అనూష మార్కెట్టును అధ్యయనం చేసింది. పబ్లిసిటీ విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు విప్లవాత్మకంగా ఉన్నాయి.
దాదాపు మూలపడిన 'సమ్రాట్ పబ్లికేషన్స్'కు మంచి పేరు రావాలని అనూష తెలివిగా నవలల పోటీ పెట్టింది.
సీరియల్ గా ఏదైనా ప్రముఖ పత్రికలో వచ్చిన నవలను పుస్తకంగా అచ్చు వేయాలంటే ప్రచురణ కర్తలు రచయితల చుట్టూ తిరిగి రాయల్టీలూ, అవీ మాట్లాడుకోవాలి. అలాగే అంత పేరుప్రఖ్యాతులు లేని రచయితలు తమ రచనల అచ్చు విషయంలో చెప్పులు అరిగేలా ప్రచురణ కర్తల చుట్టూ తిరుగుతుంటారు.
బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రచయితలు మార్కెట్టులో బాగా పేరు ఉన్న ప్రచురణ కర్తలకే తమ రచనలు ఇస్తున్నారు. ఈ సమస్యలు తలెత్తకుండా అనూష చక్కని పథకం వేసింది.
ప్రతి మూడు నెలలకొకసారి నవలల పోటీ పెట్టి, ఆ పోటీలో ఒకటి, రెండు స్థానాలలో వచ్చిన నవలలకు హెచ్చు మొత్తంలో పారితోషికం ఇచ్చి, మిగిలిన నవలలలో వచ్చిన వాటికి కొద్దిపాటి పారితోషికం ఇచ్చి నవలలను ముద్రించే హక్కు 'సమ్రాట్ పబ్లికేషన్స్'కు చెందేట్టు వేయించింది.
ఆ విధంగా చేయడం వలన ప్రతి మూడు నెలలకు మంచి నవలను మార్కెటులోకి ప్రవేశపెట్టవచ్చు.
వైవిధ్యం ఉన్న నవలలతో కొందరు కొత్త రచయితలు వెలువడ్డారు.
అనూష పథకం ప్రకారం ఎప్పటికప్పుడు పాఠకులకు విపరీతంగా ఆకర్షించే నవలలను ముద్రించడం వలన 'సమ్రాట్ పబ్లికేషన్స్'కు పేరుతో పాటు ఆర్ధిక స్తోమత కూడా పెరిగింది.
ఆమె తెలివితేటలను, పబ్లికేషన్స్ ను తీర్చిదిద్దిన విధానాన్ని చూసి విశ్వనాథ్, సమ్రాట్ ఆశ్చర్యపోయారు.
అనూష పేరు ప్రఖ్యాతులు అనతికాలంలోనే తారాపథానికి చేరాయి.
కాని, కాలం దొర్లుతున్న కొద్దీ దైనందిన జీవితం కేవలం యాంత్రికంగా నడుస్తున్న అనుభూతికి లోనయింది అనూష.
ఆఫీసులో కూర్చున్నంతసేపూ నవలల గురించి, పాఠకుల ఉత్తరాలకు రాయవలసిన జవాబుల గురించి, వ్యాపారాన్ని ఇంకా ఇంకా ఎలా అభివృద్ధి చేయాలా అనే విషయం గురించిన ఆలోచనలతోనే ఆమెకు సరిపోతున్నది.
అయితే, ఈ వృత్తిలో శ్రమతోపాటు తృప్తి కూడా ఉన్నదనిపించింది అనూషకు.
జర్నలిజంలో విశేషంగా కృషి చేయాలనే తపన అనూషలో రోజు రోజుకూ పెరుగుతున్నది.
అందుకు దోహదకరంగా ఏదైనా పత్రికలో చేరితే అన్న తలంపు కూడా కలిగిందామెలో.
వృత్తిలో తలమునకలుగా ఎన్ని బాధ్యతలతో ఉన్నా అయినవాళ్ళందరినీ వదిలి రావడంతో, అనూష అప్పుడప్పుడూ ఒంటరితనంతో బాధపడుతున్నది. ఆత్మీయులు లేని లోటు లోటుగానే ఉంది.
అసలు తను ఎందుకు ఇల్లు వదిలి వచ్చినట్టు? మరికొన్ని క్షణాలలో పెళ్ళి జరుగుతుందనగా కాదనుకుని ఎందుకు గడప దాటినట్టు?
