ఈ మానసిక చిత్రవధతో, అస్పష్ట, అయోమయ ప్రవృత్తితో, ప్రతినిముషం ఓ సంఘర్షణగా, పోరాటంగా రోజులు నడవసాగాయి.
6
ఆశ జగన్నాథపురంలో ఓ చిన్న పెంకుటింటిముందు నిలబడి "వదినా!" అని పిలిచింది మృదుకంఠంతో మెల్లగా తలుపుతట్టి.
లోపలనుండి "ఓయ్" అన్న సన్నని గొంతు వినబడింది. ఒకటి రెండు క్షణాలు గడిచాక తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మంలోపల ఓ ఇరవయి ఏళ్ళయువతి నిలబడివుంది. ఎంతో అందంగా, సుకుమారంగా, లేతగా వున్నది ఆమె. చక్రాల్లాంటి ఆమె కన్నులలో సౌమ్యభావం తొణికిసలాడుతోంది. ఆశని చూడగానే ఆమె ముఖం వికసించింది.
"లోపలకు రా ఆశా!" అన్నది ఆనందంగా.
ఆశ ఆ యువతివెంట లోపలకు అడుగుపెట్టింది. ఆ చిన్న ఇల్లు ఓ మారుమూల సందులో వుంది. లోపలకు సరిగ్గా వెలుతురు రావటంలేదు. ఆశ పరిశీలనగా చూసింది. వంట యింటితోకూడా కలుపుకుని మొత్తం మూడుగదులు. గోడలు నల్లగా, మురికిగా వున్నాయి. ఆశకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"కూర్చో ఆశా. ఎన్నాళ్ళకో కనిపించావు. అబ్బ! నిన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. వంటరితనంతో ప్రాణం విసిగిపోతూందనుకో" అన్నదా యువతి ఎంతో ఆదరంగా.
ఆశ చాపమీద కూర్చుంది. "ఇవాళ నిన్ను చూడాలనిపించింది వదినా. ఇహ మనసు వుండబట్టలేదు. వెంటనే వచ్చేశాను" అంది.
ఆమె హాయిగా నవ్వి "ఎంత దయ!" అన్నది.
కాసేపు కుశల ప్రశ్నలూ, కులాసా కబుర్లు అయినాయి. "అన్నయ్య యింట్లో లేడా వదినా" అనడిగింది ఆశ తర్వాత.
ఆ యువతి తల ఆడించి "లేరు. ఇప్పుడే వస్తానంటూ ఎవరో స్నేహితుడింటికి వెళ్లారు. కూర్చో తొందరేముంది? భోజనం చేసి ఇక్కడే వుండి ఏకంగా సాయంత్రం వెళుదువుగాని" అన్నది.
"సాయంత్రంవరకే? అసలే నాన్నగార్కి తెలియకుండా వచ్చాను" అని నోరుజారిపోయి నాలిక కొరుక్కుంది ఆశ.
"ఎందుకు ఆశా సిగ్గుపడతావ్! ఇందులో రహస్యమేముంది? పోనీ కాఫీ అయినా తీసుకుందువుగాని. ఒక నిముషం" అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళింది.
ఆశ వదిన వెళ్లినవైపు చూస్తూ కూర్చుంది. ఆమెమీద అవ్యక్తమైన జాలి కలిగింది. ఎంత మంచిది వదిన! తామిద్దరూ ఒకరంటే ఒకరు ఎంత చనువుగా, అభిమానంగా వుండేవారు!
ఆమె కన్నులు మళ్ళీ చెమ్మగిల్లినాయి. మనసు మరీ మరీ ఆర్ధ్రమైపోయింది.
ఇంతలో లోపలనుండి ఆ యువతి "అన్నట్లు ఆశా... మీవారేమంటున్నారు?" అని అడిగింది.
ఆ యువతిపేరు జ్యోతి.
