తండ్రి గురించి తెలిసిందన్న ఉత్సాహం ఒకవైపు, తండ్రి పరిస్థితిపట్ల ఆందోళన మరోవైపు- రెండూ కలసిన స్వరంతో ప్రేమ ప్రసాద్ వైపు తిరిగి, "తొందరగా వెళ్ళాలి ప్రసాద్! పద" అంటూ దాదాపు గదిలోంచి బైటకి పరుగెత్తింది.
* * * *
అనుకున్నంత సులభంగా జగపతిరావు ప్రమాదం నుంచి బయటపడలేదు. ఆపరేషన్ అయిన తరువాత మూడు రోజులపాటు అతడు అపస్మారక స్థితిలోనే వున్నాడు. ప్రేమ దీంతో బెంబేలెత్తిపోయింది. ప్రసాద్, దయానందం అహర్నిశలూ ఆమెనే కనిపెట్టుకుని వున్నారు. డబ్బు ధారాళంగా ఖర్చు చేసేరు.
మూడో రోజుకి గానీ జగపతిరావు ప్రమాదం తొలిగిపోయినట్టు డాక్టర్లు ప్రకటించలేదు.
అసలంతకు ముందు వేణూ దగ్గరనుంచి ఫోన్ వచ్చి, ప్రేమా వాళ్ళు ఆస్పత్రికి వెళ్ళేసరికే జగపతిరావుని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకు వెళ్ళిపోయారు. కాగితంమీద చేయవలసిన సంతకాలూ, కట్టవలసిన ఫీజు అంతా వేణూయే కట్టాడు. అదేమీ తక్కువ మొత్తంకాదు, పన్నెండు వేలు!
వేణు_ ముందసలు ఫోన్ చేసి వాళ్ళింట్లో విషయం చెప్పేస్తే సరిపోతుంది, తన బాధ్యత తీరిపోతుంది- అనుకున్నాడు. కానీ డాక్టర్లు ఎమర్జెన్సీ అన్నారు. పరిస్థితి నిముషాల మీదున్నట్టు పేషెంట్ ని చూస్తూంటేనే తెలుస్తూంది నిష్కారణంగా ఒక మనిషిని చంపిన పాపం తనమీదకు వస్తుందేమో_ అని వేణు భయపడ్డాడు. వెనుకా ముందు ఆలోచించకుండా వున్న డబ్బంతా కట్టి, ఆపరేషన్ ప్రారంభించమన్నాడు. ఆ తరువాత వెళ్ళి ప్రేమకి ఫోన్ చేసి అక్కడ్నించి ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇక్కడితో తనకూ, ప్రసాదరావుకూ పూర్తిగా తెగతెంపులు అయిపోయినట్టే. ప్రసాదరావు తప్పకుండా తనమీద పగ తీర్చుకుంటాడు, ఎం చేస్తాడు? తనకీ బంగారికీ జరిగిన వివాహం తాలూకు ఫోటోలు బైటపెట్టి తన జీవితం నాశనం చేస్తాడు... ఇదైతే తను ఎదుర్కోగలడు. కానీ తనకి ప్రసాదరావు పాతికవేలు ఇచ్చాడు. కాంట్రాక్టు పూర్తి కాకుండానే తనే అడ్డుపడ్డాడు. కాబట్టి, ఆ డబ్బు తిరిగి ఇచ్చెయ్యవలసిన బాధ్యత తనమీద వుంది. ఇది నైతికమైన బాధ్యత!
అంత డబ్బు తనెలా తీర్చగలడు?
ఎటూ పాలుపోక రెండు రోజులు మధనపడ్డాడు.
ఇక్కడ ఇలా వుండగా అక్కడ ఆస్పత్రిలో జగపతిరావు కొద్దికొద్దిగా కోలుకోసాగాడు. నాలుగు రోజులు గడిచిన తరువాత ప్రేమని ఆఫీసు రూమ్ కి పిలిచి మాట్లాడాడు డాక్టరు.
"మిస్ ప్రేమా! మీరు చాలా అదృష్టవంతులు. మీ తండ్రిగారు దాదాపు మృత్యుద్వారం వరకూ వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారు" అన్నాడు ఇంగ్లీషులో.
"ఇప్పుడిక ప్రమాదమేమీ లేదుకదా!"
"ఉహు_ ఏమీలేదు."
"అసలేం జరిగింది, డాక్టరుగారూ?"