ఆమె కళ్ళముందు ఆనంద్ మెదిలాడు. అతనికీ, తనకూ మధ్య ఉన్న స్నేహం ఏపాటిది? కేవలం అతన్ని తను క్లాస్ మేట్ గానే చూసిందా? లేక అతని మీద వేరే అభిప్రాయాన్ని ఏమైనా ఏర్పరచుకున్నట్టా?
ఆమె మనసు పొరలలో ఎక్కడో అతను తిష్టవేశాడు. అందుకే ఆమె కాళ్ళు సరాసరి అతని వద్దకే లాక్కు వెళ్ళాయి.
మరి, ఎందుచేతనో ఆనంద్ ధైర్యంచేసి తనను తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. సగటు మనిషిగా తన చర్యను ఖండించాడు!
తనకు అతనిమీద అసహ్యం కలిగింది. తన ఆశలు అడియాసలు చేశాడన్న అసంతృప్తితో అతను ప్రాధేయపడినా, ధైర్యంగా తన కాళ్ళమీద తను నిలవ గలిగింది.
ఆలోచనలో ఉన్న అనూష సమ్రాట్ రాకను గమనించలేదు.
సమ్రాట్ సరాసరి ఆమె దగ్గరకే వచ్చాడు. ఆమె ముఖం ముందు గట్టిగా చిటిక వేశాడు.
అనూష ఉలిక్కిపడింది. "ఎంతసేపయింది మీరొచ్చి?" సమ్రాట్ ను చూసి సర్దుకుంటూ అడిగింది.
"ఇప్పుడే. నువ్వేదో పరధ్యానంలో ఉన్నావు, ఏదైనా సమస్యా?"
"అబ్బే అదేమీలేదు!"
"కాని నిన్ను చూస్తే అలా లేవు. ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావు! ఇదివరకు ఎప్పుడూ నువ్వు ఇలా పరధ్యానంగా లేవు. అవునా?"
అనూష మౌనంగా ఉంది.
"సరే! నన్ను పరాయి వాడనుకుంటే చెప్పవద్దు. ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రతి సమస్యా భూతద్దంలో కనిపిస్తుంది, మరింత ఎక్కువగా బాధ పెడుతుంది. అదే ఆత్మీయులతో చెప్పుకుంటే ఊరట కలుగుతుంది, ఒక్కొక్కప్పుడు పరిష్కారం కూడా దొరకవచ్చు. ఇక చెప్పడం_చెప్పకపోవడం నీ ఇష్టం" నిష్టూరంగా అన్నాడు.
"సారీ! మీరు నా గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సమస్యలు ఉన్నా అన్నీ చెప్పుకోలేం కదా! అయినా, మీరింత పట్టుదలగా అడిగారు కనుక చెపుతాను. నాకెందుకో జీవితం విసుగ్గా అనిపిస్తున్నది. జరిగిన సంఘటనలు ఒక్కొక్కటే గుర్తుకు వచ్చి నన్ను బాధిస్తున్నాయి. దానితో నాలో నైరాశ్యం చోటుచేసుకుంటున్నది. అయినవాళ్ళనందరినీ వదిలి వచ్చానుగా. ఆ లోటు తెలుస్తున్నదిప్పుడు" అనూష గొంతు జీరబోయింది.
"సరే! ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? ఇంటికి వెళ్ళిపోతే బెంగ తీరిపోతుందిగా!" ఆమె మూడ్ అర్థం చేసుకుని సలహా ఇచ్చాడు.
"జీవితంలో నేనెన్నడూ వెనుకడుగు వేయలేదు. వేయను కూడా! అంతేకాదు, ఓటమిని కూడా అంగీకరించను!" అంది ఆవేశంగా అనూష.
సమ్రాట్ తన మాటలతో ఆమె గాయపడినట్లు గ్రహించాడు.
"సారీ అనూషా! సలహా ఇచ్చానని మరోలా అనుకోవద్దు."
"దానిదేముంది? మీ అభిప్రాయం మీరు చెప్పారు."
"అనూషా! ప్రస్తుతం నేను రాసే మూడ్ లో లేను. నేను బయటకు వెళతాను. నువ్వు కూడా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకో..." అని సమ్రాట్ వెళ్ళిపోయాడు.
* * * *