ముందు పోలీసులు వచ్చారు. జనాన్ని అక్కడినుంచి తోసి వేశారు. చైతన్య వచ్చే సమయానికి అతడు మరింత దూరం తోసి వేయబడ్డాడు.
అక్కడనుంచి అతడు అంగుళం అంగుళం కదులుతూ ముందుకు ప్రయాణించాడు. బట్టలు నలిగిపోయాయి. జుట్టు రేగిపోయింది. చెప్పాలి.... చైతన్యకి చెప్పాలి....
అతడు కాస్త దగ్గరగా వచ్చాడు. దూరంగా రంగనాయకి కనబడుతూంది. ఇస్మాయిల్ ఆమెనే చూస్తున్నాడు. ఎంత వడిలిపోయింది. కాలమూ దుఃఖమూ ఆకారణంగా ఆమెను ఎంత బలిచేశాయి. నుదుటిమీద సూర్యుడిలాంటి బొట్టుతో మొహంమీద వెన్నెలలాంటి నవ్వుతో వెలిగే ఈమె ఎలా అయిపోయింది?
ఇస్మాయిల్ మరో అడుగు వేశాడు.
బ్రాహ్మణుడు పిండాలు తయారు చేస్తున్నాడు. ఇస్మాయిల్ మరింత ముందుకొచ్చాడు. సరిగ్గా అప్పుడే చైతన్య సెక్రటరీ సుబ్బరాజు దృష్టి అతడిమీద పడింది. రాజు భ్రుకుటి ముడిపడింది.
ఇక్కడ- ఈ జనం మధ్య ఇతను.
ఎందుకీ ముసల్మాను చైతన్యని ఇంతలా వెంబడిస్తున్నాడు? బంధువని చెప్పి ఇంట్లో ప్రవేశించాడు. మళ్ళీ ఇక్కడ....
చైతన్యకి ఏదైనా అపాయం తలపెట్టటానికా?
ఆ ఊహ రాగానే రాజు ఇన్ స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. చెవిలో ఏదో చెప్పాడు. ఇన్ స్పెక్టర్ తలూపి ఇస్మాయిల్ వైపు పరుగెత్తాడు. వెనుకనుంచి ఎవరో పట్టుకోవటంతో తలతిప్పి చూసిన ఇస్మాయిల్ కి ఇన్ స్పెక్టర్ కనిపించాడు. అది ఊహించక పోవడంతో గింజుకున్నాడు. దానితో ఇన్ స్పెక్టర్ అనుమానం ధృవపడింది. లాఠీతో బలంగా కొట్టాడు.
సరిగ్గా అదే సమయానికి బ్రాహ్మణుడు చైతన్య చేతిలో పాలప్రస్తోక్యం పెడుతూ "పిండప్రధానం చెయ్యి బాబూ" అంటున్నాడు.
తలమీద నుంచి కారే రక్తాన్ని చేత్తో అదిమిపట్టే ప్రయత్నం చేస్తూ స్పృహతప్పి కళ్ళు మూతలు పడుతూ వుండగా ఇస్మాయిల్ అరిచాడు.
"బాబూ చైతన్యా! పిండప్రధానం చెయ్యకు, నీ తండ్రి బ్రతికే వున్నాడు."
జనం కేకలమధ్య- ప్రజల అరుపుల మధ్య ఆ మాటలు చైతన్యకి లీలగా, రంగనాయకికి స్పష్టంగా వినిపించాయి.
పోలీసుల చేతుల మధ్య వాలిపోయిన ఇస్మాయిల్ మొహం రంగనాయకి చూసింది.
జ్ఞాపకాల పొరలు చీల్చుకుని పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన స్మృతి-
ఇ...స్మా....యి...ల్....భాయ్!
పోలీసులు అతన్ని తీసుకుపోతున్నారు.
"సుబ్బరాజూ అతన్ని ఆపు" అరిచింది ఆమె.
తల్లిని చూసి చైతన్య ఏమీ అర్ధంకాక లేచాడు. జనం ఒక్కసారిగా నిశ్శబ్ధమయ్యారు.
పుష్కరపు నది హోరుతప్ప అంతా నిశ్శబ్దం.
* * * *
పాకిస్తాన్ శత్రుసైన్య నిర్బంధశాల.
ఎత్తయిన రాతి కట్టడాల మధ్య ఒక రాత్రి!