డాక్టరు వెంటనే సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు మౌనంగా వుండి తరువాత సాలోచనగా అన్నాడు, "మీ తండ్రిగారి మీద స్లో-పాయిజనింగ్ (విషప్రయోగం) జరిగిందని నా ఉద్దేశ్యం."
ప్రేమ అదిరిపడింది. "ఏ.... ఏమిటి మీరు అంటున్నది?" ఆమె కంఠం వణికింది.
"వెల్.... ఇది ఉద్దేశ్యపూర్వకం అని నేననను. ఎలాగైనా జరిగి వుండవచ్చు. అసలు స్లో-పాయిజనింగ్ కేసుల్ని పట్టుకోవటం కష్టం. మీ ఫాదర్ లోకి ఈ విషం ఇంతకాలం ఎలా ప్రవేశిస్తూ వుందో చెప్పలేం. అది యాదృచ్చికమే కావచ్చు! లేక ఇంకేదైనా కావొచ్చు."
"కానీ.... మా నాన్నగారికి శతృవులు ఎవరూ లేరు డాక్టరుగారూ!"
"సెప్పాని కదమ్మా_ ఇది ఎవరైనా పనిగట్టుకొని చేసింది కాకపోవచ్చునని... అదికాదు ఇక్కడ ముఖ్య విషయం. మీ నాన్నగారు నడిరోడ్డుమీద పడిపోయిన రోజు ప్రొద్దున్నే ఎవరో ఈయనకి మరేదో మందిచ్చారు. వారికి మీరు రుణపడి వుండాలి. ఒక విధంగా అదే విరుగుడుగా పనిచేసింది. ఆ మందేగానీ ఇవ్వకపోయివుంటే, అసలొక విషప్రయోగం జరిగిందన్న సంగతే మూడోకంటికి తెలిసివుండేది కాదు. ఆపరేషన్ ప్రసక్తే వచ్చేదికాదు."
అప్పుడు జ్ఞాపకం వచ్చింది ప్రేమకి- ఆస్పత్రిలో తన తండ్రిని ఎవరు చేర్పించారో పూర్తిగా ఎంక్వయిరీ చెయ్యలేదని ఆ ప్రశ్నే అడిగింది.
"నాకు తెలీదమ్మా! మీ తండ్రిగారు అసలు అతడి తాలూకేనేమో అనుకున్నాను మొదట. అడ్వాన్సు కూడా అతడే ఇచ్చాడు. అతడేగానీ కాస్త ఆలశ్యం చేసివుంటే పరిస్థితి చెయ్యి దాటిపోయి వుండేది. అందుకే తొందరపడ్డాడేమో... మా రూల్స్ మావి. పేషెంట్ గురించి వివరాలు తెలుస్తేగానీ చేర్చుకోము."
ప్రేమ మాట్లాడలేదు. ఆమెకీ ఇది అంతు తేలని ప్రశ్నగానే మిగిలిపోయింది.
జగపతిరావుని మరో రెండ్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఆ రోజు ప్రేమ తండ్రిని చూడటానికి వెళుతూ వుంటే కారు దగ్గిర నిలబడి నౌఖరు కనిపించాడు. అతడు తనకేదో చెప్పబోతూ తటపటాయించటాన్నే గమనించింది. ఆమె 'ఏమిటి' అన్నట్టు ఆగింది.
"మేమ్ సాబ్..." అన్నాడు. "ఆ రోజు బాబుగార్ని ఎక్కించుకు వెళ్ళిన వాళ్ళ సంగతి తెలిసింది."
ప్రేమ ఆత్రంతా "ఎవరు?" అని అడిగింది.
"ప్లే గ్రౌండ్ నించి వస్తూ వస్తూ బాబుగారు పక్క వీధిలోనే పడిపోయారత అమ్మగారూ! అంతలోనే అటు వెళ్ళే ఒక పాతికేళ్ళ కుర్రవాడు చూసేడత. ఒక్కరుకూడా సాయానికి రాకపోతే, దారెంట వెళుతున్న కారుని బలవంతంగా ఆపుచేసి. ఆ కారు తోలే ఆయన్ని బెదిరించి, బాబుగారిని ఎక్కించాడంట. ఆ వీధి గూర్ఖా నాకు తెలిసినవాడే. కానీ బాబుగార్ని ఎప్పుడూ చూడలేదు కాబట్టి, ఎవరో అనుకున్నాడంట. ఆ కుర్రవాడెవడో దేముడిలా వచ్చాడమ్మా."
"ఇదంతా నీకెలా తెలిసింది?"
