ఆజారావు మాటల్లో కలగజేసుకుని ----" ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. సరిగ్గా నాలుగు రోజుల్లో మీకు రెండు వేలు మీరు కోరిన విధంగా అందజేయబడుతుంది. డ్రాప్ట్ పంపమంటారా మనియార్దరు చేయమంటారా .....చెప్పండి ....' అన్నాడు.
"ఇన్నాళ్ళూ లేనిది నాలుగు రోజుల్లో ఎక్కణ్ణుంచి వస్తుంది ....?" అన్నాడు భీమరాజు అనుమానంగా.
"మా అన్నయ్య తీసుకొస్తాడు ....." అన్నాడు రాజారావు.
"ఒకవేళ ఆయనకు వీలుపడక పొతే ....'
రాజారావు తమాషాగా నవ్వి ---" నేనేవరికైనా మాటిచ్చే టప్పుడు వెనకా ముందు ఆలోచిస్తాను - ఒకసారి మాటిచ్చేక ఎలాగో అలా నిలబెట్టుకుంటాను . నాది తిరుగులేని మాట " అన్నాడు.
భీమరాజు నవ్వేసి ----'సరే - అయితే ధవళేశ్వరం లో నాకో తమ్ముడున్నాడు. అతని కిద్దురు గాని, పెళ్ళికి సంబంధించి వాడికీ కొన్ని బాధ్యతలప్పగించాను ...." అన్నాడు.
తర్వాత భీమరాజుగారు చేస్తున్న ఏర్పాట్లు విన్నాక --ఈ కట్నాల పద్దతి ఎంత మూర్ఖమైనదో రాజారావుకి అర్ధమైంది. కట్నంగా తీసుకున్న డబ్బు మగ పెళ్ళివారికి మిగుల్తుందనుకుంటే అది చాలా తెలివి తక్కువ.
పెళ్ళి ఇటు మగపెళ్ళివారికీ, అటు అడ పెళ్ళివారికీ కూడా ఖర్చుతో సంబంధించిన విషయం. ఎటొచ్చీ కట్న మివ్వడం ద్వారా ఆడపెళ్ళి వారుభయ ఖర్చులూ భరించి వివాహం చేసినట్లవుతుంది. అంతేకానీ ఒక మగపిల్లవాడి పెళ్ళి చేస్తే ఆడపిల్ల పెళ్ళి ఖర్చు రావడమనేది అరుదు.
మగపెళ్ళి వారి బాధ్యతల్లో - ఆడపిల్లకు నగ చేయించడం , పట్టు బట్టలు పెట్టడం - పెళ్ళి కూతురికి సంబంధించిన ఖర్చులు. ఇవికాక పెళ్ళి పేరు చెప్పి ఇంటిల్లిపాదీ బట్టలు కుట్టించుకుంటారు. వాళ్ళూ తదితర బంధువులూ కలిపి మగపెళ్ళి వారి ఖర్చు మీద బస్సు లోనో ట్రయిన్లోనో బయల్దేరి ఆడపెళ్ళి వారూరు వెళ్ళాలి. దూరాన్ని బట్టి ప్రయాణం ఖర్చు బాగా పెరుగుతుంది. ఆ తర్వాత పెళ్ళికి సంబంధించిన భజంత్రీలు, పల్లకీ ఖర్చులు మగ పెళ్ళి వారివే.
భీమరాజు కి కొన్ని సంప్రదాయపు పట్టింపులున్నాయి. పెళ్ళికి ముత్యాల పల్లకీ ఏర్పాటు చేయవలసిందిగా అయన వెంకట్రామయ్యగారికి మరీ మరీ చెప్పాడు. కాస్త ఖర్చయినా మంచి బ్యాండు మేళాన్నే ఏర్పాటు చేయించమన్నాడాయన. ఇష్టమైన వాళ్ళంతా వాళ్ళ ఖర్చులు భరించుకుని వస్తారని సరిపెట్టు కోకుండా హైదరాబాదు లోని తన ముఖ్య బంధువర్గాన్నందర్నీ తీసుకుని బయల్దేరడానికి బస్సు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడాయన. ఏ విషయమూ రేపు తెలుస్తుంది.
