Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 18


    "ఉట్టి థాంక్సేనా!"
    కోపంగా అతనివంక చూసింది తను.
    చిలిపిగా నవ్వుతున్నాడతను.
    "యుద్ధం చేసినప్పుడు కూడా నాకేం భయం కలుగ లేదు. మీరలా కోపంగాచూస్తే భయం వేస్తోంది"
    తనకూ నవ్వు ఆగలేదు. అతికష్టంమీద నవ్వు ఆపుకొంది.
    నవ్వితే అతను మరింత చనువు తీసుకొంటాడు. ఆ తరువాత ప్రేమ పాఠాలు.
    మొగాళ్ళ సంగతి తనకు బాగా తెలుసు. యస్సల్సీలో క్లాస్ మేట్ జానకి కేమయింది? ప్రేమించినట్లు నటించి, ఆమెతో షికార్లుకొట్టి-గర్భవతి కాగానే పలాయనం చిత్తగించాడు. దాని గతేమయింది! ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులేర్పడినయ్ చివరకు. కాని మొగాళ్ళందరూ అలాగే ఉంటారా? ఏమో! లోపలకు నడిచింది తను. చెల్లాయ్ ఇంట్లో దీపం ముందు కూర్చుని చదువుకొంటూ కనిపించింది.
    ఇంతకూ అతను ఇంటి కెందుకొచ్చినట్లు? అతనికీ టిక్కెట్టు దొరకలేదా?
    తన గదిలోకి వెళ్ళి లైటు వేసింది.
    అతను ఇంకా బయట పచార్లు చేయటం కిటికీలో నుంచి కనబడుతూనే ఉంది. తను భోజనం ముగించి గదిలో కొచ్చేసరికి అతను తన గదికెదురుగ్గా ఉన్న వాళ్ళ గదిలో మంచంమీద పడుకొని అతని అన్నయ్య కూతురికి కథ చెప్తున్నాడు.లైటార్పేసి మంచంమీదకి వరిగిపోయింది తను కావాలనే అతను గొంతు పెద్దదిచేసి కథ చెప్పటం మొదలుపెట్టాడు.
    "అనగనగా ఓ ఊళ్ళో ఓ అమ్మాయ్ ఉంది. ఆ అమ్మాయ్ ఎంతో అందంగా ఉంటుంది. అందుకే ఆ అమ్మాయ్ కి బోలెడు గర్వం..."
    "ఈ కథవద్దు బాబాయ్-రాజు కథ చెప్పు...." ఆ పిల్ల మారాం చేసింది.
    "సరేసరే- అనగనగా ఓ రాజు! ఆ రాజుకి ఒక రాజకుమార్తె. చాలా అందంగా వుంటుంది. అందుకు బోలెడు గర్వం. ఆ రాజకుమార్తె ఒక రోజు ఉద్యానవనంలో విహరిస్తుండగా మారు వేషంలో ఉన్న రాజకుమారుడు గుర్రంమీద వచ్చాడు. రాజకుమారిని చూస్తూనే గాఢంగా ప్రేమించాడతను. ఆమెతో మాట్టాడాలని ఉవ్విళ్ళూరసాగాడు. కాని రాజకుమారికి గర్వం కదా! అతనితో మాటలాడలేదు. మర్నాడు రాజకుమారి వాళ్ళింటిముందు ముగ్గు వేస్తోంటే..."
    "ఛీ! ఫో బాబాయ్! రాజకుమారి ఎక్కడన్నా ముగ్గు వేస్తుందేమిటి?"
    "ఎందుకు వేయదు? వాళ్ళ దాసీలెవ్వరూ పనిలోకి రాలేదుట! అల ముగ్గు వేస్తోంటే ఆ రాజకుమారుడు అరుగుమీద గూర్చుని చూసి ముగ్ధుడయిపోయాడు. ఆహా ఈ రాజకుమార్తెను పెళ్ళాడితే ఎంత అదృష్టం? అని అనుకొన్నాడు. ఆ రోజు సాయంత్రం రాజకుమారి డాబా మీద పచార్లు చేస్తూ కనిపించిందట..."
    "అబ్బ! ఏమిటి బాబాయ్! రాజకుమారి కోటలో ఉంటుందిగాని డాబా ఏమిటి?" కోపంగా అందాపిల్ల.
    "కోట రిపెరులో ఉంటే డాబా అద్దెకు తీసుకొన్నారుట రాజుగారు."
    తనకు నవ్వాగలేదు. అంతా తన గురించే! తను వినాలనే గట్టిగా చెప్పుతున్నాడు.
    "తరవాతేమయింది?" అడిగిందాపిల్ల.
    "రాజకుమారుడు అక్కడ కూడా మాట్లాడ్డానికి ప్రయత్నించాడు గానీ రాజకుమారి మాట్లాడలేదు. చివరకు రాజకుమారుడికి కోపం వచ్చేసింది. వచ్చి రాజకుమార్తెణు ఎత్తుకెళ్ళిపోయాడు."