జగదీష్ ప్రసాద్ ఆ కిటికీలోంచి బయటకు చూశాడు. అంతా నిర్మానుష్యంగా వుంది. ఆ కిటికీ, ఆ పరిసరాలూ- అంతా అతడికి పాతిక సంవత్సరాలుగా గుర్తు. ప్రతి అంగుళమూ అతడికి పరిచయమే. ఆ చీకటి గదిలో అతడు పాతిక సంవత్సరాలుగా వుంటున్నాడు. అవన్నీ వరుస గదులు. ముందు వరండా కిటికీలోంచి పడే వెలుతురు తప్ప అంతా చీకటే. గదుల్లోకి కొంత మంది బందీలుగా వస్తూ వుంటారు. దూరంగా అప్పుడప్పుడు తుపాకీ శబ్దాలు వినిపిస్తూ వుంటాయి. కొంతమంది కనపడకుండా పోతారు. పరస్పర యుద్ధఖైదీలు మార్పిడి ఒప్పందం క్రింద కొంతమందిని రెండు దేశాలూ మార్చుకుంటాయి.
జగదీష్ ప్రసాద్ మాత్రం పాతిక సంవత్సరాలుగా ఆ ఖైదులోనే వుండిపోయాడు. అక్కడే అతడు వృద్ధాప్యం అంచుకు చేరుకున్నాడు. అతడిని ఖైదీలందరూ గౌరవంతో చూసుకునేవారు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు.
పాతిక సంవత్సరాలుగా అతడు నోరు విప్పి ఒక్కమాట మాట్లాడలేదు. ఒక మునిలా, యోగిలా వుండిపోయాడు. అతడితో మాట్లాడించటానికి అధికారులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అతడు భారతదేశపు తోటి ఖైదీలతో కూడా నోరు విప్పలేదు.
జగదీష్ ప్రసాద్ సరిహద్దు ప్రాంతాల్లో రాడార్ క్యాంప్ లో పనిచేసేవాడు. అప్పుడే అతడొక విలక్షణమైన సిద్ధాంతం కనుక్కున్నాడు. ఆ "బీమ్ వైబ్రేటర్"ని విమానంలో అమరుస్తే, ఆ విమానాన్ని పట్టుకోవటం రాడార్ కి సాధ్యంకాదు. శత్రుదేశపు రాడార్ లని అయోమయపరిచే పరికరాలు మన విమానాల్లో అమర్చి సరిహద్దులవతలకి పంపి, శత్రుసైనిక శిబిరాలని ధ్వంసం చేస్తే, అవి ఏ ఆటంకము లేకుండా తిరిగి రావచ్చు. ఈ పరికరం ద్వారా సైన్యం సాంకేతికపరంగా వంద సంవత్సరాలు ముందుకు వెళుతుంది.
తను కనుక్కున్న ఆ అపురూపమైన పరికరం గురించి జగదీష్ పై అధికారికి చెప్పి బాబా ఆటమిక్ రీసెర్చి సెంటర్ లో మరికొన్ని పరిశోధనలు చేస్తే దీనికి పరిపూర్ణత్వం వస్తుందని అన్నాడు. అంత చిన్న వయస్సులో అతడు సాధించిన ఈ విజయం పై ఆఫీసర్ లో అసూయ రేపింది.
జగదీష్ ఆ రోజుల్లో భార్య రంగనాయకి, ఏడాది నిండని కొడుకు చైతన్యతో ఆ క్యాంపులోనే, సరిహద్డుకి కొంత దూరంలో వున్న రాడార్ క్యాంపులో వుండేవాడు. తమ రీసెర్చి పూర్తిచేసుకోవటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలుపగానే జగదీష్ ఆనందంతో పొంగిపోయాడు. ఆ రాత్రి అతడు భార్యతో అన్నాడు. "నెలరోజుల్లో తిరిగివస్తాను. ఇన్నాళ్ళూ నీ భర్త రాడార్ లో పనిచేసే చిన్న ఉద్యోగి మాత్రమే. త్వరలో దేశం గర్వించదగ్గ వ్యక్తి అవుతాడు."
"నేను కూడా మీతో ఢిల్లీ వస్తానండీ. ఈ నెలల కుర్రవాడిని పెట్టుకుని నేనీ కొండలమధ్య వుండలేను."
