"నమస్తే" అన్నాడు కిడ్నాపర్ పొరబాటున రెండు చేతులు జోడిస్తూ.
దాంతో ఆమెకి రివాల్వర్ కనబడిపోయింది.
"మీ చేతిలో రివాల్వర్ ఉన్నట్లుందే" అందామె ఆశ్చర్యంగా.
"అవునవును! కాదు కాదు!" అన్నాడు గాబరాగా.
"రివాల్వరే! అతనికి రివాల్వరంటే చాలా ఇష్టం. అసలు పుట్టటమే రివాల్వర్ తో పుట్టాడని అంటారు. అఫ్ కోర్స్ ఆ టైమ్ లో చాలా చిన్న రివాల్వర్ అది."
"పుట్టటమే రివాల్వర్ తో పుట్టారా?"
"అవును. దేశంలో టెర్రరిజం పెరిగిపోయింది కదా! అందుకని పాపాయిలు రివాల్వర్ చేతిలో లేకుండా పుట్టటానిక్కూడా భయపడుతున్నారు కదు బ్రదర్?"
"అహ్హహ్హహ్హ" అన్నాడు కిడ్నాపర్ రివాల్వర్ మళ్ళీ దాచేసుకుంటూ కోపంగా.
"ఇంతవరకూ ఈయనెవరో చెప్పలేదు."
"ఓ! మళ్ళీ మర్చిపోయాను. ఈయన కిడ్నాపర్. చాలా క్లోజ్ మనకి. వెరీ రీజనబుల్ డిమాండ్స్ వుంటాయి వీళ్ళకు. కాకపోతే ఇంకా మనమీదంత నమ్మకం ఏర్పడినట్లు లేదు. ఆఫీస్ కొచ్చి కాష్ తీసుకోమంటే భయపడుతున్నాడు."
సంగీత అయోమయంగా చూస్తోంది.
"నాకు మీరు చెప్పేదేమీ అర్థంకావటం లేదు."
"లేదా?"
"లేదు."
"ఎందుకని?"
"ఆయన పేరు చెప్పమంటే ఏదో చెప్తున్నారు."
"చెప్పలేదా? చెప్పినట్లు గుర్తే. అదే! అతనే కిడ్నాపర్. మనకి చాలా క్లోజ్ అయిపోయాడనుకో ఈ కాసేపట్లో. జస్ట్ లైక్ బ్రదర్."
"హలో! హౌ డూ యుడూ మిస్టర్ కిడ్నాపర్?" అందామె చేయి చాస్తూ.
"ఫైన్ థాంక్యూ!" చిరంజీవిని మింగేసేలా చూస్తూ అన్నాడతను.
"మీ పేరు చాలా వింతగా వుందే! వట్టి కిడ్నాపరేనా లేక ఏమయినా ఇనీషియల్స్ వున్నాయా?"
"ఉన్నాయ్ ఉన్నాయ్" గాబరాగా అన్నాడతను.
"ఏమిటవి?"
"కే! కే ఫర్ కరేపాకు."
"ఓ! కే ఫర్ కరేపాకు!"
"యస్! కే ఫర్ కరేపాకు!"
"మీ పేరే చాలా విచిత్రంగా వుంది. నేనెక్కడా ఇలాంటి పేరు వినలేదు. మీరు విన్నారా చిరంజీవి?" చిరంజీవి నడిగిందామె.
"నో..నో..నేనూ విన్లేదు. ఇదే మొదటిసారి వినటం. బహుశా అది వాళ్ళ ఫామిలీ నెస్ అయ్యుంటుంది. తల్లీ, తండ్రీ, తాతా అంతా కిడ్నాపర్లే అయ్యుంటారు."
"అవునవును. ఇట్ మస్ట్ బీ దిరీజన్" అంగీకరిస్తూ అందామె.
"నువ్వు నోర్మూసుకుని వస్తావా, కాల్చిపారేయమంటావా?" కాలిపోతూ అన్నాడు కిడ్నాపర్ చిరంజీవితో.
