నారా: నువ్వు చెప్పింది నిజం కాదనను. కాని, ఆ దృష్టి స్వరాజ్యపార్టీ వైపు మరల్చరా. తాము శాసనసభల్లోకి వెళ్ళి వెలగబెట్టేది ఏమీలేదని తెలుసును. వట్టి ప్రశ్నలు అడగడం తప్ప వీరు చేసిన మహత్కార్యం లేదు. వీరు సలిపిన గడబిడ అంతా వృధాయని తెలుసును. కాంగ్రెసులో వుండి ఖైదుకు వెళ్ళలేరు, కష్టపడలేరు. శాసనసభలలో సభ్యులమని విఱ్ఱివీగడం తప్ప ఏమున్నది? సరియైనమార్గం చెప్పి దీక్షతో నడచుకోండర్రా అన్న ఆ మహాత్ముణ్ణి మూలకు తోశారు. ఆయన యేర్పరచిన బాటను నడిచే శక్తిలేక ఆక్షేపిస్తారూ? శాసనసభల్లో యుద్ధాలు చేసి, శాసనసభలు ముక్కలు చేస్తారా? దేశంలో పోనీ, అసంతుష్టయినా కలుగజేశారా? ఒక్కగాటిని నడవవలసిన దేశం భిన్న భిన్నమై ఎవరికి వారే యమునాతీరే అయింది! ఏమిటోయి స్వరాజ్యపార్టీ వారు చేసిన అద్భుత కృత్యాలు?
పర: ఒరేయ్! నీకు అసలు నిరాకరణ వాదం అంటే ప్రాణంగదా, పోనీ, మీబోటిగాళ్ళేమి చేశారు? ఖైదుకు వెళ్ళివచ్చి ఏ మొహం పెట్టుకొని మళ్ళా కళాశాలల్లో చేరారు?
నారా: నేను చేసినపని సరియైందని వాదించానటరా? ఆరు నూరైనా, నూరు ఆరైనా, ఓటే మార్గాన్ని నమ్ముకుని వుండలేకపోయిన హృదయ దౌర్బల్యానికి తలవంచుకుంటున్నాను. అంతే.
పర: కాని తీవ్రవాదనంటే నీకెంత ఇష్టమైనా స్వరాజ్య పార్టీ వారు చేసిన కార్యాలు కొంచెమయినా గమనించకపోతే ధర్మదూరం కాదురా!
నారా: వాళ్ళు అసలు చేయలేదని అనను. బార్డోలీ తీర్మానం తప్పనీ, గాంధీగారికి మెదడు లేదనీ, రీడింగు ప్రభువు రాజీకి వచ్చినప్పుడు 'ఫత్వా ఖైదీలు' అంటూ తాము బట్టిన కుందేటికి మూడేకాళ్ళని కూర్చున్నాడనీ మన మహానుభావాలు చేసిన హేళన _ ఏ కొద్దో కాంగ్రెస్ దేశానికి అర్పించిన పనిని మంటగల్పడమే కాకుండా, దేశానికి విషమైందని నా వాదన.
ఈ సంభాషణ స్నేహితులందరూ వినుచున్నారు. కొందరు విసుగుతో దూరముగాబోయి పేకాట మొదలుపెట్టిరి. కొందరు తామును సంభాషణలో బాల్గొనిరి.
స్నేహితులందరకు ఆ అయిదురోజులు త్రుటిలో వెళ్ళిపోయినవి. పరమేశ్వరమూర్తి గృహప్రవేశమునకై కొత్తపేట వెళ్ళినాడు. తక్కుంగల మిత్రులు, రాజమహేంద్రవరము నుండియే పనివివినారు.
జానకమ్మగారు కోడలిని జూచి మురిసిపోయినది. ఆమె పెద్ద వియ్యపురాలామెను జూచి 'ఏవమ్మా వదినా! సుఖపడాలని పెద్దకోడల్ని తెచ్చుకున్నావే. ఈవాళే పెద్దమనిషి అయ్యేలాగుంది' అనినది.
'ఇదివరకు కోడలు వచ్చి సుఖపెట్టింది, ఇప్పుడు ఈవిడ వచ్చి సుఖపెడ్తుంది! వాళ్ళ భార్యాభర్తలు కులాసాగా ఉంటే అదే పదివేలు' అనినది జానకమ్మగారు.
