Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 17


    "నేను బ్రతికుండగా అది జరగనివ్వను. ఎక్కడున్నా వెతికి వేటాడి చంపుతాను."

    "నీ పేరేమిటి? ప్రనూష కదూ. నీ ధైర్యం నాకు ముచ్చటగా వుంది. ఇంత జరిగినా నీకు బ్రతుకుతాననే ఆశ వున్నదా? బ్రతికినా నువ్వెక్కడా? నేనెక్కడా? నన్ను మా దేశం వచ్చి వెతికి వేటాడి చంపుతావా? హాహా... తల్చుకుంటేనే నవ్వొస్తుంది. ఒక ఆడపిల్ల తన దేశం నుంచి మా దేశం వచ్చి అందులోనూ మా సైనిక గుడారాలోకి ప్రవేశించి నన్ను వెతికి చంపటం...."

    "ఇంకా పూర్తిగా వీడని నా తండ్రి ఆత్మసాక్షిగా చెపుతున్నాను. బ్రతికంటూ వుంటే నీ బ్రతుకు అంతం చేస్తాను."

    అతడి మొహంలో నవ్వు మాయమైంది. "సరే, ఇదేదో సీరియస్ గా ఆలోచించవలసిన విషయమే. ఇంతవరకూ నాతో ఇలా ఛాలెంజ్ చేసిన వాళ్ళెవరూ లేరు. నిన్ను వదలాలా లేదా అన్నది రేపు చెప్తాను. వదుల్తే మాత్రం ఇదే మన ఛాలెంజ్. అదీ గాక నా తెలివితేటలు గురించి, నేను మీ భూభాగం ఆక్రమించిన విధానం, మీ కోటలో పాగా వేసిన విధానం మీ వాళ్ళతో చెప్పటానికి ఒకరైనా బ్రతికి వుండాలి కదా! రేపు ఆలోచిస్తాను" అని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

    నన్నొక గదిలో బంధించి వుంచారు. ఆ రాత్రి చాలాసేపటివరకూ అమ్మనీ, నాన్ననీ తల్చుకుంటూ ఏడుస్తూ వుండిపోయాను. అర్ధరాత్రి దాటుతూ వుండగా బయట చప్పుడైంది. కిటికీసందుల్లోంచి చూశాను. ఒక కాపలాదారు రక్తపు మడుగులో పడి వున్నాడు. మరొకరితో ఎవరో పోరాడుతున్నారు. చావుకీ, బ్రతుక్కీ మధ్య పోరాటం.

    శత్రు సైనికుల చేహ్తిలో బాకు వుంది. అతడితో పోరాడే వ్యక్తిని గుర్తుపట్టాను. అతడి పేరు పాల్. మా యూనిట్ లో డాక్టరు. అతడికి పోరాడటం తెలీదు. అయినా సరే ప్రాణాలకి తెగించి చేస్తున్నాడు. మరో నిముషానికి రెండో కాపలాదారు కూడా నేలకొరిగాడు. డాక్టర్ పాల్ కూడా బాగా గాయాలయ్యాయి. అలాగే వచ్చి తలుపు తీశాడు. నేనేదో మాట్లాడబోతుంటే వద్దని సైగచేసి, చీకట్లోకి తీసుకెళ్ళాడు. దూరంగా కాపలాదారుల లైట్లు కనబడుతున్నాయి. వాళ్ళకి కొత్త అవటంవల్ల ఇంకా టోపోగ్రఫీ తెలియదు. మేము బయటపడటం కష్టం కాలేదు. దాదాపు ఇరవై నాలుగ్గంటలు ప్రయాణం చేసి ఇవతలగా వున్న మా క్యాంపుని చేరుకున్నాం. ఇది జరిగి దాదాపు రెండు సంవత్సరాలైంది" ఆమె ఆగింది. పక్కనే గ్లాసులో వున్న మంచినీళ్ళు తాగింది. చైతన్య ఆమెవైపు చూస్తూ అన్నాడు. ఆమె అంది-  