"లేదు రంగనాయకీ. నాకు ఏకాంతం కావాలి. రాత్రింబవళ్ళు పనిచేయాలి. మీరుంటే ఆ పని సాగదు. నేను దాదాపు అంతా కనుక్కున్నాను. తుది మెరుగులు మాత్రమే మిగిలివున్నాయి. ఎంత? కేవలం నెలరోజులు. అంతే."
బయట హారన్ వినిపించింది. అతడు కొడుకు చెంపమీద ముద్దు పెట్టుకుని వచ్చి వ్యాన్ ఎక్కాడు. ఆ తరువాత హెలికాప్టర్ లో అతడు రీసెర్చి సెంటర్ కి తీసుకురాబడ్డాడు. అధునాతనమైన సాంకేతిక పరికరాల మధ్య అతడు దాదాపు రెండు నెలలు బయట ప్రపంచాన్ని మర్చిపోయి శ్రమించాడు. అతడికి అన్ని వసతులూ కల్పించబడ్డాయి. అతడి కృషి నిర్విఘ్నంగా సాగింది. అతడి శ్రమ ఫలించింది. అతడు కనుక్కున్న పరికరాన్ని విమానంలో అమర్చారు. విమానం గాలిలోకి ఎగిరింది. ఠాడార్ వచ్చి పట్టుకోలేకపోయింది.
"సక్సెస్" చిన్నపిల్లాడిలా అరిచాడు అతడు. దేశానికి అతడిచ్చిన విలువైన కానుక అది.
రీసెర్చి సెంటర్ చీఫ్ వచ్చి జగదీష్ ని అభినందించాడు. "దేశం గర్వించదగ్గ వ్యక్తివి నువ్వు. సాంకేతికరంగంలో అత్యుత్తమ బహుమతికి నీ పేరు రికమెండ్ చేస్తున్నాను."
జగదీష్ ఆలోచనలు అక్కడ లేవు. భార్యతో ఈ వార్త పంచుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది.
"ఏవీ ఆ ఫార్ములా కాగితాలు?" చీఫ్ అడిగాడు.
"క్షమించండి. వాటిని ప్రధానిద్వారా జాతికి అంకితం చేయాలనుకుంటున్నాను" అన్నాడు జగదీష్.
అధికారులు మొహాలు చూసుకున్నారు. "తప్పకుండా అలాగే చేద్దురుగానీ. ప్రధానితో మీటింగ్ ఏర్పాటు చేయిస్తాను" అన్నాడు చీఫ్.
ఆ సాయంత్రం అతడి గౌరవార్ధం పార్టీ జరిగింది. పార్టీలో ఈ ప్రసక్తి మళ్ళీ వచ్చింది.
జగదీష్ అన్నాడు. "కాగితాలూ అంటూ ఏమీలేవు. ఆ ఫార్ములా ఎంత విలువైనదో శత్రువుల చేతిలో పడితే ఎంత హానికరమో నాకు తెలుసు. మొత్తం వివరాలన్నీ నా మనసులోనే ముద్రితమై వున్నాయి."
చీఫ్ అన్నాడు- "నువ్వు ప్రధానికి ఏం చెప్తావో.... ఈ సెంటర్ అత్యున్నతాధికారిగా నాకు ముందు తెలియాలి."
"నేనేం సాధించానో మీరు చూశారు కదా."
"చూసినా- వివరాలు తెలియాలి కదా."
"మీరింత చిన్న విషయానికి ఎందుకంత పట్టుపడుతున్నారో నాకు అర్ధం కాలేదు."
"అదే ప్రశ్న నేనూ వేయగలను. నీ తోటి సైంటిస్టులకు అంతా వివరంగా చెప్పు. నివేదిక తయారుచెయ్యి. దాన్ని ప్రధానికి అందచేద్దాం."
"క్షమించండి. ఈ వివరాలన్నీ తోటి సైంటిస్ట్ లతో చర్చించేవికావు. ఒక విభాగం చేసేపని మరో డిపార్టుమెంట్ కి తెలియకుండా ఈ పరికరం తయారుకావాలి. అసెంబ్లింగ్ చేసే వ్యక్తికి మాత్రమే చివరి విషయం తెలియాలి. ఈ విధమైన ఏర్పాట్లు లేకపోతే ఈ రహస్యం బయటికి పొక్కే అవకాశం వుంది అందుకే "ప్రధాని" అంటున్నాను. దయచేసి ఈ విషయంలో మీరు నన్ను వత్తిడి పెట్టొద్దు" నమ్రతగా అన్నాడు.