ఒక ఆవిడ: మీ కోడలు చాలా నాజూకుమంతురాలు. జమీందారు గారి అమ్మాయి పనేమి చేస్తుంది? మీకు కోడళ్ళు పని చెయ్యాలిటమ్మా అక్కా!
ఇంకో వనిత: ఏమమ్మా అత్తా! పెళ్ళివారు అతి నాజూకు వారు. ఒక్కరూ వచ్చి కూర్చోరు. పలకరించరు. ఇంత గర్వాలేమిటమ్మా? మనవాళ్ళని చూచి ఒకటే మూతులు ముడుచుకోవడము.
జానకమ్మ: అందుకోసమే ఈ సంబంధము మా వారికి ఇష్టము లేకపోయింది. మెడలు వంచి వొప్పించినారు.
వెంకాయమ్మ (నారాయణరావు అక్కగారు, శ్రీరామమూర్తి చెల్లెలు): అమ్మా, అదేమిటే అలా అంటావు! నిక్షేపం వంటి సంబంధము. తమ్ముడికి మరదలంటే చాలా ఆపేక్ష. కోరుకొని చేసుకొన్న పెళ్ళికూతురాయెను.
సత్యవతి: (నారాయణరావు రెండవ అక్కగారు) అక్కయ్యా! భార్యాభర్తలకు మనస్సు కుదిరిన సంబంధము చేసుకోవాలి. లేకపోతే వాళ్ళిద్దరి బ్రతుకూ యమలోకము.
వెంకాయమ్మ: నా తల్లీ, నీ ఖర్మం అలా కాలిపోయింది కాని, అన్ని సంబంధాలు భార్యాభర్తల ఇష్టంమీదే చేస్తున్నారటే?
జానకమ్మ: మగవాడు గౌరవము చేయని ఆడదాని బ్రతుకు అధమాధమం. డబ్బక్కర లేదు, పిల్లలక్కర్లేదు! మొగుడు ఆడది కూడా ఒక ప్రాణి అని తలపే లేక కుక్కకన్నా కనాకష్టంగా చూస్తే దాని బతుకు పేడలో దొర్లే పురుగుకైనా వద్దు.
సత్యవతి భర్త పరమకోపిష్టి. వట్టి అనుమానపు మనసువాడు. తన నీడను చూచి తాను భ్రమిసే పిచ్చిమనిషి. ఏదో వంక మీద భార్యను చావకొట్టును. బావగారితో మాట్లాడినావనును. మరిదివంక జూచినావనును. ఒకరోజంతయు తిండి పెట్టవద్దని తన తల్లికి నాజ్ఞ యిడి, గదిలో బెట్టి తాళము వేసినాడు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాలకుడు. ఒక బాలిక చిన్నతనములోనే జబ్బులు చేసి పోయినారు. పెద్దపిల్ల పదేళ్ళది. సత్యవతి స్పురద్రూపి, తీర్చిన కనుముక్కు సొబగుగల బంగారుశలాక వంటిది. వెన్నెల కిరణము, అందగత్తెయయిన భార్యను జూచినప్పుడు వీరభద్రరావు, వీరభద్రుడై నిష్కారణముగ జావగొట్టును. సుబ్బారాయుడుగారికి జానకమ్మ గారికి సత్యవతి చరిత్ర సంతతము మహావిషాదము కలుగజేయుచుండును. వారి జీవితయానములో సత్యవతీ చరిత్రయే నీటిక్రింద నణగియున్న భయంకరమగు శిలయైనది. పుత్రిక కొరకై జానకమ్మగారెన్ని గంగా యమునా ప్రవాహములు కన్నుల బ్రవహింపజేసినదో!
సూర్యకాంతము: (నారాయణరావు రెండవ చెల్లెలు) అక్కయ్యోయి! నేనూ చిట్టక్కయ్యా చిన్న వదిన దగ్గర ఉన్నాము నిన్నల్లాను. మొట్టమొదట ఏమి మాట్లాడింది కాదే! మేమే తెగ పలకరించాము. అప్పుడు మాట్లాడిందే. తన చదువు సంగతులు, సంగీతం సంగతి, వాళ్ళ చుట్టాల సంగతి అన్నీ చెప్పింది. మా ఇద్దరికీ స్నేహం కలిసిపోయింది.