అయన బస్సు ఏర్పాటు చేయడం రాజారావుకు నచ్చలేదు. అది ఎందునా పొందని ఖర్చని అతనికి తోచింది. హైదరాబాద్ నించి తన గ్రామానికి బంధు వర్గంతో రానూ పోనూ బస్సు ఏర్పాటు చేయాలంటే పదిహేను వందల లోపులో అయ్యేపని కాదు. ఆ సొమ్ము ఎవడు తిన్నట్టు?
అయితే భీమరాజు గారి సరదా వేరు. చాలా కాలం తర్వాత ఆయనింట్లో పెళ్ళి జరుగుతోంది. ఆ పెళ్ళి వేడుకల్లో తన బంధు ముఖ్యులందరూ పాల్గొనాలని అయన ఆశయం. ఆ డబ్బుతో ఎంతో కొంతయినా కూతుళ్ళ పెళ్ళికి మిగుల్చు కుంటే మంచిదన్నది రాజారావు పైకి చెప్పలేని అభిప్రాయం.
తన ముందు తరానికి తన తరానికీ చాలా అభిప్రాయ బేధాలున్నాయన్న విషయం రాజారావు తెలుసు. తర్కం పనిచేయదా విషయంలో అని కూడా అతనికి తెలుసును.
సాయంత్రం అయిదున్నర ప్రాంతంలో బాబూరావు వచ్చాడు. బాబురావుని చూసేక రాజారావుకు కలిగిన సంతృప్తి ఇంతా అంతా కాదు. చెల్లెలికి ఈడూ జోడూ గా చాలా బాగున్నాడనుకున్నాడతను.
బాబూరావూ , రాజరావూ మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో బాబూరావు కాస్త చనువుగానే మాట్లాడేడు. అందుకు సంతోషించి రాజారావా చనువును ప్రోత్సహించాడు. ఆ ఆసరాతో అతను తన తండ్రి ఉత్తరానికి వెంకట్రామయ్య జవాబివ్వక పోవడం ఇన్సల్ట్ గా ఫీలైనట్లు బయటపడ్డాడు.
అటువంటిదేదో చెప్పడానికతను ప్రయత్నిస్తున్నట్లు రాజారావు గ్రహించాడు. కాబట్టే - బాబూరావును బాగా ప్రోత్సహించాడు. విషయం విన్నాక - "మీ మామయ్యగారి నర్దం చేసుకోవాలంటే - ఆయనతో బంధుత్వం బలపడాలి --- ' అన్నాడు రాజారావు. తర్వాత అతను నెమ్మదిగా తండ్రి గురించి చూచాయిగా వివరించి ---- "కొన్ని ఇబ్బందులు పైకి చెప్పుకోలేనివి . మీలో ఏదో తెలియని ఆత్మీయత కనపడుతోంది కాబట్టి కాస్త వ్యక్తిగతమైనవే అయినా కొన్ని రహస్యాలు చెప్పుకోగలుగుతున్నాను. నా చెల్లెలి పెళ్ళి ముహూర్తం నాకు తెలిసేసరికి - ఇంక - పెళ్ళికి సరిగ్గా ఒకే ఒక నెల నెల టైముంది. నేను మా ఊరు రెండో తేదీన చేరాను. అప్పటికి పెళ్ళి ప్రయత్నాలింకా మొదలు కాలేదు. అసలు డబ్బు విషయంలో ఏ ప్రయత్నమూ జరగలేదు. ఆయనది వాయిదా వేసే మనస్తత్వం. పీకల మీదకు వస్తే కానీ ఏ పనీ చేయరు. మా అభిప్రాయాల్నాయనెన్నడూ అర్ధం చేసుకోలేదు. ఇవన్నీ మీకు నేను చెప్పడానికి కారణం ఆయన్నర్ధం చేసుకుంటారని మాత్రమే! పెళ్ళి విషయంలో ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేసే పూచీ మాది - మీ నాన్నగారి మంచితన్నలుసుగా తీసుకుని - మీకే మర్యాదలు జరక్కుండా ఏదో అయిందని పించేస్తామనుకోకండి. మా చెల్లెలు మా ప్రాణం. దానిక్కాబోయే భర్తగా మీరూ మా కాప్తులు. మీ మనసు బాధపడితే అది మాకూ బాదే! ఎటొచ్చీ అనవసరంగా మీరు బాధపడకూడదు. మా నాన్నగారుత్తరాలకు వెంటనే జవాబు రాయలేదని బాధపడితే - అది అనవసరపు బాదే నని నేనంటాను. మీ మామయ్యగారి దెంత మంచి మనసో తెలుసుకునెందుకు మీకెంతో కాలం పట్టదు. ఉత్తరాలకు జవాబు నిబట్టి ఆయన్నంచనా వేయదల్చుకుంటే మాత్రం జీవితాకాలమూ మీరాయన్ను ద్వేషిస్తూనే వుంటారు ----' అన్నాడు.
