"కానీ అప్పటికి మనిద్దరం హోమ్ ఫర్ ది ఏజ్ డ్ లో ఆఖరి శ్వాస తీసుకుంటాం."
"నో భవానీ! అలా అనకు! డాడీ పూర్తిగా ఇంప్రెస్ అయ్యేరోజు ఎంతో దూరం లేదు."
"ఓ.కె. లెటజ్ హోప్ సో!"
ఆమె అమాంతం అతని బుగ్గమీద ముద్దు పెట్టుకుని వడివడిగా వెళ్ళిపోయింది.
సరిగ్గా అప్పుడే కొంపలు మునిగిపోయినట్టు ఫోన్ మోగటం ప్రారంభించింది. భవానీశంకర్ చటుక్కున అందుకున్నాడు. "హలో! భవానీశంకర్ హియర్"
"హలో హలో హలో హలో భవానీ. హౌ ఆర్ యూ బ్రదర్?"
"చాలా అద్భుతంగా వున్నాను ఫ్రెండ్. ఇంతకూ వైర్ కి అవతల వైపు ఎవరు?"
"వాట్? అవతలివేపా? వేపంటేనా వెనుకా! వెనుక రోడ్డుంది బ్రదర్. రోడ్డు మీద ఎవరు అంటే ఏం చెప్పగలం? బోల్డు మంది వెళ్తుంటారు. అయినా వాళ్ళ సంగతి మనకెందుకిప్పుడు? బోల్డు స్కూటర్లు, కార్లు, ఆటోలు, మనుషులు- ఆ సంగతొదిలెయ్ బ్రదర్. హౌ ఆర్ యూ?"
"ఓ.కె. ఫ్రెండ్. ఇంతకూ మాట్లాడేదెవరు?"
"వాట్? నన్నింకా గుర్షుపప్షలేదా? నేను బ్రదర్! వి.కె.వర్మ. ఏ ఆర్ ఎమ్ ఏ ఏ ఏ ఏ"
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు "అరే! వర్మా మాట్లాడేది?"
"యష్ బ్రదర్! మనమే! వి.కె.వర్మ! వి ఏ ఆర్ ఎమ్ ఏ ఏ ఏ ఏ? షారీ? అయామ్ షారీ! ఒక 'ఏ' ఎక్స్ ట్రాగా వచ్చినట్లుంది. కాన్షిల్ పేషెయ్. వి ఏ ఆర్ యమ్ ఏ ఏ ఏ! అంతే! ఒక ఏ కాన్షిల్."
" 'ఏ' ల సంఖ్య గురించి వర్రీ అవకు వర్మా ఫెలో, నువ్వెక్కడి నుండి మాట్లాడుతున్నావ్?"
"రాత్రి వైషాగ్ నుండి వషాను, రాగానే మన క్లాష్ మేట్ శ్రీకాంత్ కనబడి నీ ఫోన్ నెంబరిచ్చాడు."
"ఇంతకూ ఇప్పుడెక్కడి నుండి మాట్లాడుతున్నావ్?"
"కల్లు కాంపౌండ్. వారుణ వాహిణి ష్కీమ్ బ్రదర్. షాలా హాపీగా వుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన షేవ షేస్తోంది తెలుగు ప్రజలకు."
"అది సరేగానీ మనం వెంటనే కలుసుకుందాం ఫ్రెండ్. నా అడ్రస్ నోట్ చేసుకుని వెంటనే బయలుదేరి వచ్చేసెయ్."
"ఓ యష్. అడ్రస్ చెప్పు"
"జనరంజనీ పబ్లికేషన్స్, హిమాయత్ నగర్"
"జనమంషరీ పబ్లికేషన్, మ్హాయస్ నగర్ ఓకే - నీ అడ్రస్ చెప్పు"
"అదే నా అడ్రస్ గురూ. జనరంజనీ పబ్లికేషన్స్ - హిమాయత్ నగర్"
"ఆ సంగతి ముందు నీ అడ్రస్ షెప్పు వచ్చేష్తా"
"అదే ఫ్రెండ్ నోట్ చేసుకో. కేరాఫ్ జనరంజనీ పబ్లికేషన్స్, హిమాయత్ నగర్"
"మనజంషరీ రిపబ్లికేషన్స్ యామాహష్ నగష్ అంతేనా? ఆల్ రైట్. నీ అడ్రస్ షెప్పు- అయ్ వాంషుషు మీష్ యు."
