పడుకొని కళ్ళు మూసుకొందన్న మాటేగానీ నిద్రపట్టడం లేదు. మనస్సు పరిపరి విధాల పోతోంది.
'ఇప్పటిదాకా మీటింగ్ పూర్తవదా? ఇంతసేపూ మీటింగ్ వుందంటే ఎలా నమ్మేస్తాననుకొంటున్నాడు? కనీసం ఫోనయినా చేయలేదు. ఫోను చెయ్యాలని గుర్తుకూడా ఎందుకుంటుంది. వుందిగా అన్నీ మరిపించే అసిస్టెంటు' అనుకుంది. 'రవళి' ఆలోచన రాగానే మనసు ఇరుకయిపోయినట్లనిపించింది.
కళ్ళముందు రవళితో కలిసి కబుర్లు చెప్పుకొంటూ నవ్వుతూన్న శరత్ చంద్ర కనిపించాడు. తనకి తానొక ఫూల్ లా అనిపించింది. ఎందుకో తనమీద తనకే జాలేసింది. మనసు ఉడికిపోయింది.
"మమ్మీ! డాడీ ఇవాళ కూడా ఇంటికి రారా?" మంచంలో పడుకొని ప్రక్కకు తిరిగి కళ్ళు విప్పార్చి తల్లిని చూస్తూ అడిగింది మువ్వ.
చిర్రెత్తుకొచ్చింది నీలిమకి, ఉన్న చిరాకు చాలక వీళ్ళ నస ఒకటి.
"నువ్వింకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావా? కళ్ళు మూస్తావా లేదా?" విసుక్కుంది.
బిత్తరపోయింది మువ్వ. ఎక్కడ లేని గుబులు కలిగింది మనసుకి.
తండ్రంటే చాలా యిష్టం మువ్వకి. సాయంత్రం శరత్ చంద్ర ఫోన్ చేసినప్పటినుండీ అతనికోసం ఎదురు చూస్తోంది. ఆ రోజు..... డాడీ దగ్గర పడుకోవాలని, డాడీ ఛాతిమీద వెంట్రుకలని ఒకదానితో ఒకటి ముడివేసి-గట్టిగా పీకి ఆడుకోవాలనీ చాలా - చాలా ఊహించుకొంది. డాడీ అరుస్తుంటే చాలా ఆనందం తనకి.
సాయంత్రం నుండీ యింట్లో సంభాషణలు మువ్వ చెవిలో పడుతూనే వున్నాయి. తండ్రి గురించి వాళ్ళేవో అనుకోవడం ఆ చిన్న మనసుకి చాలా కష్టం కలిగింది. తండ్రిని ఎవరు చిన్నచూపు చూసినా భరించలేదు! తండ్రినెవరు ఒక్కమాట మాట్లాడినా అభిమానపడి పోతుంది. ఏదో తెలియని అభద్రతా భావానికి గురయింది. ఆ పిల్ల మనసంతా గుబులు ఆవహించింది. ఒక్కసారి తండ్రిని చూడాలనీ, అతన్ని హత్తుకుపోవాలనీ తండ్రి తలని ఒడిలో పెట్టుకుని లాలించాలని పసితల్లి మనసు విలవిల్లాడింది. అందరూ కలిసి తండ్రిని ఏకాకిని చేస్తున్నట్లు తల్లడిల్లిపోయింది! పైగా తల్లి కసురుకోవడంతో మరింత క్రుంగిపోయింది. కళ్ళ వెంట నీరు కారుతుండగా అలాగే కళ్ళు మూసుకు పడుకొంది.
హాల్లో మంచంమీద పడుకొని అసహనంగా కదిలాడు రాఘవయ్య. చంటిపిల్ల ప్రశ్నకి కూతురి కసిరింపు విన్నాడు. అల్లుడి పదధతి అసలు నచ్చలేదు ఆయనకి. తల్లీపిల్లలు ఎంత నలిగిపోతున్నారో అర్ధం అయింది. అల్లుణ్ణి గట్టిగా మందలించాలనుకున్నాడు.
తల్లి కసురుకున్న తర్వాత అన్నవైపు తిరిగి పడుకుంది మువ్వ "అన్నయ్యా! డాడీ ఇంకా రాలేదు" గుసగుసగా అంది, దుఃకం నిండిన గొంతుతో. తన మాట తల్లి ఎక్కడ వింటుందోననే భయం కూడా వుంది మాటలో. తల్లి కోప్పడటం తప్పనిపించలేదతనికి. 'పాపం మమ్మీ మాత్రం ఏం చేస్తుంది? ఒక్కతే ఎన్నని చూసుకుంటుంది?' అనుకున్నాడు. చెల్లిని అలా చూస్తే జీవన్ కి అన్నిటికి కారణమైన తండ్రిమీద కోపం ఇంకా పెరిగింది.
ఇంట్లో పరిస్థితి అతన్ని చాలా బాధపెడుతున్నాయి.
పొరుగూరు నుండి తాతయ్యా, అమ్మమ్మ తనని చూడడానికి వచ్చారుగానీ, ఈ వూళ్ళో వున్న కన్నతండ్రికి చూడటానికి కుదరలేదా? నిన్ననగా యాక్సిడెంట్ అయితే ఎలా వున్నానన్న ఆలోచన కూడా కలగలేదా? ఎందుకు తనంటే అంత నిర్లక్ష్యం? తనకన్నా హాస్పిటలూ, పేషెంట్స్ ఎక్కువయిపోయారా?
ఏవేవో ఆలోచనలు మెదడును తొలిచి మనసుని సలుపుతున్నాయి.