    "నాన్న పోవటంతో కోట్ల ఆస్థి, ఒంటరితనం, మనసంతా దిగులు, పగా మిగిలాయి. ఆ క్షణం అమ్మకతను చేసిన పరాభవం నాన్నని చంపిన విధానం అజ్మరాలీతో నేనన్న మాటలూ గుర్తు రాసాగాయి. అతడిని చంపాలి. లేకపోతే నాకు శాంతి లేదు. అతడి గురించి ఎంక్వయిరీ ప్రారంభించాను. ఎక్కడో శత్రు సైన్యంలో ఒక అధికారి గురించి వివరాలు సంపాదించటమంటే అంత సులభం కాదు. విదేశీ సైన్యంలో కొంతమందిని లోబర్చుకున్నాను. యాభైలక్షల దాకా ఖర్చయింది. అయితేనేం? నాన్న ఆస్థికి ఇంతకంటే సద్వినియోగమైన పని ఇంకొకటి ఏముంటుంది. మనసైన్యం, గూఢచారి శాఖ సంపాదించి దానికంటే ఎక్కువ సంపాదించాను. ఆ మ్యాపుల ముందు కూర్చుని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అధ్యయనం చేశాను. ఆ వివరాలన్నీ నాకు ఇప్పుడు కంఠతా వచ్చు. అజ్మరాలీ ఎక్కడుంటాడో మాత్రమే కాదు. ఏ యే సైనికాధికారి ఎక్కడుంటాడో, వాళ్ల కాలనీ ఎక్కడో, అతడు శలవుల్లో ఎక్కడికి వెళతాడో, అతడి ప్రియురాలు ఎవరో... మొత్తం వివరాలన్నీ నా వేళ్ళ చివర వున్నాయి. ఆరువందల రోజులు కష్టపడి సేకరించిన వివరాలు అవి."

    చైతన్య ఆమెవైపు బ్లాంక్ గా చూశాడు. ఆమె అతడివైపు చూడటంలేదు. శూన్యంలోకి చూస్తూ అన్నది-

    "నేను ఆ దేశం వెళ్ళాలి. ఆ సైనిక శిబిరాల్లోకి చొచ్చుకు పోవాలి. అతడిని పట్టుకుని నుదుటిమీద పిస్టల్ పేల్చాలి. నా తండ్రి శరీరాన్ని అతడు చేసినట్టు అతడి శరీరాన్ని నేను ఛిద్రం చేయాలి. నా తల్లి ఆర్తనాదాల్ని మించిపోయేలా ప్రాణం పోతూంటే అతడు అరవాలి. అదే నా జీవితాశయం. కానీ ఇదంతా ఎలా సాధ్యం? ఒక స్త్రీ విదేశీ సైనిక శిబిరాల్లోకి ప్రవేశించి ఒక ఉన్నతాధికారుని చంపటం అనేది కలలో కూడా ఎవరయినా ఊహించగలరా? కానీ చేయాలి. మనిషి తల్చుకుంటే చేయలేనిది ఏమున్నది? కానీ నాకో తోడుకావాలి.... వెతకసాగాను. అప్పుడు నా దృష్టి మీ మీద పడింది.

    చైతన్య.

    ఆంధ్రుల ఆరాధ్య నటుడు.

    సారీ అదికాదు మీ క్వాలిఫికేషను నాక్కావాల్సింది నటుడు కాదు. కృషి పట్టుదల వున్న మనిషి. నా కెవరో చెప్పారు- చైతన్య ఫైట్స్ ల్లోనూ, డాన్స్ ల్లోనూ ప్రేక్షకులను వుర్రూత లూగిస్తాడని. వరుసగా చూడటం మొదలుపెట్టాను. అందరూ ఈలలూ, చప్పట్లూ వేస్తుంటే నేను మాత్రం ఆ నటుడి వెనుక వున్న వ్యక్తిని గమనించసాగాను. ఎంతో పట్టుదల, దీక్ష వుంటేగానీ ఆ స్థాయికి చేరుకోవటం, దాన్ని నిలబెట్టుకోవటం కష్టం. నాకు కావలసింది సరీగ్గా అలాంటి మనిషే. ఒకటి చెయ్యాలనుకుంటే, అది పూర్తయ్యేవరకూ ఆగని తపన నాకు చైతన్యలో కనబడింది. ఈ ఆపరేషన్ లో పాల్గొనాలంటే నటనతోపాటు చురుకుదనం, చొరవ కూడా రావాలి. అవన్నీ చైతన్యకి వున్నాయి. అయితే, ఒక్కసారి శత్రు శిబిరంలో ప్రవేశించాక ఎన్నో చిక్కులు ఆకస్మికంగా వస్తాయి. అప్పుడు మనోధైర్యం కోల్పోతే? రహస్యాలు కనుక్కోవటానికి శత్రువులు ఎన్నో రకాలుగా మానసికమైన వత్తిడులు కలుగచేస్తారు. అప్పుడు 'విషయం' చెప్పేస్తే.... నేను ఇన్నాళ్ళుగా పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. తెరమీద చైతన్య దృఢశాలి. నా దృష్టిలో చైతన్య చైతన్య వంతుడు. కానీ వ్యక్తిగతంగా అతనెంత ధీమంతుడు? కొంతమంది సుఖాల్లోనే ఉజ్వలంగా ప్రకాశిస్తారు. కష్టమొస్తే నీరుకారిపోతారు. చైతన్య ఏ వర్గానికి చెందిన మనిషి?