"పడిపోయింది మన బాబుగారే అని చెప్పగానే ఆ గూర్ఖా ఆ రోజు జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చాడమ్మా! ఆయనే మన బాబుగారని తెలుస్తే ఇంతపని జరక్కపోయేదికదా?" అని బాధపడ్డాడు.
"అతడెవరో తెలుస్తే బావుణ్ణు" తనలో తను అనుకొంటున్నట్టు అంది.
"అతగాడెవరో తెలీదుకానీ, అతడు ఆపిన కారు ఎవరిదో ఆయన మాత్రం తెలుసమ్మా! బాబుగారిని తీసుకెళ్ళిన కారాయన..."
"కారాయన! ఎవరు?" ఆత్రంగా అడిగింది.
"మన ఎదురింటిలోనే వుంటాడాయన. చిన్న కారుంది ఆయన్దే."
* * * *
ప్రేమ తనింటివైపు రావటం గమనించగానే, అప్పటివరకూ చూస్తున్న బైనాక్యులర్ ని చప్పున దాచేసి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు ప్రసాదరావు. సరిగ్గా తను వేసిన బాణం అనుకున్నచోటే వెళ్ళి తగిలింది. ప్రేమ వాళ్ళ నౌఖరుకి గూర్ఖా చూసింది చూసినట్టు చెప్పినట్టున్నాడు. వేణు తన నుంచి విడిపోయి, దెబ్బలాడి వెళ్ళిపోయిన తరువాత ప్రసాదరావు చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అంతకుముందు జగపతిరావు పడిపోయిన చోటుకి వెళ్ళి అక్కడ గూర్ఖాకి కనబడి, తన ద్వారా ప్రేమ ఇంట్లో నౌఖరుకి తన ఉనికి బైటపడేలా చేసేడు. ముందే తెరవెనుక నుంచి ఇలా బైటకి రావటం ప్రమాదకరమే అయినా, తప్పలేదు.
అతడు ఆలోచనల్లో వుండగానే బైట అడుగుల శబ్దం వినిపించింది.
అంతలో ప్రేమ లోపలికి వచ్చింది.
"నమస్తే!"
"నమస్తే!"
"నేను.... మేము.... ఎదురింట్లో వున్నాము."
"అవునమ్మాయ్! నిన్ను చూడకపోవడం మేఇతి? క్రితం ఏడాది వరకూ నువ్వు కాలేజీకి వెళ్ళేదానివి కదూ? కూర్చో__ కూర్చో!"
అతడి మాటలకి ఆమెకున్న బెదురుపోయింది. "నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి వచ్చాను" అన్నది కూర్చుంటూ.
"నాకు__ ఎందుకు?"
"మా తండ్రిగారిని రక్షించినందుకు!"
"ఓ! ఆయన మీ నాన్నగారా?" జ్ఞాపకం వచ్చినట్టు తల పంకించి, అంతలోనే_ "ఉహు_నేను కానమ్మాయ్ అతన్ని బ్రతికించింది! ఆమాటకొస్తే_ ఈ కథలో నేను విలన్ లా ప్రవర్తించాను. రోడ్డుమీద పడిపోయిందెవరో తెలీదు. కార్లున్నది ఇలా అడ్డంగా పడిపోయిన వాళ్ళని ఎక్కించుకోవటానికేనా? అన్నాను కూడా! ఆ యువకుడెవడోగానీ నన్ను నిలదీసేడమ్మాయ్! చెప్పుకోవటానికి సిగ్గుపడను గానీ నా కళ్ళు తెరిపించాడు. రోడ్డుమీద ఆపుచేసి, నాలుగు దులిపేసరికి నిజం చెప్పొద్దూ, నాకు భయం వేసింది. తీరా పడిపోయిన మనిషిని కారు ఎక్కిస్తుంటే ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను. మీ నాన్నగారన్న మాట. అఫ్ కోర్స్ ఆయన్తో నాకు పరిచయం లేదనుకో. కానీ దూరం నుంచి చూస్తూనే ఉంటాను కదా. అప్పుడే అనుకున్నాను_ జీవితంలో ఇక ఎప్పుడూ రోడ్డు పక్క ఎవరు పడిపోయి కనిపించినా కారు ఆపి ఎక్కించుకోవాలని!"
"ఆ అబ్బాయెవరో మీకు తెలుసా?"