"డాడీ యివ్వాళ ఇంటికి వస్తానని చెప్పారుగా? నా కిప్పుడు డాడీ దగ్గర పడుకోవాలనుంది" ఏడుపు ఆగలేదు మువ్వకి. ఎంత పెద్దదయిపోయినట్లు శబ్దం రాకుండా వెక్కుతూ అంది.
తమ ఇద్దరి తగాదాలో, చిన్నది కదా అని తల్లిదండ్రులు మువ్వని సపోర్టు చేసినప్పుడూ, వాళ్ళ ప్రేమని తనకన్నా మువ్వే ఎక్కువ పొందుతుందని అనుమానం వచ్చినప్పుడూ, తన వస్తువులు కావాలని పోటీ పడేటప్పుడూ, తప్ప చెల్లెలంటే ప్రాణం జీవన్ కి.
మువ్వ అలా తన ప్రక్కన పడుకొని వెక్కుతుంటే కదిలిపోయాడు. ప్రేమ నిండిన గొంతుతో ఎంతో పెద్దరికాన్ని ఆపాదించుకొని, "రారా నాన్నా! డాడీ వచ్చేదాకా నన్ను ఆనుకొని పడుకో. నేనీ డాడీని. నువ్వు నా బంగారు తల్లివి. నా దగ్గరగా ఆనుకొని పడుకోరా తల్లీ"! అన్నాడు. కాలికట్టుతో చెల్లివేపు తిరిగి పడుకునే పరిస్థితిలో లేడు జీవన్.
కొద్దిగా లేచి, చెల్లిని రెండు చేతులతో దగ్గరకు లాక్కున్నాడు. పసిదాన్ని తన శరీరానికి ఆనించి పడుకోబెట్టుకుని, ఒక చెయ్యి లాక్కొని తన గుండెమీద పెట్టుకొని హత్తుకున్నాడు.
కళ్ళనీళ్ళు తుడిచి, బుగ్గలు నిమిరి ముద్దులిచ్చాడు. మువ్వ తండ్రి దగ్గర పడుకున్నప్పుడు కూతురి వీపు నిమురుతూ ఎలా నిద్రపుచ్చుతాడో అలాగే చేశాడు. ఆ పూటకి తానే తండ్రయి చెల్లెని అక్కున చేర్చుకున్నాడు.
అన్న స్పర్శలో తండ్రి సామీప్యాన్ని అనుభవిస్తూ చిట్టితల్లి నిద్రలోకి జారుకుంది. అటుతిరిగి పడుకున్న నీలిమ ఇవన్నీ గమనించే స్థితిలో లేదు.
* * * *
మీడియం సైజులో వుందా హాలు. సోఫాల్లాంటి కుర్చీలు వరుస ప్రకారం హాలునిండా పరచుకొని వున్నాయి. ముందు భాగంలోని డయాస్ మీద ఓ టేబిలూ, నాలుగు కుర్చీలూ వేసివున్నాయి.
గోడలకి నాలువైపులా వైద్య శాస్త్రజ్ఞుల రూపాలు పెయింటింగ్స్ లో వేళ్లాడుతున్నాయి.
ముందు భాగంలోని కొద్ది కుర్చీల్లో కార్డియో థొరాసిక్ సర్జన్లూ, ఎమ్.సి.హెచ్. స్టూడెంట్లూ, బ్లడ్ బ్యాంక్ ఆఫీసరూ, మైక్రోబయాలజిస్టులూ కూర్చునివున్నారు. మిగతా హాలంతా ప్రాణంలేని మొండెంలా వెలవెలబోతోంది.
అందరూ ఏదో ఉద్వేగంగా మాట్లాడుకొంటున్నారు. అప్పుడే వచ్చిన శరత్ చంద్రని చూసి మాటలాపి అందరూ అతనికి విష్ చేశారు.
"హలో.... శరత్ చంద్రా.....! హీరో ఆఫ్ ద డే... కమాన్!" నవ్వుతూ ఆహ్వానించాడు భగవంతం.
"హలో.....!" అని భగవంతం వైపోసారి చూసి కుర్చీలో కూర్చుంటూ "హీరో ఏమిటి?" అన్నాడు అర్ధం కానట్లు శరత్ చంద్ర.
"ఇవ్వాళ్టి హాట్ న్యూస్ కి మీ పేషెంటే గా కారణం. సో.... యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్" అంటూనే పెద్దగా నవ్వాడు.
అతని నవ్వులో అక్కడెవరూ నవ్వు కలపకపోవడంతో ఆ నవ్వుని మెల్లగా వెనక్కి తీసుకున్నాడు. డైరెక్టర్ పరమేశ్వరం కూడ గదిలోకి రావడంతో వాతావరణం మారిపోయింది.
"గుడీవినింగ్ ఎవ్విరిబడీ! అంటూ తన సీటులో కూర్చున్నాడు పరమేశ్వరం. మరీ పొడవు, పసిమి ఛాయ - యాభయ్యేళ్ళ వయసుంటుంది. బట్టతల అతని హోదాకొక అందాన్నిచ్చింది.
సాయంకాలపు చల్లనిగాలి ఆ గదిలోకి జొరబడి అందర్నీ పలకరించింది. అస్తమిస్తున్న సూర్యుడి తాలూకు ఎర్రని కిరణాలు, తెరిచిన కిటికీ అద్దాలపై పడి పరావర్తనం చెంది, ఆ ఎర్రని వెలుగు గదిలో కూర్చున్న వాళ్ళ మొహాలమీద పడుతోంది.