Previous Page Next Page 
జయ - విజయ పేజి 17


    "ఎందుకేమిటి నీ తలకాయ? నన్నూ, నా రూపాన్నీ చూసి నేనే విజయనంటూ ఇకిలిస్తే ఆయన నాతో యింకేం మాట్లాడతారు? "హా! మీరా విజయగారు? ఇంత అందంగా ఉత్తరాలు రాసే మీరు యింత అందవికారులా?" అని మూర్చబోరూ? అందుకే అబద్ధం చెప్పేశాను! విజయ లేదంటే వెళ్ళిపోతారు గదా అని అనుకున్నాను. తీరా చూస్తే ఆయనేమో ఎలాగోలా విజయగారిని కలుసుకోవలసిందేనని మొండికేసి బస్ ప్రయాణం కూడా పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు యింట్లోకి రావడం చూసి నువ్వే విజయవని అనుకుంటున్నారాయన. నువ్వు ఓ పని చెయ్! నువ్వే విజయ వయినట్లు కాసేపు ఆయనతో మాట్లాడి పంపించెయ్."
    "బాబోయ్! కొంప మునిగిపోదూ?"
    "ఎవరిది?"
    "ఎవరిదేమిటి మనదే!"
    "ఏం మునగదు! నువ్వెళ్ళు త్వరగా!"
    "ఊహు! వద్దే! నాకు భయం!" గాబరాగా అంది జయ.
    "ప్లీజ్, మా డార్లింగ్ వి కదూ"
    "ఇలాగే! నాకు సరిగ్గా మాట్లాడడమే రాదు! ఆయన కథలేవో నాలుగయిదు చదివానుగానీ నవలల టాపిక్ ఎత్తితే పారిపోయి రావలసి వస్తుంది."
    "నీకెందుకు? నీతోపాటు నేనూ వచ్చి కూర్చుంటాగా?"
    "కానే ఇదంతా ఎందుకొచ్చిన గొడవక్కా! నేను వెళ్ళి ఆయనకు క్షమార్పణ చెప్పుకుంటాను! మా అక్కయ్య సరదా కోసం మీతో అలా అబద్ధం చెప్పింది అని!"
    "అమ్మో! ఇంకేమయినా ఉందా? ఆయన నా గురించి చెడుగా అనుకోరూ!"
    "ఏమో అక్కా! నువ్వే విజయవని ఆయనకు నిజం చెప్పేసినంత మాత్రాన జరిగే నష్టం ఏమిటో నాకు అర్థం కావటం లేదు."
    "నీకు ఎంత చెప్పినా అర్థంకాదు లేవే! ఇప్పుడు నిన్ను చూసి నన్నే 'విజయ' అనుకున్నారనుకో!
    తనకు ఉత్తరాలు రాసే అమ్మాయి ఇంత అందమయిన అమ్మాయి అని తెలుసుకుంటే ఆయనకు ఎంత గర్వంగా, ఆనందంగా ఉంటుంది? ఆయన ఊహించే రూపం కన్నా అందంగానే ఉంటావు నువ్వు! నువ్వు ముందుకెళ్ళి ఆయన దగ్గర కూర్చుని కాసేపు మాటలాడి పంపించెయ్." ఆమెనా గదిలోనుంచి బయటకు బలవంతంగా నెడుతూ అంది విజయ. జయ భయంగానే హాల్లోకొచ్చింది.
    "రండి! ఎలాగయినా సరే మిమ్మల్ని కలుసుకోవాలని ఏడు గంటల ప్రయాణం కూడా కాన్సిల్ చేసుకున్నాను!" నవ్వుతూ అన్నాడతను.
    "అవునట! మా విజయ చెప్పింది."
    "విజయా! ఆశ్చర్యంగా అడిగాడతను.
    "అదే, జయ." తడబడుతూ అంది జయ.
    కొద్ది నిముషాలు తన కుటుంబం గురించి వివరాలు చెప్పి, ఆమె గురించి వివరాలు తెలుసుకున్నాడతను.
    "మీరేమీ అనుకోనంటే మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను." సందేహంగా అన్నాడతను.
    "ఏమిటది?" ఆసక్తిగా అడిగింది జయ.
    "మీరు ఇంత అందంగా ఉంటారని నేనసలు ఊహించనేలేదు." నవ్వుతూ అన్నాడు.
    జయ సిగ్గు పడింది. ఆమెకు కొంచెం గర్వం కూడా కలిగింది.
    "మీరు పొగుడుతున్నారు." అంది సిగ్గుపడుతూ.
    "ఊహు! నాకా అలవాటు లేదు. ఉన్నదున్నట్లు మాట్లాడడమే నాకిష్టం."
    కొద్దిక్షణాలు మౌనంగా గడిచినయ్.
    జయ చూపులు మరల్చుకుంది అతనివంక చూడలేక.
    "మీరు సిగ్గుపడుతున్నట్లున్నారు కదూ?"
    "ఊహు! అదేం లేదు."
    "ఇది అన్యాయం విజయగారూ! ఉత్తరాల్లో అంత ధైర్యంగా స్వేచ్చగా కబుర్లు చెప్తారు! తీరా ఎదుటికొస్తే ఇలా మాటలే కరువయిపోతే ఎలా?"
    "నేను ఏం మాట్లాడమంటారో చెప్పండి! మాట్లాడతాను!"
    "ఏదొకటి! మీ ఆఫీస్ విషయాలో, మీ రజని గురించో?"
    "రజనా?" ప్రశ్నార్థకంగా అడిగింది.
    "బావుంది. మీ స్నేహితురాలినే మర్చిపోయారా ఏమిటి? మీతోపాటు ఆఫీస్ లో పనిచేసే ఆవిడ పేరు రజనే కదూ?"
    "ఓ గుర్తుకొచ్చింది. రజని అంటే ఇంకా నా కాలేజి ఫ్రెండ్స్ ఎవరి గురించయినా మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నాను." ఖంగారు అణచుకుంటూ అందామె.
    "ఈ మధ్య మంచి బుక్స్ ఏమయినా చదివారా?" అడిగాడతను.
    "బుక్సా...ఏం పుస్తకాలు!" అయోమయంగా అడిగిందామె.
    "అయ్యో! మీరు పాత ఇంగ్లీష్ నవలలు ఎంతో ఇష్టంతో చదువుతుంటానని రాశారుగా. అదికూడా మర్చిపోయారా ఏమిటి?"
    "ఆ...అదా! ఈ మధ్య కొంచెం ఆఫీస్ పని ఎక్కువగా ఉంటోంది. అందుకని ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోవడంతోనే సరిపోతుంది." ఉక్కిరి బిక్కిరయి సర్దుకుంటూ అందామె.

 Previous Page Next Page