ఉధృతమైన వాక్ర్పవాహానికి అడ్డుపడ్డట్టు వచ్చిన ఆ ప్రశ్నకి అతడు ఆగి, "ఎవరూ? మీ నాన్నగార్ని ఆస్పత్రిలో చేర్పించిన కుర్రాడా?"
"ఆఁ- అతనే" అంది.
ప్రసాదరావు ఓరగా ఆ అమ్మాయి మొహంలో 'ఆతృత పాలు' ఎంతుందా అని చూశాడు. అది సరిపోయిన పాళ్ళలోనే వుందని తెలుసుకున్నాక, "ఆ కుర్రాడు పాపం చాలా బెదిరిపోయాడమ్మా!" అన్నాడు.
ఆమె విస్తుపోయి "ఎందుకు?" అంది.
"ఆ కుర్రవాడి తండ్రి ధన్వంతరి. ఇతడు ఆయుర్వేదంలో దిట్ట అనుకుంటా. కానీ పైకి అలా కనబడడు. ఫ్యాక్టరీ కార్మికుడిలా కనబడతాడు. మీ తండ్రిగారిని కారులో ఎక్కించుకున్నాక చాలా కంగారు చేసేడు అమ్మాయ్. 'అమంగళం అప్రతిహతమగుగాక!' కారులోనే పోతాడనుకున్నాను నేనైతే! ఆ యువకుడు నీ తండ్రిగారి మొహంవైపు తదేకంగా కొంచెంసేపు చూసి, నన్ను కారు ఆపమన్నాడు. అతడి ఇల్లే ఒక ఆయుర్వేద షాపు అనుకుంటా, సందులో వున్న ఇంటిలోకి వెళ్ళి ఒక మందుతో తిరిగి వచ్చాడు. దానిపేరు....ఏమిటీ....వెధవది.... వయస్సు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు ఎక్కువ అవుతూంది. ఆ.... 'నవమూలికా కషాయం.... ఇంగ్లీషులో పొటాషియం_డి_సల్ఫైడ్' అంటారు. దాన్ని నోట్లో పోసేడు. నా వైపు తిరిగి "బాబుగారూ! ఈ వ్యక్తి చాలా ప్రమాద పరిస్థితిలో వున్నాడు. నేనిచ్చిన మందుతో తేరుకుంటాడు" అన్నాడు. కాని అంతలోనే మీ తండ్రిగారు కాళ్ళూ, చేతులు కొట్టుకోవడం ప్రారంభించారు. ఆ కుర్రవాడు చాలా కంగారుపడ్డాడమమే! తనిచ్చిన మందుతోనే ఇది ఇలా వికటించిందని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. మీ తండ్రిగారిని రక్షించవలసిన బాధ్యత తనదే అని నిర్ణయించుకున్నట్టున్నాడు. అట్నుంచి అటే నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్ళమన్నాడు. అతడి అనుమానం నిజమే అయింది. అక్కడి డాక్టర్లు అతడి మందువల్ల ప్రమాదస్థితి ఏర్పడిందని, వెంటనే ఆపరేషన్ చెయ్యాలనీ అన్నారు. దాంతో ఆ కుర్రవాడు తనకి ఆత్మహత్యే శరణ్యమన్నట్లు తనలో తనే కుదించుకుపోయాడు. తెలిసీ తెలియని ఐద్య విజ్ఞానంతో_ తను వాడిన మందువల్ల....
"కాదు కాదు" అరిచింది ప్రేమ. తరువాత తన ఆవేశానికి తనే సిగ్గుపడుతూ కొద్దిగా తగ్గి.... "ఆయనిచ్చిన మందువల్లనే నాన్నగారు బ్రతికారు. అదివ్వకపోయుంటే డాక్టర్లకి అసలు ఆపరేషన్ చెయ్యాలనే తెలిసేసి కాదు. మీకు తెలీదండీ.... నాన్నగారి శరీరంలోకి చాలాకాలం నుంచీ విషం ప్రవేశిస్తూందట. మరి బైట ఆహారమో ఏమో.... దానికి ఈయన మందు విరుగుడుగా పనిచేసిందన్నమాట...."
ప్రసాదరావు హఠాత్తుగా ఏదో స్పురించినట్టు_ "అయ్యో! ఎంతపని జరిగిందమ్మా" అన్నాడు.
"ఏం జరిగింది?"
ప్రసాదరావు వెంటనే సమాధానం చెప్పలేదు. అతడి మొహంలో మారే భావాల్ని గమనిస్తూ ప్రేమ ఆందోళనగా "ఏం జరిగిందండీ?" అన్నది.