    ఇది తెలుసుకోవటం కోసం అతడిని కష్టాల్లో పడేశాను. దాదాపు అయిదు లక్షల ఖర్చుతో ఒక రంగస్థలాన్ని సృష్టించాను. డాక్టర్ పాల్ నాకు సహకరించాడు. లక్ష్మి అనే ఒక నటిని అద్దెకు తెచ్చాం.

    తరువాత కథ మీకు తెలిసిందే!

    చైతన్యగారూ.. ప్రతీ పరీక్షలోనూ మీరు నెగ్గారు. మామూలు మనుషులైతే ఈ పరీక్షకి పిచ్చెక్కిపోయి వుండేవారు. నాక్కావల్సిన వ్యక్తిమీరే. మీరు, నేనూ కలిస్తే ఆ పనిని సాధించగలం! మీరు నాతో వస్తారా?"

    ఆమె చెప్పటం ఆపింది. చైతన్య కుర్చీ వెనక్కి వాలి "అయిందా" అన్నాడు. ఆమె అర్ధంకానట్టు చూసింది.

    అతనన్నాడు- "నాకు సంస్కారం వుంది కాబట్టి వూరుకున్నాను. ఇంకెవరయినా అయితే లాగిపెట్టి కొట్టి వుండేవారే."

    ప్రనూష మొహం వాడిపోయింది. "నే... నేనేం చేశాను?" అంది.

    "నీ ఇష్టం వచ్చిన ఒక వ్యక్తిని పట్టుకుని అతడిమీద రకరాల ప్రయోగాలు చేయడానికి నువ్వేం సైంటిస్టువా? ఆ వ్యక్తేమన్నా కుందేలా? నీ పట్టుదలకి నా జోహార్లు. కానీ నీ తెలివి తేటల పట్లే నాకు అనుమానంగా వుంది. ఒక మనిషి మానసిక హింసలకు తట్టుకోగలడా లేదా అన్న విషయం తేల్చుకోవటం కోసం ఒక మెంటల్ హాస్పిటల్ నాటకమాడి మరీ పరీక్షిస్తావా? దీనివల్ల నా ఎన్ని విలువైన దినాలు వృధా అయ్యాయో తెలుసా నీకు?"

    "మీరెంత నష్టపోయారో అంత డబ్బు నేనిస్తాను."

    "షటప్! డబ్బు గురించి కాదు. నీవు వృధా చేసిన సమయం గురించి మాట్లాడుతున్నాను. అసలు ఒక పనికి నన్ను ఎన్నుకునేటప్పుడు దానికి నేను ఒప్పుకుంటానా లేదా అని ఆలోచించనవసరం లేదా? నీ ఇష్టం వచ్చినట్లు పరీక్షలు చేసెయ్యటమేనా?"

    "నా కథంతా తెలిస్తే మీరు ఒప్పుకుంటారనుకున్నాను."

    "నిజంగా నీది హృదయాన్ని కదిలించే కథే. కానీ పరిష్కారం కోసం నువ్వు ఎన్నుకున్న విధానమే సరి అయినది కాదు... వెళ్ళొస్తాను" అని లేచాడు.

    "చైతన్యగారూ! మీరీ పనికి ఒప్పుకుంటే ఎంత కావాలంటే అంత యిస్తాను. ఇరవై... ముప్పై... ఎన్ని లక్షలు కావాలంటే అన్ని" చైతన్య మొహంలో అంత కోపం ఎవరూ ఇంతకుముందు చూసి వుండరు. అతికష్టంమీద తమాయించుకుని.... "అది నా నెలరోజుల సంపాదన" అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

    ప్రనూష అటువైపే చూస్తూ వుండిపోయింది. ముక్కమీద ముక్క పేర్చి అతికష్టంమీద కట్టిన పేకమేడ చివరి అంతస్తు దగ్గర కూలిపోతే ఎలా వుంటుందో అలా వుంది ఆమె మొహం.