రమణమ్మ: (నారాయణరావు పెద్ద చెల్లెలు) ఒసే అక్కయ్యా, నాతో రెండు మాటలేవో చెప్పింది. అంతే. సూరీడుతో ఒకటే కబుర్లు. వాళ్ళిద్దరికీ ప్రాణ స్నేహం కలిసిపోయింది.
వెంకాయమ్మ: ఏమి కబుర్లు చెప్పిందేమిటే సూరీడూ!
ఇంతలో జానకమ్మగారి రెండవ వియ్యపురాలు, వెంకాయమ్మ అత్తగారు వచ్చి 'ఏమండీ వదినా, ఈ రోజున ఇంకా పెళ్లికూతుర్ని తల దువ్వటానికి తీసుకురాలేదు. ఊళ్ళో వాళ్ళందర్నీ బంతులాడించటమునకు పిలిచాము. మేమంతా ముస్తాబయ్యాము. మీరూ, మీ అమ్మాయిలు సోదిపెట్టుకు కూర్చున్నారు అన్నది.
జాన: మా పెద్దమ్మాయి, సూరీడూ వెళ్ళి పెళ్ళికూతుర్ని తీసుకువస్తారు. సత్యవతీ మాణిక్యం మీరంతా పెళ్ళివారందర్నీ పేరంటానికి పిలవండి. సావిత్రీబాయి సంగీతపు కచ్చేరట! ఆడవాళ్ళకి ప్రత్యేకం. ఇది పెళ్ళికొడుకుగారి ఎరేంజ్ మెంట్. లెండర్రా, ఎవరిపనులు వారు చెయ్యండి మూడయింది అప్పుడే.
ఆ నాల్గవ నాటి సాయంత్రం ఊరిలో ఆడవారికి మాత్రం అచ్చు కార్డులు పంపినారు. ఈ పద్ధతి అంతయూ నారాయణరావు పరమేశ్వరమూర్తి లక్ష్మీపతులు చేసిన ఆలోచన. దగ్గర చుట్టాలను, పెద్దల ఇండ్లలో నాడంగులను మూడు మోటారు కార్లమీద జానకమ్మగారు, శ్రీరామమూర్తి భార్య, సూర్యకాంతము, మాణిక్యాంబ, శ్రీరామమూర్తి అత్తగారు, వెంకాయమ్మ అత్తగారు వెళ్ళి పిలిచివచ్చినారు.
విడిదిలో మధ్యహాలతి సౌందర్యముగ పెళ్ళికొడుకు, బరమేశ్వరుడు నలంకరించినారు. వచ్చిన స్త్రీమండలి వీలుగా కూర్చుండుటకు విచిత్రముగా నాసనము లమర్పించినారు. విసనకర్రలతో విసరుటకు పనికత్తెల నేర్పాటు చేయించినారు.
వేరే గదులలో వచ్చినవారందరకు నుపాహారములు, కాఫీ, పండ్లు నిచ్చిరి. తాంబూలములు, కర్పూరపు దండలు, చక్కని పూవులద్దిన ఖద్దరు రవికలు, వెండి కుంకుమ బరిణెలు, పూవుల గుత్తులు బొట్టుపెట్టి స్త్రీమండలికి నర్పించినారు. జడ్జీ భార్య, ఆంగ్ల సబ్ కలెక్టరు భార్య, మొదలగు గొప్పవారందరును వచ్చిరి. ఈ పద్ధతి నమీనముగా నుండుటచే, ఆడపెండ్లివారి వనితామణులందరు విచ్చేసిరి. వచ్చిన బాలబాలికలందరకు చక్కని వెండి బొమ్మలర్పింపబడినవి. సెంటు బుడ్లు అందరకు నిచ్చినారు. జేబురుమాళిచ్చినారు. సావిత్రి ఆరోజున తన గానవిద్యా ప్రౌఢిమ నానంద ప్రవాహముల బరపినది. ఆమె కంఠము వీణతీగయినది. ఆ మధుర దివ్యగాంధర్వములో వధూవరులిరువురు లీనమైపోయినారు. సంగీత కళాపాసకులగు నూతన దంపతుల యానందములో దివ్యత్వము జూరగొన్నది సావిత్రి.