భవానీశంకర్ తల కొట్టుకున్నాడు.
"మైడియర్ ఫ్రెండ్ వర్మా"
"యష్ బ్రదర్"
"నీకు ఓ చేతిలో ఫోన్ వుంది కదూ?"
"ఉంది"
"రెండో చేతిలో వారుణవాహిని వుంది కదూ?"
"వుంది"
"అది అవతల పారేస్తే నా అడ్రస్ రాసుకోవచ్చు"
"నోనోనో! ఇంపాషిబుల్! అది లైఫ్ లైన్ ఓ.కె."
"అయితే నీ అడ్రస్ చెప్పు నేనే వస్తా"
"ఒండర్ ఫుల్ ఐడియా బ్రదర్. కేరాఫ్ కల్లు కాంపౌండ్, హైద్రాబాద్ పక్కన ఓ.కె. వెంటనే వచ్చెషెయ్ బ్రదర్. అయ్ లవ్ షు సీయూ"
భవానీశంకర్ కంగారుపడ్డాడు "హలో హలో హలో! కల్లు కాంపౌండ్ అంటే ఎక్కడుంది? ఏ ఏరియాలో- హలో..."
"ష్! పాషు పాడుషున్నాను డిశ్షర్బ్ చేయకు దుక్కలాంషి కుర్రోడు దోరచూపు చూషాడు హంసలాంపి చిన్నది నెమలి నడక నడిషింది" ఠక్కున ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది.
"హలో హలో" గాబరాగా పిలిచి చేసేదిలేక ఊరుకున్నాడు భవానీశంకర్.
సేల్స్ మేనేజర్ మోహన్ రాజ్ హడావుడిగా వచ్చాడతని దగ్గరకు.
"గుడ్ మార్నింగ్ సేల్స్ మేనేజర్"
"నేను చెప్పినది ఎంతవరకూ చేశారు?"
"అన్నీ చెక్ చేశాను సార్. విజయ్ అనే రచయిత రాసిన 'ఎర్ర మట్టి' అనే నవల స్టాక్ మొత్తం రెండేళ్ళయినా ఒక్క కాపీ కూడా అమ్ముడవకుండా అలానే వుండిపోయింది సార్."
"ఒక్క కాపీ కూడా అమ్ముడవలేదా?"
"ఒకే ఒక్కటి అమ్ముడయింది సార్. అది ఆ రచయితే కొన్నాడు."
"ఎన్ని కాపీలు ప్రింట్ చేశారు?"
"ఎనిమిదివేల కాపీలు సార్"
"తెలుగులో అన్ని కాపీలు ప్రింట్ చేయడానికి ఎంత ధైర్యం?"
"ఆ రచయితకు పారితోషికం ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు కదాని ఎక్కువ కాపీలు చేసేయమన్నారండీ మార్కండేయులు గారు. పైగా 'ఎర్రమట్టి' అన్న టైటిలుంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ విరగబడి కొనేస్తారని ఆయననుకున్నారండి."
భవానీశంకర్ హుషారుగా విజిల్ చేశాడు "ఓకె బ్రదర్. ఇప్పుడా ఎనిమిది వేల కాపీలు అర్జంటుగా అమ్మేయాలి అంతే కదా?"
"అవున్సార్. కాకపోతే కాష్ డౌన్ సేల్సు వుండాలండీ. అరువయితే మేమెప్పుడో అమ్మేసేవాళ్ళం."
"మోహన్ రాజ్ నువ్వు అర్జంటుగా స్టేట్ గవర్నమెంట్ లో ఎవరినయినా పట్టుకుని 'ఎర్రమట్టి' అనే పుస్తకాన్ని బాన్ చేయించాలి. దానికోసం కొంత డబ్బు ఖర్చయినా ఫర్లేదు."