    "తరువాతేమయింది?"
    "కథ కంచికీ-మనమింటికీ..."
    "ఛీ! కథేం బావుండలేదు..."
    తను లేచి కూర్చుని నవ్వుకోసాగింది.
    ఆ రాత్రి చాలా సేపటివరకూ అతని మాటలే తల్చుకొని నవ్వుకొంటూ వుండిపోయింది.
    మర్నాడు సాయంత్రం తను డాబా మీద పచార్లు చేస్తోంటే అతనూ వాళ్ళ డాబా మీదకొచ్చాడు.
    "ఇవాళ సినిమాకి వెళ్ళలేదేమిటి?" అడిగాడు నవ్వుతూ.
    "ఇంక సినిమా లెందుకూ? అతకంటే మంచి కథలు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు..."
    "కథలా? ఎవరు చెప్తున్నారు?
    "ఏమో! పేరు తెలీదు....రాజకుమార్తె కథలుబాగా చెప్పగలడు."
    "పూర్ ఫెలో! ప్రేమలో దెబ్బతిని ఉంటాడు..."
    "అవునట పాపం కనపడ్డ అమ్మాయినల్లా ప్రేమిస్తూ కూచుంటే ఏమవుతుంది మరి!"
    "నేనొప్పుకోను. అతనలాంటివాడు కాదు..."
    "మీకెలా తెలుసు?"
    "వాడు నా బెస్టు ఫ్రెండ్ వాడే నేను- నేనే వాడనేంత స్నేహం మాది..."
    "అలాగా, ఈసారి కనబడితే అలాంటి పిచ్చి కథలు చెప్పొద్దన్నానని చెప్పండి..."
    "వాడు కనబడడం కష్టమండీ. ప్రయత్నిస్తాను..."
    నవ్వుకొంటూ మెట్లుదిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది తను.
    ఆ రాత్రి కావాలని తనే చెల్లాయిని పిలిచి దగ్గరకూర్చోబెట్టుకొంది.
    "ఏమిటక్కా?" చిరాకుగా అడిగింది చెల్లెలు.
    "నీకో కథ చెప్తాను వింటావా?"
    "ఏం కథ? సినిమాదేనా?"
    "ఆ! అవును ఆ సినిమాలో ఏమవుతుందంటే హీరో అన్నీ పిచ్చివేషాలేస్తోంటే హీరోయిన్ కి కోపం వచ్చింది. అందుకని అతను మాట్లాడించడానికి ప్రయత్నించినా మాట్లాడకుండా ఊరుకొంది. మర్నాడు ఇద్దరూ సినిమా హాలు దగ్గర కలుసుకొన్నారు. పోనీ లేగదాని జాలిపడి హీరోయిన్ మాట్లాడింది..."
    "ఛీ....ఏం బావుండలేదిది. నేను పోతున్నా. రేపు సోషల్ స్టడీస్ లో టెస్టు వుంది నాకు..."
    వెళ్ళిపోయింది చెల్లాయ్.
    "ఏవండోయ్. తరువాతేమయిందో చెప్పండి. నాకు చాలా సస్పెన్స్ గా వుంది..." తన గది కిటికీలో నుంచి అన్నాడతను.
    "మీ రెందుకు విన్నారీకథ? నేను మా చెల్లాయికి చెపుతున్నాను. మీకు కాదు."
    "నేనే మీ చెల్లాయ్ ననుకొని చెప్పండి..."
    "ఇంకా నయం...." కిటికీ తలుపులు మూసివేయబోయింది తను.
    "ఏవండోయ్ అంతపని చేయకండి. మన మధ్య గొడవలుంటే వుండవచ్చు. మధ్యలో ఆ తలుపులేం చేసినయ్" దీనంగా అన్నాడతను.
    తను నవ్వాపుకొంటూ తలుపులు తీసివేసింది.
    ఇద్దరి మధ్యా చనువు పెరిగిపోయింది. నాలుగురోజులు తర్వాత ఇద్దరూ బజార్లో కలుసుకొని బస్ లో సి షోర్ వెళ్ళారు. అక్కడ సరుగుడు తోటల్లో ఆడుకొన్న ఆటలూ సముద్రంలో చేసిన స్నానాలు-అతని అల్లరీ-మనసులో ఆ దృశ్యాలు  అలాగే నిలిచిపోయినయ్. ఒకరి మీద ఒకరు పూర్తి నమ్మకం-ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ....ఇద్దరూ ఒకటయిపోవాలనే కోరికా-ఒకరిని విడిచి ఒకరు ఒక్కక్షణం కూడా వుండలేని పరిస్థితికి తీసుకొచ్చినయ్.

 Previous Page Next Page