అధికారి మొహంలో రంగులు మారాయి. అప్పటివరకూ వున్న ప్రసన్నత పోయింది. జగదీష్ మెడపట్టుకుని దగ్గిరకి లాగాడు. విసురుగా మొహం పైకెత్తుతూ "ఎలా చెప్పవో చూస్తాను. గూఢచారి విభాగం గురించి తక్కువ అంచనా వేసినట్టున్నావు. ఎలాంటి నిజాన్నయినా కక్కించగల్గే సామర్ధ్యం వాళ్ళకుంది" అన్నాడు.
జగదీష్ విస్మయంతో, "మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధంకావటం లేదు" అన్నాడు.
"నువ్వున్నది ఇండియాలో కాదు. పాకిస్తాన్ లో! అర్ధమాయిందా?"
జగదీష్ మీద పిడుగు పడినట్టయింది. "అంటే.... అంటే.... నేనీ రిసెర్చి చేసింది శత్రుదేశంలోనా? నేనున్నది ఢిల్లీలో కాదా?" తడబడుతూ పిచ్చెక్కివాడిలా అన్నాడు.
"కాదు. రిసెర్చి సెంటర్ చీఫ్ ని కూడా నేను కాదు. నా పేరు అజ్మరాలీ. సైన్యంలో అధికారిని. నన్ను ఇండియన్ సరిహద్దు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి నీతో రహస్యం చెప్పిందే బాధ్యత నామీద పెట్టింది ప్రభుత్వం."
జగదీష్ ప్రసాద్ మొహం వాడిపోయింది. ఏమీ తోచనివాడిలా నిశ్చేష్టంగా వుండిపోయాడు. అజ్మరాలీ అతడి దగ్గరికి వచ్చాడు. "మీ దేశంలో నువ్వు కలలో కూడా ఊహించని సౌఖ్యాలు ఇక్కడ అమరుస్తాను. నీ భార్యపిల్లల్ని ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది. చెప్పు."
"నేను చెప్పను" క్లుప్తంగా ప్రసాద్ అన్నాడు. అజ్మరాలీ వెళ్ళిపోయాడు. మిగతావాళ్ళు అతడికి ఎన్నో విధాల నచ్చచెప్పారు. అతడు వినలేదు. ఆ తర్వాత మొదలైంది. నరకం. అతడిని రకరకాలుగా హింసించటం ప్రారంభించారు. కలలో కూడా ఊహించని బాధలు పెట్టారు. అతను చెప్పలేదు.
అతడిని ఒక చీకటి గదిలో బంధించారు. మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా వుంచారు. చిత్రహింసలు పెట్టారు. అతడి కళ్ళు గాజుగోళాల్లా నిస్తేజమయ్యాయి. అతడి శరీరం శుష్కించి పోయింది. ఒక్కటే మాట." మీరు చంపినా చెప్పను."
పదేళ్ళు గడిచాయి. సుదీర్ఘమైన ప...దే...ళ్ళు... అతడు వుడకబెట్టిన దుంపలా తయారయ్యాడు. మరింకెంతో కాలం బ్రతకడనిపించేలా తయారయ్యాడు.
అజ్మరాలీ సైన్యంనుంచి తిరిగి ఈ డిపార్టుమెంట్ కి వచ్చాడు. జగదీష్ ప్రసాద్ పరిస్థితి చూసి మిగతా ఆఫీసర్లని తల వాచేట్లు చివాట్లు పెట్టాడు. అతడిని మిగతా ఖైదీల్లో కలిపి వుంచమని ఆజ్ఞ యిచ్చాడు. అతడితో అన్నాడు- "పది సంవత్సరాలుగా నువ్వీ రహస్యం చెప్పలేదంటే మరిక చెపుతావని నాకు నమ్మకం లేదు. మామూలు పరిస్థితుల్లో అయితే నిన్ను చంపెయ్యాలి? సైన్యం సంగతి నీకు తెలియనిదేముంది? మనకు దక్కనిది పరాయివాడికి దక్కకూడదు అన్న సిద్ధాంతం. అయితే ఒక సైంటిస్ట్ గా నీమీద నాకు గౌరవం వుంది. అందువల్లే నిన్ను చంపేయకుండా వుంచుకున్నాను. అయితే జీవితాంతం నీకు స్వేచ్చ మాత్రం వుండదు."