జ్యోతి విశ్వనాథరావుగారింటికి చిన్నకోడలుగా వచ్చింది. సుందరం మూడో ఏడు చదువుతూండగా ఓసారి సెలవులకి యింటికి వచ్చాడు. అతనప్పటికి మునుపటికన్నా నునుపు తేలాడు. కొంచెం ఆరోగ్యంగా కనబడుతున్నాడు. అవసరం వున్నప్పుడే కాకుండా మిగతా సమయాలలో మనసు దిటవు చేసుకొని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇదివరకటిలాగా శ్రమ అనిపించటంలేదు.
లలితమ్మగారు అతనిదగ్గరకు వచ్చి "ఏలూరు నుంచి రాజగోపాలరావుగారు, వారమ్మాయిని నీకిద్దామనే ఉద్దేశంతో వచ్చారు. ఏం చెప్పమంటావు?" అనడిగింది.
"నాకు చదువు పూర్తికాలేదు కదమ్మా. అప్పుడే ఎందుకు పెళ్ళి?" అన్నాడు సుందరం.
అప్పటికి ఆశకు ఇంకా పెండ్లికాలేదు. రామానికి పెళ్ళయింది. కాని మనోరమ అతని దగ్గర లేదు.
"పెళ్ళి అయినంతమాత్రాన చదువుకు అడ్డు ఏముంటుందిరా? చదువు పూర్తి అయినాకనే కాపురానికి తీసుకురావచ్చు" అంది లలితమ్మగారు.
సుందరం యీ ప్రతివాదనను కూడా నిరాకరిస్తూ "నాకు చేసుకోవాలనిపించటం లేదమ్మా ఇప్పుడు" అనేశాడు.
కొడుకుతో ఇంకేమీ అనలేక లలితమ్మగారు ఈ విషయం వెళ్ళి భర్తకు చెప్పింది. విశ్వనాథంగారు "వాడికిష్టం లేకపోతే బలవంతంలేదు. కాని, పాపం ఆయన ఎంతో ఆశతో వచ్చాడే! ఏమయినా సరే పెళ్లిచూపులకు రమ్మని ప్రాధేయపడుతున్నాడు. పోనీ వెళ్లి చూసివచ్చేద్దాం. లేకపోతే ఆయన బాధ పడతాడు. ఆనక ఏదో ఉపాయం చెప్పి తప్పించుకోవచ్చు" అన్నాడు.
సుందరం తండ్రిమాటలను కాదనలేకపోయాడు. జీవితంలో ఇంతవరకూ ఆయనకు ఎదురు సమాధానమిచ్చి ఎరుగడు. అంగీకరించక తప్పలేదు.
మరునాడు మధ్యాహ్నం కారులో బయలుదేరి తల్లిదండ్రులూ, అతనూ, ఆశా కలసి ఏలూరు వెళ్ళారు. వేసవికాలం కావటంచేత గోదావరి మీదనుంచి కార్లు పోతూనే వున్నాయి.
ఏలూరులో పెండ్లిచూపుల్లో సుందరం జ్యోతిని చూశాడు.
అతను ఉలిక్కిపడ్డాడు.
పెండ్లిచూపులు ఇంత అందంగా వుంటాయనీ, ఈ అద్భుత తరుణంలో, సుందర వాతావరణంలో ఓ చక్కని మూర్తిని చూడగలుగుతాడనీ, అతనికి ముందుగా తెలియదు.
జ్యోతిలో, ఆమె పలుచదనంలో, ఆ నయనదళకాంతులలో అతడ్ని ఏదో కవ్వించింది. అతని మనసు సంపుల్లమానమైనది. అతని ముఖం ప్రపుల్ల మయింది.
అతనిలో ఏదో అజ్ఞాతశక్తులు మేల్కొన్నట్లయింది.
ఇన్నాళ్ళు... ఆ గదిలో, చదువులో, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఏదో తెలియనిది కావాలని వుండేది. ఏదో వెలితి, తపన, ఉత్పన్నమయే ఆరాటం, అతనికి అర్థమయ్యేదికాదు.
ఇప్పుడు తనకు కావాల్సింది యిక్కడ వున్నదని తెలిసి వచ్చింది.