షం ప్రారంభమయింది. పన్నెండయిపోయినా తగ్గకపోయేసరికి కర్టెసీ కోసం తను రాత్రికి అక్కడే వుండిపొమ్మనిచెప్పింది. గెస్ట్ రూమ్ లో అతనికి ఏర్పాట్లు చేసి వెళ్ళిపోబోతూండగా అతను మాట్లాడాడు.
"మేడమ్! మీరేమయినా అనుకోండి! అయామ్ మారీడ్ ఆఫ్టర్ యూ! మీరు వప్పుకుంటేమనం పెళ్ళి చేసుకుందాం!"
తను నివ్వెరపోయింది. తనకంటే ఏడెనిమిదేళ్ళు చిన్నవాడతను. తను వెంటనే సమాధానం చెప్పలేకపోవటాన్ని అతను అంగీకార సూచకంగా భావించాడు. క్షణాల్లో తను అతని కౌగిట్లోనలిగిపోసాగింది.
అతనిని నివారించడానికి ప్రయత్నిస్తూండగానే అతని స్పర్శ తనలో నిద్రపోతూన్న కోర్కెలను రగిల్చింది.
తెల్లారేవరకూ అతని గదిలోనే ఉండిపోయింది తను. మరికొద్ది రోజుల్లో అతనితోపెళ్ళికి వప్పుకుంది తను. ఎలాంటి హడావుడీ లేకుండా అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ రోజే రిజిస్ట్రార్ ఆఫీస్ కెళ్ళాల్సి వుంది. అందుకే వరంగల్ లో కాన్ఫరెన్స్ అటెండ్ అయాక విజయవాడ చేరుకుంటోందా రోజు. అతను తనకోసం విజయవాడ స్టేషన్ కొస్తాడు ఇప్పుడు.
కానీ ఈ మధ్యే తను విజయ్ కుమార్ గురించి తామిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తిద్వారా వింది, అతను మరో వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవితం గడుపుతున్నాడని.
ఆ మాట విన్న దగ్గర్నుంచీ తనలో ఓ విధమయిన అశాంతి బయల్దేరింది. అతనెందుకు వివాహం చేసుకోలేదు మళ్ళీ? తనను మర్చిపోలేకపోతున్నాడా? లేక తన వల్ల పెళ్ళంటేనే విరక్తి కలిగిందా? కనీసం ఆ చిన్నపిల్లాడికోసమైనా పెళ్ళి చేసుకుని ఉండాల్సింది. ఆ పసివాడి పెంపకం ఎవరు చూస్తారు? ఇవన్నీగాక అతని వయసు సంగతేమిటి? పోనీ అపుడప్పుడూ అతని మాజీ ప్రియురాలు సంపూర్ణంతో ప్రణయం జరిపినా అదెంత కాలం సాగుతుంది.
ఆమె భర్తకు తెలుస్తే ఇద్దరూ అల్లరిపాలవుతారుకదా!
సంగీత బెర్తుమీదనుంచి కిందకు దిగి కిటికీ దగ్గరకొచ్చి విజయ్ కుమార్ కెదురుగ్గా కూర్చుంది. ఒక్కసారి తన కొడుకుని చూడాలనివుంది. విజయవాడ వచ్చిందంటే తను దిగి తనదారిన వెళ్ళిపోతుంది తన క్కాబోయేభర్తతో మళ్ళీ ఎప్పటికయినా వాడినిచూసే అవకాశం దొరుకుతుందోలేదో-
విజయ్ కుమార్ కి ఆశ్చర్యంగా వుంది. ఆమె విజయవాడరాకముందే కిందకు ఎందుకుదిగినట్లు? కావాలనితనను అవహేళన చేయడానికా? నేనుదర్జాగా, సుఖంగా బ్రతుకుతున్నానని తనకు తెలియజేయడానికా?
హఠాత్తుగా తనపై బెర్తుమీద పడుకున్న సుష్మ నిద్ర లేచినట్లుంది. "మమ్మీ" అని పిలిచింది.