    ఆమె అలా నిలబడి వుండగానే వెనుకనుంచి డాక్టర్ పాల్ వచ్చాడు.

    "ఏమైంది? ఏమన్నాడు?"

    "ఒప్పుకోలేదు. మనమీద పోలీస్ రిపోర్టు ఇవ్వనందుకు సంతోషించమన్నట్టు మాట్లాడాడు."

    "పోన్లే. ఇతను కాకపోతే మరొకడు. అయినా నేను ముందే చెప్పానుగా అమ్మాయ్! అంత ఆదాయాన్ని వదులుకుని అతడు ఆ మృత్యుముఖంలో అడుగుపెట్టడు అని."

    ఆమె మాట్లాడలేదు. ఆమె కెందుకో చైతన్య తప్ప ఇంకెవరూ ఈ పని చేయలేరనిపిస్తోంది. డాక్టర్ పాల్ చెప్పింది నిజమే కావొచ్చు. కోరి కోరి ఎవరు కష్టాల్ని కొనితెచ్చుకుంటారు? బలమైన కారణం వుంటే తప్ప!

    చైతన్యని చూసిన మరుక్షణం- అతడా కష్టాలకి ఒప్పుకుంటాడు అనిపించింది. దానికి బలమైన కారణం- 'తను'

    అని భ్రమపడింది. 


                                                 10


    పుష్కరాలు.

    మామూలుగానే వేలాది జనం స్నానాలకి వస్తారు. ఆ రోజు లక్షల సంఖ్యలో వున్నట్టున్నారు. ఎంత రహస్యంగా వుంచినా ఆ వార్త వూరంతా పొక్కిపోయింది.

    చైతన్య ఆ రోజు వస్తున్నాడన్న వార్త.

    పదేళ్ళ పిల్లల్నుంచి, యాభై ఏళ్ల వాళ్ళ వరకూ తొక్కిసలాట.

    పోలీసులు లాఠీలతో బారికేడ్లు నిర్మించి జనాన్ని కంట్రోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

    రంగనాయకి కొడుకుతో సహా అక్కడికి చేరుకుంది. అక్కడి నుంచి నది ఒడ్డువరకూ పోలీసులు చేసిన దారి మధ్యలోంచి నడిచి వెళ్ళాడు చైతన్య. తద్దినపు బ్రాహ్మణుడు వారి కోసం ఎదురు చూస్తున్నాడు. అతడి ముందున్న పీటమీద కూర్చున్నాడు చైతన్య. "కొడుకంటే అలా వుండాలి! అంత పెద్ద స్థాయిలో వుండికూడా, తండ్రిపోయిన ఇన్నేళ్లకు పుష్కరాల కోసం ఇంతదూరం వచ్చాడు" దూరంనుంచి ఎవరో అంటున్నారు.

    'చైతన్యకీ'

    'జై'

    'స్టార్ స్టార్'

    'జిందాబాద్'

    అరుపులు ప్రజ్వరిల్లుతున్నాయి. నటుల అవస్తే అది. తండ్రికి నిర్మలమైన మనసుతో తద్దినం కూడా పెట్టుకోనివ్వరు. ఆ స్థితిలో కూడా అతడిని తాకాలని కొందరు తాపత్రయ పడుతున్నారు. అతడు తమవైపు చూడాలని చేతులు వూపుతున్నారు. రకరకాల తాపత్రయాలతో, తమకంతో, పిచ్చి అభిమానంతో వెర్రెక్కిపోతున్న ఆ జనం మధ్య ఒకే ఒక వ్యక్తి నిజమైన కోరికతో, నిజమైన తాపత్రయంతో తనువెల్లా వూగిపోతున్నాడు.

    అతడు ఇస్మాయిల్.

    రెండ్రోజుల క్రితమే అతడికి చైతన్య ప్రోగ్రాం సంగతి తెలిసింది. చైతన్యని మామూలుగా కలుసుకోవటం అసాధ్యమని తెలిసిపోయింది. అందుకే ఇక్కడికి వచ్చాడు. ఆ రాత్రి నది ఒడ్డునే పడుకున్నాడు. ప్రొద్దున్నే లేచి కూడా అక్కడనుంచి కదల్లేదు. కాని దురదృష్టం...

 Previous Page Next Page