"మేమిద్దరం డిన్నర్ తీసుకునేవరకూ నేనెక్కడికీ రాను! నువ్వు కాల్చిపారేసినా సరే! ప్రేమకూ, బుల్లెట్స్ కీ ఛాయిస్ ఇస్తే బుల్లెట్సే ఆహ్వానిస్తాను" త్యాగ పురుషుడి గ్రాండ్ ఫాదర్లా అన్నాడు చిరంజీవి.
కిడ్నాపర్ కేం చేయాలో అర్థంకాలేదు.
"ఏమిటి మీరిద్దరూ అలా రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? నేనిక్కడుండకూడదా? పోనీ నేను కాసేపలా విజిటర్స్ లాంజ్ లో కూర్చుంటాను మీ మాటలయ్యేవరకూ..."
"నో నో నో! మాటలేం లేవు! ఐమీన్ వున్నవన్నీ అయిపోయాయి" గాబరాగా అన్నాడు చిరంజీవి.
"ఓ.కే. అయితే మరి మనం..."
చిరంజీవి ఆమె చెయ్యి పట్టుకుని డైనింగ్ రూమ్ వేపు నడిచాడు.
కిడ్నాపర్ కేం చేయాలో తోచలేదు. పరుగుతో వెళ్లి చిరంజీవి చెయ్యి పట్టుకుని వెనక్కు లాగాడు. సంగీతకు వళ్ళు మండిపోయింది.
"ఏయ్ మిస్టర్! మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవాలి! అతనిని వదులు" అంది చిరాకుగా.
"నో! ఇంపాజిబుల్" అంటూ చిరంజీవిని బలవంతంగా లాక్కెళ్ళబోతూంటే సంగీతకు ఇంక కోపం ఆగలేదు.
రెండో చెయ్యి పట్టుకుని చిరంజీవిని ఒక్క లాగు లాగేసరికి అమాంతం వచ్చి ఆమె మీద పడ్డాడతను, ఇద్దరూ అప్పుడే బయటికొస్తున్న బేరర్ మీద పడ్డారు. బేరర్ సోఫాలో పడ్డాడు. జనమంతా వారి చుట్టూ మూగటంతో కిడ్నాపర్ భయపడిపోయాడు.
"ఆల్ రైట్! డిన్నర్ తర్వాత కలుసుకుందాం" అనేసి తనూ వారి వెనుకే బేస్ మెంట్ లోకి నడిచాడు.
చిరంజీవి, సంగీత వాళ్ళకోసం రిజర్వ్ చేసిన టేబుల్ ముందు కూర్చుని ఒకరి వంక ఒకరు తన్మయత్వంతో చూసుకున్నారు కాసేపు. అలా చూసుకోవటం విసుగు పుట్టింతర్వాత మళ్ళీ నార్మల్ గా చూసుకోసాగారు.
"సంగీతా!"
"ఊ!"
"సంగీతా!"
"ఒక్కసారి..."
"ఊ! ఒక్కసారి?"
"నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది సంగీతా."
"ఇప్పుడా?"
"ఇప్పుడంటే ఖచ్చితంగా ఇప్పుడే అని కాదు. ఇంకొక్క నిముషం వరకూ ఆగగలను."
ఆమె నవ్వేసింది.
"ఆ! ఒక్క నిమిషం అయిపోయింది. మీ తల ఇలా వంచుతారా?"
ఆమె తల ముందుకి వంచింది.
ఆమె చెక్కిలి మీద పెదాలు ఆన్చాడతను.
"ఇలా ఎంతసేపు ముద్దు పెట్టుకోవచ్చు?" అనుమానంగా అడిగాడు.
"గడియారంలో పదమూడయ్యేవరకూ" చిలిపిగా అందామె.
"అదేమిటి గడియారంలో ఎప్పటికీ పదమూడవదుగా?"
"అవదు."