సంగీత లేచి నిలబడింది.
"ఏమిటి సుష్మా?"
"నేనూ కిందకు దిగి నీ పక్కన కూర్చుంటాను మమ్మీ?"
"ఎందుకు? విజయవాడ రావటానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. పడుకో-"
"వద్దు మమ్మీ! అయ్ వాంట్ టు గెట్ డౌన్-"
సంగీత సహాయంతోకిందకు దిగింది సుష్మ.
ఆమెను చూస్తూనే నిశ్చేష్టుడయ్యాడు విజయ్ కుమార్. సుష్మ అచ్చం తన తల్లిపోలిక! ఆ పెద్ద పెద్దకళ్ళూ, దట్టంగా పెరిగిన జుట్టూ, అందమయిన ముక్కు, తెల్లని శరీరఛాయ-
తన తల్లి చాలాగొప్ప అందగత్తె. సుష్మ ముమ్మూర్తులా ఆమెపోలికే! ఇప్పుడు సుష్మను చూస్తే ఆమె ఎంత సంతోషిస్తుందో సుష్మ సంగీతతో ఏమేమో మాట్లాడుతోంది. ఆ గొడవకు విమల్ లేచి కూర్చున్నాడు బెర్తుమీదనుంచి! సంగీత గుండెకొట్టుకోవటం కొద్దిక్షణాలు నిలిచిపోయినట్లయింది.
అచ్చం తన పోలికేవాడు. ఎలాంటి తేడాలేదు.
ఎంత ముద్దుగా, అందంగా వున్నాడు? ఒక్కసారి వాడిని దగ్గరకు తీసుకుని తనివి తీరాముద్దుపెట్టుకోవాలని వుంది.
"డాడీ! మనం దిగే ఊరు ఇంకెప్పుడొస్తుంది?" అడిగాడు విమల్.
"వచ్చేస్తుంది! ఇంకో గంట! అంతే!"
"ఆ లైట్లన్నీ ఏమిటి డాడీ?"
"ఇక్కడ రైలేందుకు ఆగటం లేదు?"
"చిన్న చిన్న స్టేషన్లలో ఈ రైలు ఆగదు-"
"ఎందుకు డాడీ?"
"అక్కడ రైలెక్కేవారు, దిగేవారు ఎవరూ వుండరు"
వాడు కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఆలోచిస్తూండిపోయాడు. సంగీత ఇంక వుండబట్టలేకపోయింది. "వాటీజ్ యువర్ నేమ్?" అడిగింది వాడిని ఆప్యాయంగా. విజయ్ కుమార్ ఆశ్చర్యపోయాడు.
ఆమె అంత ధైర్యం చేస్తుందని తననుకోలేదు.
"మై నేమీజ్ విమల్" ముద్దుగా చెప్పాడు వాడు.
"ఓ! వెరీ ఫైన్!" ఆనందంతోపొంగిపోతూ అందామె.
"వుచ్ క్లాస్ యూ ఆర్ స్టడీ యింగ్?"
"సెకండ్-"
అకస్మాత్తుగా ముందుకు వంగి వాడిని ముద్దుపెట్టుకుందామె. వాడుబిక్క మొఖం వేశాడు. భయంగా విజయ్ కుమార్ వేపు జరిగాడు.
"డాడీ! ఆ ఆంటీ ఎవరు?" అడిగాడు సంశయంగా.
విజయ్ కుమార్ ఆ ప్రశ్నను విననట్లు ఇగ్నోర్ చేశాడు.
"డాడీ!" మళ్ళీ పిలిచాడువాడు.
"ఊ!"
"ఆంటీ నన్నెందుకు కిస్ చేసింది?"
"బికాజ్ యూ ఆర్ గుడ్ బాయ్!"
"నేను గుడ్ బాయ్ అని అంటీకెలా తెలుసు?"
"తెలుసు!"