బాబూరావుకు తన మాటలు రుచించినట్లే కనిపించినా ----- "మనిషి మనసు గాయడడానికి - ఎంత చిన్న విషయం సరిపోతుంది ?" అనుకుని ఆశ్చర్యపడ్డాడు.
బాబూరావు దగ్గర విషయం, సంస్కారం రెండూ కూడా సమపాళ్లలో వున్నాయి. ఆ రెండూ వున్నవాడే ప్పుడూ ఎన్నటికీ చెడ్డవాడు కాలేడని రాజారావు కు తెలుసు.
భీమరాజు బలవంతం మీద తండ్రీ కొడుకు లిద్దరూ ఆ మర్నాడూ రాత్రి వరకూ వుండిపోవలసి వచ్చింది. ఈలోగా ఆ కుటుంబం గురించి మరి కాస్త అర్ధం చేసుకునే అవకాశం రాజారావుకు వచ్చింది.
భీమరాజు ఇంటికి తిరుగులేని యజమాని. ఆ ఇంట్లో అయన మాటకు, గౌరవమూ, భయమూ విలువా వున్నాయి. పిల్లలందరకూ అయన దగ్గర భయం, చనువూ సమాపాళ్ళలో వున్నాయి. ఇల్లంతా ఒక నిర్దిష్టమైన కార్యక్రమం ప్రకారం నిర్వహించబడుతూ వుంటుంది. ఎటొచ్చీ ఇంటి ఖర్చులు మాత్రం అవసరానికిమించినవి. భీమరాజు గారింట్లో ఆయె కాఫీ ఖర్చుతో ఒక మధ్యతరగతి సంసారానికి భోజనం ఖర్చులు వెళ్ళిపోతాయి. భీమరాజింటి కేప్పుడే వేళలో అతిధి వచ్చినా కనీసం కాఫీ సిద్దంగా వుంటుంది.
ఆచరణ పద్దతులు తన తండ్రికి పూర్తిగా విరుద్దమైనప్పటికీ ఇద్దరి ఆశయాలు ఒక రకానివేననిపించింది. భీమరాజు డబ్బు పొదుపు చేయడంలో నమ్మకం లేదు. పొదుపు చేసే మిమ్మల్నందరినీ పోషిస్తున్నానా - రేపు గురించి మరీ ఎక్కువగా ఆలోచించ కూడదు. నేడు సుఖంగా గడపాలి - అంటాడాయన. బాబూరావు తండ్రి చాటు బిడ్డ. బాధ్యతలకు సంబంధించినంత వరకూ అతనికి స్వానుభవం లేదు. అన్నీ అతను తండ్రికే వదిలి పెట్టేశాడు. తన జీతంలో ఒక యాభై రూపాయలు పాకెట్ మనీగా తీసుకుని మిగతాదంతా తండ్రి కిచ్చేస్తాడు.